నూతన సంవత్సర శుభాకాంక్షలతో.. | Best New Year 2019 Resolution Idea | Happy New Year! | VantintiChitkalu


టెలీఫోన్, టైం వాచ్, క్యాలిక్లేటర్, క్యాలెండర్, అలారం, mp3 ప్లేయర్, వీడియే ప్లేయర్, కెమేరా, ఇంటర్నెట్.. ఏదైనా ఇప్పుడు అరిచేతులోనే... అంటే సెల్ ఫోన్. ఇది ఇప్పుడు మనిషికి నిద్ర, ఆహారాలను కూడా దూరం చేస్తోంది. నేడు అందరికి రోజులో ఎక్కువ సమయం మొబైల్ లో టెక్స్టింగ్, సోషల్ మీడియా, గేమ్స్.. వగైరాతోనే సరిపోతోంది. ఫోన్ కాల్, SMS.. రాకపోయినా అదే పనిగా సెల్ తో కాలం గడిపేస్తుంటారు. ఎలాంటి అలర్ట్స్ లేనప్పుడు అవసరం అయితేనే సెల్ వాడాలని నిర్ణహించుకోవాలి.

ప్రత్యేకించి భోజనం చేసే సమయంలో, ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు తప్పకుండా సెల్ ఫోన్ ని దూరంగా ఉంచడం ఎంతైనా అవసరం. నిద్ర సమయం కూడా కుచించుకుపోకుండా పడకగదికి మొబైల్ ని దూరంగా ఉంచాలి.

మొబైల్ ఫోన్ ని ఎన్ని సౌకర్యాలకు వాడుతున్నా సమయపాలన ముఖ్యమని గమనించాలి. అప్పుడే విలువైన సమయం వృధా కాకుండా ఉంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది.
 Wish You A Happy and Prosperous New Year
from
http://www.vantintichitkalu.com
 

ఆనంద దీపావళి వేళ.. | Safety Tips to Ensure a Happy Diwali


దీపావళి అనగానే పిల్లలు, పెద్దలు కలసి బాణాసంచా కాలుస్తూ సంబరంగా జరుపుకొనే పండగ. అయితే అప్రమత్తంగా ఉంటేనే పండగ సంబరంగా జరుపుకోవడం సాధ్యమవుతుంది. వారివారి వయసుని దృష్టిలో పెట్టుకుని దూకుడుగా ప్రవర్తించ కుండా టపాకాయలు ఎంచుకోవడం, కాల్చడం అవసరం. ఆడంబరాలకు, పోటీలకు పోయి ఎక్కువ డబ్బులు టపాకాయాలకు ఖర్చుపెట్టకుండా, నిరాడంబరంగా జరుపుకుంటేనే మంచిదని గమనించాలి. ముఖ్యంగా పిల్లలకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. టపాకాయలు కాల్చుతూ ఆనందంతో ఉరకలేస్తుంటారు. ఈ ఆనందం విషాదాన్ని మిగల్చకూడదు. అందుకే పిల్లలను కనిపెడుతూ ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే!

