పిడుగులు పడుతున్నాయి జాగ్రత్త.. | Thunderbolt Weather


ఆవిరి రూపంలో ఉన్న మేఘాలు పరస్పరం ఒకదానితో మరోకటి ఢీ కొనడం వల్ల పిడుగులు సంభవిస్తాయి. ముందుగా మెరుపు కనపడి వెంటనే పెద్దశబ్దంగా ఉరుము వినిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం పగటి ఉష్ణోగ్రతలు పెరగడం.. ఆ వెంటనే వాతావరణం చల్లబడి వర్షాలు కురవడం.. అంటున్నారు వాతావరణ నిపుణులు. పిడుగుపాటు సమయంలో రెండు లక్షల ఓల్టుల శక్తిగల విద్యుత్‌ తరంగాలతో పాటు లక్షల డెసిబుల్స్‌లో శబ్ధం ఉత్పత్తి అవుతుంది. ఇలా మేఘాలు ఢీకొన్నప్పుడు జనించే విద్యుత్‌, ధ్వని తరంగాలు 50 వేల పై చిలుకు డిగ్రీల వేడితో భూమిని చేరుతాయి. ఇక విద్యుత్‌ తరంగాలు భూమిలోకి వెళ్ళే క్రమంలో ప్రమాదాలు సంభవిస్తాయి. కారణం అవి ఎత్తయిన చెట్లు, ఇనుప స్తంభాలు, టవర్లు .. ఇతర ప్రవాహాకాలను ఎంచుకోవడమే. మైదాన ప్రాంతాల్లో అయితే అక్కడ ఉన్న మనుషులు, జంతువులకు మరణం తప్పదు. పిడుగులు పడకుండా భవనాలు నిర్మించేటప్పుడు వాటి పైకప్పులో రాగి కడ్డీలను ఏర్పాటు చేస్తారు. ఇలా చేసిన కాపర్ ఎర్త్  పిడుగులను నేరుగా భూమిలోకి పంపి ఆస్థి నష్టం, ప్రాణనష్టం కలుగకుండా కాపాడుతుంది.
పిడుగుల నుంచి రక్షించుకోవడంలో నిపుణుల సూచనలు.. - ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ఎత్తయిన చెట్లు, టవర్లు, శిథిల భవనాల కిందకు వెళ్ల కూడదు.
- వ్యవసాయ పనుల్లో ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకే చోట గుంపుగా చేరకూడదు. ఒక్కొక్కరుగా దూరంగా ఉండాలి. చేతిలో పలుగు, పార వంటి ఇనుప వస్తువులను వదిలేయాలి. ఎత్తైన ప్రదేశాల్లో ఉండరాదు. ఇళ్లపై పిడుగు పడే అవకాశం అరుదు కనుక పొలాల్లో నుంచి వెంటనే నివాసాలకు చేరుకోవాలి. పశువులను కూడా ఇలాగే కాపాడాలి.
- ఆ సమయంలో మైదాన ప్రాంతంలో ఉండి ఉంటే మోకాళ్ల మీద కూర్చుని తల కిందకి వంచి ఉంచాలి.
- ఎలక్ట్రికల్ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాల పరిసరాల్లోకి వెళ్లకూడదు. ఎక్కువ నీరున్న చోట కూడా ఉండరాదు.
- ఇంట్లో ఉన్న వాషింగ్‌మిషిన్‌, టీవీ, రిఫ్రిజిరేటర్.. తదితర ఎలక్ర్టికల్‌ వస్తువులను స్విచ్ ఆఫ్ చేయడమే కాకుండా విద్యుత్‌ వైర్లను తొలగించాలి. ముఖ్యంగా టీవీకి ఉన్న కేబుల్‌ కనెక్షన్‌ను తీసివేయాలి.
- ల్యాండ్‌ ఫోన్‌లో అస్సలు మాట్లాడకూడదు. సెల్‌ఫోన్‌, కెమెరాలను, ఎఫ్‌ఎం రేడియోలను సైతం వినియోగించకూడదు.
- ఈ సమయంలో ట్యాప్‌ కింద స్నానం చేయడం కూడా అత్యంత ప్రమాదకరమే. 


No comments: