క్రమశిక్షణ ముఖ్యం | How to Discipline Children | Positive Parenting


అన్ని మంచి హ్యబిట్స్ ఉన్నయంట నాలో విన్నవ మిస్టర్.. 

పిల్లలకు సమ్మర్ హాలీడేస్ ముగుస్తున్నాయ్.. ఇక అల్లరికి ఇంత సమయం చిక్కకపోవచ్చు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి. పిల్లలకు మార్కులు మాత్రమే ముఖ్యం కాదని గుర్తించాలి. సభ్యత, సంస్కారం అలవడేలా చూడాలి. క్రమశిక్షణతో పిల్లలను పెంచడం ఒక కళ అంటారు. సహజంగా కూతురు తండ్రిని, కొడుకు తల్లిని అనుకరిస్తారని సైకాలజీ నిపుణులు చెప్తారు. అందుకని తగు జాగ్రత్తలతో నడుచుకోవడం అవసరం.

- పిల్లలు టీవీ,కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జట్స్ కి అడిక్ట్ కాకుండా చూసుకోవాలి. అలా జరగకుండా దృష్టి మళ్ళించడమే కాకుండా వాటి వల్ల అనర్థాలను తెలియచెప్పాలి.
- ఇంట్లో అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆర్పే పద్ధతిని పెద్దలను చూసి పిల్లలు అలవర్చుకుంటారు.
- 'ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉండదు..'  అని విసుక్కునేకన్నా చక్కగా వస్తువులను సర్దుకోవడంలో ఉన్న ప్రయోజనాలను తెలియచేయాలి.
- వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహణ కలిగించాలి.
- చాక్‌లెట్ రేపర్స్.. ఇతర చెత్తను ఎప్పటికప్పుడు చెత్తబుట్టలో వేయడం లాంటివి పిల్లలకు నేర్పాలి.
- మంచినీళ్ళు, పాలు తాగిన గ్లాసులు పిల్లలు ఎక్కడివి అక్కడే పడేయకుండా సింక్ లో వేయడం, డైనింగ్ టేబుల్ మ్యానర్స్ నేర్చుకునేలా చూడాలి.
- విడిచిన బట్టలను ఎక్కడ వెయ్యాలో, ఏవి హ్యాంగర్‌కి తగిలించాలో.. పెద్దలను చూసి పిల్లలు నేర్చుకునే అవకాశముంది.
- స్కూళ్ బ్యాగ్, ఇతర సామాగ్రి సమయానికి చిక్కేలా చూసుకోవాలి.
- నేటి రోజుల్లో పిల్లలకు ట్రాఫిక్ రూల్స్ నేర్పించడం అన్ని విధాలా శ్రేయస్కరం అని గమనించండి.
- పిల్లల ఐక్యూ పెంచేలా మంచి పుస్తకాలను వారికి అందుబాటులో ఉంచండి. మంచి విషయాలు చెప్పండి. చెస్, పజిల్స్, రిడిల్స్.. పిల్లల మెదడుకి పదునుపెడ్తాయి.
- పెయింటింగ్, మొక్కలు పెంచడం, బుక్ రీడింగ్.. లాంటి మంచి అలవాట్లు వారి సృజనాత్మకతను తట్టి లేపుతాయి.
- తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా వారితో రోజూ కొంత సమయం గడపడం అవసరం.
- గ్రాండ్ పేరెంట్స్ అతి గారాబం పనికిరాదు. అది మీకు సంతృప్తినివ్వొచ్చేనేమో కానీ వారి ఎదుగుదలకు ఏమాత్రం ఉపయోగపడదు.
- పిల్లలతో వారించకుండా మీ పిల్లల మాటలు కూడా వినండి.
- వారి పనులను వారు చేసుకునేలా ప్రోత్సహించడం మరవద్దు.

 https://www.youtube.com/c/vantintichitkalu

pc:internet

వాషింగ్ మిషన్ నిర్వహణలో.. | How to Clean a Washing Machine | Laundry Hacks


మాసిన దుస్తులను నానబెట్టి, సబ్బురుద్ది, మురికిని వదిలించడం శ్రమతో కూడిన పని పైగా అంత సమయం ఇప్పుడు ఎవరికి చిక్కడం లేదు. కారణంగా వాషింగ్ మిషన్‌ విరివిగా వాడకం లోకి వచ్చింది. ఇందులో సెమీ ఆటోమెటిక్, ఆటోమెటిక్ రకాలున్నాయి. మొదటి రకంలో మిషన్ లోకి నీటిని పోయడంతో పాటు ఉతికిన దుస్తులను తీసి నీళ్లలో జాడించి ఆరేసుకోవాలి. అదే ఆటోమెటిక్ వాషింగ్ మిషన్లో అయితే దుస్తులను ఆరవేసేందుకు వీలుగా తయారవుతాయి. కానీ కొన్ని సమస్యలు మాత్రం తప్పవు. ముఖ్యంగా బట్టలు ఒకదానికి ఒకటి చుట్టుకుపోవడం, మడతలలోని మురికి వదలకపోవడం జరుగుతుంది. ఈ సమస్య టాప్ లోడ్ మిషన్ లో కంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ లో తక్కువగా ఉండే అవకాశముంది.

ఎంతో ఖరీదైన గుడ్డలు ఈ వాషింగ్ మిషన్ లో శుభ్రపరచడం వల్ల పాడవకుండా ఉండాలంటే జాగ్రత్తవహించాల్సి ఉంటుంది. ఆపరేటింగ్ మ్యాన్వల్ చదివి తు.చ తప్పకుండా విధివిధానాలు పాటించాలి. దుస్తులపై ఉన్న లేబుల్స్ చూసి వాటిని శుభ్రపరిచే పద్దతులను కచ్చితంగా అవలంభించాలి. లేదంటే రంగులు వెలవడం, ఎక్కువకాలం మన్నకపోవడం తప్పదు. మిషన్ ఆపరేటింగ్ సిస్టంనిబట్టి నాణ్యమైన వాషింగ్ పౌడర్ ని వాడడంతో పాటు వారి సూచనలు పాటించాల్సిఉంటుంది. లేదంటే ఎక్కడ మురికి అక్కడే ఉండడం, దుస్తులు చిరిగిపోవడం, డిటర్జెంట్ వదలకపోవడం, రంగులు అంటుకోవడం.. చివరికి మిషన్ మొరాయించడం సంభవించవచ్చు. నీటి సరఫరా, డ్రైన్ పైప్ కనెక్షన్లను సరిచూసుకోవడం, సరియైన వాషింగ్ ప్రోగ్రాంని ఎన్నుకోవడం.. మాత్రమేకాకుండా వాషింగ్ మిషన్ నిర్వహణలో ఈ చిట్కాలు తప్పనిసరి..