- టపాసులు కాల్చేవేళ కాటన్ వస్త్రాలు, ఎక్కువ వదులుగా లేని దుస్తులు మాత్రమే ధరించాలి. ఒక వేళ నిప్పురవ్వలు పడినా మంటలు త్వరగా వ్యాపించకుండా ఉంటుంది.
- బాణాసంచా కాల్చే ప్రదేశం నుంచి పసి పిల్లలను, వృద్దులను, శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారిని దూరంగా ఉంచాలి.
- పెద్దపెద్ద శబ్దాల వల్ల గుండె అదురుతుంది. గుండె వ్యాదులు ఉన్న వారు ఇటువంటి శబ్దాలకు దూరంగా ఉండాలి.
- బాణసంచా కాల్చేటప్పుడు చెప్పులు లేదా షూస్ తప్పక వేసుకోవాలి.
- పిల్లల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఒంటరిగా బాణసంచా కాల్చేందుకు అనుమతించకూడదు. పిల్లల వద్ద పెద్దలు కచ్చితంగా ఉండాలి.
- చిచ్చుబుడ్లు, బాంబులు, మతాబులు, టపాసులు.. వగైరా వెలిగి పేలకుండా ఆరిపోయిన వాటి జోలికి పొరపాటున కూడా వెళ్లకూడదు.
- కాలిన టపాసులు, ఇనుప ఊచలు.. మొదలైన వాటిని ఎప్పటికప్పుడు పక్కన పడేయాలి. 
- ఆరుబయట ఖాళీ ప్రదేశాల్లోనే టపాసులు కాల్చాలి. ఇల్లు, అపార్ట్‌మెంట్లలో, నలుగురు తిరిగే వీధుల్లో బాణాసంచా కాల్చరాదు.
- గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్, ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్ ల వద్ద టపాసులు ఉంచరాదు.
- ఎక్కువ మొత్తంలో వెలుగులు విరజిమ్మి కంటికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూలింగ్‌ గ్లాసులు పెట్టుకోవడం ఉత్తమం.
- క్రాకర్స్ శబ్దాలతో చెవులు గిళ్ళుమనకుండా పిల్లలు, పెద్దలు ఎవరైనా చెవులలో దూది పెట్టుకోవడం మర్చిపోకూడదు. దీని వల్ల కర్ణభేరికి హాని జరగకుండా ఉంటుంది.
- చిన్నచిన్న ప్రమాదాలను తప్పిచ్చడానికి ఇసుక, నీరు అందుబాటులో విధిగా ఉంచుకోవాలి.
  అలాగే బర్నాల్ లాంటి ప్రధమచికిత్స మందులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
- టపాసుల తయారీలో వినియోగించే వివిధ రకాల రసాయన పదార్థాల కారణంగా ఆరోగ్యం దెబ్బతినకుండా వాటినుంచి జనించే పొగకు దూరంగా ఉండాలి.
  అలాగే చేతులు శుభ్రపరచుకుని మాత్రమే ఆహారం తీసుకోవాలి. కళ్లకు కూడా ఈ రసాయనాలు తగలకుండా జాగ్రత్తపడాలి.
- ఈ ఆనంద సమయాన ఏమరుపాటుతో ప్రమాదాలను కొనితెచ్చుకోకుండా ఉండడమే కాక, ఇతరులకు, పక్షులకు, జంతువులకు కూడా ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాలి.
- శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం వగైరాలు తలెత్తకుండా పర్యావరణ అనుకూలమైన దీపావళిని జరుపుకోవాలి.


 

శరన్నవరాత్రులలో బొమ్మలకొలువు | Bommala Koluvu | Golu Dolls

దసరా పండుగ వచ్చింది - సరదాలెన్నో తెచ్చింది.. ఈ ఆనందం, ఉత్సాహాల మధ్య దసరా 'బొమ్మల కొలువు' ఆడపిల్ల ఉన్న ప్రతీ ఇంటా కొలువు తీరింది. దసరా నవరాత్రులలో పది రోజుల పాటు బతుకమ్మ ఆటపాటలకు తోడు బొమ్మలకొలువు పండగ జరుపుకుంటారు. ప్రతి రోజూ సాయంత్రము పేరంటానికి ముత్తైదువులను, పిల్లలను పిలిచి, అందరికీ తాంబూలము, దక్షిణ ఇవ్వడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం.
బొమ్మల కొలువు ప్రారంభించిన సంవత్సరం ఒక వరుస బొమ్మలతో మొదలై ప్రతీ సారి ఒకటి చొప్పున తొమ్మిది మెట్ల వరకు పెంచుతూ వెళతారు. ప్రతీ సంవత్సరము తప్పనిసరిగా ఓ క్రొత్త బొమ్మ కొనడం సంప్రదాయం. అలాగే వచ్చిన వారు కూడా ఒక కొత్త బొమ్మను బహుకరిస్తారు. బొమ్మల కొలువులో ప్లాస్టిక్ బొమ్మలు, బార్బీలు.. వంటివి కాకుండా మట్టి బొమ్మలు, కొయ్య బొమ్మలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి.

