ఒత్తిడి వదిలెయ్‌.. | Tips for Overcoming Depression

నేడు అందరిని ఆందోళనకు గురి చేసే అంశం మానసిక ఒత్తిడి. నిత్యం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ అనేక సంద‌ర్భాల్లో తీవ్ర‌ ఒత్తిడికి లోనవడం, క్ర‌మంగా తీవ్ర మాన‌సిక స‌మ‌స్య‌, డిప్రెష‌న్‌ల‌కు దారి తీయడంతో శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది. తరవాత పరిణామాలు ఎలా ఉంటాయో తెలియంది కాదు. అందుకని మానసిక ఒత్తిడిలో ఉన్న వారికి తగిన ఓదార్పు చాలా అవసరం అంటారు మానసిక నిపుణులు. దీనికి సైకియాట్రిస్టులు అక్కర్లేదు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరైనా సరే కాస్త ఊరట కలిగిస్తే చాలు. వ్యక్తిగతంగా కూడా ఒత్తిడిని పెంచే ఆలోచనలకు స్వస్తి చెప్పాలి. మనస్సును ఆహ్లాదపరిచే ఆలోచనలకు రూపకల్పన చేయాలి.  ప్రకృతి అందాలు ఊహల్లోకి వస్తేనే ఎంతో రిలాక్స్ కావచ్చు. యోగా, ధ్యానం, వ్యాయామం.. మానసిక ఒత్తిడికి మంచి పరిష్కారమార్గాలు అని మరిచిపోకూడదు. ఒత్తిడిని తగ్గించేందుకు ఏదో ఒక కళను, హాబీని అలవర్చుకోవచ్చు. చిత్రలేఖనం, చక్కటి సంగీతం పాడడం, వినడం వగైరా చేయచ్చు. ఇక హాబీల విషయానికి వస్తే వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, బుక్ రీడింగ్, గార్డెనింగ్, పజిల్స్, గేమ్స్ .. పరిశీలించవచ్చు. ఒత్తిడి దరిచేకుండా పెంపుడు జంతువులు ఎంతో తోడ్పడతాయి. అవి మనతో పూర్తిగా మమేకమయి మనస్సులో నూతన ఉత్తేజాన్ని నింపుతాయి.

ఒంటరిగా ఉండకూడదు. నాలుగురితో కలివిడిగా ఉంటూ సమస్యలను మరిచిపోయేందుకు ప్రయత్నించాలి. ఎంతసేపు చదువు, ఉద్యోగమే అని కాకుండా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులతో విందు, వినోదాలకు సమయం కేటాయించాలి. ఒత్తిడి అధికంగా ఉన్నట్టు భావిస్తే చేసే పనినంతా పక్కన పెట్టి కొన్ని నిమిషాల పాటు కళ్లు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకోండి. గాలి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడు శ్వాసను గమనించండి. దీంతో ఒత్తిడి భారం తగ్గుతుంది. శారీరక ఆరోగ్యానికే కాదు. మానసిక ఆరోగ్యానికి కూడా పోషకాహారం ముఖ్యం. మానసిక ప్రశాంతతను కలిగించే పోషక విలువలున్న పాలు, బాదం పప్పు, సిట్రస్ ఫ్రూట్స్, పాలకూర, చేపలు తదితర ఆహారాలను రోజూ తీసుకోవాలి. అలాగే సరియైన నిద్ర తప్పనిసరి లేదంటే ఒత్తిడిని కలిగించే హార్మోన్లు దాడి చేస్తాయి. రోజూ తగినంత మంచినీటిని తీసుకోవాలి. అప్పుడే శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. దీంతో ఒత్తిడి దరిచేరదు.


No comments: