టిఫిన్ బాక్స్.. | Healthy Tiffin Box for Your Child

స్కూళ్ కి వెళ్లే పిల్లలకు టిఫిన్ బాక్స్.. బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్.. ఇలా ఏదైనా సరే వారికి సర్దడం కొంచం కష్టమే. ఏ రోజు ఏ ఆహారం ఇష్టంగా తింటారో.. ఏ రోజు టిఫిన్ బాక్స్ తిరిగి తీసుకొచ్చేస్తారో తెలియదు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే చదువు మీద దృష్టి సారించగలరు కాబట్టి వారి ఆహారం, అలవాట్లపై ప్రతీ తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. అందుకని పిల్లల టిఫిన్ బాక్స్‌ పైన శ్రద్ధ పెట్టాలి. బాక్సులో పిల్లలకు పెట్టే ఆహార పదార్థాలు శారీరకంగా మానసికంగా దృఢంగా ఎదగడానికి తోడ్పడేలా మంచి పోషకాలను అందించేవిగా చూసుకోవాలి. ప్రతిరోజూ ఒకేలాంటి ఆహారం కాకుండా రోజుకోరకం అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. సింహభాగం నేచురల్‌ ఫుడ్ మాత్రమే ఉండాలి. అంటే  ఫ్రూట్స్‌, తాజా కూరగాయాలు అన్నమాట. వీటితో పిల్లలకు వెంటనే శక్తి అందడం, ఎక్కువ సమయం వరకు హుషారుగా ఉండడంమే కాక ఏకాగ్రతస్థాయి మెరుగుపడుతుంది. పిల్లలు చీటికిమాటికి అనారోగ్యం పాలు కావడానికి కారణం పోషకాహార లోపం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా పెద్దలే అరికట్టగలగాలి. ఉదయం వేళల్లో క్యారట్, బీట్ రూట్.. లాంటి పచ్చికూరగాయల రసాన్ని ఒక గ్లాసు ఇస్తే బాగుంటుంది. దానివల్ల కంటిచూపు మెరుగవుతుంది, చర్మసమస్యలు దరిచేరవు. అల్పాహారంగా మొలకెత్తిన విత్తనాలు, నానబెట్టిన వేరుశెనగ పప్పు, ఖర్జూర, పచ్చికొబ్బరి, డ్రై ఫ్రూట్స్.. పెట్టాలి. తేనె, బెల్లం.. లాంటి పదార్థాలు రోజూ తీసుకోవడం తప్పనిసరి. స్నాక్స్ సమయంలో సీజనల్ ఫ్రూట్స్ లేదా ఒక గ్లాస్ పండ్లరసం మంచిది. దీంతో మీ పిల్లలు ఆరోగ్యవంతులుగా తయారవుతారు.

మరిన్ని టిఫిన్ బాక్స్ టిప్స్..
- టిఫిన్‌ బాక్సులు తోటి పిల్లల కుండే లాంటివే ఉండాలి. రెండు మూడు గిన్నెలతో పదార్థాలు పెట్టడానికి అనువుగా, సుళువుగా మూతలు తీసుకునేలా బాక్స్ ఉండాలి. అవి మారకుండా వాటిపైన పేర్లు రాయాలి.
- పిల్లలు స్కూల్లో టిఫిన్‌ బాక్స్‌, వాటర్‌బాటిల్‌ మూతలు తీయడానికి వీలుగా ఒక్కసారి ఇంటి వద్ద చేయించి చూపించాలి.
- తక్కువ సమయంలోనే తినేవిధంగా పోషక విలువలున్న ఆహారపదార్థాలను మాత్రమే పెట్టాలి. ఎక్కువ మసాలా పదార్థాలు లేకుండా చూసుకోవాలి.
- బాక్సులో పెట్టిన పదార్థాలు ఎక్కువసమయం వరకూ ఉన్నా, పాడవకుండా ఉండే విధంగా ఉండాలి. 
 
 

పొత్తు కుదిరితే.. | Amazing Health Benefits of Corn Maize


చిటపట చినుకులు పడుతూ ఉంటే మనసు మొక్కజొన్న పొత్తు కోరుకుంటుంది. దీనికి కారణం లేక పోలేదు. ఇందులో మంచి మూడ్ ను కలిగించే ఫ్లేవనాయిడ్స్‌ అనే రసాయనాలు ఉంటాయి. మొక్కజొన్న పొత్తుతో మస్తు మజాయే కాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉడికించిన లేదా కాల్చిన మొక్కజొన్న పొత్తు, పాప్ కార్న్, స్వీట్ కార్న్ లే కాకుండా గింజలు ఒలిచి పలు రకాల కూరల్లో, పిండివంటల్లో ఉపయోగించవచ్చు.  ఈ గింజలను కాస్త నూనెలో వేయించి ఉప్పు, కారం చేర్చి స్నాక్స్ గా సర్వ్ చేసుకోవచ్చు.

- మొక్కజొన్నలో విటమిన్ - ఎ, విటమిన్ - బి, విటమిన్ - సి, విటమిన్ - ఇ లు పుష్కలంగా లభిస్తాయి. అవసరమైన ఖనిజాలు లభ్యమౌతాయి.
- ఓ కప్పు కార్న్ తీసుకుంటే అవసరమైన పీచు అందుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ మెరుగుపడడంతో పాటు మలబద్దకాన్ని నివారిస్తుంది.
- ఫైబ‌ర్ ఎక్కువ‌గా అందడంతో ర‌క్తంలో అనవసరంమైన కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తుంది. దీనివ‌ల్ల గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు.
- ముఖ్యంగా వీటిలో అధికంగా లభించే మెగ్నీషియం, ఐరన్, కాపర్, పాస్పరస్.. లాంటి మినరల్స్  వల్ల ఎముకలు గట్టిపడతాయి.
- గర్భిణీలకు అవసరమైన ఫోలేట్‌ శాతం కూడా  మొక్కజొన్నలో ఎక్కువగా లభిస్తుంది.
- వీటిలోని కార్బొహైడ్రేట్స్ తో శ‌రీరానికి కావాల్సిన శ‌క్తి అందడంతో పాటు రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండ‌వ‌చ్చు.
- ఐర‌న్ పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల  రక్తహీనతను అరికట్టడంలో మొక్కజొన్న అద్భుత ఔషధంగా చెప్తారు.
- మొక్కజొన్నలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. అలాగే క్యాన్సర్‌ నిరోధకాలుగా పనిచేస్తాయి. ఉడికించిన స్వీట్‌కార్న్‌లో యాంటీఆక్సిడెంట్ల శాతం మరింత ఎక్కువగా ఉంటుంది.
- బీటా కెరోటిన్‌, విట‌మిన్- ఎ లు సమృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల మొక్క‌జొన్న‌ తీసుకోవడంతో కంటి ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.
- ఆల్జీమర్స్‌, మధుమేహం, బీపీ, హృద్రోగాలు, క్యాన్సర్‌ .. ఉన్నవారికి మొక్కజొన్న మంచి ఆహారం అని నిపుణులు సూచిస్తున్నారు.


ఆరోగ్యం మీ తోడుగా.. | Health Benefits of Millets

రోజూ మన ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, అవిసెలు, బబ్బెర్లు, పెసర్లు.. తదితర తృణధాన్యాలలో విటమిన్లు, ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. చిరుధాన్యాలను మిగతా పప్పు ధాన్యాలతో కలిపి తయారుచేసిన వంటలు రుచికరంగా ఉండడమే కాక పోషక విలువలు రెట్టింపవుతాయి. వీటిని మర పట్టించి నేరుగా వండుకోవచ్చు. స్ప్రౌట్స్ గానూ వినియోగించవచ్చు. అల్పాహారంలో తృణధాన్యాలను తీసుకోవడం ద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. మధుమేహాన్ని నియంత్రించవచ్చు. గుండెపోటుకు చెక్‌ పెట్టవచ్చు.

- వీటిల్లో అధికంగా ఉండే పీచు మలబద్దకాన్ని నివారిస్తుంది.
- చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగు పడుతుంది.
- శరీరానికి కావల్సిన శక్తి లభించడమే కాకుండా, ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి.
- చిరుధాన్యాల్లో ఉండే మెగ్నీషియం అధిక రక్తపోటు, గుండెపోటును దరిచేరనివ్వదు.
- వీటిల్లో ఉండే ఫైబర్ కంటెంట్ శరీరానికి కావల్సిన చక్కెర స్థాయిలను నిదానంగా విడుదల చేయడంతో పాటు డయాబెటీస్‌ను నియంత్రిస్తాయి.
- అంతేకాకుండా వీటిలోని మినరల్స్, ప్రొటీన్స్, పైథో కెమికల్స్.. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
 
 

పాములుంటాయ్‌.. జాగ్రత్త..! | With the Rains come Snakebites

వర్షాకాలంలో విషసర్పాలు ఎక్కువగా సంచరిస్తాయి. పాముల్లో అన్నీవిషపూరితమైనవి కావు. కట్లపాము, నాగుపాము, నల్లత్రాచు, రక్తపింజర వంటి వాటి వల్ల మాత్రమే ప్రాణనష్టం ఉంటుంది. అయితే సకాలంలో స్పందించి వైద్యం అందించగలిగితే ఎలాంటి హాని కలగదు. పాముకాటుకన్నా పాముకరిచిందన్న భయం, ఆందోళన వల్ల ప్రాణాలు కోల్పోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. విషపూరిత పాము కాటుకు గురైతే వాటి రెండు కోరల గాయం స్పష్టంగా కనిపిస్తుంది. నొప్పి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. క్రమక్రమంగా నొప్పిపైకి పాకి శరీరం మత్తుకు గురై స్పృహ కోల్పోవడం జరుగుతుంది. అంతకన్నా ఎక్కువ కాట్లు కనిపిస్తే అది సాధారణ పాము అయి ఉండవచ్చు. పాము కాటును గుర్తించిన వెంటనే అప్రమత్తం అవ్వడమే ప్రధానం. విషం రక్తంలో కలిసి గుండెకు చేరితే ప్రాణాపాయం సంభవిస్తుంది. కనుక కాటు వేసిన శరీర భాగం నుంచి ఇతర భాగాలకు రక్తప్రసరణ జరగగకుండా వెంటనే రబ్బర్ బ్యాండ్, తాడు, గుడ్డ.. వీటిలో దేని సహాయంతోనైనా గట్టిగా కట్టు కట్టాలి. కరిచిన భాగంలో కొత్త బ్లేడ్‌తో చర్మాన్ని తొలగించి ఆ విషపు రక్తాన్ని పిండివేయాలి. దీనివల్ల శరీరంలోకి ప్రవేశించిన విషం త్వరగా గుండెకు చేరకుండా నివారించవచ్చు. తదనంతరం వైద్యున్ని సంప్రదించడం ద్వారా ప్రాణాలు నిలుస్తాయి.

పాములకు దూరంగా..
- కప్పలు, ఎలుకలు ఉన్న చోట పాములు ఆహారం కోసం ఎక్కువగా సంచరిస్తాయి. అందువల్ల అవి రాకుండా పరిసరాల్లో శుభ్రత పాటించడం అవసరం. చుట్టూ ఉన్నమొక్కలను, చెట్లను ఎప్పటికప్పుడు ట్రిమ్ చేయాలి. బయటికి ఉన్న డ్రైనేజి పైపులకు జాలీ విధిగా ఉండాలి. బాత్ రూంలో కమ్మోడ్ వాడుతున్నప్పుడు ఒక్కసారి గమనించాలి. చెప్పుల స్టాండ్, ఎక్కువ కాలం పార్క్ చేసిన వాహానాలు, ఖాళీ ప్రదేశాల్లోనూ దృష్టి సారించాలి. ముఖ్యంగా వరదనీరు అపార్ట్ మెంట్ లేదా ఇంట్లోకి వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
- ధాన్యపు గాదెలు, గడ్డివాములు ఉన్న చోట ఎలుకలు ఎక్కువగా తిరుగుతాయి. నిల్వనీళ్లు, తడి ప్రదేశాల్లో కప్పలు చేరుతాయి. అలాగే దుంగల మధ్య, పిడకల దొంతరల్లో పాములు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఆయా ప్రదేశాల్లోకి  వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు అవసరం. మోకాళ్ల వరకు ఉండే గమ్ బూట్లను వేసుకోవాలి. పాములు కేవలం శబ్ద తరంగాలను గ్రహిస్తాయి కనుక ఏదోలా చప్పుడు చేయడం వల్ల పాములు అక్కడి నుంచి పారిపోతాయి.
- అలాగే పాత భావి, బంగ్లాలు, వ్యవసాయ క్షేత్రాలవద్ద పాములు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఇలాంటి ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు పాదరక్షలు, శరీరాన్ని కప్పుతూ దుస్తులు వేసుకోవడంతో పాటు వెంట కర్రను, టార్చిలైట్‌ను తీసుకెళ్లడం తప్పనిసరి.
- కోడి, పిల్లి, కుక్క మొదలైన పెంపుడు జంతువులు పాములను ముందుగా గుర్తిస్తాయి. 



pc:internet

వంటింటి చిట్కాలు | Kitchen Hacks - Genius Ways to Save Time and Money


ఇంట్లో కిచెన్ అత్యంత కీలకమైనది. ఈ గది ఎంత శుభ్రంగా ఉంటే కుటుంబమంతటికి అంత ఆరోగ్యం. అలాగే కొన్ని 'వంటింటి చిట్కాలు'  ఘుమఘుమలాడే రుచికరమైన వంటలను అందించడంతో పాటు శారీరక శ్రమను, వృథాఖర్చును తగ్గిస్తాయి. సమయం కలిసివస్తుంది. మరి ఇంటిళ్ళిపాది 'యమ్మీ..' అంటూ లొట్టలేసుకుంటూ వంటలన్నీ ఆరగించడానికి చిట్కాలేంటో చూద్దామా..

- పుదీనా పచ్చడిలో కాస్త పెరుగు కలిపితే రుచికరంగా ఉంటుంది.
- కోడి గుడ్డును ఉడికించే నీళ్లల్లో కాస్త ఉప్పు వేస్తే అది పగిలిపోకుండా ఉంటుంది.
- అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే వాటిని తరిగాక మజ్జిగలో వేయాలి.
- బెండకాయ కూర వండేటప్పుడు ముక్కలపై కాస్త నిమ్మరసం పిండితే జిగురు ఉండదు.
- క్యాబేజీ ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండడానికి చిన్న అల్లం ముక్క వేయాలి.
- వంకాయ కూర వండేటప్పుడు ఒక స్పూను పాలు చేరిస్తే ముక్కలు నల్లబడవు.
- పెరుగు పుల్లబడకుండా ఉండాలంటే చిన్న కొబ్బరి ముక్కను వేయాలి.
- ఉడికించిన బంగాళాదుంపలను ఎగ్ స్లైసర్ తో కట్ చేస్తే ముక్కలు చక్కగా వస్తాయి.
- కరివేపాకుని ఎండ పెట్టి పొడిచేసి కూరల్లో వేసుకుంటే కమ్మని సువాసనలు వెదజల్లుతాయి.
- కుక్కర్‌ అడుగున నల్లగా అవ్వకుండా ఉండాలంటే వాడేసిని నిమ్మ  చెక్కలను వేయాలి.



దుస్తులు ఆకర్షణీయంగా.. | Keep your Clothes Looking New | Ideas for Organizing your Wardrobe


బట్టలు ఉతికి, ఐరన్ చేయడం ఒకెత్తైతే వాటిని నీట్‌గా వార్డ్‌రోబ్‌ లో సర్దుకోవడం ఒక కళ. ఒక పద్ధతిలో దుస్తులను అలమారలో అమర్చుకుంటే అవసరానికి ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. లేదంటే స్కూల్ కి వెళ్లే పిల్లల నుంచి ఆఫీసులకు వెళ్ళే పెద్దలవరకు అందరికి తిప్పలు తప్పవు. ముందుగా అలమారలో పేపర్‌ వేసి ఆ తర్వాత క్రమంగా ముదురు రంగు నుంచి లేతరంగు బట్టలు పెట్టుకోవాలి. ప్రతి వరుసలో చక్కగా గాలి, వెలుతురు ప్రసరించేలా చూసుకోవాలి. లేదంటే తేమ చేరి క్రిమికీటకాలు చేరే ప్రమాదం ఉంది. వీటి వల్ల దుస్తులు పాడవడమే కాక పలు రకాల ఎలర్జీలకు దారితీస్తాయి. ఇవి దరిచేరకుండా అరల్లో మధ్యమధ్యలో కలరా ఉండలు వేయాలి. అలగే నెలకోసారైనా వార్డ్‌రోబ్‌ను శుభ్రం చేసి మళ్లీ దుస్తులను నీట్‌గా సర్దుకోవాలి. ముఖ్యంగా అన్ని దుస్తులు ఒకే చోట గందరగోళంగా ఉండకూడదు. అలమారాలో కుటుంబసభ్యులకు విడివిడిగా ఒక్కో అరను కేటాయించి వాటి ప్రాధాన్యాన్ని బట్టి పద్దతిగా అమర్చుకోవాలి. దీనివల్ల వెతుక్కునేందుకు సమయం వృథా కాకుండా ఉంటుంది. ఎక్కువ స్పేస్ ఆక్యూపై చేసే జీన్స్‌ ప్యాంట్‌లను సగానికి మడిచి హ్యాంగర్లకు వేలాడదీసుకోవాలి. ఏవైనా వాడని దుస్తులుంటే వాటిని ప్లాస్టిక్‌ బ్యాగ్‌ల్లో వేసి మరో చోటకు మార్చుకోవాలి. దీనివల్ల అలమారలో స్థలం కలిసిరావడమే కాక చూడడానికి నీట్ గా, బట్టలు తీసుకోవడానికి సులువవుతుంది. అలమార సరిపోదు అనుకున్నప్పుడు రోజువారీ బట్టలు మాత్రమే ఇక్కడ సర్దుకొని మిగతావి సూట్‌కేస్‌లలో తగు జాగ్రత్తలతో సర్దుకోవడం ఉత్తమం. చాలా సందర్భాల్లో పిల్లలే కాదు, పెద్దలు కూడా ఏమి అవసరం వచ్చినా.. అలమారా అంతా సర్దేసి.. దుస్తులన్నీ బయటకు లాగేసి.. నానా కంగాళి చేస్తుంటారు. అందుకనే కంటికి కావలసిన దుస్తులు ఇట్టే కనిపించడంతో పాటు అలమార అందంగా కనిపించాలి. అప్పుడే ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న దుస్తులు, అలాగే ఎంత ఖరీదైనవైనా నాణ్యత లోపించకుండా కాపాడుకలుగుతాం.


ఆహారం - చ‌ర్మ సౌంద‌ర్యం | Best Foods for Healthy Skin

కాస్మటిక్స్‌కు దూరంగా ఉంటూ మీ చర్మం సహజ సౌందర్యంతో తొణకిసలాడాలనుకుంటున్నారా? దానికి పోషకవిలువలున్న ఆహారం తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.. మీ అందాన్ని రెట్టింపు చేసుకోవాలంటే ముఖ్యంగా రోజూ మీ ఆహారంలో ఏమి ఉండాలంటే..

- పాలకూరలో బి, సి, ఇ - విటమిన్ లు ఉండటంతో పాటు విటమిన్ - ఎ, బెటాకెరోటిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా చర్మాన్నికాంతి వంతంగా ఉంచుతాయి.
- క్యారెట్స్ లో కూడా విటమిన్ - ఎ, బీటాకెరోటీన్‌లు అధికంగా ఉంటాయి. వీటితో అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలతో పాటు చర్మానికి, కురులకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ఎండ తీవ్రత నుంచి చర్మాన్ని కాపాడుతాయి.
- నిమ్మలో విటమిన్ - సి పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఏజింగ్ గుణాలను తగ్గించి, పీహెచ్ లెవల్‌ను పెంచుతుంది.
- చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు స‌బ్జా గింజ‌లు, ఫ్లాక్ సీడ్స్, సన్ ఫ్లవర్ సీడ్స్.. ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని ర‌క్షిస్తాయి.
- టమోటాలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మ నిగారింపును ఇనుమడింపచేస్తుంది. అంతే కాక కాలుష్యం, హానికార‌క సూర్య కిర‌ణాల నుంచి మ‌న‌ల్ని ర‌క్షిస్తుంది.
- చర్మ సౌందర్యానికి ఎంత‌గానో అవసరమయ్యే విటమిన్‌ - ఇ, యాంటీ ఆక్సిడెంట్లు బాదం ప‌ప్పుల్లో పుష్కలంగా ఉంటాయి.
-  పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లాలు చర్మానికి తేమను అందిస్తాయి. అంతేకాకుండా చర్మ సమస్యలను దరిచేరకుండా చూస్తాయి.
- ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా అవకాడోస్‌ పనిచేయడమే కాక ఇందులోని విటమిన్‌ - ఇ చర్మానికి ఒక చక్కని టానిక్‌ అని చెప్పవచ్చు.
- చర్మ సౌందర్యానికి అవసరమైన విటమిన్ - బి బీట్రూట్ తో లభిస్తుంది. ఇది గోళ్లు, కేశాల ఆరోగ్యానికి సహకరిస్తుంది. పెదవులు పొడిబారకుండా కాపాడుతుంది. 

 

పిల్లలు జాగ్రత్త.. | Child Care During The Rainy Season

 
వర్షాకాలంలో ముఖ్యంగా నీరు, ఆహారం కలుషితమయి పిల్లలు ఇట్టే జబ్బు పడే అవకాశం ఉంది. అలాగే పిల్లలు వర్షంలో ఆడటానికి ఎంతో ఇష్టపడతారు. వద్దన్నా వినే అవకాశం ఉండదు.  దీని కారణంగా పిల్లలకు జలుబు, దగ్గులతో పాటు వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. వీటి నుంచి పిల్లల్ని కాపాడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

- పిల్లలతో బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా గొడుగు, రెయిన్‌కోట్‌, రెయిన్ క్యాప్, షూస్.. వగైరా తప్పక తీసుకెళ్లాలి.
- చిన్నారులను వర్షంలో తడవకుండా ఇలా జాగ్రత్తలు తీసుకున్నా తడిస్తే వెంటనే దుస్తులను మార్చివేయాలి. అలాగే వీలైనంత త్వరగా షవర్‌ స్నానం చేయించాలి.
- వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం వల్ల సూక్ష్మక్రిములు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. కాబట్టి చేతులు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. తినే ముందు పిల్లలు కచ్చితంగా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి.
- ఈ కాలంలో కూడా వీలైతే రోజూ రెండుసార్లు యాంటీ ఫంగల్ సోప్‌తో స్నానం చేయిస్తే మంచిది. స్నానానికి కచ్చితంగా గోరు వెచ్చని నీటిని మాత్రమే వినియోగించాలి. ఆ నీటిలో యాంటీసెప్టిక్‌ డ్రాప్స్‌ కూడా వాడుకోవచ్చు.
- పిల్లలకి వర్షాకాలంలో కాటన్ దుస్తులతో పాటు సెమీ ఉలన్‌ ఫ్యాబ్రిక్స్‌ వాడాలి.
- కాచి చల్లార్చి, వడకట్టిన నీటినే మాత్రమే తాగించాలి. గోరువెచ్చగా మంచి నీటిని తాగడమే ఉత్తమం. ఎల్లప్పుడూ తాజా ఆహారం తీసుకోవాలి. సమతులాహారంపై దృష్టి పెట్టడమే కాక బయట తినుబండారాలకు దూరంగా ఉండాలి.
- ఎక్కువగా మంచి నీటిని తాగడం వల్ల జలుబు, జ్వరాలను నివారించవచ్చు. ఎక్కువ మోతాదులో నీరు తీసుకున్నప్పుడు శరీరంలో ఉన్న విషపదార్థాలు, హానికారక సూక్ష్మక్రీములను నివారించవచ్చు.
- అలాగే భోజనానికి ముందు ద్రవపదార్థమైన వేడివేడి విజిటబుల్‌ సూప్‌ తీసుకోవాలి. ఇది అనేక పోషకాలతో పాటు కమ్మని రుచిని ఇస్తుంది.
- తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు రోజూ వారి ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి. సిట్రస్‌ జాతి పండ్లు ఎక్కువగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- ఈ కాలంలో దోమలు స్వైరవిహారం చేయడంతో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా.. వీటి భారిన పడకుండా పిల్లలకు దోమలు కుట్టకుండా నిండైన దుస్తులు వేయాలి. నిద్రించే సమయంలో దోమతెరలను విధిగా ఉపయోగించాలి
- దోమల నివారణకు ప్రధానంగా ఇంటిని శుభ్రంగా ఉంచడంతో పాటు ఇంట్లోనూ, పరిసర ప్రాంతాల్లోనూ నీరు నిలువ లేకుండా చూడాలి.
- గదుల్లో తేమ లేకుండా ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకుంటే పిల్లలకు వెచ్చదనాన్ని కలిగించడంతో పాటు హాయిగా ఉంటుంది.
- పిల్లలకు అనారోగ్యం కలిగితే వెంటనే వైద్యులను సంప్రదించడమే కాక త్వరగా కోలుకోవడానికి వారికి తగినంత విశ్రాంతి ముఖ్యమని గమనించండి.



pc:internet

ప్రపంచ సంగీత దినోత్సవం | June 21: World Music Day


వరల్డ్ మ్యూజిక్ డే.. మొదటగా ఫ్రాన్స్ లో 1982 వ సంవత్సరం జూన్ 21న ప్రారంభమైంది. ఇక అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం ఇదే రోజున ప్రపంచ దేశాల్లో సంగీత ప్రియులు ఇలా 'మ్యూజిక్ డే'ని జరుపుకుంటున్నారు. సంగీతానికి అనంతమైన శక్తి ఉంది. మనిషిని కదిలించే మహత్తర శక్తి సంగీతానిది. ఆనందం.. ఆవేశం.. వినోదం.. విషాదం.. ఇలా ఏదైనా దానికి గళమిచ్చేది సంగీతం. సువిశాల సంగీత ప్రపంచంలో ఎన్నో సంగీతాలు. శాస్త్రీయ సంగీతం, జానపదం, పాప్ మ్యూజిక్.. ఇలా ఎన్నో. ముఖ్యంగా భారతీయ సంగీతాన్ని ప్రధానంగా శాస్త్రీయ సంగీతం, జానపదం, ఆధునిక సంగీతం.. ఇలా మూడు విభాగాలుగా చెప్తారు. మనకు శాస్త్రీయ సంగీతం అంటే మక్కువ ఎక్కువ. అలాగే పాశ్చాత్య సంగీతాలైన పాప్, రాక్, వెస్ట్రన్ మ్యూజిక్ వగైరాలను  కూడా నేటి యువతరం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సంగీతం ఏదైనా ఇవన్నీ సంగీత ప్రియులను మైమరిపిస్తాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. హ్యప్పీ వరల్డ్ మ్యూజిక్ డే..!


యోగా డే | 21 June: International Yoga Day


జూన్ 21 న ప్రపంచ వ్యాప్తంగా సుమారు 200 దేశాల్లో కొన్ని కోట్ల జనాబా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. సర్వప్రతినిధి సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోదీ సూచన మేరకు ఇంటర్నేషనల్‌ యోగాడేని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇది ప్రతియేటా 2015వ సంవత్సరం నుండి జూన్ 21న ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది. వేద కాలానికి ముందే పుట్టిన యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మనసు, శరీరం మనకు నచ్చినవిధంగా పనిచేయాలంటే వాటి రెండింటినీ ఏక కాలంలో అదుపులోకి తెచ్చుకోగలగాలి. అలా అనుకూలంగా మరల్చగలిగే శక్తి కేవలం యోగాకి ఉంది. అందుకే యోగాభ్యాసం ఎంతైనా అవసరం. దీనకి సులభమైన ఆసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు లాంటివి అవసరం అవుతాయి.

శ్వాస క్రియలో మనం పీల్చే గాలి పరిమాణం పెరిగితే జీవకణాలకు ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది. తద్వారా జీవకణాలు శక్తివంతమవుతాయి. ప్రాణాయామంతో పాటు శరీర కండరాలు కూడా బాగా బిగించటం వదులు చేయటం ప్రక్రియతో అవి శక్తివంతం అవుతాయి. అలాగే శరీర భాగాలను పైకి క్రిందకు పక్కకు కదిలిస్తుండడం చేత శక్తిని పొందుతాయి. ఆరోగ్యం కాపాడ బడుతుంది. అయితే యోగ సాధనలో సక్రమ ఫలితాలకోసం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అవేంటంటే...

ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకోవాలి. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, శరీరం తేలికగా ఉందని తోచినప్పుడు మాత్రమే యోగాను అభ్యసించాలి. యోగాకి ముందు, వెనుక కనీసం గంట పాటూ ఎలాంటి ఘనపదార్థాలు తీసుకోకూడదు. సరిపడా గోరువెచ్చని నీటిని తాగి కొంత సమయం తరవాత అభ్యాసం మొదలుపెట్టాలి. ప్రాణాయామం చేసేటపుడు మరీ కష్టంగా అనిపిస్తే ఆపడం మంచిది. యోగాసనాలు వేసేటపుడు సుదీర్ఘంగా, లయబద్ధంగా నాసిక రంధ్రాలతో మాత్రమే శ్వాస పీల్చుకోవాలి.



pc:internet

అనారోగ్యం దరి చేరనివ్వద్దు..! | How to Clean your Home Efficiently


ఇళ్లు రోజూ శుభ్రపరచడంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. ఫ్లోర్ తో పాటు గోడల నలు మూలల్లో ఉన్న బూజు, దుమ్ము రేణువుల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. ముఖ్యంగా స్నానాలగది, వంటగదుల్లో ఎక్కువగా సూక్ష్మజీవులు పెరగటానికి అస్కారమున్న కారణంగా తరచూ శుభ్రపరచమే కాక ఎప్పుడూ అంతా పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఈ గదులకు సరియైన వెంటిలేషన్ ఉండాలి. తలుపులు కాసేపైనా తెరిచి తాజా గాలి వీచేలా చూసుకోవాలి. మిగతా గదుల్లో కిటికీలు తెరిచి గాలి, వెలుతురు ధారాళంగా ప్రవహించేలా చూసుకోవాలి. నివాస పరిసరాల్లో చెట్లు ఉంటే పరిశుభ్రమైన గాలి రావడం, తద్వారా గాలిలో తేమశాతం తగ్గడం జరుగుతుందని గమనించాలి. అలాగే ఫ్లోర్ తో పాటు ఇళ్లంతా నెలకోసరి అయినా దుమ్ము, ధూళి దులిపి వస్తువులను సర్దుకోవాలి. దీంతో డస్డ్ అలర్జీలు,  సీజనల్‌ అలర్జీల నుండి దూరంగా ఉండచ్చు. ఇక ఆస్తమా, ఇతర అలర్జీతో బాధపడేవాళ్లు పెంపుడు జంతువులకి దూరంగా ఉండడమే ఉత్తమం. క్రిమికీటకాల వల్ల కూడా అలర్జీలు, చర్మవ్యాధులు వస్తుంటాయి. ఇంట్లో తేమ, చల్లదనం కారణంగా చీమలు, దోమలు, ఈగలు, బొద్దింకలు, ఎలుకలు, బల్లులు.. ఇవేవి దరిచేరకుండా తగు జాగ్రత్తలు తప్పనిసరి.



లావయిపోతాం.. | How to get a Perfect Body Shape | Health and Fitness Tips

సామాన్య మానవుడు సైతం టెక్నాలజీని అందిపుచ్చుకుని పనులన్నీ ఆటోమెటిక్ చేసుకుంటున్నాడు. పోటీప్రపంచంలో సమయం లేదనే సాకుతో ఇంటిపనులకు కూడా శారీరకశ్రమ ఉండట్లేదు. ఫలితంగా శరీరంలోని పలు అవయవాలలో కొవ్వు పేరుకుపోయి శరీరాకృతిని అందవిహీనం చేస్తోంది. మరి.. మంచి శరీరాకృతిని సొంతం చేసుకోవడానికి నిపుణులు ఏం సూచిస్తునారు..?
- ఇంటిపనులను పిల్లలకు చిన్నప్పటి నుంచే చేయించాలి. భారతీయ సంస్కృతిలో ఇంటిపనులు చేసుకోవడంలోనే చక్కని వ్యాయామం ఇమిడిఉంది. ఇంటిపనులు చేయక, వ్యాయామం చేయకపోతే చిన్న వయసులోనే బి.పి, షుగర్‌, ఒబేసిటి, హార్ట్‌ ఎటాక్‌ వగైరా తప్పవు. 
- శారీరక శ్రమ అనగానే బరువులు మోయడం అనుకోవక్కరలేదు. విసురురాయి, రుబ్బురోలు.. వీలైతే అడపాదడపా వాడుకోవాలి.  అలాగే వాషింగ్‌ మిషన్‌ పక్కనపెట్టి బట్టలు ఉతికి, జాడించడంలో చేతికండరాలు గట్టిపడతాయి. సరే ఇవన్నీ కుదరవు అనుకున్నప్పుడు నడక, మెట్లు ఎక్కడం, స్కిప్పింగ్‌, గార్డెనింగ్‌.. ఇవి మంచి వ్యాయామం అని మరవద్దు.
- ఇంట్లో అయినా, ఆఫీసులో అయినా కుర్చీకి అతుక్కుపోకూడదు. అలా కూచోటంతో మెటబాలిక్‌, కార్డియో వాస్క్యులర్‌ సిస్టంకి నష్టం కలుగుతుంది. దీనివల్ల హార్ట్ సమస్యలు, షుగర్‌ రావడం వంటి ప్రమాదం ఉంది. లాంగ్‌ సిట్టింగ్‌ తో కండరాలు ఒకే పొజిషన్‌కి అలవాటు పడిపోయి కదలలేని పరిస్థితి ఎదురవుతుంది. ఇది హిప్‌, స్పైన్‌, షోల్డర్‌, నెక్‌పెయిన్‌ లకు దారితీస్తుంది.
- చూడ చక్కని శరీరాకృతికి క్రమం తప్పకుండా చేసే వ్యాయామంతో పాటూ ఆహారంపై కూడా దృష్టి పెట్టాలి. భోజనానికి ముందు సూప్స్‌ తీసుకోవడం చాలా మంచిది. కొవ్వును కరిగించే గుణం సూప్స్‌కు ఉంది. మిరియాలు, మిరపకాయలు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అధిక బరువును తేలికగా తగ్గించుకోవచ్చు. గ్రీన్‌టీ ఆరోగ్యానికే కాకుండా అందంగా ఉంచడానికి దోహదం చేస్తుంది. రోజుకు రెండు లేదా మూడు కప్పుల గ్రీన్‌ టీ తాగడం వలన జీర్ణ ప్రక్రియ కూడా వేగవంత మవుతుంది. నిమ్మరసం కనీసం వారానికి ఒకసారి తాగినా ఎంతో మంచిది.


మొత్తం మీరే చేశారు.. | Thoughts for Father's Day


ఫాదర్స్ డే!.. ప్రతీయేటా జూన్‌ మూడో ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా ఈ దినోత్సవం నిర్వహిస్తారు. అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం అనేది కుటుంబ సభ్యుల్లో తండ్రి విలువను ప్రపంచానికి చాటి చెప్పటానికి ఉద్దేశించబడినది. దీని పుట్టుపూర్వోత్తరాలలోకి వెళ్తే మొదటిసారిగా వాషింగ్టన్‌లో ఓ యువతి ఇందుకు చొరవ చూపిందని తెలుస్తోంది. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తన బాధ్యతతో పాటు ఆరుగురు తోబుట్టువుల అలనాపాలనా అన్నీ తానై తండ్రి చూసుకున్నాడు. అందుకు కృతఙతగా తండ్రి పుట్టిన రోజును ఫాదర్స్ డే గా జరిపింది. దానికి కాలక్రమంలో 1966వ సంవత్సరం నుండి అధికారికంగా గుర్తింపు వచ్చింది.

- పితృదేవో భవ.. ప్రతీ తండ్రికి తన పిల్లలను ప్రయోజకుల్ని చేయాలన్న తపన ఉంటుంది.

- అతి సర్వత్ర వర్జయేత్‌.. అన్నట్టుగా పిల్లలపై తండ్రికి కఠినత్వం, గారాభం మితిమీరి ఉండకూడదు. తిట్టడం, కొట్టడం వల్ల ప్రయోజనం ఉండదని గమనించాలి.

- స‌త్య‌మే వ‌జ‌య‌తే.. పిల్లలకు అబద్దాలు చెప్పడం అలవడకుండా చూసుకోవాలి. వారి ముందు తల్లితండ్రులు సత్ప్రవర్తనతో మెలగాలి.

- స్నేహమేరా జీవితం.. చిన్న వయసులో వారితో తండ్రిలా.. టీనేజిలో స్నేహితుడిలా వ్యవహరించాలి. రోజులో వీలైనంత ఎక్కువ సమయం పిల్లలతో గడపడమే కాకుండా ఏది మంచి, ఏది చెడు అన్నవిచక్షణను కలిగించాలి.

- ప్రేరణతోనే విజయం సాధ్యం.. ఇంట్లో పిల్లలను ఒకరిని ఎక్కువ మరొకరికి తక్కువ చేసి చూడకూడదు. అలాగే ఇతరులతో పోల్చి తమ పిల్లలను తక్కువ చేసి మాట్లాడరాదు. ఆత్మన్యూనతకు లోనవకుండా పిల్లలకు తరచూ సానుకూల మాటల్ని చెబుతూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి.


వాన చినుకులు ఇట్టా తడిపితే.. | Essential Precautions to take during Rainy Season


- వర్షంలో తడిస్తే జలుబు, జ్వరం వస్తాయనుకున్నప్పుడు ముందు జాగ్రత్తలు అవసరం. బయటికి వెళ్తున్నప్పుడు అంఉబాటులో ఉన్న గొడుగు, రెయిన్ కోట్, రెయిన్ క్యాప్.. వగైరా వెంట తీసుకెళ్లాలి. ఒక వేళ తడిసినా త్వరగా ఆరిపోయే దుస్తులు వేసుకుంటే మంచిది. సురక్షితమైన పాదరక్షలు వాడాలి. వర్షంలో తడిసిన వెంటనే జుట్టు, శరీరమంతా పొడిగా తుడుచుకోవడం, స్నానం చేయడం మరవద్దు. 

- తీసుకునే ఆహార పదార్థాల మీద ప్రత్యేక శ్రద్ద ఉంచాలి. పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా ఆకు కూరలు వండుకునే ముందు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే వాటిమీద అనేక లార్వాలు , దుమ్ము, పురుగులు ఉంటాయి. ఇవి సులబంగా తొలగించడానికి ఉప్పు నీటిలో 10 నిముషాలు ఉంచాలి. తరవాత ధారగా పడుతున్న నీటిలో శుభ్రపరచుకోవాలి. ఇలా చేయుటం వలన బాక్టీరియాను నిరోధించవచ్చు.

