శరన్నవరాత్రులలో బొమ్మలకొలువు | Bommala Koluvu | Golu Dolls

దసరా పండుగ వచ్చింది - సరదాలెన్నో తెచ్చింది.. ఈ ఆనందం, ఉత్సాహాల మధ్య దసరా 'బొమ్మల కొలువు' ఆడపిల్ల ఉన్న ప్రతీ ఇంటా కొలువు తీరింది. దసరా నవరాత్రులలో పది రోజుల పాటు బతుకమ్మ ఆటపాటలకు తోడు బొమ్మలకొలువు పండగ జరుపుకుంటారు. ప్రతి రోజూ సాయంత్రము పేరంటానికి ముత్తైదువులను, పిల్లలను పిలిచి, అందరికీ తాంబూలము, దక్షిణ ఇవ్వడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం.
బొమ్మల కొలువు ప్రారంభించిన సంవత్సరం ఒక వరుస బొమ్మలతో మొదలై ప్రతీ సారి ఒకటి చొప్పున తొమ్మిది మెట్ల వరకు పెంచుతూ వెళతారు. ప్రతీ సంవత్సరము తప్పనిసరిగా ఓ క్రొత్త బొమ్మ కొనడం సంప్రదాయం. అలాగే వచ్చిన వారు కూడా ఒక కొత్త బొమ్మను బహుకరిస్తారు. బొమ్మల కొలువులో ప్లాస్టిక్ బొమ్మలు, బార్బీలు.. వంటివి కాకుండా మట్టి బొమ్మలు, కొయ్య బొమ్మలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి.

సంస్కృతి సంప్రదాయాలు, నీతి కథలు, పురాణ గాథలు, ఇతిహాసాలు పిల్లలకు బోధపడేలా బొమ్మల కొలువును తీర్చిదిద్దుకోవాలి. దేవుని బొమ్మల్లో వినాయకుడు, సీతారాములు, రాదాకృష్ణులు, లక్ష్మిదేవి, సరస్వతిదేవి, పార్వతిదేవి.. పెట్టుకోవచ్చు. ఇక పెళ్ళితంతు బొమ్మలు, హాస్యబొమ్మలు, బామ్మ-తాత, గోపికలు, వివిధ జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, పండ్లు, చెట్ల బొమ్మలు,  ప్రయాణ సాధనాలు వంటివి కొలువులో ప్రత్యేక ఆకర్శనగా నిలుస్తాయి.


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. | Bathukamma - Telangana Floral Festival


మారుతున్న నాగరికతలను పుణికిపుచ్చుకుంటున్నా, అనాదిగా వారసత్వ సంస్కృతిగా వస్తున్న సంప్రదాయాల్ని, పండగల్ని రెట్టించిన ఉత్సాహంతో జరుపుకోవడం ముదావహం. తెలంగాణ జిల్లాల్లోని ప్రతి ఆడపడచు ఎదురు చూసే 'బతుకమ్మ' పండుగ, దసరా పండుగలో భాగంగా నిర్హహించడం విశేషం.

ఏటా ఆశ్వీజ శుద్ధ పాఢ్యమి మొదలుకుని మహానవమి వరకు బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. పండుగ ప్రాశస్త్యత, పుట్టుపూర్వోత్తరాలపై రకరకాల కథలు ప్రచారంలో ఉన్నా "శంకరుని భార్య గౌరీదేవి మహిషాసురిడితో పోరాడి అలసిపోయి ఆశ్వీజ శుద్ధ పాఢ్యమి నాడు మూర్చపోయిందనీ, ఆ మూర్చ నుండి ఆమె తేరుకోవడానికి గ్రామీణులు వివిధ రీతుల్లో గౌరీదేవిని స్తుతిస్తూ పాటలు పాడారనీ, అదే బతుకమ్మ పండుగగా మారిందనే" కథ ప్రముఖంగా వినవస్తుంది. సంధ్యాసమయాన ఆడిపాడే 'బతుకమ్మ'కు పగలంతా హడావిడే. ఈ పండుగ ప్రకృతిరమణీయకతకు విడదీయరాని సంబంధం ఉందనడానికి నిదర్శనంగా బతుకమ్మను అనేక రకాలైన పూలు, ఆకులతో ఆకర్శణీయంగా అలంకరిస్తారు. తంగేడు, గుమ్మడి, చామంతి, గడ్డిపూలు, గునుక - పలు రకాల పూలను సేకరించి సిబ్బి(పల్లెం)లలో గుమ్మడి ఆకులను పరచి వాటిపై గోపురాకారంలో పేర్చుతారు. పేర్చిన పూల మీద 'గౌరమ్మ'(పసుపు ముద్ద)ను పెడతారు.  ఈ బతుకమ్మను తయారు చేసి, వారిలో ఉన్న సృజనాత్మకతను చాటిచెబుతారు.

ఈ నెల 9న ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగ మహానవమి (అక్టోబర్ 17) రోజున ముగుస్తుంది. బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమైన ఆరో రోజును 'అర్రెం' పేరుతో సెలవు పాటించడం పరిపాటి. చివరి రోజున జరుపుకునే బతుకమ్మను 'సద్దుల బతుకమ్మ' పండుగగా పేర్కొంటారు. తొమ్మిది రోజుల ఉత్సవాలు ఒకెత్తుకాగా, చివరిరోజున ఉత్సవం ఒకెత్తు. స్త్రీలంతా ఒకరినొకరు పోటీపడి రంగురంగుల పూలతో పేర్చిన నిండైన నిలువెత్తు 'బతుకమ్మల్ని' చేర్చి వాటికి 'జానపదుల్ని' కూర్చి కలిసికట్టుగా పాడతూ గౌరమ్మను పూజించడం శోభాయమానంగా ఉంటుంది. చివరి రోజున అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, రకరకాల సద్దులను నైవేద్యాలుగా సమర్పించి బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. అంతటితో తొమ్మది రోజుల ఆటవిడుపుకి తెరపడుతుంది. అదే ఉత్సాహంతో మరో ఏడాది బతుకు సమరానికి సన్నద్ధులవుతారు.