భూచోడు ఎత్తుకెళ్ళిపోతాడు | Are we poisoning our children with Plastic?


ప్లాస్టిక్‌ వినియోగం వల్ల అనారోగ్యం, ప్రాణాపాయం అని తెలిసినా ఈ రోజుల్లో అంతా ప్లాస్టిక్ మయమయిపోయింది. ఇందులోంచి ముందుగా పిల్లలను రక్షించే మార్గాలనైనా యుద్ధప్రాతిపదికన వెతుకుదాం..

- మనం నిత్యం వినియోగించే ప్లాస్టిక్ కవర్ల తయారీలో వాడే ముడిసరుకు, రంగులలో కొన్ని రకాల క్యాన్సర్‌ కారకాలున్నాయని పరిశోధనలు వెల్లడించాయి. ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి ముప్పు తేవడమేకాక వీటిల్లో ఆహారపదార్థాలను ఉంచినప్పుడు అవి కచ్చితంగా కలుషితమవుతాయి. కవర్లలో ఉంచి ఫ్రిజ్ లో నిల్వచేసిన పండ్లు, కూరగాయలు మంచినీళ్లతో కడిగినా ప్లాస్టిక్‌ కాలుష్యం వీడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- నాణ్యమైన ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే  వేడి నీళ్లలో కడిగిన తర్వాత వాడుకుంటే ప్రమాదం ఉండదు. కానీ అన్నివేళలా ప్లాస్టిక్ నాణ్యతను గుర్తించడం కష్టమవుతుంది. అందుకని గాజు, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌.. వంటి వాటిల్లో ఆమ్ల లేదా క్షార తత్వం ఎక్కువగా ఉండదు కాబట్టి ఆరోగ్యానికి ఎటువంటి చెడు జరగదు.

- పిల్లలకు పాలు పట్టడానికి ఉపయోగించే ప్లాస్టిక్ ఫీడింగ్ బాటిల్ తో కూడా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున స్టీల్ సీసాలు వాడుకోవాలని వైద్యులు చెప్తున్నారు. ఇది స్టెర్లైజ్ చేయడం కూడా సునాయసం అని గమనించాలి.

- పిల్లల స్నానం కోసం వినియోగించే వస్తువులు సబ్బుపెట్టి, బల్ల, బకెట్, మగ్.. ఇవన్నీ ప్లాస్టిక్ తో తయారయినవే అయితే అనర్థాలు తప్పవు. వీలైనంతవరకు స్టీల్, ఇత్తడి లేదా రాగి వస్తువులను వినియోగించడం ఆరోగ్యకరం. 

- ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకునే పిల్లలలో నాడీ వ్యవస్థ, మానసిక ఎదుగుదలల్లో లోపాలు తలెత్తుతాయని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. కనుక పిల్లలను విధిగా మట్టిబొమ్మలు, చెక్క బొమ్మలతోనే ఆడించాలని నిపుణులు సూచిస్తున్నారు.

- కారుచౌకగా లభిస్తున్న ప్లాస్టిక్ లంచ్ బాక్స్, వాటర్ బాటిళ్లతో అనేక అనర్థాలు ఎదురవుతాయి. వీటిలోని ఆహారం విషతుల్యమై పిల్లలను అనారోగ్యం పాలు చేస్తాయి.

ఎంత జాగ్రత్తపడి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించినా పిల్లల ఔషధాలు సింహభాగం ఇంకా నిషేధిత ప్లాస్టిక్‌ పెట్‌ బాటిల్లలో అమ్మడం గమనార్హం. వీటి వాడకంతో అసలు రోగాలు నయం అవటం అటుంచి ఇతరేతర జబ్బులు తప్పవు.


జర భద్రం బిడ్డా.. | Health Risks associated with Cell Phones

మళ్ళీ సెల్ ఫోన్ పేలడం మూడవ తరగతి చదువుతున్న జగన్మోహన్‌ ఆచారి తీవ్రగాయాలపాలవడం అందరిని కలచివేస్తున్న విషయం. సెల్‌ఫోన్‌లో పాటలు వింటుండగా బ్యాటరీ భారీ శబ్దంతో పేలడంతో బాలుడి కుడిచేతి వేళ్లు తెగిపడిన ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఇలాంటి దుర్ఘటనలు తరచూ జరుగుతూ రానురాను సెల్ ఫోన్ కాస్తా హెల్ ఫోన్ గా మారిపోతోంది. మొబైల్ ఫోన్లతో ఎంత ఉపయోగమో అంత అనర్థమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా పిల్లల్లో నేరుగా మెదడు ఎదుగుదలపై ప్రభావం చూపుతుందంటున్నారు. ఇక తిండి, నిద్ర, చదువు.. అయితే సరేసరి. సెల్‌ఫోన్‌ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నా పెడచెవిన పెట్టేవారే ఎక్కువున్నారు. రోజురోజుకు ఆహారం, విశ్రాంతి, చేసేపని మీద ద్యాస కరువవుతోంది. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం ఫ్యాషన్‌ అయిపోయింది. అలాగే సెల్ఫీల పిచ్చి పీక్స్ కి చేరి యువత ప్రాణాలు కోల్పోతోంది.

అసలు సెల్ ఫోన్ అనేది పైకాన కంటే అపరిశుభ్రమైన పరికరం. ఏరోజూ శుభ్రతకు నోచుకోక వంటింటి నుంచి వాష్ రూం దాకా, బయటి అడుగుపెట్టినప్పటి నుంచి పబ్లిక్ టాయ్‌లెట్ దాకా అన్నీ చోట్ల సెల్ ఫోన్ వినియోగించడంతో అధిక శాతం క్రిములు దాంట్లోనే చేరతాయి. ఈ బ్యాక్టీరియా అనేక రుగ్మతలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక స్మార్ట్ ఫోన్ లు వచ్చాక అందరి చేతుల్లో ఇట్టే ఇముడుతున్న ఈ సెల్ ఫోన్ నుండి వెలువడే రేడియేషన్ తో ప్రాణానికి హాని తలపెట్టే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువే ఉన్నాయంటూ అధ్యయనాలు ఇప్పటికే చెప్పాయి. సిగ్నల్ వ్యవస్థ, బ్యాటరీ ఛార్జింగ్ సరిగా లేనప్పుడు మొబైల్ వినియోగంతో ఈ ముప్పు తప్పదని నిపుణులు అంటున్నారు.


 pc:eetv, eenadu

కలువల్లాంటి కళ్ళ కోసం.. | Natural Eye Care


మనిషిని ఇట్టే ఆకర్షించేవి కళ్ళు. మరి కళ్ళు మరింత అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? కంటికి మంచి వ్యాయామంతో పాటు, సరైన పోషకాహారం చాలా అవసరం అంటున్నారు బ్యూటీషియన్స్. అలాగే తగినంతసేపు నిద్ర పోవడం వల్ల కళ్ళు తాజాగా కనబడతాయి. పచ్చిక బయళ్ళ మీద నడవడం, పచ్చని చెట్లను రెప్పలార్పకుండా చూడడం ద్వారా కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. కళ్ళు ఎండలో స్ట్రెయిన్‌ అవ్వకుండా, పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవకుండా జాగ్రత్తపడాలి. ఎప్పటికప్పుడు కళ్లు చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి. కళ్ల ఆరోగ్యానికి పాలు, పాలపదార్థాలతో పాటు తాజా ఆకుకూరలు, టమోటో, మిరపకాయ, క్యారట్, బీట్రూట్, సీజనల్ ఫ్రూట్స్  తప్పక తీసుకోవాలి.
- రాత్రి పడుకునే ముందు కొబ్బరి, నువ్వులు, ఆముదం.. ఏదోఒక నూనెను రెండు మూడు చుక్కలు చేతిలోకి తీసుకొని కళ్ళకు అప్లై చేయడం ద్వారా కళ్ళ కింద ముడతలు తొలగిపోయి చర్మం మృదుత్వం సంతరించుకుంటుంది.
- అలాగే ఈ మసాజ్ తో కంటికి విశ్రాంతి లభించడంతో పాటు ఎలాంటి మచ్చలైనా కొద్దిరోజుల్లోనే మాయమవుతాయి.
- కళ్ళ చుట్టూ ఉండే ముడతలు పొవాలంటే పాలమిగడతో మసాజ్ చేసుకున్నా సరిపోతుంది.
- అలసట తీరడానికి కీరదోసకాయను చక్రాల్లా కోసి కళ్ళ మీద కాసేపు ఉంచుకోవాలి.
- రాత్రి ఉసిరి పొడిని నానబెట్టిన నీటితో ఉదయాన్నే కళ్ళు కడుగుతే తాజాగా మెరుస్తాయి.
- కళ్ళ చుట్టూ ఉండే నలుపుదనం నివారించడానికి అల్మాండ్ ఆయిల్ తో కొంచెం ఆలివ్ అయిల్ కలిపిన మిశ్రమం కొంత కాలం పాటు మర్దనా చేయాలి.
- కాస్త కిరా రసంలో కొద్దిగా రొజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు దూదిపింజలతో అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రపరిస్తే కళ్ళు ఆకర్షణీయంగా మారుతాయి.


స్నానాలగది అద్దంలా.. | Natural Bathroom Cleaning

రోజూ కిచెన్, లివింగ్, బెడ్ రూంలను శుభ్రపరిచినట్లే బాత్ రూం క్లీనింగ్ పై కూడా దృష్టి పెట్టాలి. లేదంటే అనారోగ్యం లేదా ప్రమాదాలు తప్పవు. అన్నీ గదుల్లో లాగానే చక్కని గాలి, వెలుతురు ఉండేలా జాగ్రత్తపడాలి. ఏదో డిమ్ లైట్ లకు పరిమితం కాకుండా ఎక్కువ వెలుతురు ఉండే ఎలక్ట్రికల్ బల్బ్ లనే వాడుకోవాలి. బాత్ రూమ్ లో ఎక్సాస్ట్ ఫ్యాన్ అమర్చుకోవడం వల్ల వాసనలు సులభంగా తొలగించబడతాయి. స్నానాలగదిని రెండు లేదా మూడు రోజులకొకసారియైన ఫినాయిల్‌తో శుభ్రం చేయడం చాలా ముఖ్యం. అవసరమున్నా లేకపోయినా బాత్ రూం లో అన్ని వస్తులను చేర్చి స్టోర్ రూం లా చేయకూడదు. సబ్బు, షాంపూ, హ్యాండ్ వాష్.. వగైరా నిత్యవసరమైనవి మాత్రమే అందుబాటులో ఉండాలి. వాడేసిన, ఎక్స్పైరీ అయిన టాయిలెట్ సామాగ్రీని వెంటనే తొలగించాలి. ఎల్లవేళలా బాత్ రూం తడి, తేమ లేకుండా జాగ్రత్త పడాలి. లేదంటే తడితో ప్రమాదాలు, తేమతో క్రిమికీటకాల అడ్డాగా మారే ప్రమాదముంది. టూత్‌పేస్ట్‌, బ్రష్‌ వగైరా అక్కడే ఉంచకూడదు. బాత్రూంలో వాటిపై ఇట్టే సూక్ష్మక్రిముల చేరుతాయి. స్నానం చేసేటప్పుడు గోడల మీద నీళ్ళు ఎక్ఉవగా చిందకుండా చూసుకోవాలి. అతి వేడి నీళ్లు బాత్రూంలో వాడడం వల్ల టైల్స్ అందవిహీనంగా మారతాయి. పైగా తేమ కూడా ఎక్కువ చేరుతుందని గమనించాలి. బాత్రూం లో ట్యాప్ ల లీకేజితో ఒక్కబొట్టు నీళ్లు కూడా కారకుండా ఉండాలి. బాత్‌రూమ్‌ నుంచి నీళ్ళు బయటకు వెళ్ళే మార్గాలు సక్రమంగా ఉండాలి. టాయ్ లెట్‌ తో పాటు బాత్‌రూమ్‌లో కింద శుభ్రంగా ఉన్నట్టే చుట్టూ వున్న గోడలు కూడా క్లీన్ గా ఉండాలంటే నెలకోసారియైన ఫినాయిల్‌ నీళ్ళతో కడగాలి. విడిచిన బట్టలు అక్కడే గంటలతరబడి వదిలేయడంతో దోమలు, చీమలు, బొద్దింకలు.. చేరే అవకాశం ఉంది. పైగా బాత్రూంలో వాసన ఇబ్బంది పెడుతుంది. కాళ్లతో మురికి బాత్రూంలోకి చేరకుండా, తడికాళ్లతో బయటికి రాకుండా నిరోధించడానికి అనువైన డోర్ మ్యాట్ ని విధిగా వాడాలి. న్యూస్ పేపర్, మొబైల్ ఫోన్ వగైరా బాత్రూంలో వినియోగించకపోవడమే మంచిది. స్మోకింగ్ కూడా బాత్రూంలో పనికిరాదు. దీంతో బాత్రూం పొగచూరడం, వ్యర్థాలకు కారణం అవుతుంది. బాత్రూంలో క్లీనింగ్ ఏజెంట్ గా ఘాటైన కెమికల్స్, యాసిడ్స్ వాడకూడదు. అలాగే ఎయిర్ ఫ్రెష్ నర్.. ఎట్టిపరిస్థితుల్లో ముక్కుపుటాలు అదిరేలా ఉండేవి ఉపయోగించకూడదు. బాత్రూంలో అద్దం వాడుతున్నట్టైతే ఎప్పుడూ పొడిగా తుడవాలి.


చిన్న చిట్కా - గొప్ప ఉపశమనం | Kitchen Ingredients that work like Medicines

వంటింట్లో లభ్యమయ్యే పసుపు గాయాలను మానుస్తుంది. తేనే గాయాల వల్ల ఏర్పడిన మరకల్ని మాయం చేస్తుంది.. ఇలా చిన్న చిన్న చిట్కాలతో ఎన్నో రుగ్మతలను ఇట్టే పారదోలవచ్చు. మచ్చుకి కొన్ని చూద్దామా.. 
- చిన్నగా తరిగిన అర చెంచా అల్లం ముక్కలతో తేనే కలిపి తీసుకుంటే రోజూ పీడించే జలుబు సమస్య తలెత్తదు.
- చిటికెడు పసుపు వేడినీటిలో కాని, పాలల్లో కాని వేసుకుని రాత్రి పడుకునేముందు సేవిస్తే గొంతు నొప్పి, తుమ్ములు ఉండవు. 
- నిమ్మకాయ, అల్లం రసంల మిశ్రమం దగ్గుకు మంచి టానిక్ లాంటిది. రోజుకి రెండు మూడు సార్లు తాగితే దగ్గు ఇట్టేమాయమవుతుంది.
- చిన్న అల్లం ముక్కను కాల్చి నోట్లో వేసుకుంటే వికారం తగ్గుముఖం పడుతుంది.
- జీర్ణశక్తి మెరుగుపడడానికి భోజనానంతరం గ్లాసు మజ్జిగలో చిటికెడు ఇంగువ, రుచికి ఉప్పు కలిపి తీసుకోవాలి.
- అజీర్తి బాధిస్తుంటే జీలకర్రను పొడి చేసి చిటికెడు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
- పిల్లలు కడుపునొప్పితో బాధపడుతుంటే ఇంగువని నీటిలో కలిపి బొడ్డుమీద రాయాలి.
- బెల్లం ఉండలో కాస్త ఇంగువ కలిపి ఇచ్చినా పిల్లల్లో కడుపునొప్పి ఇట్టేమాయమవుతుంది.


కడుపులో గ్యాస్‌.. | Home Remedies for Stomach Bloating & Gas

కడుపులో గ్యాస్‌ సమస్య కేవలం తీసుకున్న ఆహారం అరగకపోవడం వల్లే కాదు.. అసలు ఏం తీసుకోకపోయినా తలెత్తుతుంది. ఇది అనేక రుగ్మతలకు దారితీస్తుంది. అందుకని సమయానికి భోజనం, మంచి నీరు ఎక్కువ గా తాగడం, సరియైన విశ్రాంతి, వ్యాయామం పట్ల దృష్టి సారించాలి.
- ఆహారాన్ని గబగబా తినటం, మాట్లాడుతూ తినటం.. సరికాదు. దీంతో  జీర్ణాశయంలోకి గాలి ఎక్కువగా చేరి త్రేన్పులకు దారితీస్తుంది. 
- ఎక్కువ మసాల లేదా కొవ్వు పదార్థాలు తినటం వల్ల కడుపు ఉబ్బరంగా మారుతుంది. 
- మానసిక ఒత్తిడి, ఆందోళన, కూల్ డ్రింక్, పొగ తాగటం.. వగైరా కూడా కడుపు ఉబ్బరానికి కారణమవుతాయి. 
- కాఫీ, టీ, ఎనర్జీడ్రింకులు వంటివన్నీ పేగుల్ని డీహైడ్రేషన్‌కు గురిస్తాయి.
- పాల పదార్థాలు, పిండి పదార్థాలు.. కడుపులో గ్యాస్‌ నిండేలా చేస్తాయి.

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
- మంచినీళ్లు మంచి డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తాయి. మూత్రపిండాలు, పెద్ద పేగులలో మలినాలు శుభ్రం అవడానికి ఉపకరిస్తాయి.
- ఒక గ్లాసు మంచినీళ్లలో ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకుని తాగితే కడుపు ఉబ్బరం నయం అవుతుంది. 
- తరచూ ఉడికించిన ఆపిల్‌ను తీసుకోవడం వల్ల ఉదరంలోని ఇన్‌ఫెక్షన్లు మాయమవుతాయి. 
- పీచు పదార్థాలతో పాటు అరటిపండు, పాలకూర, కీరదోసకాయ, క్యారెట్‌, టొమోటో, అల్లం, చిరు ధాన్యాలు తీసుకోవడంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు దరిచేరవు.
- అసిడిటీ నుంచి తక్షణమే ఉపశమనం లభించాలంటే కొబ్బరి బోండాం తాగితే సరిపోతుంది.
- దానిమ్మగింజల రసం తీసుకుంటే మలబద్ధకం సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. 
- జీర్ణప్రక్రియ చురుగ్గా జరగడానికి మజ్జిగ, పుదీన, నిమ్మకాయ, అల్లం, ధనియాలు, పసుపు వంటివి సహకరిస్తాయి. 
- ఒక స్పూన్‌ తేనె తాగితే వెంటనే అసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు.
- యాలకులను (ఇలాచీలు) పొడిచేసి కాసిని నీళ్లలో మరిగించి, చల్లార్చిన మిశ్రమం తీసుకుంటే గ్యాస్‌ సమస్యలు ఇట్టే తొలిగిపోతాయి.


ఎలా కూర్చోవాలి.. | How to Sit at a Computer | Desktop or Laptop

ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ కంప్యూటర్ నిత్యం వాడడం సర్వసాధారణమయిపోయింది. గంటల తరబడి కంప్యూటర్ ముందే కూర్చోవడం అనేక మానసిక, శారీరక రుగ్మతలకు దారి తీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకని కంప్యూటర్ మానిటర్ లేదా ల్యాప్ టాప్ వినియోగించేటప్పుడు తగు జాగ్రత్తలు సూచిస్తున్నారు. డెస్క్ టాప్, ల్యాప్ టాప్ లను గంటల తరబడి వినియోగిస్తున్నప్పుడు మధ్యమధ్యలో కాసేపు నిటారుగా నిలబడి కాని నాలుగు అడుగులు అటూఇటూ వేసి కాని రిలాక్స్ అవడం విధిగా చెయాలి. దీంతో నడుము, మెడ, భుజాలు, చేతివేళ్లు, కళ్లు.. ఇలా అన్నింటిమీద స్ట్రెయిన్ తగ్గుతుంది.

వీలైతే అప్పుడప్పుడు కుర్చీలోనే రెండు చేతులు జోడించి బాడీని కొద్దిగా స్ట్రెచ్ చేయడం, మెడను అటూ ఇటూ, పైకి కిందకీ తిప్పడం వల్ల మంచి రిలాక్సేషన్ లభిస్తుంది. అప్పుడే చేసేపని మీద దృష్టి పెట్టగలుగుతారు. అయితే రోజూ అధిక గంటల పాటూ మానిటర్ల ముందే ఉండాల్సిన వాళ్లకు క్రమం తప్పని వ్యాయామం లేదా యోగా సహకరిస్తుంది. ఆయా అవయవాల కండరాలు గట్టిపడి అంత తొందరగా స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉండదు.

కంప్యూటర్ ముందు తప్పు పొజిషన్లలో కూర్చోవడం, కంప్యూటర్ సరియైన ఎత్తులో లేకపోవడం, మానిటర్ బ్రైట్ నెస్ అసౌకర్యంగా ఉండడం చేత వెంటనే మెడ, నడుము, భుజాలు, కళ్లు.. ఇతర అవయవాల నొప్పులు మిమ్మల్ని బాధిస్తాయి. స్క్రీన్ ని అదేపనిగా గంటలతరబడి కళ్లార్పకుండా చూడడం వల్ల కళ్లు తడిఆరిపోయి మంటలు వస్తాయి. ఇలా సమస్యతలెత్తకుండా అప్పుడప్పుడు కంటికి సంబంధించిన వ్యాయామం తప్పక చేయాలి. కంటి రెప్పలను బలంగా మూయడం, వీలైనన్ని ఎక్కువ సార్లు కనురెప్పలు ఆర్పడం వంటివి మేలు చేకూరుస్తాయి. డిస్ప్లె కోసమని తలవంచడం, పైకి ఎత్తడం వల్ల మెడ నొప్పి, సరియైన పోస్చర్ లో కూర్చోకపోతే నడుం నొప్పి తప్పవు. అందుకని ఏదైనా కంప్యూటర్ స్క్రీన్ మన కళ్లు సునాయసంగా చూసేలా ఉండాలి. అంటే మెడ నిటారుగా ఉంచి నేరుగా చూడగలగాలి. లేదంటే అది మెడనొప్పికి దారితీస్తుంది. మన కళ్ల నుంచి మానిటర్ చేయిచాచినంత దూరంలో ఉండాలి. అలాగే కంప్యూటర్ ముందు మనం కూర్చునే భంగిమ చాలా ముఖ్యం. కాలుపై కాలు వేసుకోవడం, కాళ్లను దేనికైనా తన్నిపెట్టకుని కూర్చోవడం అత్యంత ప్రమాదకరం. డెస్క్ టాప్ లేదా ల్యాప్ టాప్ ముందు కుర్చీలో నిటారుగా కూర్చుని కాళ్లు సమానంగా నేలమీద ఆనించి పెట్టాలి. కాళ్లు నెలపైకి అందడం లేదనుకున్నప్పుడు చిన్న పీటను అమర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.

కంప్యూటర్ మానిటర్ ఎల్లవేళలా శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు రూములో సరైన లైటింగ్ ఉండాలి. స్క్రీన్ బ్రైట్ నెస్, కాంట్రాస్ట్‌ కళ్లకు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవడం మరవద్దు. తరుచుగా మంచినీళ్లు తాగడం, గుండెల నిండా గాలి పీలుస్తూ వదలడం వల్ల మంచి ఉపశమనం దొరుకుతుందని గమనించండి.


అలసట తీరేదెలా.. | How to avoid Tiredness


శారీరకంగా లేదా మానసికంగా ఎక్కువ శ్రమకులోనవడం వల్ల అలసట కలుగుతుంది. మరి ఆధునిక కాలంలో అలసట తప్పదా.. అంటే కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు..
అలాగే చిన్నచిన్న బ్యూటీ టిప్స్ తో ముఖంలోని అలసటను ఇట్టే తరిమేయవచ్చంటున్నారు సౌందర్యనిపుణులు.. అవేంటో చూద్దాం..

- నిస్సత్తువ ఆవరించటానికి ఒంట్లో నీరు తగ్గిపోయి డీహైడ్రేషన్‌ కి లోనవడం ఒక కారణం. ఫలితంగా శరీరంలో అవయవాలకు రక్తప్రసరణ సక్రమంగా జరగక మెదడు పనితనం నెమ్మదించడం, పని చేసే సామర్థ్యం తగ్గడం జరుగుతుంది. అందుకని దాహం వేసేవరకు వేచి చూడ‌కుండా మంచినీటిని తరచూ తాగుతూనే ఉండాలి. ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల‌ నీరు తాగాల్సి ఉంటుంది. 

- బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే అల‌స‌ట తప్పదు. కారణం క్రితం రోజు రాత్రి నుంచి మధ్యాహ్నభోజనం వరకు శ‌క్తి అంద‌క‌పోతే శ‌రీర మెట‌బాలిజం దెబ్బతింటుంది. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ లో శ‌క్తినిచ్చే కార్బొహైడ్రేట్ల‌ను తీసుకోవాలి. మధ్యాహ్నం పూట కార్బొహైడ్రేట్లతో పాటు ప్రోటీన్లతో కూడిన ఆహారం విధిగా తీసుకోవాలి. అప్పుడే శారీరక శక్తి మరియు మానసిక శక్తి సొంతమవుతాయి. 

ఎంత అలసిపోయినా ఫ్రెష్ లుక్ తో కనపడాలంటే.. 
- ఓట్ మీల్ మంచి నేచురల్ స్క్రబ్బర్. దీంతో ముఖంపై రుద్దుకుని చల్లని నీళ్లతో కడిగేస్తే చర్మం కాంతివంతమవుతుంది. 
- కొన్ని ఐస్ క్యూబ్ లను పల్చటి క్లాత్ లోకి తీసుకుని ముఖంపై మెల్లగా రుద్దినా, గంధాన్ని ఫేస్ ప్యాక్ లా వేసుకుని పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రపరిచినా ముఖంలో ఉండే అలసట మటు మాయమవుతుంది.
- అలసట కళ్లపై కనిపించకుండా కొద్దిసేపు ఐస్ బ్యాగ్స్, కీరాదోసకాయ ముక్కలు, టీ బ్యాగ్స్ వగైరా వాడుకోవచ్చు.



నేడే తొలి ఏకాదశి | జూలై 23, 2018 | Ekadashi Fasting

ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా వ్యవహరిస్తారు. యేడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో మొదటిది.. హైందవులకు ఇది అత్యంత శ్రేష్ఠమైంది. ముఖ్యంగా విష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైన దినం. ఈ రోజుతో ప్రారంభించి, శ్రీమహావిష్ణువు నాలుగు నెలలపాటు క్షీరాబ్ధిలో శేషపాన్పు పైన శయనించడం వల్ల శయనైకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఎందుకు చేయాలి? ఎలా చేయాలి?.. ఈ వీడియోలు మీ కోసం..

పుస్తకాలు చక్కగా.. | Easy Steps to Cover a Book with Brown or Transparent Paper


పాఠ్య  పుస్తకాలు, నోట్ బుక్స్.. సంరక్షణ విషయంలో తగు జాగ్రత్తలు అవసరం.. ఈ వీడియోస్ మీ కోసం.. 


సహజ సౌందర్యం | Effective Home Remedies for Natural Beauty

ఆరోగ్యం కంటే అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం సర్వత్రా అనర్థమే అంటున్నారు నిపుణులు. అందం కోసం ఎంత ఖరీదైన కాస్మోటిక్స్ వాడినా అసలు సిసలైన అందం శరీర ఆరోగ్యం ద్వారానే సొంతమవుతుంది. మీ అందం ద్విగుణీకృతం కావాలంటే పోషకాహారం, నిద్ర, వ్యాయామం.. విషయాల్లో దృష్టిపెడితే సరిపోతుంది. తగినంత నిద్ర లేకపోతె దాని ప్రభావం శరీర ఆరోగ్యంపై పడుతుంది. నిద్రలేమితో కళ్లు అలసటగా కనిపించి అందవిహీనంగా కనిపిస్తారు. రోజూ వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ సజావుగా జరిగి ఆరోగ్యంగా ఉంటారు. దీంతో చర్మ కణాలు కాంతివంతమయి అందంగా కనిపిస్తారు. 

- రోజూ మీ ఆహారంలో పాలు, పండ్లు, ఆకుకూరలు, గోధుమ.. వగైరా ఉండేలా చూసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండే పాలు, కోడి గుడ్డు, టమోటా, క్యారెట్.. అయితే కచ్చితంగా తీసుకోవాలి. ఇవి చర్మ నిగారింపును మెరుగుపస్తాయి.
- క్యారెట్ తరచుగా వాడడం వల్ల అందం, ఆరోగ్యం చేకూరుతాయి. ముఖ్యంగా ఎండ తీవ్రత నుంచి చర్మం రక్షింపబడుతుంది. మేని ఛాయ ప్రకాశవంతం అవుతుంది.
- పాలకూరలో విటమిన్ - ఎ, బెటాకెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోజూ శరీరానికి అందడం ద్వారా వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయవు.
- లాక్టిక్ యాసిడ్ లభించే పెరుగు వల్ల చర్మానికి సరియైనా తేమ అందుతుంది. తద్వారా చర్మ సమస్యలు దరిచేరవు.
- పాల మీగడను ముఖం మీద నెమ్మదిగా మర్ధనచేసి ఆ తర్వాత చల్లటినీటితో కడిగేస్తే ముఖం ఫ్రెష్ నెస్ ని సంతరించుకుంటుంది.
- అలసిన కళ్లకు కీరదోసకాయ ముక్కలు చక్కగా పనిచేస్తాయి. కళ్లు కాతివంతంగా తయారవుతాయి.
- కొంచెం బాదం నూనెను పెదవులకి రోజూ రాత్రి అప్లై చేసుకోవడం వల్ల మృదువుగా తయారవుతాయి.
- దాహం ఉన్నా లేకపోయినా రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తప్పని సరిగా తీసుకోవాలి. దీంతో శరీరం హైడ్రేట్ అయి సహజ బ్యూటీమణులవుతారు.


ములక్కాయ రుచే వేరయా.. | Drumsticks for Improving Digestion to Boosting Immunity

మునగకాడ ముక్కలు చేరితే రసం, సాంబార్ లు ఘుమఘుమలాడిపోవాల్సిందే. రుచికరమైన శాఖాహారం, మాంసాహారం.. ఏ వంటకైనా ములక్కాడ ఉండాల్సిందే. అంతేకాదు ములగ ఆరోగ్యప్రయోజనాలు తెలుసుకున్న వారైతే ములగ చిగురు పప్పు, ములగ ఆకు పొడి, ములగ కాడల కూరలు, పచ్చడి.. ఇలా రోజూ వినియోగిస్తారు. ముఖ్యంగా జంక్ ఫుడ్ తో ఎదురయ్యే సమస్యలు, పోషకాహార లోపం.. సరిదిద్దడానికి ములగ ఆకు, మునక్కాడలు విరివిగా తీసుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు.

మునగాకులో విటమిన్ - ఎ, విటమిన్ - సి పుష్కలంగా లభిస్తాయి. అమినో యాసిడ్స్‌, మినరల్స్‌ సమృద్ధిగా ఉన్నాయి. రక్తహీనత తగ్గి, హిమోగ్లోబిన్‌ శాతం పెరిగి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కీళ్ళ జబ్బులు దరిచేరవు. ఇందులోని క్లోరోజెనిక్‌ యాసిడ్‌ కారణంగా బ్లడ్‌లో షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి. థైరాయిడ్‌ను క్రమబద్ధీకరించే శక్తి, యాంటీ ట్యూమర్‌గా పనిచేస్తూ క్యాన్సర్లను నిరోధించే సత్తా మునగ ఆకుకి ఉంది. గర్భీణి స్త్రీలకు, బాలింతలకు మునగాకు వాడకం ఎంతో మంచిది. అవసరం అయ్యే క్యాల్షియం, ఐరన్‌, పాస్ఫరస్‌, పొటాషియం, విటమిన్స్ అందుతాయి. గాయాలకు యాంటి సెప్టిక్‌గా వాడుకోవచ్చు. జీర్ణశక్తిని పెంచడంలో, అకలిని కలిగించడం, విరేచనాలను అరికట్టడంలో మునగ రసం బాగా పనిచేస్తుంది. కంటి సమస్యలు, చర్మ రుగ్మతలకు చెక్ పెడుతుంది. మునగాకు కాలేయంలో చేరిన విష పధార్థాలను హరిస్తుంది. ఇంకా మూత్రాశయంలో రాళ్లను కరిగిస్తుంది. నూతన ఉత్తేజం కలగడంతోపాటు వీర్యవృద్ధి కలుగుతుంది.


గులాబీ మొక్కల సంరక్షణ | Rose Garden : Growing Roses in Pots

వాతావరణం అనుకూలంగా ఉండడంతో పూలమొక్కలకు భలే మంచి గిరాఖీ ఉంది. వీటిల్లో ప్రధానంగా రకరకాల రంగుల్లో పువ్వులు విరభూసే గులాబీ మొక్కలంటే మగువలకు మక్కువ ఎక్కువ. రెండు గులాబీ మొక్కల కుండీలు ఉన్నా ఇంటికి శోభనిస్తాయి. గులాబీకి ఒక రంగు అంటూ ఉన్నా ఎరుపు, తెలుపు, పసుపు, నీలం - ఇలా నానా రకాలరంగుల్లో గులాబీలు పూస్తాయి. చిన్నిచిన్న మొక్కలకే ఎక్కువ పువ్వులు పూయడం వల్ల కుండీలను పైభాగాన 25 నుంచి 30  సెంటీమీటర్ల వ్యాసార్థం కలవి ఎన్నుకోవాలి. కుండీలు మట్టితో చేసి కాల్చినవి వాడడం ఉత్తమం. కుండీలో నీళ్ళు నిలువ ఉండకుండా అడుగున కన్నం ఉండేలా జాగ్రత్తపడాలి. ఇలా కారిన నీరు వృథా కాకుండా కుండీల కింద సరిపడా ట్రేలను విదిగా వాడుకోవాలి. కుండీల్లో మట్టితోపాటు కంపోస్ట్ ఎరువును రెండు, ఒకటి నిష్పత్తిలో గుల్లగా చేసి కలిపి నింపాలి. కుండీలో నీళ్ళు పోయడానికి వీలుగా పైన 5 సెంటీమీటర్ల వరకు ఖాళీస్థలం ఉండాలి.

నర్సరీల్లో అమ్మే గులాబీ మొక్కలను ప్లాస్టిక్ బ్యాగుల్లో ఉండడంచేత వాటిని తీసి మళ్ళీ నాటేప్పుడు మట్టిలోకి ఆకులు, మొగ్గలు కలిసిపోకుండా చూడాలి. మొక్కను నిటారుగా కుండీలోకి దించాక చుట్టూ చేతి వేళ్ళతో మట్టిని నెమ్మదిగా నొక్కాలి. మొక్కను నాటాక రోజూ రెండుపూటలా నీళ్ళు అవసరమైనన్ని పోస్తుండాలి. గులాబీ మొక్కలను పెంచడం సరదాగా, చాలా సులువుగా తోస్తుంది. కానీ కాస్త శ్రమ తప్పదు. వాడిపోయిన ఆకులను, పువ్వులను తుంచడం, కలుపుమొక్కలను తీయడం చేస్తుండాలి. గులాబీ మొక్కల పైన అప్పుడప్పుడు నీళ్ళు స్ప్రే చేయడం ద్వారా దుమ్ము ధూళి ఆశించవు. గులాబీ మొక్కల ఎదుగుదలకి మట్టిలో ఆమ్ల స్వభావం ఉండాలి. కాఫీ పొడి మట్టికి ఆ గుణాన్ని పెంచుతుంది. కాబట్టి దాన్ని గులాబీ మొక్క మొదట్లో చల్లండి. ఉల్లిపొట్టు, బంగాళాదుంప పొట్టు.. మొక్కచుట్టూ వేస్తే మంచి ఎరువుగా పనిచేస్తాయి.


మంచి అలవాట్లు.. | Best Hobbies for Better Health

గృహిణి అయినా.. ఉద్యోగిని అయినా.. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో వారి ఆరోగ్యంపై దృష్టిపెట్టేంత సమయం ఉండట్లేదు. ఇది ఏమాత్రం మంచిది కాదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం, విశ్రాంతి, వ్యాయామం.. వీటి విషయంలో నిర్ణీత సమయాన్ని పాటించకపోతే ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండాలంటే పోషకాహారం, సరియైన నిద్ర, క్రమం తప్పని వ్యాయామం.. పై నిర్లక్ష్యం తగదు. అన్నింటికిమించి ఎల్లవేళలా సానుకూల దృక్పథంతో ఉండగలిగితే మానసికానందం తద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.

- ఎలాంటి రోగాలు దరిచేరకుండా ప్రతి రోజూ మూడు లీటర్ల మంచినీరు తాగాల్సిఉంటుంది. పరగడుపున రెండు గ్లాసుల మంచి నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. చర్మం బాగా హైడ్రేట్ అయి ఆరోగ్యంగా తయారవుతుంది.
- ఆ తరవాత తప్పనిసరిగా వ్యాయామం చేయడం మంచిది. దీంతో మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు.
- ఉదయంపూట అల్పాహారం కచ్చితంగా తీసుకోవాలి. ఒక కప్పు పాలు తీసుకున్నా ఎముకలు ధృడపడుతాయి.
- పన్నెండు గంటలనుంచి ఒంటి గంటలోపు మధ్యాహ్నభోజనం చేయడం చాలా మంచిది.
- స్నాక్స్ సమయంలో ఫ్రూట్స్ లేదా వాటి జ్యూస్ తీసుకోవడం ఆరోగ్యకరం. రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదంటారు. నిమ్మకాయ రసం అయితే శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది.
- గ్రీన్‌ టీలోని యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. రోగనిరోధకక్తి ఇనుమడింపచేస్తుంది.
- భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమించకూడదు. నిద్రలేమికి లోనవ్వకుండా నిద్ర విషయంలో సమయపాలన పాటించాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఆరోగ్యవంతమైన మనిషికి రోజుకు కనీసం ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి అని గమనించాలి.


మనోధైర్యంతో సొనాలి బింద్రే..

తన అందం, అభినయంతో టాలీవుడ్‌, బాలీవుడ్‌ సినిమాల్లో నటించి ఎంతో మంది ఫ్యాన్స్‌ని ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకున్న సోనాలి బింద్రే ఉన్నట్టుండి క్యాన్సర్తో బాధపడుతున్న షాకింగ్‌ న్యూస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ నెల 4న పోస్ట్ చేసి అందరిని షాక్ కు గురిచేసిన విషయం విధితమే.

న్యూయార్క్‌లో హైగ్రేడ్‌ క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్న సొనాలి ఎంతో దైర్యంగా ఈ మహమ్మారిని జయిస్తానని అంటోంది. అభిమానులకు సోషల్ మీడియాలో టచ్ లో ఉంటూ తనకు సపోర్ట్ చేసే ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలియచేస్తోంది.

టాల్కం పౌడర్‌తో క్యాన్సర్‌

జాన్సన్ అండ్ జాన్సన్‌ బేబీ పౌడర్ కారణంగా తనకు అండాశయ క్యాన్సర్ సోకిందంటూ కాలిఫోర్నియాకి చెందిన ఇవా ఎచివెరియా అనే మహిళ ఫిర్యాదు మేరకు లాస్‌ ఏంజిల్స్ కోర్టు 417 మిలియన్ డాలర్ల భారీ జరిమానా విధించింది. జాన్సన్ అండ్ జాన్సన్‌ ఈ టాల్కం పౌడర్ ఉత్పాదన విషయంలో 9 వేలకు పైగా కేసులను ఇప్పటికే ఎదుర్కొంటోంది.

బేబీ టాల్కం పౌడర్లలో ప్రమాదకమైన ఆస్‌బెస్టాస్‌ అవశేషాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో కొన్ని దశాబ్దాల పాటు ఈ ఉత్పాదనలు వినియోగించిన వారికి పలురకాల క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందనేది వాదన.

జర భద్రం! | Prevention Is Better Than Cure

వర్షాకాలం చాలా ఆనందంగా ఉంటుంది. చిటపట చినుకులు ఎవరికి ఆహ్లాదాన్ని కలిగించవు. అయితే అందరు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఈ కాలంలో  సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు ప్రబలే ముప్పు ఎక్కువ. దానికి తోడు ఏమాత్రం రోగనిరోధక శక్తి క్షీణించినా సమస్య మరింత జఠిలమయ్యే ప్రమాదం ఉంది. దీని నివారణకు వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత ముఖ్యం అంటున్నారు వైద్యనిపుణులు.

వ్యాధులు - అవగాహన
- జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం.. ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా వర్షంలో తడిసిన వెంటనే శుభ్రంగా స్నానం చేయడం ఉత్తమం. ఇవి అంటువ్యాధులు కూడా కావడంతో తగు జాగ్రత్తలు అవసరం.
- ఏమాత్రం ఆహారం, శుభ్రత విషయంలో అశ్రద్ద కనబరిచినా డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌, జాండిస్‌ వంటి వ్యాధి కారక క్రిములు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ.
- మలేరియా.. ఇది దోమకాటు వల్ల విజృంభిస్తుంది. కడుపులో నొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం, చలి, అతిగా చమట పట్టడం వగైరా లక్షణాలు కనిపిస్తాయి.
- డయేరియా.. కలుషిత ఆహారం లేదా నీటిని తీసుకోవడం వల్ల డయేరియా వ్యాధి వస్తుంది. వాంతులు, విరేచనాలు, ఆయాసం, నీరసం.. ఇలా లక్షణాలు ఉంటాయి.
- టైఫాయిడ్.. ఇది కూడా కలుషిత ఆహారం, తాగే నీరు ద్వారా సోకుతుంది. తలనొప్పి, గొంతు నొప్పి, జ్వరం లాంటి లక్షణాలు పీడిస్తాయి.

 
Prevention Is Better Than Cure
- రోడ్డు పక్క ఆహారం వద్దు. సులభంగా జీర్ణమయ్యే తాజా తాజా వేడి ఆహారపదార్థాలను మాత్రమే తీసుకోవాలి.
- ఏ మాత్రం బద్ధకించకుండా వ్యాయామం చెయ్యడం తప్పనిసరి. సీజన్‌ ఏదైనా ఫిట్‌నెస్ ను జీవనవిధానంలో ఒక భాగం అని గుర్తించాలి.
- రెయిన్ కోట్, రెయిన్ క్యాప్, గొడుగు.. వగైరా బయటికి వెళ్లడానికి తప్పనిసరి. ఒక వేళ వర్షంలో తడిసినా త్వరగా ఆరిపోయే దుస్తులు వేసుకోవాలి.
- వానాకాలం దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి అనేక రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. వాటి నివారణకు పలు రకాల చర్యలు విధిగా తీసుకోవాలి.
 
https://www.youtube.com/c/vantintichitkalu
 
 

యముడి మెరుపు తీగ.. | Get Rid of House Flies

ఎస్. ఎస్. రాజమౌళి ఈగ చిత్రం గుర్తుండే ఉంటుందికదా. అవును ఆ సినిమా కథలో లాగే తెలుగు రాష్ట్రాల్లో ఈగలు పగపట్టడం కొన్ని సందర్భాల్లో విందులు బహిష్కరిస్తే ఏకంగా గ్రామాలనే వదిలి వెళ్ళాల్సిన పరిస్థితులు చూసాం..

ఈగలు ఆషాడ మాసంలో విజృంభిస్తాయి. ఈ వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులతో పొంచి ఉన్న ముప్పు నివారించాలంటే ఏకైక మార్గం వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత అని అందరూ గుర్తించాలి.

ప్రధానంగా అనారోగ్యానికి కారణమయ్యే ఈగలు వ్యాప్తిచెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తడి లేదా తేమ పరిసరాల వల్ల ఈగలు తొందరగా వృద్ధి చెందుతాయి. చెత్తాచెదారం మీద వాలిన ఈగలు మనం తినే ఆహార పదార్థాలపై వాలుతుంటాయి. ఫలితంగా ఆహారం కలుషితమై అనేక వ్యాధులకు దారితీస్తుంది.  అందకని ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. మంచినీరు, ఆహారపదార్థాల పాత్రలపై విధిగా మూతలు ఉండాలి. నిల్వ ఆహారపదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. అలాగే వాటిని ఎప్పటికప్పుడు చెత్తకుండీల్లో పడేసి, పాత్రలను శుభ్రం చేయాలి. వంటింటిని శుభ్రం చేసే నీళ్లలో కాస్త పసుపు కలపాలి. దాని వల్ల ఈగలు చేరకుండా ఉంటాయి. వేడి నీళ్లలో లావెండర్ నూనెను కలిపి ఇంట్లో నాలుగు మూలలా చల్లాలి. వేపాకు పొగ పెట్టడం వల్ల కూడా ఈగలను ఇట్టే తరిమేయవచ్చు. పుదీనా, బంతి మొదలైన మొక్కలు పెంచడం వల్ల ఈగలు పరిసరాల్లోకి రాకుండా ఉంటాయి.


వంట చిట్కాలు | Tips to Cook Better & Faster than ever

వంట గదిలో చిన్నచిన్న చిట్కాలు ప్రయోగిస్తుంటే ఆహార పదార్థాల రంగు, రుచి, వాసన కోల్పోకుండా ఉంటాయి. పైగా పోషక విలువలు మెరుగుపడతాయి. అలాంటి వాటిల్లో కొన్ని వంటింటి చిట్కాలు చూద్దామా..
- బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉండడానికి నూకకి చెంచా నూనె పట్టించాలి.
- బెండకాయ ముక్కల మీద కాస్త నిమ్మ రసం పిండితే కూర జిగురు రాదు.
- పచ్చి బటానీలను ఉడికించేటప్పుడు చిటికెడు పంచదార చేరిస్తే రంగు మారకుండా ఉంటాయి.
- అప్పడాలు మెత్త బడకుండా డబ్బాలో గెప్పెడు బియ్యం వేయాలి.
- కాచిన నెయ్యి ఘుమఘుమలాడడానికి నాలుగు మెంతులు వేసి చూడండి.
- మంచి నూనె డబ్బాలో రెండు లవంగాలను వేసి ఉంచండి. కమ్మని వాసన ఎటూపోదు.
- కందదుంప ముక్కలు త్వరగా ఉడకడానికి చిన్న బెల్లం ముక్క వాడి చూడండి.
- ఆకు కూరల వంటలు సహజ రంగుని కోల్పోకుండా ఉడికేటప్పుడు చిటికెడు పంచదార కలపాలి.
- పాలు కాచే సమయంలో విరగకుండా ఉండాలంటే కొద్దిగా తినే సోడా వేయాలి.
- దోసల పిండి బాగా పులిసిపోతే కాస్త గోధుమ పిండిని చేర్చితే సరిపోతుంది.
 
 

జర భద్రం! | Safety Tips and Precautions for for Everyday Life

- వంట సమయంలో గ్యాస్ స్టవ్ దగ్గరలోనే ఉండాలి. ఎలాంటి గ్యాస్ లీకేజి ఉందనిపించినా వెంటనే కిటికీలు, తలుపులు కాసేపు తెరిచే ఉంచాలి. ఎలక్ట్రికల్ స్విచెస్ వేయడం లేదా తీయడం చేయకూడదు. రోజులో ఎక్కువసేపు బయటికి వెళ్ళాల్సివచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్ రెగ్యూలేటర్ కట్టేయడం ఉత్తమం.
- ఇళ్లలో ప్రమాదాలకు లోపభూయిస్టమైన హౌజ్ వైరింగ్ కూడా కారణమే. ఇది సరిచూసుకోవడంతో పాటు ఎలక్ట్రికల్ ఎర్తింగ్ కచ్చితంగా ఉండాలి.
- ట్యాప్ లో నీళ్లు వస్తున్నాయా చూసుకుని గీజర్  వేసుకోవాలి. పని అయిపోయిన వెంటనే కచ్చితంగా పవర్ స్విచ్ ఆఫ్ చేయాలి.
- ఇమ్మర్షన్ రాడ్, ఐరన్ బాక్స్.. ఇలాంటి ఎలక్ట్రికల్ అప్లైన్సెస్ వాడుతున్నప్పుడు కాళ్లకు చెప్పులు వేసుకోవాలి.
- పొల్యూషన్ లో బయటికి వెళ్ళేటప్పుడు నిర్ళక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
- టూవీలర్ రైడింగ్ సమయంలో హెల్మెట్ వేసుకోవడం, దాన్ని లాక్ చేసుకోవడం తప్పనిసరి.
- ఫోర్‌వీలర్ వాహన చోదకులు, ప్రయాణికులు విధిగా సీట్ బెల్ట్ ధరించాలి.
- వెహికిల్స్ నడిపేటప్పుడే కాక రహదారులపై నడిచేటప్పుడు కూడా విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. వర్షాకాలంలో మ్యాన్ హోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
- డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లను వాడడంలో, మిగతా డిజిటల్ లావాదేవీల్లో అప్రమత్తత అవసరం. ఇతరులకు ఎలాంటి పరిస్థితుల్లోనూ కార్డులను ఇవ్వడం, ఓటిపి లేదా పాస్వర్డ్ లను చెప్పడం మంచిదికాదు.
- ఇమెయిల్ లాగిన్, మిగతా సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ లకు ఒకే విధమైన క్రెడెన్సియల్స్ వాడకూడదు. స్పామ్ లేదా జంక్ మెయిల్స్ జోలికి వెల్లకపోవడం, సోషల్ మీడియాలో పర్సనల్ డిటేల్స్, ముఖ్యంగా ఫొటోస్ పెట్టకపోవడం ఉత్తమం.

https://www.youtube.com/c/vantintichitkalu

 

చీడ వదిలించడిలా.. | Natural Pest Control for Houseplants

 
పూలమొక్కలు, కూరగాయల మొక్కలు, అలంకరణ మొక్కలు..  ఏవైనా సరే నాటుకోవడానికి ఇది అనువైన కాలం. అందుకని చాలామంది గార్డెనింగ్ పై ఆసక్తి చూపిస్తారు. అయితే వర్షాకాలంలో మొక్కలను చీడ పీడలు ఎక్కువగా ఆశించే ప్రమాదముంది. మరి వాటిని హానికర రసాయణాలు ఉపయోగించకుండా ఇంట్లో అందుబాటులో ఉన్న పదార్థాలతోనే నివారించడమెలానో చూద్దాం..

- సేంద్రియ పద్ధతులను పాటించడం ద్వారా ఆరోగ్యదాయకమైన పెరటితోటలు సొంతమవుతాయి.
- మొక్కలపై దుమ్ముధూళీ చేరకుండా చూసుకోవడం, సరియైన గాలి, సూర్యరశ్మి పడేలా జాగ్రత్తవహించడం అవసరం.
- మడి, కుండీల్లో మట్టిని సజీవంగా ఉంచడం ద్వారా పోషకాల సమతుల్యత దోహదపడుతుంది. దీనికి సహజ సిద్ధమైన కంపోస్టు ఎరువులను తరచూ వాడుతూ మొక్కలను కాపాడుకోవాలి. మట్టిలోని సూక్ష్మ పోషకాలు సక్రమంగా అందకపోతే మొక్కలు బలహీనపడడమే కాక పురుగులు, తెగుళ్లు చేరుతాయి.
- ఎలాంటి దుష్ప్రభావాలు లేని వేపనూనె, కానుగునూనె, బంతికాడల కషాయం, కొయ్య బూడిద మొదలైన వాటితో స్ప్రే ద్రావకాలు తయారచేసి వాడుకోవాలి.
- లీటర్ నీటిలో ఒక చెంచా కారం పొడి బాగా కలియపెట్టి మొక్కల మీద చల్లడం ద్వారా కీటకాలను నివారించవచ్చు. ఈ మిశ్రమంలో కాస్త లిక్విడ్ సోప్ లేదా కుంకుడుకాయ రసం చేర్చితే మరీ మంచిది.
- ఒక్కో చెంచా వంటసోడా, సోయాబీన్‌ నూనెను తీసుకుని నాలుగు లీటర్ల నీళ్లలో కలిపి తరచూ స్ప్రే చేస్తూంటే క్రిమికీటకాలతో పాటు ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ లకు తావుండదు.  
- పుల్ల మజ్జిగ మొక్కలపై కీటకాలను పారదోలడమే కాక వాటి గుడ్లను సైతం నశింపచేస్తుంది. అందుకని నాలుగైదు రోజులు మజ్జిగను బాగా పులియపెట్టి దాన్ని కావలసినంత నీటిలో కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి.
- లీటరు నీటిలో గుప్పెడు దవనం ఆకులను వేసి బాగా మరిగించాలి. చల్లారక దీనికి రెండింతలు మంచి నీటిని చేర్చి మొక్కలపై పిచికారీ చేయాలి.
- కిరోసిన్ ని మొక్కలపై స్ప్రే చేయడం ద్వారా కూడా మంచి ఫలితం లభిస్తుంది.


మురిపాల అరచేత.. | Benefits of Henna for Skin & Hair

ఆషాడమాసం ఈ విళంబి నామ సంవత్సరంలో జులై 14న మొదలై 11వ తేది ఆగస్టు 2018 వరకు ఉంటుంది. ఆషాడంలో అతివలు కనీసం ఒక్కసారైనా తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవడం భారతీయ సంస్కృతిలో ఒక భాగం. దీన్ని శుభప్రదంగా భావిస్తారు. అంతేకాదు వర్ష రుతువులో గోరింటాకు పెట్టుకోవడంలో అరోగ్య రహాస్యం ఇమిడిఉంది. కేవలం అలంకరణగానే కాకుండా గోరింటాకును హెయిర్‌ డైగా,  గోరింటాకు పొడిని హెన్నాగా విరివిగా ఉపయోగిస్తున్నాం. గోరింటాకులో ఉండే ఔషధగుణాలు మన శరీరాన్ని రక్షించి, ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రకృతి వరమైన గోరింట సూక్ష్మక్రిములను నశింపచేయడంతో పాటు పలు ఇన్ఫెక్షన్ లను దరిచేరకుండా చూస్తుంది. అయితే నాసిరకం మెహందీల వల్ల దుష్ప్రభావాలు అనేకం అని గుర్తించాలి.

- గోరింటాకు రోగ నిరోధక శక్తిని ఇస్తుంది.
- పైత్యం, గొంతు ఇన్‌ఫెక్షన్, చర్మ వ్యాధులకు గోరింటాకు చెక్ పెట్టడమే కాక నయం చేస్తుంది.
- దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ వల్ల గోర్లను, పాదాలను, చేతులను రక్షిస్తుంది.
- గోరింటాకు కషాయం గాయాలకు, నొప్పులకు మంచి ఔషధం అని చెప్పవచ్చు.

మీ అరచేతిలో గోరింటాకు ఎర్రగా పండడానికి www.vantintichitkalu.com అందిస్తున్న చిట్కాలు..
- ముందు రోజు రాత్రి ఆకు శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసుకోవడం ఉత్తమం.
- కల్తీ పౌడర్, కోన్ లతో అనేక అనార్ధాలు తప్పవు కనుక ఆకును ఆరపెట్టి పొడిచేసి వాడుకోవచ్చు.
- మెహందీ పెట్టుకునే ముందు సబ్బుతో శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి.
- పెట్టుకున్న డిజైన్ పూర్తిగా వెంటనే ఆరిపోకుండా ఆరార నిమ్మరసం, పంచదార కలిపిన మిశ్రమం కాటన్ బాల్ తో అద్దుతుండాలి.


 

సెలబ్రిటీ.. | Chrissy Teigen Slams Open Breastfeeding

అమెరికన్ మోడల్,  నటి క్రిస్సీ టైగెన్ తాజాగా ఓ పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసి సంచలనాలకు మళ్ళీ తెరలేపింది. ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఈ ఛాయాచిత్రంలో ఆమె ఏకకాలంలో శిశువుకు, కూతురు లూనా ఆడుకునే బొమ్మకు తల్లిపాలను ఇస్తూ ఉండడం గమనించవచ్చు.   

శిశువుకు తల్లిపాలు పడుతున్న సమయంలో లూనా తన బొమ్మకు పాలివ్వమని ఇవ్వడంతో క్రిస్సీ టైగెన్ కు కవలపిల్లలు అన్న భావన కలుగుతోందని వెల్లడించింది. వివాదాలకు దారితీస్తూనే ఈ వ్యవహారమంతా ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. మూడు పదుల క్రిస్సీ తీరు  ఆది నుంచి వివాదాలకు దారి తీస్తున్నా నిర్భయంగా విమర్శకులకు  సమాదానం ఇస్తూనే వస్తోంది.


pc: instagram

సైరా..! | The Health Hazards of having Pests & Insects in your Home

కంటికి కనిపించేవి కొన్ని అయితే కనిపించని ఎన్నో క్రిమికీటకాలు, బ్యాక్టీరియా, వైరస్.. ల కారణంగా మనం అనారోగ్యం పాలవుతాం అని తెలిసిన విషయమే. అయితే ఇవి ఎక్కడో ఉండవని ఏమాత్రం అపరిశుభ్రంగా ఉన్నా మనపై దాడి చేసి వ్యాధులభారిన పడేస్తాయని మరవకండి. ఇల్లు పైకి శుభ్రంగా ఉంటే సరిపోదని ఇలాంటి వ్యాధి కారకాలు వ్యాప్తిచెందే ప్రతీ ప్రదేశాన్ని అన్నివేళలా నీట్ గా, డ్రైగా ఉంచుకోవాలని గుర్తించాలి. ముఖ్యంగా పిల్లల్లో తరచూ వచ్చే వ్యాధులకు కారణం అపరిశుభ్ర వంటపాత్రలు కారణమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు ఇల్లు చిమ్మడం, తుడవడం రోజూ చేసే విధే అయినా తగు జాగ్రత్తలు అవసరం. ప్రధానంగా అందరూ బాత్ రూం లోనే క్రిములు చేరతాయని, అక్కడ మాత్రం శుభ్రంగా ఉంటే సరిపోతుందనే భ్రమలో ఉంటారు. కాని అన్నీ డోర్ హ్యండిల్స్, ఫోన్ లతో పాటు వంటగది, ముఖ్యంగా సింక్, గ్యాస్ స్టవ్, కర్టేన్స్, ఫ్యాన్స్, చేతిగుడ్డలు.. వగైరా ఏరియాల్లో అనేక రకాల క్రిములు స్థావరాలు ఏర్పరచుకుంటాయి. ఇవి గాలి ద్వారా లేదా తాకగానే మన శరీరంలోకి ప్రవేశించి వ్యాధులను కలిగాస్తాయి. ఇంట్లో ఉపయోగించే తడి చెత్త, పొడి చెత్త కుండీలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. వంటపాత్రలు శుభ్రపరచడంలో అశ్రద్ధ పనికిరాదు. గిన్నెల జిడ్డు మరకలు, వాటిని తోమే డిటర్జెంట్ల ఆనవాళ్లు లేకుండా చూసుకోవాలి.  

వంటగదిలో శుభ్రతకు డిటర్జెంట్లతో పాటు వెనిగర్‌, వంటసోడా, బేకింగ్‌ పౌడర్.. అందుబాటులో ఉంచుకోవాలి. ఇవి ఫ్లోర్, సింక్, వస్తువులు ఇట్టే శుభ్రపరచడమే కాక క్రిమికీటకాలు మటుమాయమవుతాయి. ఎలాంటి దుర్వాసనలు లేకుండానూ ఉంటుంది. ఇంట్లో మిగతా గదులన్ని ఉదయం క్లీన్ చేసుకోవాలనుకున్నా కిచెన్, వంటపాత్రలు, సింక్ మాత్రం రాత్రి శుభ్రపరచుకోవడమే ఉత్తమం. దీనివల్ల రాత్రివేళల్లో వంటగదిలో ఇవి వృద్ధిచెందకుండా ఉంటాయి. వీలైనంత వరకు తలుపులు, కిటికీలు తెరచి ఉంచి సూర్యకిరణాలు, ఫ్రెష్ ఎయిర్ ప్రసరించేలా చూసుకుంటే వంటగదిలోనూ
సూక్ష్మక్రిములు చేరవు. ఇంట్లో దుమ్మూధూళి దులపడానికి వాడే చేతి గుడ్డ లేదా వంటింట్లో వాడే మసి గుడ్డ ఏదైనా రోజూ ఉతికి ఆరవేయాలి. లేదంటే వాటివల్లే ఎక్కువ అనార్థాలు కలిగే ప్రమాదం ఉంది.
    

దగ్గరగా రా..! | Keeping the Clothes Clean & Fresh


వర్షాకాలం అన్నీ వయసుల వారికి ఆనందకరమైనది. అందులో సందేహం లేదు కాని అదే సమయంలో ఏమాత్రం దుస్తుల శుభ్రత విషయంలో అజాగ్రత్తగా ఉన్నా ముతక వాసనతో ముక్కుపుటాలు అదిరిపోతాయి. సరియైన సూర్యరశ్మి పడకపోవడంతో ఉతికిన గుడ్డలు సరిగా ఆరవు. ఈ తేమతో కూడిన బట్టలు అలాగే భద్రపరిచినా, వేసుకున్నా ముతక కంపు కొడుతాయి. అయితే దుస్తుల ఎంపిక, శుభ్రపరచడంలో మెళకువగా ఉంటే ఈ వర్షాకాలం ఎంతో ఎంజాయ్ చేసేయొచ్చు.

వర్షాకాలంలో దుస్తుల ఎంపిక అనేది చాలా ముఖ్యం. దళసరి గుడ్డలైతే వర్షంలో తడిసినా ఆరడం కష్టం, పైగా ఉతికి ఆరేసినా ఓపట్టానా పూర్తిగా ఆరవు. దీంతో ఇబ్బందికరమైన దుర్వాసనలు తప్పవు. అలాగే ఈ కాలంలో మరకలు ఎక్కువగా చేరే ప్రమాదమున్నందున లేత రంగు వస్త్రాలను ఎంపిక చేసుకోకపోవడమే ఉత్తమం. వాతావరణం ఎలాగూ డల్‌గా ఉంటుంది కాబట్టి డార్క్ కలర్స్ ట్రై చేయడానికి ఇదే మంచి సమయం అని గుర్తించాలి. పొడవుగా కాళ్ల చివర్ల వరకూ ఉండే దుస్తులను ఈ కాలంలో వేసుకోకపోవడం మంచిది.

ఇక దుస్తుల నిర్వహణ విషయానికి వస్తే విప్పిన దుస్తులను వాషింగ్ మిషన్ లో వేసే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి. వీటికి విడిగా ఒక బాస్కెట్ ని వాడుకోవాలి. వాషింగ్ మిషన్ లో డిటర్జెంట్ తో పాటుగా కొంచం బేకింగ్ సోడా లేదా వెనిగర్ ని వాడితే బట్టలకు ఎటువంటి చెడు వాసనలు పట్టకుండా సువాసనలు వెదజల్లుతాయి. వాషింగ్ మిషన్ లో నుంచి దుస్తులను వెంటనే తీసి ఎండలో లేదా గాలి ప్రసరించే ప్రదేశంలో ఆరవేయాలి. దుస్తులు ముడతలు పడకుండా దులపడం, తిరిగేసి ఆరవేయడం మరవద్దు. అలాగే విడివిడిగా ఆరవేయడంతో బట్టలు పూర్తిగా తేమ లేకుండా పొడిగా ఆరుతాయి. వీటిని వార్డ్ రోబ్ లో అలాగే కుక్కేయకుండా ఐరన్ చేసుకుని సర్దుకోవాలి.
లేదంటే తేమ చేరి మన దుస్తుల ముతక వాసనతో ఇతరులు ఇబ్బందిపడక తప్పదు. పైగా ఈ అపరిశుభ్రమైన వస్త్రాలతో అనేక ఎలర్జీలకు గురికావాల్సివస్తుంది.