- ద్రవరూపంలో ఉన్న డిటర్జెంట్ల కంటే పౌడర్ రూపంలో ఉన్నవైతే ఉత్తమం. మిషన్ లో వేసిన లోడ్ కి తగ్గట్టు మాత్రమే డిటర్జెంట్ వాడాలి.
- ట్రేలో డిటర్జెంట్ పేరుకుపోయి, ఫంగస్ చేరకుండా తరచు శుభ్రపరచాలి.
- ఫిల్టర్‌లను క్రమం తప్పకుండా ఖాళీ చేస్తూ ఉండాలి. మురికి, మిగిలిపోయిన పదార్థాలు నిండి పోకుండా జాగ్రత్తపడాలి.
- లోడ్ వేయకుండా మెషీన్‌ని వాష్ మోడ్‌లో పెట్టి వేడి నీరు కానీ, వంటసోడాతో కానీ వాష్‌డ్రమ్‌ ని శుభ్రపరచాలి.
- వాషింగ్ సమయంలో మాత్రమే మురికి గుడ్డలు వాష్‌డ్రమ్‌ లో వేయాలి. అంతేకాకుండా మిషన్‌ వాడిన ప్రతిసారీ కాసేపు లిడ్ తెరిచి ఉంచాలి. తద్వారా సూక్ష్మక్రిములు చేరకుండా ఉంటాయి. వాసన కూడా దరిచేరదని గమనించండి.


pc:internet

నల్లటి వలయాలా.. | How to Remove Dark Circles Under the Eyes Naturally


ఈ రోజుల్లో నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు, పని ఒత్తిడి, నిద్రలేమి, డిప్రెషన్‌, రోజులో ఎక్కువ సమయం మొబైల్‌, టివి, కంప్యూటర్.. వగైరా వాడటం.. కారణమేదైనా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. అయితే వీటి గురించి ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ డార్క్‌ సర్కిల్స్‌ని సులభంగా మటుమాయం చేసుకోవచ్చు. ముఖ్యంగా పోషక ఆహారం, సరిపడా నిద్రపై దృష్టి పెట్టడంతో పాటు అనవసర ఆలోచనలను దరిచేరనివ్వకూడదు. డిప్రెషన్‌కు దూరంగా ఉండడానికి యోగా లేదా ధ్యానం సత్ఫలితాలు ఇస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక కళ్ళ చుట్టూ ఏర్పడే డార్క్‌ సర్కిల్స్‌ తగ్గించుకోవడానికి ఈ చిన్న చిట్కాలు ప్రయత్నించవచ్చు..
- పాలలో దూది పింజలను ముంచి కళ్లపై పెట్టుకోవాలి. పదినిమిషాల తర్వాత కళ్లను శుభ్రం చేసుకుంటే చక్కని ఫలితం కనబడుతుంది.
- రోజ్‌ వాటర్‌ డార్క్‌ సర్కిల్స్‌ను వేగంగా మటుమాయం చేస్తాయి. అందుకని పాలకు బదులుగా రోజ్‌ వాటర్‌ ని వాడుకోవచ్చు.
- టీ బ్యాగులను మంచి నీటిలో ముంచి కళ్ల కింద ఉన్న నల్లటి వలయాలపై పెట్టుకున్నా కొన్ని రోజుల్లోనే చక్కని ఫలితం కనిపిస్తుంది.
- కీరా దోసకాయ లేదా బంగాళదుంపను శుభ్రపరిచి సన్నగా, గుండ్రని ముక్కలుగా తరిగి కళ్ళపై పెట్టుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటే మంటలే కాక డార్క్‌ సర్కిల్స్‌ కూడా మాయమవుతాయి.


pc:internet

తీరైన ఆకృతికి.. | Health and Fitness Tips for Women


ఈ రోజుల్లో మహిళలకు ఉరుకులు పరుగుల జీవితం సర్వసదారణం. ఇంటా.. బయట.. పనులకే టైం సరిపోవడం లేదు. ఇక ఆరోగ్యంపై ఏం శ్రద్ధ పెట్టం?  అనుకుంటే పొరబాటే. మెరుగైన అరోగ్యం, శరీరాక్రుతి  పొందడానికి ఈ చిట్కాలు తప్పనిసరి..

- మంచి పోషకాహారం, క్రమం తప్పని వ్యాయామం.. వీటితొ నాజూకైన శరీరాక్రుతిని మీరు సొంతం చేసుకోవచ్చు.
- సరియైన సమయంలో సరియైన ఆహారం తీసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. చిరు తిండివైపు మనసు లాగేస్తే శరీరం బరువు పెరగడం తథ్యం.
- సాద్యమైనంత వరకు అధిక కొవ్వు, క్యాలరీలతో కూడిన ఆహారమును దూరంగా ఉంచాలి.
- ఉదయం ఫలహారంలో పాలు, పాల ఉత్పత్తులను తప్పనిసరిగా తీసుకోవాలి. గుడ్డు, తృణధాన్యాలతో చేసిన అల్పాహారాన్నీఎంచుకోవచ్చు.
- మధ్యాహ్న భోజనంలో తాజా కూరగాయలూ, ఆకుకూరలు ఉండేలా జాగ్రత్తపడాలి.
- స్నాక్స్ గా పండ్లముక్కలు, నట్స్‌ వంటివి ఎంచుకోవాలి.
- మంచి నీరు ఎక్కువగా తీసుకోవడం మరవద్దు.
- టివి దగ్గర, ఆఫీసుల్లో గంటల పాటు కదలకుండా కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి తిరుగుతుండాలి.
- ఉదయం లేదా సాయంకాలం పూట అన్ని వ్యాయామాలతోపాటూ నడకనీ తప్పనిసరి చేసుకోవాలి. 


pc:internet

ప్రాణాంతకం | Smoking is Injurious to Health | May 31 : World No Tobacco Day


ధూమపానం చేయడం నేడు ఫ్యాషన్ అయిపోయింది. ఎవరింట్లోనైతే పెద్దలు ధూమపానం చేస్తుంటారో ఆ ఇంట్లోని పిల్లలు, గర్భినీ స్త్రీలు, పెంపుడు జంతువుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ధూమపానం చేసేవారికన్నా ఆ చుట్టుపక్కల వారి ఆరోగ్యంపై పొగ ప్రభావం అధికంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పొగాకు వినియోగం ఏ రూపంలో ఉన్నా అనారోగ్యానికి గురిచేస్తుంది. అయితే వినియోగించిన విధానాన్ని బట్టి కొంతవరకు తీవ్రతలో మార్పు ఉంటుంది. ఈ శారీరక సమస్యలకు తోడు మానసిక సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తప్పవు. పొగాకు కొన్ని వందల రకాల హానికర రసాయనాలతో కూడుకున్నదే కాక నికోటిన్, బూడిద, అధికంగా అనర్థాలకు గురి చేసే కార్బన్ మోనాక్సైడ్ దీనిలో ఎక్కువగా ఉంటాయి. పొగాకు ఊపిరితిత్తులను విపరీతంగా ప్రభావితంచేస్తాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మాత్రమేకాకుండా, శరీరంలోని అన్ని అవయవాలను క్రమంగా నాశనం చేస్తుంది. పొగాకు వినియోగం వలన కలిగే నష్టాలలో ముఖ్యమైనవి ఊపిరితిత్తుల కాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు. అంతేకాకుండా ధూమపానం వల్ల నంపుసకత్వం వస్తుందని తాజా పరిశోధనలు వెల్లడించాయి.