- వర్షం నీటి ద్వారా తాగునీరు కలుషితమవడం, డ్రైనేజ్‌ అస్తవ్యస్తంగా మారడం వల్ల మనం రోగాల బారిన పడతాం. వర్షాకాలంలో కాచివడబోసిన నీరు తాగితే రోగాలకు దూరంగా ఉండవచ్చని వైద్యుల సూచిస్తున్నారు.

- వర్షాకాలంలో దోమల వల్ల వ్యాపించే వ్యాధుల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది మలేరియా. నివాస ప్రాంతాల్లో నీరు నిల్వ ఉన్నప్పుడు, వాటిలో ఎనాఫిలస్‌ దోమలు చేరి గుడ్లు పెడతాయి. క్రమంగా దోమలు పెరిగి మనుషులను కుట్టడం ద్వారా మలేరియా వస్తుంది. జ్వరం వచ్చి తగ్గుతుండడం, చలి, ఒళ్లునొప్పులు, తలనొప్పుల్లాంటి లక్షణాలతో మలేరియా ప్రారంభమవుతుంది. దోమల వల్ల ఫైలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా, మెదడువాపు వంటి వ్యాధులు వ్యాపించే అవకాశముంది. కాబట్టి ఏ దోమ తెరనో, మస్కిటో రిపెల్లెంట్స్ ద్వారానో వాటి నుంచి తప్పించుకోవాలి.

- వర్షాలు అధికంగా కురిసి వెలిసిన తరువాత శ్వాస కోశ వ్యాధులు ప్రబలటానికి ఆస్కారం ఎక్కువ. తగు జాగ్రత్తలు అవసరం. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రతలతో పాటు గోరువెచ్చని నీరు, తాజా ఆహారపదార్థాలను తీసుకోవడం చేయాలి. వీలైనంత వరకు బయటి ఫుడ్ ని అవాయిడ్ చేయాలి. అలాగే క్రమం తప్పని వ్యాయామం ఉండాలి.


అందం - ఆరోగ్యం | Healthy Beauty Tips | Natural Ways to Look Beautiful

- రోజంతా ఫ్రెష్ గా ఉండి, రాత్రి కమ్మని నిద్ర పట్టాలంటే రెండు పూటలా గోరువెచ్చని స్నానం ఆచరించడం మంచిదని వైద్యనిపుణులు చెప్తున్నారు. స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రమవడమే కాక ఇతర లాభాలు ఉన్నాయి. శరీర నొప్పులను తగ్గించగలిగే శక్తి వేడినీటికి ఉంది. అంతేకాకుండా గోరువెచ్చటి నీటి స్నానం శరీరాన్ని రిలాక్స్‌ చేస్తుంది. అంటే మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. ఫలితంగా మంచినిద్రకు దారితీస్తుంది. మెదడు చురుకుదనాన్ని, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

- సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. ప్రస్తుతకాలంలో టీవి, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్.. ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడకం విపరీతమయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా అందరూ వీటిని వినియోగిస్తున్నారు. అయితే నిపుణుల సలహాలను తప్పక పాటించాల్సి ఉంది. లేదంటే కంటి సమస్యలు, మానసిక ఆంధోళన.. ఇతర అనారోగ్యసమస్యలు తప్పవు. సహజంగానే సూర్యకిరణాలలోని అతినీలలోహిత కిరణాలు కంటి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. కంటి కింద నల్లనిచారలు, చుట్టూ చర్మంపై ముడతలు చిన్న వయసులోనే వచ్చేలా చేస్తాయి. కాబట్టి కంటిని కాపాడుకునేందుకు చక్కని పెద్ద గాగుల్స్‌ ధరించంచాలి.

- లిఫ్ట్‌లు, ఎలివేటర్లు.. వచ్చాక మెట్లు ఎక్కే శ్రమ తప్పింది. అయితే మెట్లు వాడడం అనేది చక్కని వ్యాయామం అని గుర్తించాలి. మెట్లు వేగంగా ఎక్కడం వల్ల కండరాలకు చక్కని రూపం వస్తుంది.  శరీరంలోని అదనపు కేలరీలను బరువును సులభంగా కరిగించుకోవచ్చు. సో.. అన్ని సందర్భాల్లో కాకున్నా వీలైనంతవరకు స్టెయిర్ కేస్ వినియోగిస్తారు కదూ!.

- ఎంత ఎబ్బెట్టుగా ఉన్నా స్టైల్‌, ఫ్యాషన్ ముసుగులో నప్పని వస్త్రాల జోలికి వెళ్లద్దు. ఒంటికి అతుక్కుపోయినట్లుండే జీన్స్‌ వేసుకోవడంవల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. మరీ బిగుతుగా ఉండే జీన్స్‌ శరీర కండరాల కదలికలను అడ్డుకోవడమేకాక వెన్నునొప్పి వచ్చే ప్రమాదం ఉంది.

- మహిళలు హ్యాండ్‌ బ్యాగ్‌, ఎత్తు మడమల చెప్పుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. బరువైన ఆభరణాలను ధరించడంవల్ల కూడా మెడ కండరాలు దెబ్బతినే అవకాశం ఉంది. 


కాలుష్య భూతం | Tips to Protect Yourself from Unhealthy Air | Traffic Pollution


అసలే పరిశ్రమలు, వాహనాల కాలుష్యంతో సతమతమవుతూంటే రోడ్లు ఎక్కడికక్కడ తవ్వేసి దుమ్ము, ధూళి పెరిగిపోయింది. పైగా వర్షాకాలం మూలంగా నగర జీవితం ప్రాణసంకటంగా మారింది. ఆందోళనకరంగా శ్వాసకోశ వ్యాధులు ప్రభలుతున్న నేపథ్యంలో పోల్యూషన్ కి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లేదంటే తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులతో పాటు క్రానిక్ బ్రాంకైటీస్, ఆస్తమా, సైనస్ వంటి సమస్యలు తప్పవు.

స్వచ్ఛమైన గాలి (ఆక్సీజన్) పీల్చుకోవాల్సిన మనకు తెలియకుండానే ధూళిరేణువులు నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరిపోతున్నాయి. ఫలితంగా అనేక శ్వాసకోశ సమస్యలకు కారణమవుతోంది. దుమ్ము ధూళి కళ్లలోకి చేరి కళ్ళ సమస్యలు దరిచేరుతున్నాయి. కళ్ళ రెటీనా దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ట్రాఫిక్ సమస్యలకు తోడు పొల్యూషన్ కారణంగా చికాకు, అసహనం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. నీరసం, తలనొప్పి, ఒళ్లంతా నొప్పులతో బాధపడాల్సివస్తుంది.

అందుకని ట్రాఫిక్ లో బయటికి వెళ్తున్నప్పుడు ముందు జాగ్రత్త చర్యలే ముఖ్యం. కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు, సూర్యరశ్మి నుండి కాపాడుకునేందుకు, చర్మాన్ని, కేశాలను రక్షించుకునేందుకు తప్పక స్కార్ఫ్ లు ధరించాలి. డ్రైవింగ్ లో హెల్మెట్ వాడడంతో పాటు ముక్కుకు మాస్క్‌లు, కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం తప్పనిసరి. వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ని వినియోగించుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ పోషకాహారం, సరియైన విశ్రాంతి, వ్యాయామం దృష్టిసారించడం తప్పనిసరి.


విసుకు చెందక.. | Tips for Balancing Your Family Life with Your Career | Work-Life Balance

 
మహిళ ఇంటా బయట 'రాణి'స్తోంది. కారణం ఇళ్లు, ఆఫీసు పనులను చాకచక్యంగా చక్కబెట్టడమే. మహిళలు పనివేళల్లో సహోద్యుగులతో, మిగతా సమయాల్లో కుటుంబసభ్యులతో హుషారుగా ఉండాలంటే అలసటను దరిచేరనివ్వద్దు. అందుకని ఆరోగ్యం మీద దృష్టి సారించాలి. ఆరోగ్య చిట్కాలను పాటించాలి.

- రోజంతా చలాకీగా ఉండాలంటే కనీసం అరగంట సమయం వ్యాయామానికి కేటాయించండి. నడక శరీరానికి చక్కని ఎక్సర్సైజ్ అని గుర్తించండి. వీలైతే లిఫ్ట్ కి బదులు మెట్లు ఉపయోగించడం మంచిది.
- కంప్యూటర్ స్క్రీన్ కంటికి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. కుర్చీలో నిటారుగా  కూర్చోవాలి. ఇలా చేస్తే మెడ, వెన్ను నొప్పులు రావు. కళ్ళు తొందరగా స్ట్రేయిన్ అవ్వవు.
- అదేపనిగా గంటల తరబడి కూర్చోకుండా మధ్యమధ్యలో నిటారుగా నిలబడడం, నాలుగు అడుగులు వేయడం చేయాలి.
- కంప్యూటర్ కీబోర్డ్, మౌస్ వాడడంలో చేతివేళ్లు నొప్పిపెట్టవచ్చు. వేళ్లు రిలాక్స్ అవ్వాలంటే రబ్బర్ బ్యాండ్ తీసుకుని రెండు చేతులను దగ్గరగా చేర్చి వేసుకోవాలి. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ ని సాగదీస్తూ, వదిలేస్తూ ఐదు నిమిషాల పాటు చేయాలి. స్ట్రెస్ బాల్ ని కూడా వినియోగించవచ్చు.
- ఉదయంపూట టిఫిన్ నిర్లక్ష్యం  చేయకూడదు. అల్పాహారంలో ఆరోగ్యకరమైన తృణధాన్యాలు, నట్స్ వంటివి ఉండేలా చూసుకోవాలి. అలాగే రోజూ తీసుకొనే ఆహారంలో తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవాలి. తగినంత మంచినీళ్లు  అవసరం.
- వరాంతల్లోనే కాక రోజూ కనీసం అరగంట వ్యక్తిగత సమయం అంటూ పెట్టుకోండి. దాన్ని కేవలం మీకోసమే సద్వినియోగం చేసుకోండి. దీంతో మీకు చక్కని విశ్రాంతి దొరకడంతో పాటు యాంత్రికత, విసుగూ మటుమాయమవుతాయి.

 
pc:internet

ఆరోగ్యానికి తులసి.. | Amazing Health & Beauty Benefits of Holy Basil | Tulsi

 - తులసి మేలు మరిచేది కాదు. తులసి, తేనె కలిపి పరగడుపున రోజూ తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. తద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
- ఈ వర్షాకాలంలో తీవ్రంగా వ్యాప్తి చెందే మలేరియా, డెంగ్యూ.. వగైరా జ్వరాలను అరికట్టడంలో తులసి మంచి ఔషధం. శుభ్రపరచిన కొన్ని తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి ఆ కషాయం సేవించాలి.
- తులసి ఆకుల్ని నోట్లో వేసుకుని తరచూ నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం కలుగుతుంది.
- రెండు చెంచాల తులసి రసంలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది.
- తులసి ఆకులను వేసి మరిగించిన నీళ్లను తాగినా, నోట్లో పోసుకొని గార్గిలింగ్ చేసినా గొంతులో పలుసమస్యలతో పాటు గరగర ఇట్టే మటుమాయం కావాల్సిందే.
- తులసిలోని యాంటీఆక్సిడెంట్ల కారణంగా చర్మం కాంతులీనడమే కాక వృద్ధాప్య లక్షణాలను దరిచేరనివ్వదు.
- అలాగే తులసిలో యాంటీసెప్టిక్‌ గుణాలు అధికం. ఎలాంటి అలర్జీలనైన పారదోలుతుంది.
- తులసి ఆకులను మెత్తగా నూరిన ముద్దను మొఖానికి బాగా అప్లై చేసి చల్లటి నీటితో శుభ్రపరిస్తే జిడ్డు, మరకలు, మచ్చలు శాశ్వతంగా తొలగిపోయి కాంతివంతం అవుతుంది.


బ్యూటీ టిప్స్‌ | Beauty Tips for Gorgeous Skin | Face Care


కాస్మొటిక్స్‌ జోలికి వెళ్లకుండా సహజమైన చర్మ సౌందర్యం ఇనుమడింపచేయాలంటే..? కొన్ని బ్యూటీ టిప్స్‌ మీకోసం..

- ముఖం మీద పేర్కొన్న దుమ్ముధూళిని వదిలించడానికి టొమాటో రసాన్ని పట్టించి పది నిమిషాల తరువాత గోరు వెచ్చటి నీళ్లతో కడిగేయాలి.
- ముఖానికి తేనెతో ఫేస్‌ ప్యాక్‌ వేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.
-  చర్మం పట్టుకుచ్చులా మారాలంటే కలబంద గుజ్జు ఉపయోగపడుతుంది. ముఖంపై మొటిమలు, మచ్చలను తొలిగిస్తుంది. ఈ గుజ్జును ముఖానికి రాసి పావు గంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.
- మోచేతులు, మోకాళ్ల మీద ఉండే నలుపు పోవాలంటే నిమ్మ చెక్క లేదా కమలాపండు తొక్కతో ఆ ప్రదేశంలో రుద్దాలి.
- కొబ్బరినూనెలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు చర్మాన్ని శుభ్రపరుస్తాయి. సో.. చర్మంపై మర్దన చేసి మెరిసే చర్మం మీ సొంతం చేసుకోవచ్చు.


వంటగ్యాస్‌ ఆదా.. | Save upto 30% of Cooking Gas | Fuel Saving Tips


మనం నిత్యం వాడే సహజవనరులలో వంటగ్యాస్‌ అతి ముఖ్యమైనది అని చెప్పవచ్చు. దీన్ని సురక్షితంగా, సంపూర్ణంగా వినియోగించుకొని, తద్వారా సహజవనరుల పరిరక్షించడం మన అందరి బాధ్యత. దీంతో ఆర్ధికంగా కూడా లాభం చేకూరుతుంది. గ్యాస్ స్టవ్ వినియోగంలో ఏ మాత్రం ఏమరుపాటు వహించినా వంటింటి ప్రమాదాలు సంభవిస్తాయి. ఈ అగ్నిప్రమాదాలతో ప్రాణ, ఆస్థి నష్టాలు తప్పవు.

LPG (Liquefied Petroleum Gas) వంటచెరుకుగా వినియోగించి గ్యాస్ స్టవ్ వాడటంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. స్టవ్, గ్యాస్ రెగ్యులేటర్.. ఇతర అససరీస్ కచ్చితంగా నాణ్యమైనవి ఎన్నుకోవాలి. తరుచూ స్టౌవ్‌ను శుభ్రపరుస్తూ ఉండాలి. సిలిండర్‌కంటే కాస్త ఎత్తులో స్టవ్ ఏర్పాటు చేసుకోవాలి. నేరుగా సూర్యరశ్మి పడకుండా, ఎలక్ట్రికల్ పాయింట్స్ దగ్గరగా లేకుండా జాగ్రత్తపడాలి. అలాగే ఇతర దీపాలు, క్రిమికీటకాల మందులు, స్ప్రే బాటిల్స్ స్టవ్ దగ్గరలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. 

ఈ ముందు జాగ్రత్తలతో పాటు గ్యాస్ ఆదా చేయడంలో ఈ చిట్కాలు మరవద్దు..
- వంటకు అన్నీ సిద్ధం చేసుకున్నాకే స్టవ్ వెలిగించాలి. ముఖ్యంగా నాబ్ తిప్పేసి లైటర్ వెతుక్కోకూడదు.
- వంటలకు సరియైన పాత్రలను మాత్రమే వినియోగిచాలి. అంటే పరిమాణం, ఉష్ణవాహకాలపై దృష్టి పెట్టాలి.
- వంట పాత్రలపై విధిగా మూత పెట్టాలి. ప్రెషర్‌ కుక్కర్‌ వినియోగిస్తే చాలా మేలు.
- ఫ్రిజ్‌లో నుంచి తీసిన పాలు, ఇతర పదార్థాలను వెంటనే స్టవ్ పై పెట్టకూడదు.
- బియ్యం, పప్పు దినుసులు.. వగైరా వంటకు ముందే నానబెట్టుకుంటే గ్యాస్ తో పాటు సమయం వృధా ఉండదు.
- తరుచూ బర్నర్‌లను శుభ్ర పరచాలి. నాబ్స్, పైప్ నుండి ఏమైనా గ్యాస్ లీక్ అవుతోందా అని గమనించాలి.
- వంట సమయంలో ఎక్జాస్ట్ ఫ్యాన్ వేసుకోవాలి. ఇతర ఫ్యాన్ ల వల్ల కాని, కిటికీల్లో నుంచి కాని స్టవ్ వద్ద అతిగా గాలి వీచకూడదు.
- వంట పూర్తయ్యేవరకు గ్యాస్ స్టవ్ దగ్గరే ఉండడం మంచిది. అప్పుడే వంటలు రుచికరంగా వండుకోవడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా ఆహార పదార్థాలు పొంగి బర్నర్‌పై పడే ప్రమాదం తప్పుతుంది. 


రోటీన్ కి భిన్నంగా.. | Tips for a Happy and Healthy Weekend


సరియైన విశ్రాంతి లేకుండా రోజంతా పనిభారంతో వారం రోజులు గడపామంటే ఆరోగ్యం క్షీనిస్తుంది. విశ్రాంతి అనగానే కాలీగా కూర్చోవడమో, ఎక్కువ నిద్రపోవడమో, టీవీ చూడడమో కాకుండా వారాంతాల్లో పిల్లలతో బయటికి వెళ్లడం, స్నేహితులు, బంధువులను కలవడం చేయాలి. వీకెండ్స్‌లో ఇలా చేయడం వల్ల జీవతం ఆహ్లాదభరితంగా మారుతుంది. అంతేకాకుండా ఇంట్లో అయినా, ఆఫీసులో అయినా రోజు వారీ పనుల పట్ల విరక్తి చెందకుండా ఉండగలుగుతాము. ఊరికే అందరి ఇంటికి వెళ్లడం ఏంటి అనుకుంటే కనీసం పుట్టిన రోజులకు, పార్టీలకు, అకేషన్లకు తప్పక వెళ్లండి. దీని వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే అనేక ఒత్తిళ్లు దరిచేరకుండా ఉంటాయి.

ఇక స్కూళ్ళు తెరిచేసారు కాబట్టి మీకు ఉదయాన్నే చాలా పనులు ఉంటాయి. కనుక రాత్రి పడుకునే ముందే పిల్లల యూనిఫామ్స్, స్కూల్‌ బ్యాగ్సు, వాటర్‌ బాటిల్స్‌ అన్నీ సిద్ధం చేసుకోవాలి. సమయాభావం లేకుండా ఉదయం టిఫిన్‌ చేయడం కుదురుతుంది. రాత్రిపూట టీవీ, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్.. ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ జోలికి వెళ్లకుండా నిద్రకు సమయపాలన పాటించాలి. వీలైనంత వరకు రాత్రి భోజనం అయినా కుటుంబ సభ్యులతో కలిసి చేయడానికి ప్రయత్నించండి.



వంటింటి చిట్కాలు | Basic Cooking Hacks Everyone Should Know


- అన్నం వండేటప్పుడు గంజి వార్చకుండా అత్తెసరుగా వండాలి. అంటే ఒకటి, రెండు నిష్పత్తిలో బియ్యం, నీరు పోసి ఉడికించాలి.
- అట్లు, దోసెలు, ఇడ్లీ, వడ, కిచిడి తయారీలో పొట్టు పప్పలను వినియోగించాలి.
- పప్పు, ధాన్యం ఒకే రకం రోజూ వాడటం కన్నా రెండు, మూడు రకాలుగా వాడితే మేలు.
- ఆవిరితో ఉడికిన ఆహార పదార్థాలు తక్కువగా పోషకాలను నష్టపోవడమే కాకుండా సులభంగా జీర్ణమవుతాయి కూడా. పప్పులు, కూరలు ఉడికిన తరవాత మిగిలిపోయిన నీటిని పారపోయకుండా చారులోగానీ, పులుసులో గానీ వాడుకోవాలి.
- క్యారెట్, బీట్ రూట్ ను ఉడికించిన నీటిని వృధా చేయకుండా అన్నం ఉడికించేందుకు వాడితే, అన్నం రుచికరంగానూ పోషక విలువలనూ కలిగి ఉంటుంది. రంగు రెడ్ పలావ్ లా ఉంటుంది మరి.


ఒక్క ఐడియా.. | Life Hacks in Telugu | VantintiChitkalu


- అజీర్ణం, కడుపునొప్పి, ఉబ్బరం.. వగైరా బాధిస్తుంటే తరచూ తీసుకునే ఆహారంలో పీచుపదార్థాలతో పాటు తాజా ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి.

- ఇక వికారం చిరాకుపుట్టిస్తుంటే నాలుగు వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి రోజూ రెండు పూటలా తీసుకుంటే సరి.

- వంటింట్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా చిన్నచిన్న గాయాలు అవుతుంటాయి. శరీరానికి షార్ప్ ఎడ్జెస్ ఎవైనా గీసుకుని రక్తస్రావం అవడం, వేడిపాత్రలు పట్టుకోవడం, వేడి పదార్థాలు మీద పడడం వల్ల కాలడం జరగవచ్చు. వీటికి కలబంద రసంలో కాస్త పసుపు కలిపి గాయాల మీద రాస్తే గాయాలు త్వరగా మానడమే కాక మచ్చలు ఏర్పడవు.


ఈ వర్షం సాక్షిగా.. | Take care of Health during Monsoon | Rainy Season


నైరుతీ రుతుపవణాలు ఆగమనంతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 3 డిగ్రీల వరకు తగ్గుతున్నాయి. గాలిలో తేమ శాతం బాగా పెరిగింది. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ప్రధానంగా వర్షాలు మొదలవుతూనే అంటువ్యాధులు ప్రబలుతాయి. మన చుట్టూ ఉండే వాతావరణంలో రోగ కారకాలైన రకరకాల వైరస్‌లు, బాక్టీరియా, ఫంగస్‌లు మనకి కనిపించకుండానే ఆహారంతోపాటు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. సరైన ఆరోగ్యం ఉన్నప్పుడు మితమైన ఆహారం, సరియైన విశ్రాంతితో శరీరంలో మలిన పదార్ధ విసర్జన, ఉచ్చ్వాస నిశ్వాసాలు క్రమబద్ధంగా ఉంటాయి. ఆరోగ్యానికి హాని కలగజేసే సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఇన్ఫెక్షన్‌ ఏర్పడుతుంది.

వర్షాకాలం తడిస్తే కొందరికి జలుబు, జ్వరాలు వస్తుంటాయి. అలాంటి వారు గమనించుకొని వర్షాల్లో తడవకపోవడమే మంచిది. ఒక వేల తడిసినా వెంటనే తల, ఒళ్లును తడుచుకొని జలుబు చేయకుండా చూసుకోవాలి. అంతేకాకుండ వర్షపు నీటి వల్ల తాగునీరు కలుషితమవడం, డ్రైనేజ్‌ అస్తవ్యస్తంగా మారడం వల్లే మనం రోగాల బారిన పడతాం. వర్షాకాలంలో కాచివడబోసిన నీరు తాగితే రోగాలకు దూరంగా ఉండవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే తీసుకునే ఆహారం మీద ప్రత్యేక శ్రద్ద కనబరచాలి. పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా ఆకు కూరలు వండుకునే ముందు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాటిమీద అనేక లార్వాలు, దుమ్ము, పురుగులు ఉంటాయి. ఇవి తొలగించడానికి ఉప్పు నీటిలో కూరగాయలు, ఆకుకూరలను కాసేపు ఉంచాలి. తరవాత ధారగా పడుతున్న నీటిలో శుభ్రపరడం ద్వారా బాక్టీరియాను నిరోధించాలి.

https://www.youtube.com/c/vantintichitkalu