పొగాకు ఉత్పత్తులకు బానిసై ఒక్కసారిగా మానడం కష్టమే అంటున్నారు వైద్య నిపుణులు. పైగా అలా మాన్పించినా నష్టమే జరుగుతుందంటారు. అయితే గుట్కా నమిలే వాళ్లు వాటికి క్రమంగా దూరం అవడం కోసం నికోటిన్ తక్కువ మోతాదులో ఉండి, హానికర పదార్థాలు లేని చూయింగ్‌గమ్, చాక్లెట్లను ఆశ్రయించాలి. అలాగే ధూమపానం అలవాటుకు దూరం కావడం కోసం టార్‌ఫ్రీ, హానికర పదార్థాలు లేని ఎలక్ట్రానిక్ సిగరెట్లు వాడడం ఉపయోగకరం అని సూచిస్తున్నారు. పొగాకు వినియోగం వల్ల కలిగే నష్టాలను గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 31వ తేదీని ధూమపాన వ్యతిరేక దినం (అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం)గా ప్రకటించింది. 1953 నుండి ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రపంచ మంతటా ‘నో స్మోకింగ్‌ డే’ నిర్వహించడం ఆనవాయితీగా మారింది. పొగాకు రాహిత సమాజంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా 18 సంవత్సరాల వయస్సులోపువారికి పొగాకు ఉత్పత్తులు అమ్మడం ప్రభుత్వం నిషేధించింది. సిగరెట్ అండ్ అదర్ టబాకో ప్రోడక్ట్స్ యాక్ట్ లోని సెక్షన్ 4 బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్దం.



సౌర శక్తి.. | Renewable Energy & Energy Resources of the Future | May 31 : World Solar Day


నేడు అనేక దేశాలు  ప్రత్యామ్నాయ ఇంధనవనరులైన సోలార్, విండ్, బయోమాస్ వంటి వాటిపై దృష్టి పెట్టాయి. మన దేశంలోనూ గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్  వంటి రాష్ట్రాలు సౌరశక్తిని విరివిగా వాడకంలోకి తెచ్చాయి. మొదటగా అమెరికా 1978 మే 31న సూర్యదినంగా పాటించింది. అమెరికా శాస్త్రవేత్త డేవిడ్‌ హౌస్‌, సౌర శక్తిని పరిశోధించి రాబోయే వంద సంవత్సరాల వరకూ దేశ అవసరాలన్నింటిని సౌర శక్తి తీరుస్తుందని చెప్పాడు. అంతేకాదు సౌరశక్తితో వివిధ ప్రాజెక్టులను ఎలా నడపవచ్చునో చూపించాడు. భౌగోళికంగా మన దేశం భూమధ్య రేఖకు దగ్గరలో ఉండడం వల్ల మనకు మరిన్ని అవకాశాలు మెండుగానే ఉన్నాయి.

మన ఆదిత్యుడు శక్తి సామర్థ్యాలు  అంతాఇంతా కావు.  ఒక్క క్షణంలో సూర్యుడి నుంచి విడుదలయ్యే శక్తి మనకు వెయ్యి ఏళ్లు సరిపోయేంత ఉంటుంది. ఒక అంచనా ప్రకారం ఒక్కో చదరపు మీటర్ కు వెయ్యివాట్లు. భూమికి సూర్యుని నుంచి 174 పెటావాట్ల శక్తిగల సూర్య కిరణాలు వెలువడతాయి. దీనిలో సుమారు 30 శాతం అంతరిక్షంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. మిగతా వేడిమిని మేఘాలు, సముద్రాలు, భూమి గ్రహించుకుంటాయి. సౌర విద్యుత్‌ ఫొటో వోల్టాయిక్‌ ఘటాల నుంచి ఉత్పత్తి అవుతుంది. ప్రపంచ దేశాల ప్రస్తుత విద్యుత్తు అవసరాలు దాదాపు 15 టెరావాట్లు కాగా కేవలం ఐదు  శాతం సౌరశక్తిని అందిపుచ్చుకోగలిగినా ఇది అవసరాలకంటే యాబైరెట్లు  ఎక్కువనే చెప్పాలి. కాలుష్యరహిత సౌరవిద్యుత్ ఉత్పాదనపట్ల ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్ - పలు ఇతర రాష్ట్రాలు ప్రత్యేక విధానాలు అమల్లోకి తెచ్చి సౌరవిద్యుత్ ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  రాష్ట్రాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి కూడా భారీగా అవకాశాలున్నాయి. 


 

నిఫా - ఎ డెడ్లీ వైరస్ | Nipah virus: Symptoms and Treatment


మలేషియాలో తొలిసారిగా 1998వ సంవత్సరం బయటపడ్డ నిఫా వైరస్ గబ్బిలాలు, గుడ్ల గూబలు, కోతి, పిల్లి, పందులు.. వంటి వాటి ద్వారా వ్యాపిస్తూ కేరళలో మృత్యు ఘంటికలు మోగించడమే కాకుండా పక్క రాష్ట్రాలకు సోకుతోందని హెచ్చరికలు వస్తున్నాయి. దీని నివారణకు వ్యాక్సిన్‌ లేదు. ఈ నిఫా వైరస్ ని అరికట్టడానికి మందులు కూడా లేవని, ప్రాథమిక దశలో గుర్తిస్తేనే ప్రత్యేక చికిత్సతో నివారించవచ్చని వైద్యులు అంటున్నారు. వ్యాధి లక్షణాలు ఐదు రోజుల నుంచి రెండు వారాల్లో బయటపడుతాయి. ముఖ్యంగా జ్వరం, జలుబు, తలనొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు, మానసిక ఆందోళన.. వగైరా ఉంటాయిట. 

సరియైన సమయంలో చికిత్స అందకపోతే ఒకటి, రెండు రోజుల్లో బాధితులు కోమాలోకి వెళ్లి మృతి చెందే ప్రమాదం ఉంది. అందుకని నిఫాను కట్టడి చేయడానికి ముందస్తు జాగ్రత్తలు ప్రతీ ఒక్కరు తప్పక తీసుకోవాలి. వ్యక్తిగత శుభ్రతలో భాగంగా భోజనం చేసేటప్పుడు విధిగా చేతుల్ని కడుక్కోవాలి. పండ్లను బాగా కడిగితే కాని తిన వద్దు. పండ్ల పై ఎలాంటి మరకలు, పగుళ్లు, పక్షులు కొరికిన ఆనవాళ్ళు.. లేకుండా ఉన్నవి మాత్రమే వినియోగించాలి.


బతుకు ధీమా | Social Security Schemes | PMSBY | PMJJBY


ఏ కారణం చేత మృతిచెందినా నామినీకి 2 లక్షల రూపాయలు అందించే ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana, Life Insurance) పథకానికి గానూ ఏడాదికి ఒకసారి ఏకమొత్తంలో రూ.330 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి 18 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్నవారు ఎవరైనా అర్హులు. ఇక ప్రధానమంత్రి జీవన్ సురక్ష (Pradhan Mantri Suraksha Bima Yojana, Accidental Death, Disability Cover Insurance) విషయానికొస్తే ప్రమాదాల కారణంగా ప్రమాదవశాత్తు మరణం సంభవించినా లేదా పూర్తి వైకల్యం కలిగినా రెండు లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లిస్తారు. పాక్షిక వైకల్యానికి గురయితే ఒక లక్ష రూపాయల నష్ట పరిహారాన్ని అందిస్తుంది. ఈ పథకంలో సభ్యత్వానికి వార్షిక ప్రీమియం కేవలం 12 రూపాయలే. ఇందులో చేరటానికి 18 నుంచి 70 సంవత్సరాల వయసు వారు అర్హులు.

జీవన జ్యోతి, జీవన్ సురక్ష పథకాల్లో చేరడానికి ఏదేని బ్యాంకు పొదుపు ఖాతాదారులకు మాత్రమే అవకాశముంది. సంవత్సర కాలం వ్యవధిగా ఉన్న ఈ భీమా పథకాలు 1 జూన్  నుంచి 31 మే వరకు వర్తిస్తాయి. గతంలో రిజిష్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ పథకాలను రెన్యూవల్ చేసుకోవాడానికి సమయం ఇదే. చాలా బ్యాంకులు మే 26 నుంచి 31వ తేదీల్లో ప్రిమీయం జమ చేసుకుంటారు.  ఈ పథకాల్లో చందాదారులుగా చేరిన సమయంలో అగ్రీమెంట్ ననుసరించే సదరు ప్రీమియం సొమ్ము ఖాతాదారుల పొదుపు ఖాతా నుంచి 'ఆటో డెబిట్' అవుతుంది. అందకుని ప్రీమియం మొత్తం మీ ఖాతాలో సకాలంలో ఉండేలా చూసుకోవాలి. పథకాల పునరుద్ధరణలో ఎలాంటి సందేహాలున్నా వెంటనే సంబంధిత బ్యాంకు అధికారులను సంప్రదించాలి. 


నేను తప్పిపోయాను.. | Lost Cat - Reward Rs. 2000 /-


వారం రోజుల క్రితం ఫిలింనగర్, జూబ్లిహిల్స్‌ లో ఓ పిల్లి తప్పిపోయింది. సంవత్సరం వయసున్న ఈ మ్యావ్.. మ్యావ్.. పిల్లి పేరేంటో పేర్కోనలేదు కాని అన్నీ వివరాలతో కరపత్రాలు, పోస్టర్లు ఫిలింనగర్ దైవసన్నిధానం పరిసర ప్రాంతాల్లో వెలిసాయి. సదరు మార్జాలం కనిపించగానే విషయం అందించిన వారికి రెండు వేల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. ఈ పిల్లిగారు ఏ విదేశాల నుంచో వచ్చిన అరుదైన జాతి అయిఉంటుంది అనుకుంటున్నారు కదూ. కాదండి.. చంటిగాడు లోకల్. 


మామిడి పండు - ఆరోగ్యానికి మెండు | Amazing Benefits of Mangoes for Skin, Hair and Health

ఇది మామిడి పండ్ల సీజన్ కావడంతో చాల విరివిగా లభిస్తాయి. మామిడి పండ్లలో ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండి వడదెబ్బ తగలకుండా కాపాడడంతో పాటు శరీరానికి కావలసినంత శక్తినిస్తాయి. అంతేకాకుండా శరీరం చల్లబరిచేలా చేస్తాయి. మామిడిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. దీనితో క్యాన్సర్లకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇందులో ఎక్కువగా ఉండే విటమిన్‌-సి, పెక్టిన్‌, పీచు, సీరం కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించడంలో తోడ్పడతాయి. విటమిన్లు, పోషకాలు అధికంగా ఉన్న కారణంగా మామిడి పండు తినగానే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఇందులోని పీచు పదార్థాలు జీర్ణక్రియ బాగా జరగడానికి తోడ్పడుతాయి. అంతేకాకుండా ఈ పీచు అదనపు కేలరీలను దహించడం ఫలితంగా బరువు తగ్గడంలో దోహదం చేస్తుంది. మామిడిపండులో అధిక పొటాషియం ఉండటంతో అధిక రక్తపోటును అదుపులోఉంచుతుంది. మామిడిలోని తక్కువ గ్లెసిమిక్‌ ఇండెక్స్‌ వల్ల శరీరంలో షుగర్‌స్థాయి పెరగదు. విటమిన్‌-సి, విటమిన్‌-ఎ, పలు రకాల కెరటోనాయిడ్లు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇందులో అధికంగా ఐరన్‌ ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారికి దీనివల్ల సహజంగా ఐరన్‌ సమకూరుతుంది. అలాగే శరీరంలో కాల్షియం స్థాయి మెరుగుపడుతుంది. ఇందులో ఉండే విటమిన్‌-కె ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది.

కంటి సంరక్షణలో, జుట్టు, చర్మ సౌందర్యం ఇనుమడింప చేయడంలోనూ మామిడి మేటి. మామిడి గుజ్జు, పాలు, తేనె కలిపి పేస్టులా తయారు చేసి స్క్రబ్‌లాగా వాడుకోవచ్చు. శరీరంపై స్వేద గ్రంధులు శుభ్రపడి తద్వారా శరీర ఉష్ణోగ్రతలు క్రమబద్ధీకరిస్తాయి. ఇక చర్మం లేతగా, మృదువుగా మారడం తధ్యం.


pc:internet

దగ్గు భాదిస్తుంటే.. | Best Natural Cough Remedies


ఒక పక్క ఎండ, మరో పక్క వర్షాలు.. ఇలా వాతావరణ మార్పుల వల్ల దగ్గు అందరిని వేధించే సమస్యే. మన శ్వాస క్రియకు ఆటంకం కలిగినప్పుడు దగ్గు వస్తుంది. వేసవి తాపం తీరడానికి అంటూ తాగే శీతల పానీయాల వల్ల ఈ సమస్య మరింత జఠిలం అవుతుంది. గోరువెచ్చని నీటిని తరచూ తీసుకోవడం, పుక్కిలించడం వల్ల ఈ ద‌గ్గు నుంచి ఉప‌శ‌మనం ల‌భిస్తుంది. అలాగే మరికొన్ని స‌హ‌జ సిద్ధ‌మైన చిట్కాలు చూద్దాం..
 
- దగ్గు భాదనుండి విముక్తికి అల్లం రసం, తేనెల‌ను సమపాల్లలో బాగా కలిపి రోజుకు రెండు పూటలా తీసుకోవాలి.
- కొన్ని తులసి ఆకులను శుభ్రపరచి నీటిలో వేసి బాగా మరిగించి ఆ కషాయాన్ని తాగాలి.
- కాస్త నిమ్మరసంలో, చిటికెడు పసుపు, తేనె చేర్చిన మిశ్రమాన్ని మూడు పూటలా తీసుకోవాలి.
- అర స్పూన్ శొంఠి పొడిని తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది.
- చిన్న కరక్కాయ ముక్కను బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని మింగుతుంటే దగ్గు తగ్గుముఖం పడుతుంది.
- అల్లం టీ ని తీసుకోవడం వల్ల కూడా దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.
- పాలలో మిరియాల పొడి లేదా పసుపు వేసుకొని తాగితే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.

https://www.youtube.com/c/vantintichitkalu 

 

కీలెరిగి.. | Tips to keep your Joints Healthy and Strong

కీళ్లనొప్పులు.. ఇది తరచూ వింటున్న ఆరోగ్య సమస్య. అయితే రోజూ వ్యాయామం చేస్తే కీళ్లనొప్పులు వచ్చే అవకాశాలు తక్కువ అంటున్నారు వైద్యనిపుణులు. అంతేకాకుండా వ్యాయామమే కీళ్ల నొప్పులకు మంచి చికిత్స అని సూచిస్తున్నారు. వ్యాయామంలో ముఖ్యంగా నడకను ఎంచుకోవచ్చు. సైక్లింగ్, స్విమ్మింగ్ కూడా కీళ్లకు బలాన్నిచ్చేవే. అయితే వాకింగ్, జాగింగ్.. చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తప్పనిసరి. వీటికి ఎగుడు దిగుడు రోడ్లు, సిమెంట్ రోడ్లు ఏమంత శ్రేయష్కరం కాదు. మోకాళ్ల నొప్పులు ఉన్నవాళ్ళైతే జాగింగ్ చేయకూడదు. అలాగే మెట్లు కూడా వాడకపోవడమే మంచిది. యోగాలో మోకాళ్లపై ఒత్తిడి పెంచే ఆసనాలకు దూరంగా ఉండడమే కాక నిపుణుల సహకారం అవసరం.

నిత్యం ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. అలాగే రాగులు, జొన్నలు, సజ్జలు.. వంటి గింజ ధాన్యాలు తీసుకుంటే శరీరానికి కావల్సిన పోషకాలు లభించడంతో పాటు ఎముకలు దృఢంగా మారుతాయి. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ సెప్టిక్‌ గుణాలు మెండుగా ఉంటాయి. కనుక రోజూ ఒక గ్లాస్‌ పాలలో అర టీస్పూన్‌ పసుపు వేసుకుని తాగితే కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆవనూనెతో క్రమం తప్పకుండా రోజూ రెండు పూటలా మర్దన చేస్తుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

విటమిన్‌ - డి లోపిస్తే ఆహారంలో తీసుకున్న క్యాల్షియం శరీరానికి పట్టదు. అందుకని ఉదయం, సాయంకాలం వేళల్లో సూర్యరశ్మిలో నడక, తోటపని వగైరా వ్యాపకాలు పెట్టుకుంటే ఎంతో మంచిది.

 
 
pc: internet

పిడుగులు పడుతున్నాయి జాగ్రత్త.. | Thunderbolt Weather


ఆవిరి రూపంలో ఉన్న మేఘాలు పరస్పరం ఒకదానితో మరోకటి ఢీ కొనడం వల్ల పిడుగులు సంభవిస్తాయి. ముందుగా మెరుపు కనపడి వెంటనే పెద్దశబ్దంగా ఉరుము వినిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం పగటి ఉష్ణోగ్రతలు పెరగడం.. ఆ వెంటనే వాతావరణం చల్లబడి వర్షాలు కురవడం.. అంటున్నారు వాతావరణ నిపుణులు. పిడుగుపాటు సమయంలో రెండు లక్షల ఓల్టుల శక్తిగల విద్యుత్‌ తరంగాలతో పాటు లక్షల డెసిబుల్స్‌లో శబ్ధం ఉత్పత్తి అవుతుంది. ఇలా మేఘాలు ఢీకొన్నప్పుడు జనించే విద్యుత్‌, ధ్వని తరంగాలు 50 వేల పై చిలుకు డిగ్రీల వేడితో భూమిని చేరుతాయి. ఇక విద్యుత్‌ తరంగాలు భూమిలోకి వెళ్ళే క్రమంలో ప్రమాదాలు సంభవిస్తాయి. కారణం అవి ఎత్తయిన చెట్లు, ఇనుప స్తంభాలు, టవర్లు .. ఇతర ప్రవాహాకాలను ఎంచుకోవడమే. మైదాన ప్రాంతాల్లో అయితే అక్కడ ఉన్న మనుషులు, జంతువులకు మరణం తప్పదు. పిడుగులు పడకుండా భవనాలు నిర్మించేటప్పుడు వాటి పైకప్పులో రాగి కడ్డీలను ఏర్పాటు చేస్తారు. ఇలా చేసిన కాపర్ ఎర్త్  పిడుగులను నేరుగా భూమిలోకి పంపి ఆస్థి నష్టం, ప్రాణనష్టం కలుగకుండా కాపాడుతుంది.
పిడుగుల నుంచి రక్షించుకోవడంలో నిపుణుల సూచనలు.. - ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ఎత్తయిన చెట్లు, టవర్లు, శిథిల భవనాల కిందకు వెళ్ల కూడదు.
- వ్యవసాయ పనుల్లో ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకే చోట గుంపుగా చేరకూడదు. ఒక్కొక్కరుగా దూరంగా ఉండాలి. చేతిలో పలుగు, పార వంటి ఇనుప వస్తువులను వదిలేయాలి. ఎత్తైన ప్రదేశాల్లో ఉండరాదు. ఇళ్లపై పిడుగు పడే అవకాశం అరుదు కనుక పొలాల్లో నుంచి వెంటనే నివాసాలకు చేరుకోవాలి. పశువులను కూడా ఇలాగే కాపాడాలి.
- ఆ సమయంలో మైదాన ప్రాంతంలో ఉండి ఉంటే మోకాళ్ల మీద కూర్చుని తల కిందకి వంచి ఉంచాలి.
- ఎలక్ట్రికల్ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాల పరిసరాల్లోకి వెళ్లకూడదు. ఎక్కువ నీరున్న చోట కూడా ఉండరాదు.
- ఇంట్లో ఉన్న వాషింగ్‌మిషిన్‌, టీవీ, రిఫ్రిజిరేటర్.. తదితర ఎలక్ర్టికల్‌ వస్తువులను స్విచ్ ఆఫ్ చేయడమే కాకుండా విద్యుత్‌ వైర్లను తొలగించాలి. ముఖ్యంగా టీవీకి ఉన్న కేబుల్‌ కనెక్షన్‌ను తీసివేయాలి.
- ల్యాండ్‌ ఫోన్‌లో అస్సలు మాట్లాడకూడదు. సెల్‌ఫోన్‌, కెమెరాలను, ఎఫ్‌ఎం రేడియోలను సైతం వినియోగించకూడదు.
- ఈ సమయంలో ట్యాప్‌ కింద స్నానం చేయడం కూడా అత్యంత ప్రమాదకరమే. 


గొంతు ఇన్ఫెక్షన్ కి.. | Home Remedies for Cold, Cough and Throat Infection


- జలుబు , గొంతు మంట, దగ్గు  మొదలైన సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి రెండు స్పూన్ల ఉసిరి రసంలో ఒక స్పూన్ తేనే కలిపి నిత్యం పరగడుపున సేవిస్తే సరి.

- రాత్రి పడుకునే ముందు కాచిన గ్లాసు పాలలో చిటికెడు పసుపు  కలిపి సేవిస్తే జలుబు, దగ్గు, ఆయాసం గొంతులో కళ్ళె నివారణ అవడం ఖాయం.

- దగ్గు, జలుబు, గొంతు నొప్పి సమస్యలకు గొప్ప నేచురల్ హోం రెమడీ ఏంటంటే వేడినీళ్ళు త్రాగడమే. 


తరచూ జబ్బుపడుతున్నారా.. | Healthy Kitchen Hacks


- వంటిల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే సూక్ష్మజీవులు చేరి ఇంటిళ్లిపాదికి అనారోగ్యం తప్పదని గమనించాలి.
- ముఖ్యంగా కిచెన్ లో సింక్ ని యాంటిబాక్టీరియల్‌ లిక్విడ్ లతో కడిగి ఎప్పుడూ పొడిగా ఉండేలా జాగ్రత్తపడాలి. లేకపోతే అనేక రకాలైన హానికారక బాక్టీరియాలకు నిలయంగా మారుతుంది.
- వంటపాత్రలు శుభ్రపరిచే సోప్, స్క్రబ్బర్ విషయంలోనూ తగు జాగ్రత్తలు అవసరం. సబ్బు పూర్తిగా పాత్రలపై వదిలేలాగ ఫ్లోటింగ్ వాటర్ ని వినియోగించాలి. గిన్నెలను పొడిగా తుడిచిపెట్టుకోవాలి. స్క్రబ్బర్ ని తరచూ మారుస్తూండాలి.
- వంటగదిలో చేతులకు, గిన్నెలకు వాడే రుమాళ్లను ఎప్పటికప్పుడు వేడి నీళ్లతో ఉతికి ఎండలో ఆరవేయాలి.
- వ్యక్తిగత శుభ్రత కూడా చాలా ప్రధానమైనది. ఏమాగ్రం అపరిశుభ్రతకు తావివ్వకుండా తరచూ చేతులను హ్యాండ్ వాష్ తో రుద్ది కడుక్కుని పొడిగుడ్డతో తుడుచుకోవడం మరవద్దు.


ప్రపంచ మాతృదినోత్సవం శుభాకాంక్షలు | Happy Mother’s Day


ఒకప్పుడు వంటగదికి మాత్రమే పరిమితమైన అమ్మకు ఇప్పుడు బాధ్యతలు బాగా పెరిగాయి. ఆకాశంలో సగం అంటూ అన్నిటా అమ్మదే పైచెయిగా ఉంటోంది. ప్రతీ అమ్మకు నిజానికి ఆరోజు, ఈ రోజు అంటూ కాకుండా నిత్యమూ హ్యట్సాఫ్‌...

అలాగే ఏటా మే రెండో ఆదివారం నిర్వహిస్తున్న ప్రపంచ మాతృదినోత్సవం సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు.


 

అల్లనేరేడు - ఔషధ ఫలం | Amazing Health Benefits of Black Plum | Nerudu | Jamun Fruit


వేసవిలో లభించే పండ్లలో అల్లనేరేడు ఒకటి. ఈ పండ్లతో పోషకాలు పుష్కలంగా అందుతాయి అంటున్నారు.. వైద్యులు. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లలతో పాటు ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌, సోడియం, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్ - ఎ, విటమిన్ - బి, విటమిన్ - సి  వగైరా లభిస్తాయి. అల్లనేరేడు పండ్లు మాత్రమే కాకుండా చెట్టు ఆకులు, బెరడు, గింజలు.. అన్నీ అయుర్వేద చికిత్సలో ఉపయోగపడతాయి. ఇది సీజనల్ ఫ్రూట్ కావున సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండాలంటే పండ్లను ఆరపెట్టి పౌడర్ కొట్టి భద్రపరచుకోవచ్చు. ఈ పౌడర్ ని మండే ఎండల్లో షర్బత్ తయారుచేసుకోవడంలో వినియోగించుకోవచ్చు. 

- వేసవిలో దాహం తీరుతుంది. శరీరానికి చక్కని చలువనిస్తుంది.
- కడుపులోనులి పురుగులను నివారిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపడుతుంది.
- శరీరంలోని వ్యర్థాలు విసర్జించబడుతాయి. ఫలితంగా రక్తశుద్ధి జరుగుతుంది.
- ఇందులోని విటమిన్‌ - సి కారణంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
-  రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంచడంలో నేరేడు దోహదం చేస్తుంది.  అందుచేత మధుమేహం ఉన్నవారికి నేరేడు పండ్లతో ఎంతో మేలు కలుగుతుంది.
- వీటిల్లో సింహభాగం ఉండే పొటాషియం మధుమేహగ్రస్తులెకే కాక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారికి కూడా ఎంతో మంచిది.
- మూత్ర విసర్జనకు తోడ్పడడంతో పాటు కిడ్నిల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది.
- చిగుళ్ళు నుంచి రక్తస్రావం తగ్తుతుంది. నోటి దుర్వాసన దూరమవుతుంది.
- అంతేకాకుండా నోటి, మూత్రాశయ క్యాన్సర్‌లకు చెక్ పెడుతుంది.


pc:internet

ఏం కొంటున్నామో.. | The Importance of Reading and Understanding Food Labels


ఒకప్పుడు సరుకుల లిస్ట్ రాసుకుని దగ్గరలోని షాప్ కి వెళ్ళి వెచ్చాలు తెచ్చుకునే వాళ్లం. ఇప్పుడు సరుకులతో పాటు కూరగాయలు, పండ్లు.. వగైరా కావాల్సిన అన్నీ ఒకేచోట లభించేలా సూపర్ మార్కెట్ లు, ఆన్ లైన్ షాపింగ్ కాన్సెప్ట్ లు వచ్చాక చేతికొచ్చిన వస్తువులతో ట్రాలీలు నింపేస్తున్నాం. నిజానికి నాణ్యమైనవి, పోషక విలువలున్నవి ఎంచుకునే అవకాశం ఇప్పుడే ఎక్కువ. కానీ డిస్కౌంట్ రేట్ మీద ఉన్న దృష్టి వెయిట్ ట్యాగ్, ప్యాకింగ్ మరియు ఎక్స్పైరీ డేట్స్ ట్యాగ్ ల మీద ఉండడం లేదు. అలాగే వస్తువుయొక్క పోషక లేబుల్స్ ని కచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సహజ గుణం, తక్కువ కొవ్వు, చక్కర లేకుండా ఉన్న వస్తువులను గుర్తించాల్సి ఉంటుంది. అలాగే శరీరానికి పోషక విలువలు ఎలా అందుతాయన్నది తెలుస్తుంది. అన్నీ పోషక విలువలు అవసరమే కనుక ఉప్పు, మంచి నూనె.. వగైరా వస్తువులను అవసరాన్ని బట్టి నెలనెలా మార్చుకోవచ్చు. వైద్యుల సూచనల మేరకు కొన్ని రకాల ఆహారపదార్థాలను వాడకుండానూ ఉండవచ్చు. ప్యాకింగ్ లపై వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ సింబల్స్ తో పాటు విత్ మిల్క్, విత్ ఎగ్.. వగైరా ముందే చూసుకోవాలి. వస్తువుల నాణ్యతతో పాటు ఎంత కాలం అవి వినియోగించ వచ్చో, ఎలా భద్రపరచాలో కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే కల్తీ వస్తువులతో డబ్బు వృధానే కాకుండా ఆరోగ్యం గుల్లవడం ఖాయం. 


చిన్న చిట్కా | Clever Cooking Hacks to Save Time and Money

ఒక్క చిన్న చిట్కా మీ పనితీరునే మార్చేస్తుంది. సమయం వృధా ఉండదు. డబ్బు ఖర్చు లేదు. మరెన్నో లాభాలు ఉన్నాయి. కిచెన్ లో ఇట్టే పనులు చక్కబెట్టడానికి కొన్ని చిట్కాలు మీకోసం..

- నూనెలో పచ్చి మిరపకాయలను వేయించేటప్పుడు మధ్యలోకి చీల్చితే అవి పేలకుండా ఉంటాయి.
- పచ్చిమిరపకాయలు ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉండాలంటే వాటి తొడిమలను తొలగించి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
- అన్నం తెల్లగా రావాలంటే ఉడికే సమయంలో రెండు చుక్కల నిమ్మరసం వేసుకోవాలి.
- దోశల పిండి ఎక్కువ పులిసిపోతే కాస్త గోధుమ పిండి చేర్చి వేసుకుంటే దోశలు రుచిగా తయారవుతాయి.
- చపాతి పిండిలో కాసిని పాలు కలిపితే చపాతీలు మృదువుగా వస్తాయి.
- పెరుగు పులిసిపోకుండా ఉండాలంటే ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క వేసి చూడండి.


కొబ్బరినూనె.. కొన్ని టిప్స్ | Surprising Benefits & Uses of Coconut Oil


- కొబ్బరినూనెతో చేసిన ఆహారపదార్థాలు త్వరగా జీర్ణమవుతాయి. ఫలితంగా కొవ్వు కరగడం, బరువు తగ్గడం జరుగుతుంది.
- రక్తంలో చక్కెరస్థాయిని స్థిరపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ పెరగకుండా చేస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
- శరీరారోగ్యాన్నే కాకుండా మానసిక ఒత్తిడినీ తగ్గిస్తుంది. బ్రెయిన్‌ మెమొరీ అండ్‌ ఫంక్షన్‌ను మెరుగుపరుస్తుంది.
- బ్యాక్టీరియా కారణంగా సోకిన ఇన్ఫెక్షన్స్‌ను నివారించడంలో, వ్యాధి నిరోధకశక్తిని పెంచడంలో కొబ్బరినూనె సహాయపడుతుంది.
- కొబ్బరినూనెలో సహజ సిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి ఓరల్‌ హెల్త్‌ను కాపాడుతాయి.
- మేని చాయ ఇనుమడింపచేయడానికి స్నానానికి ముందు శరీరానికి కొబ్బరినూనె బాగా పట్టిస్తే సరి.
- ఇంట్లో ఫర్నిచర్‌పై చేరిన మురికి, మరకలపై కొద్దిగా కొబ్బరినూనె రాసి తరవాత మెత్తని గుడ్డతో తుడిచేయాలి.
- అంతేకాదు కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఫర్నిచర్‌కి పూస్తే పాలిష్‌ అవసరమే ఉండదు.
- లెదర్ వస్తువులు కొత్తవాటిలా మెరవడానికి కాస్త కొబ్బరినూనెను మెత్తని గుడ్డతో తీసుకుని అప్లై చేయాలి.


నిద్ర పోతోందెందుకు? | Tips to Establish Healthy Sleep Habits


ఆరోగ్యానికి నిద్ర ఎంత అవసరమో చెప్పనవసరం లేదు. ఈ సత్యం తెలిసినా అజాగ్రత్తతో కంటినిండా కునుకు కరవై దీర్ఘకాలికరోగాల భారిన పడుతున్నారు. పిల్లలు ఎంత నిద్రపోతే అంత మంచిది కాగా యుక్తవయసు నుంచి రోజూ 8 నుండి 10 గంటల నిద్ర కచ్చితంగా ఉండాలి. అదే కావలసిన శక్తినిస్తుంది. మెదడు అభివృద్ధి చెందుతుంది. ఇది నేటి జీవనవిధానంలో కుదరదనే వారేక్కువయ్యారు. కానీ పరిస్థితులపై అవగాహణతో మెళకువగా ఉంటే అన్నీ సాధ్యమే. పౌష్టికాహారం, క్రమం తప్పని వ్యాయామం తో నిద్రదేవత తనంతట తానే ఆవహిస్తుందని నిపుణులు అంటున్నారు. కొన్ని అనారోగ్యాల కారణంగా నిద్రకు దూరమవుతుంటే వెంటనే చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కమ్మని నిద్రకు కొన్ని చిట్కాలు చూద్దాం..

- మనం తీసుకునే ఆహారపానీయాల ప్రభావం నిద్రమీద పరోక్షంగా ఉంటుందని గమనించాలి.
- నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందు నుంచి కాఫీ, టీలు తాగకూడదు. వీటిలోని కెఫైన్ నిద్ర పట్టకుండా చేస్తుంది.
- వాకింగ్, యోగా.. వంటి వ్యాయామాలు క్రమం తప్పకూడదు.
- మెడిటేషన్ చేయడం వల్ల అనవసర ఆలోచనలను దూరంపెట్టి ప్రశాంతతకు దోహదం చేస్తుంది.
- ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రకు ఉపక్రమించడం అలవర్చుకోవాలి. నిద్రపోవడానికి గంట ముందే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ అపెయ్యడం మంచిది.
- లాప్‌టాప్, స్మార్ట్ ఫోన్ వంటి గ్యాడ్జెట్స్ నుంచి వచ్చే కాంతి కిరణాలు నిద్రకు దోహదం చేసే రసాయనాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.
- పడకగదిలో వీలైనంత తక్కువ వెలుతురు ఉండేలా లైటింగ్ వ్యవస్థ ఉండాలి.
- పగటి పూట నిద్రతో రాత్రి నిద్రకు ఆటంకం కలుగవచ్చు.
- మద్యం, సిగరేట్లు.. మొదలైనవి నిద్రకు ప్రధాన శత్రువులు.



pc:internet

ఎండాకాలం హాయిగా సాగిపోదామా.. | Essential Safety Tips While Riding In Summer


ఎండల్లో సాధ్యమైనంతవరకు మధ్యాహ్నం వేళ ద్విచక్రవాహనంపై ప్రయాణం చేయకపోవడం ఉత్తమం. టూవీలర్ పై రైడింగ్ తప్పదు అనుకుంటే కొన్ని జాగ్రత్తలు విధిగా పాటించాలి. ఎండల్లో ద్విచక్ర వాహనాలను నడిపే మహిళల విషయంలో ముఖ్యంగా చర్మం నల్లపడడం, జుత్తు నిస్సత్తువుగా మారడం జరుగుతుంది. ఎండకు తోడు పొల్యూషన్‌ కూడా తోడైతే తలలో చుండ్రు, కేశాలు రాలిపోవటంతో పాటు అనేక చర్మ సంబంధిత వ్యాధులు దరిచేరుతాయి. అందుకని హాయ్.. హాయ్.. గా కూల్ గా టూవీలర్ పై సాగిపోవాలంటే దుమ్ము, ధూళి కణాలు, కాలుష్యం, వేడి గాలుల నుండి చర్మాన్ని సంరక్షించుకోవడానికి బైకర్స్ తప్పక స్కార్ఫ్ వాడాలి. ఫుల్ స్లీవ్ గ్లౌజ్ ధరించిచాలి. హెల్మెట్ ధరించడానికి ముందుగా మీ కేశాలను చక్కగా స్కార్ఫ్‌తో కవర్ చేయడం మంచిది. వీలైనంతవరకు మెత్తగా ఉన్న కాటన్ స్కార్ఫ్‌లను ఉపయోగించండి. ముఖానికి, చేతులకు సన్‌స్ర్కీన్‌ లోషన్‌ వాడుకోవాలి. అలాగే సమ్మర్ డ్రెస్సింగ్‌లో చాలా కేర్‌ తీసుకోవాల్సి ఉంటుంది. కాటన్ దుస్తులనే ప్రిఫర్ చేయాలి. కాస్త వదులుగా గాలి ఆడుతూ శరీరాకృతికి తగిన వాటిని ఎంచుకోవాలి. చర్మం కనబడకుండా ఉండేవిధంగా దుస్తులు ధరించాలి. వెహికిల్ సీట్ త్వరగా వేడెక్కకుండా వెల్వెట్‌ కవర్లను వాడటం మంచిది. ఈ కాలంలో బైక్‌, స్కూటర్ లపై స్పీడుగా వెళ్లకూడదని గమనించాలి. లేదంటే వడగాలికి డీహైడ్రేషన్‌, వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువ. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు వాటర్‌ బాటిల్‌ తీసుకెళ్లడం మరవద్దు సుమా.


వంటిప్స్.. | Easy Kitchen and Cooking Tips


- పాలు విరగకుండా ఉండాలంటే తేనే చుక్క లేదా చిటికెడు తినేసోడా కాచే సమయంలో వేయాలి.
- కూరగాయలు శుభ్రం చేసి తరిగే ముక్కలు పసుపు కలిపిన నీటిలో వేసుకుంటే రంగు మారవు, క్రిములు ఏమైనా ఉంటే చచ్చిపోతాయి కూడా.
- వండిన కూరలు ఘుమఘుమలాడుతు ఉండాలంటే అందులో కొంచం కొత్తిమీర తురుము లేదా కరివేపాకు పొడి చల్లాలి.
- బియ్యం డబ్బాలో కొన్ని ఆరిన వేపాకు ఆకులు వేసుకుంటే పురుగులు పట్టకుండా ఉంటాయి.


ఉల్లి చేసే మేలు | Beat the Heat and prevent Sun Stroke with Raw Onion


వంటల్లో ఉల్లిపాయలను, ఉల్లికాడలను విరివిగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఉల్లిచేసే మేలు అలాంటింది మరి. ఇక వేసవికాలంలోనైతే చెప్పనవసరం లేదు. వంటల్లోనే కాక విడిగా పచ్చి ఉల్లిపాయ ముక్కలను కూడా ఎక్కువగానే తీసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో మండే ఎండల్లో వడదెబ్బ నుండి రక్షణకు పిల్లల మెడలో ఉల్లిపాయలను మాలగా గుచ్చి వేస్తారు. పెద్దవారైతే ఎండలో బయటికి వెళ్ళాల్సివచ్చినప్పుడు ఉల్లిపాయను తలపై ఉంచుకుని టోపీ పెట్టుకుంటారు. అంత చలువను చేకూర్చే ఉల్లిపాయను మనమూ ఎండలో బయటికి వెళ్తున్నప్పుడు విధిగాజేబులోనైనా పెట్టుకోవడం మరవకూడదు. అలాగే చిన్నపిల్లల్లో, పెద్దవారిలో నిద్రలేమిని ఇట్టేమాయం చేసే ఉల్లి ఆరోగ్యానికే కాదు సౌందర్యం ఇనుమడింపచేయడంలోనూ మేటి.

- ముక్కులో నుండి రక్తం కారుతుంటే ఉల్లిపాయను మధ్యలోకి కోసి కాసేపు వాసన చూస్తే సరి.
- మూర్ఛతో బాధపడుతున్నప్పుడు ఉల్లిపాయ రసాన్ని రెండు మూడు చుక్కలు ముక్కులో వేస్తే వెంటనే తేరుకుంటారు.
- మొటిమలు, వాటి తాలూకు మచ్చలకు ఉల్లిపాయరసం, ఆలివ్ ఆయిల్ సమపాళ్లలో కలుపుకున్న మిశ్రమం చక్కని ఔషధం.
- కిడ్నీలో రాళ్ల సమస్యకు పెరుగులో ఉల్లిపాయ ముక్కలు కలిపిన రైతా పనికొస్తుంది.
- వీర్యకణాల అభివృద్ధికి ఉల్లిపాయ రసాన్ని తేనేలో కలుపుకుని తీసుకోవాలి.
- చుండ్రు సమస్య వేధిస్తుంటే ఉల్లిపాయ రసం తలకు బాగా పట్టించాలి. చుండ్రు మాయం అవడంతో పాటు జుట్టు పెరగడానికి దోహదం చేస్తుంది.
- విషకీటకాలు, కుక్కకాటుకు ఉల్లిపాయ రసం తీసుకోవడం లేదా ఉల్లిపాయను దంచిన గుజ్జును గాయంపై పూసినా వెంటనే మంట తగ్గుతుంది. విషం హరిస్తుంది.
- ఎంతగా బాధించే నొప్పులకైనా ఉల్లిపాయ రసం, ఆవనూనె సమంగా కలిపి మర్దనచేస్తే చాలు వెంటనే ఉపశమనం దొరుకుతుంది.



pc:internet

కీరాలో ఉన్న సుగుణాలేంటో.. Health & Beauty Benefits of Cucumber | Kheera


కీరలో సింహభాగం నీరే ఉంటుంది. దాంతో మండే ఎండల్లోనూ డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది. అదే సమయంలో మన శరీరంలో పేరుకొన్న వ్యర్థ పదార్థాలను, విష పదార్థాలను బయటకు పంపి ప్రక్షాళన చేస్తుంది. నీటి శాతం ఎక్కువగా ఉండటం, కెలోరీలు తక్కువగా ఉండటం వల్ల శరీర బరువు తగ్గాలనుకునేవారికి కీరాని మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదని చెప్పాలి. తొక్కతో తీసుకునే దీనిలో పీచు పదార్థాలు ఎక్కువే కావున జీర్ణక్రియ పనితీరు మెరుగుపడి మలబద్ధకంతో బాధపడేవారు ఆ సమస్య నుంచి చాలా సులువుగా బయటపడతారని చెప్పవచ్చు.

కీరలో మన శరీరంలోని, శరీరం బయట వేడిని తగ్గించే గుణం ఉంది. కీరదోసకాయ తినడం వల్ల శరీరంలోపల ఛాతిలో మంటను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కిడ్నీలలో రాళ్ళను సైతం కరిగించే శక్తి కీరదోసకాయకు ఉందంటారు. కీరని ముక్కలుగా కానీ, గుజ్జుగా కానీ చేసుకుని చర్మానికి రాసుకుని కాసేపయ్యాక చల్లటి నీటితో కడిగేయడం వల్ల సన్ బర్న్ నుంచి ఉపశమనం పొందచ్చు. అంతేకాకుండా ముఖ వర్చస్సు ఇనుమడింపచేస్తుంది. వేడికి, అలసటకు వచ్చే కళ్లమంటలకు సన్నగా తరుక్కున్నగుండ్రని కీర ముక్కలను కళ్లపై కాసేపు పెట్టుకుని రిలాక్స్ అవ్వొచ్చు. కీరదోసకాయ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. మధుమేహం నయం చేస్తుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం మూలకాలతో పాటు పీచు ఎక్కువ. రక్తపోటును క్రమబద్దీకరిస్తూ హై బీపి, లో బీపి ఉన్న వారేవరికైనా మేలుచేస్తుంది. కీర క్యాన్సర్ తో పోరాడుతుంది. ఇందులో ప్రధానంగా లభించే మూడు లిఙాన్స్ వల్ల అండాశయ, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ సహా అనేక క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తాయి. కీరాని, క్యారట్ తో కలిపి తయారు చేసుకున్న జ్యూస్ తాగడం వల్ల కీళ్లనొప్పులను తగ్గించుకోవచ్చు. కీరా నోటి దర్వాసన, చిగుళ్ల సమస్యలను దూరం చేస్తుంది. కీరా, పెరుగులతో తయరయ్యే రైతా అంటే నోరురనిదెవరికి. కీరలో అన్నీ విటమిన్లు, పలు పోషకాలు ఉండడం వల్ల రోజూ మన ఆహారంలో తప్పక ఉండేలా చూసుకోవాలి మరి.