సంస్కృతి సంప్రదాయాలు, నీతి కథలు, పురాణ గాథలు, ఇతిహాసాలు పిల్లలకు బోధపడేలా బొమ్మల కొలువును తీర్చిదిద్దుకోవాలి. దేవుని బొమ్మల్లో వినాయకుడు, సీతారాములు, రాదాకృష్ణులు, లక్ష్మిదేవి, సరస్వతిదేవి, పార్వతిదేవి.. పెట్టుకోవచ్చు. ఇక పెళ్ళితంతు బొమ్మలు, హాస్యబొమ్మలు, బామ్మ-తాత, గోపికలు, వివిధ జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, పండ్లు, చెట్ల బొమ్మలు,  ప్రయాణ సాధనాలు వంటివి కొలువులో ప్రత్యేక ఆకర్శనగా నిలుస్తాయి.


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. | Bathukamma - Telangana Floral Festival


మారుతున్న నాగరికతలను పుణికిపుచ్చుకుంటున్నా, అనాదిగా వారసత్వ సంస్కృతిగా వస్తున్న సంప్రదాయాల్ని, పండగల్ని రెట్టించిన ఉత్సాహంతో జరుపుకోవడం ముదావహం. తెలంగాణ జిల్లాల్లోని ప్రతి ఆడపడచు ఎదురు చూసే 'బతుకమ్మ' పండుగ, దసరా పండుగలో భాగంగా నిర్హహించడం విశేషం.

ఏటా ఆశ్వీజ శుద్ధ పాఢ్యమి మొదలుకుని మహానవమి వరకు బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. పండుగ ప్రాశస్త్యత, పుట్టుపూర్వోత్తరాలపై రకరకాల కథలు ప్రచారంలో ఉన్నా "శంకరుని భార్య గౌరీదేవి మహిషాసురిడితో పోరాడి అలసిపోయి ఆశ్వీజ శుద్ధ పాఢ్యమి నాడు మూర్చపోయిందనీ, ఆ మూర్చ నుండి ఆమె తేరుకోవడానికి గ్రామీణులు వివిధ రీతుల్లో గౌరీదేవిని స్తుతిస్తూ పాటలు పాడారనీ, అదే బతుకమ్మ పండుగగా మారిందనే" కథ ప్రముఖంగా వినవస్తుంది. సంధ్యాసమయాన ఆడిపాడే 'బతుకమ్మ'కు పగలంతా హడావిడే. ఈ పండుగ ప్రకృతిరమణీయకతకు విడదీయరాని సంబంధం ఉందనడానికి నిదర్శనంగా బతుకమ్మను అనేక రకాలైన పూలు, ఆకులతో ఆకర్శణీయంగా అలంకరిస్తారు. తంగేడు, గుమ్మడి, చామంతి, గడ్డిపూలు, గునుక - పలు రకాల పూలను సేకరించి సిబ్బి(పల్లెం)లలో గుమ్మడి ఆకులను పరచి వాటిపై గోపురాకారంలో పేర్చుతారు. పేర్చిన పూల మీద 'గౌరమ్మ'(పసుపు ముద్ద)ను పెడతారు.  ఈ బతుకమ్మను తయారు చేసి, వారిలో ఉన్న సృజనాత్మకతను చాటిచెబుతారు.

ఈ నెల 9న ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగ మహానవమి (అక్టోబర్ 17) రోజున ముగుస్తుంది. బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమైన ఆరో రోజును 'అర్రెం' పేరుతో సెలవు పాటించడం పరిపాటి. చివరి రోజున జరుపుకునే బతుకమ్మను 'సద్దుల బతుకమ్మ' పండుగగా పేర్కొంటారు. తొమ్మిది రోజుల ఉత్సవాలు ఒకెత్తుకాగా, చివరిరోజున ఉత్సవం ఒకెత్తు. స్త్రీలంతా ఒకరినొకరు పోటీపడి రంగురంగుల పూలతో పేర్చిన నిండైన నిలువెత్తు 'బతుకమ్మల్ని' చేర్చి వాటికి 'జానపదుల్ని' కూర్చి కలిసికట్టుగా పాడతూ గౌరమ్మను పూజించడం శోభాయమానంగా ఉంటుంది. చివరి రోజున అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, రకరకాల సద్దులను నైవేద్యాలుగా సమర్పించి బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. అంతటితో తొమ్మది రోజుల ఆటవిడుపుకి తెరపడుతుంది. అదే ఉత్సాహంతో మరో ఏడాది బతుకు సమరానికి సన్నద్ధులవుతారు.


ధ్యానం | Meditation - it's good for you


ప్ర‌తి ఒక్కరికి ఒత్తిడి అనేది ఈ రోజుల్లో స‌ర్వ‌సాధార‌ణం అయిపోయింది. తద్వారా మాన‌సిక ప్ర‌శాంత‌త‌కు దూర‌మ‌వుతున్నాం. అనారోగ్యాల పాలవుతున్నాం. అయితే ఎంత ఒత్త‌డినైనా జయించడానికి ధ్యానం స‌రైన మార్గం అంటున్నారు వైద్యనిపుణులు.
రోజూ ప్రశాంత వాతావరణంలో చేసే ధ్యానంతో ఒత్తిడి, ఆందోళన వంటివి మాయమయి మానసిక ప్రశాంతత నెలకొంటుంది. మెదడు శక్తివంతమై ఆలోచనలలో, చేసే పనిలో చురుకుదనం పెరుగుతుంది. శారీరక, మానసిక భావోద్వేగాల సమతుల్యత ఏర్పడుతుంది. చెడు ఆలోచనలను కట్టిపెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టడమే ధ్యానం. ఉదయం వేళ చేసే ధ్యానం రోజంతా ఉల్లాసంగా ఉండేలా చూస్తే, రాత్రివేళ ధ్యానం కమ్మని నిద్రకు దోహదం చేస్తుంది.


మరమరాలు | Is Puffed Rice good for Health?

మరమరాలు తినడం చాలామంది ఇష్టపడతారు. వాటితో ఆకలితీరదని వారిస్తారు కొందరు. వరి అన్నంతో సరిసమానంగా అన్నీ పోషకవిలువలు బొరుగుల్లోనూ ఉన్నాయి. చక్కని బ్రేక్ ఫాస్ట్ ఫుడ్ మాత్రమేకాకుండా స్నాక్స్ లోనూ మరమరాలు వాడడం పిల్లలకు బాగా నచ్చుతుంది.  వీటిల్లో విటమిన్‌ – డి, విటమిన్‌ – బి లతో పాటు క్యాల్షియం, ఐరన్‌ శాతం కూడా ఎక్కువే. పిల్లల ఎదుగుదలలో మరమరాలు ఉపయోగపడతాయి. మెదడుకు చురుకుదనాన్ని కలిగిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి, ఆహారం మితంగా తీసుకోవాలనుకునే డయాబెటీస్ వ్యాధిగ్రస్థులకు మరమరాలు మంచివి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. మరమరాల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. అందుకని కాసిని తిన్నా కావలసిన శక్తి సమకూరుతుంది. పీచు పదార్థాలు పుష్కలంగా ఉండడంతో మరమరాలతో తయారయిన ఆహారపదార్థాలు చాలా తేలిగ్గా అరగడంతో పాటు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. మరమరాల్లోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్‌ వల్ల రోగనిరోధక శక్తి ఇనుమడింపచేస్తుంది.


Tips & Tricks in Telugu | VantintiChitkalu


- అజీర్తితో బాధ పడుతున్నారా? రెండు మూడు చిన్న అల్లం ముక్కలను ఉప్పుతో కలిపి తీసుకోండి.

- జింజర్ బట్టర్ మిల్క్.. ఒక గ్లాస్ మజ్జిగలో రెండు స్పూన్ ల అల్లం రసం కలిపి తీసుకుంటే వెంటనే గ్యాస్ సమస్య తీరుతుంది.

- కాచిన గ్లాసు పాలలో చిటికెడు పసుపు  కలిపి రాత్రివేళలో సేవిస్తే జలుబు, దగ్గు, ఆయాసం గొంతులో కళ్ళె నివారణ అవడం ఖాయం.

- ప్రతీరోజు నీళ్లలో మూడు, నాలుగు తులసి ఆకులు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.



హెయిర్‌ గ్రోత్‌ కి.. | Amazing Benefits of Sesame Oil for Hair


- డ్రైగా, డల్‌గా ఉన్న హెయిర్‌ కి నువ్వుల నూనె జీవంపోసి మంచి మెరుపు ఇస్తుంది.

- నువ్వుల నూనెతో జుట్టుకి కావల్సిన పోషకాలు అందుతాయి. ఆరోగ్యకరమైన జుట్టు సొంతమవుతుంది.

- నువ్వుల నూనె కాలుష్యంనుండే కాకుండా అల్ట్రా వైలెట్‌ కిరణాల ప్రభావం జుట్టు పై పడకుండా రక్షిస్తుంది.

- జుట్టు ఆరోగ్యాన్ని పాడుచేసే చుండ్రు నివారించడానికి నువ్వుల నూనె ఉత్తమం అంటున్నారు బ్యూటీషియన్స్.

- గోరువెచ్చని నువ్వుల నూనె తలకు పట్టించడం వల్ల టెన్షన్‌, మానసిక ఒత్తిడి నుంచి రిలీఫ్ దొరకడమేకాక జుట్టు పెరుగుదలలో తలెత్తే సమస్యలు పరిష్కారం అవుతాయి.


నిమ్మపండులాంటి ఛాయ.. | Health Benefits of Lemon Water


- తరచూ జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం, పలు ఇన్‌ఫెక్షన్లు బాధిస్తుంటే నిమ్మరసం చక్కని పరిష్కారం. ఇందులో ఉండే విటమిన్‌ - సి రోగనిరోధక శక్తిని ఇనుమడింపచేస్తుంది.

- రకరకాల మానసిక ఒత్తిళ్లకు నిమ్మకాయ నీళ్ళు లేదా లెమన్ - టీ తీసుకుంటే సరి.

- బరువు తగ్గాలనుకునే వారికి నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది. భోజనానికి ముందు గ్లాసు నిమ్మరసం తాగాలి. పొట్ట నిండి, ఆహారం తక్కువగా తీసుకుంటాం. పైగా జీవక్రియ రేటు అదుపులో ఉంటుంది.

- యాంటీఆక్సిడెంట్ల కారణంగా నిమ్మరసం ఆరోగ్యానికే కాదు, సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. మొటిమల్ని దూరం చేయడమేకాక నిమ్మపండులాంటి చర్మం సొంతం అవుతుంది.

- యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా నిమ్మరసం పనిచేస్తుంది. వృద్ధాప్య ఛాయలు దరిచేరవు.


బఠానీల్లో పోషకాలు అధికం | Green Peas are Healthy and Nutritious


- ప‌చ్చి బ‌ఠానీలు, నానపెట్టిన పచ్చ బ‌ఠానీలు అనేక ర‌కాల వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచిని చేకూరుస్తాయి. శ‌రీరానికి చ‌క్క‌ని పోష‌ణ అందిస్తాయి. రోగనిరోధకశక్తిని ఇనుమడింపచేస్తాయి.
- పచ్చి బఠానీల్లో విటమిన్ - ఎ, విటమిన్ - బి1, బి2, విటమిన్ - సి.. వీటితోపాటు ఐరన్, కాల్షియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా లభిస్తాయి.
- డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి పచ్చి బఠాణీలు చక్కని ఆహారం అని చెప్పాలి. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో రక్తంలో గ్లూకోజ్ త్వరగా చేరకుండా ఉంటుంది.
- బరువు తగ్గాలనుకునే వారు వీటితో తయారయిన ఆహారపదార్థాలు తీసుకుంటే ఆకలి త్వరగా వేయదు. శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ను తగ్గించడంతో పాటు మంచి కొలెస్టరాల్ స్థాయిలను మెరుగుపరుస్తాయి.
- బఠానీలతో విటమిన్ - కె పుష్కలంగా అందుతుంది. తద్వారా రక్తనాళాలు సంరక్షించబడుతాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.
- బ‌ఠానీల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి.
- మొలకెత్తిన బఠానీలు మంచి బలవర్థకం అని గుర్తించాలి. వీటిల్లో కార్బోహైడ్రేట్స్, పీచు పదార్థాలు, ప్రోటీన్స్ మరింత అధికంగా ఉంటాయి.



డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పుట్టినరోజు | Teachers Day

గొప్ప వ్యక్తులు ఆశయాల కోసం జీవిస్తే.. 
దుర్బరులు ఆశల కోసం జీవిస్తారు 
- సర్వేపల్లి  రాధాకృష్ణన్

ఒక సామాన్య ఉపాధ్యాయుడు రాష్ట్రపతి స్థాయికి ఎదిగి, ఆ వృత్తికే వన్నె తెచ్చారు. అలా ఉపాధ్యాయవృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రపతిగా ఉన్న రోజుల్లోనే ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5న శిష్యులు, అభిమానులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పగా, దానికి బదులు ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలని కోరారట. ఆరోజు నుంచే డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.


పోషకాహార వారోత్సవాలు | National Nutrition Week | 1 - 7 September


రోజూ సమతుల్య ఆహారం అందితేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. పోషకాహారం లోపిస్తే జీవన ప్రమాణాలు క్షీణిస్తాయి. అందుకే పోషకాహారంపై సరియైన అవగాహన అవసరం. పోషకాహార లోపం తీవ్రతను గుర్తించి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేది నుంచి 7 వరకు భారత ప్రభుత్వం పోషకాహార వారోత్సవాలను నిర్వహిస్తోంది.

పోషకాహారంపై విస్తృతమైన ప్రచారం కలిగించడమేకాక పోషక విలువలు ఉన్న ఆహారం ముఖ్యంగా గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు అందేలా పలు కార్యక్రమాలను ఆరోగ్యశాఖ నిర్వహిస్తోంది. 


ప్రపంచ లైంగిక ఆరోగ్య దినం | World Sexual Health Day


సెక్స్ పట్ల చాలా మందికి అవగాహన లోపం,  పలు అపోహలు.. లైంగిక ఆరోగ్యానికి అవరోధాలుగా నిలుస్తున్నాయని  వైద్యులు అంటున్నారు.  సెక్స్‌కు సంబంధించి ఎటువంటి సందేహాన్నైనా వెంటనే నిపుణులను సంప్రదించి ఆనందకరమైన, ఆరోగ్యకరమైన సెక్స్‌ జీవితం గడపడం వల్ల వాళ్ల ఆరోగ్యమే కాక వారి ఉత్పాదకత కూడా పెరుగుతుంది. సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది.
 
శృంగారంతో ఇద్దరిలోనూ ఆయుఃప్రమాణం మెరుగవుతుంది. చక్కని వ్యాయామం చేకూరి అధిక బరువు, గుండెపోటు, పక్షవాతం మొదలైన ముప్పుల నుండి దూరంగా ఉండవచ్చు. ఎలాంటి డిప్రెషన్‌ కి లోనవ్వకుండా చక్కటి నిద్ర సొంతమవుతుంది. ధృడమైన శరీరసౌష్టవం, నిగారించే చర్మం.. లైంగిక ఆరోగ్యం తో చేకూరుతాయని గమనించాలి.

ఇక ప్రతీ యేటా సెప్టెంబరు 4వ తేదిన, ప్రపంచ లైంగిక ఆరోగ్య దినోత్సవం గా 2010 నుండి World Association for Sexual Health (WAS) నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లైంగిక ఆరోగ్యానికి సంబంధించి ప్రజల్లో అపోహలు తొలగించి, అవగాహన కలిగించడం ముఖ్యోద్దేశంగా అనేక కార్యక్రమాలు తలపెట్టింది.


శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో.. | VantintiChitkalu


జయజనార్ధనా కృష్ణ రాధికాపతే
జనవిమోచనా కృష్ణ  జన్మమోచనా

జయజనార్ధనా కృష్ణ రాధికాపతే
జనవిమోచనా కృష్ణ  జన్మమోచనా 
గరుడవాహనా కృష్ణ  గోపికాపతే
నయనమోహనా కృష్ణ నీరజేక్షణా

జయజనార్ధనా కృష్ణ రాధికాపతే
జనవిమోచనా కృష్ణ  జన్మమోచనా 

సుజన బాంధవా కృష్ణ  సుందరాక్రుతే
మదనకోమలా  కృష్ణ మాధవాహరే
వసుమతిపతే  కృష్ణ వాసవానుజా
వరగుణాకారా  కృష్ణ  వైష్ణవాకృతే
సురుచిరననా  కృష్ణ శౌర్యవారిదే
మురహరావిభో  కృష్ణ  ముక్తిదాయక
విమలపాలకా  కృష్ణ  వల్లభీపతే
కమలలోచనా  కృష్ణ  కామ్యదాయక

జయజనార్ధనా కృష్ణ రాధికాపతే
జనవిమోచనా కృష్ణ  జన్మమోచనా 

విమలగాత్రనే  కృష్ణ  భక్తవత్సలా
చరణపల్లవం  కృష్ణ  కరుణకోమలం
కువలైక్షణా కృష్ణ  కొమలాక్రుతే 
తవపదాంబుజం కృష్ణ  శరణమాశ్రయే 
భువననాయకా కృష్ణ  పావనాక్రుతే
గుణగాణోజ్వాల కృష్ణ  నలినలోచనా
ప్రణయవారిదే  కృష్ణ  గుణగణాకర
దామసోదరా కృష్ణ  దీనవత్సల
 

జయజనార్ధనా కృష్ణ రాధికాపతే
జనవిమోచనా కృష్ణ  జన్మమోచనా
 
కామసుందరా కృష్ణ  పాహిశర్వాదా 
నరకనాషణా కృష్ణ  నరసహాయకా
దేవకిసుతా  కృష్ణ  కరున్యంభుదే
కంసనాషణా  కృష్ణ  ద్వారాకస్తితా
పవనత్మకా కృష్ణ  దేహిమంగళం
త్వత్పదంబుజం  కృష్ణ  శ్యామకోమలం
భక్తవత్సలా  కృష్ణ  కామ్యదాయకా
పాలిశెన్నను  కృష్ణ  శ్రీహరినమో

జయజనార్ధనా కృష్ణ రాధికాపతే
జనవిమోచనా కృష్ణ  జన్మమోచనా 

భక్తదాసనా కృష్ణ  హరసునీసదా
కాదునింతినా కృష్ణ  సలహేయవిభో
గరుడవాహనా  కృష్ణ  గోపికాపతే
నయనమోహనా  కృష్ణ  నీరజేక్షణా
జయజనార్ధనా కృష్ణ రాధికాపతే
జనవిమోచనా కృష్ణ  జన్మమోచనా
  //2//


మాతృభాషా దినోత్సవం.. | August 29 : Telugu Language Day


మాతృభాషపై మమకారం పెంచుకున్న ఎందరో మహనీయులు మన తెలుగును కాపాడేందుకు అహర్నిశలూ శ్రమించారు. ఆంగ్లేయుల పాలనలో మన విద్యార్థులకు కొత్తభాష అవసరమైంది. శతాబ్దాలుగా పుస్తకాల్లో వాడే కట్టుదిట్టమైన భాషలో రాయాలని కొందరన్నారు. వాళ్లకు చిన్నయసూరి నాయకుడయ్యారు. ప్రజల భాషలో రాయడం ప్రపంచం అంతటా ఉన్న పద్ధతి. కాబట్టి మాట్లాడే భాషలోనే రాయాలని కొందరన్నారు. వాళ్లకు గిడుగు రామ్మూర్తి పంతులు నాయకుడయ్యారు. గిడుగు రామ్మూర్తి పంతులు కారణంగా 1906 నుంచి వాడుక భాషలో రాయాలన్నది ఒక పెద్ద ఉద్యమమైంది. వాడుక భాష ప్రజల్లో బలంగా నాటుకుంటూ నూరేళ్లలో అత్యున్నతస్థాయికి చేరిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

గతంలో మనం మాట్లాడే తెలుగుభాషలోనే పరిపాలన సాగాలని, అందుకు ప్రత్యేక రాష్ట్రం అవసరమని 1913లో ఆంధ్ర మహాసభ తీర్మానించింది. ఉద్యమం ప్రారంభమైన 40 ఏళ్ల అనంతరం పొట్టి శ్రీరాములు బలిదానంతో 1953లో ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. వావిలాల గోపాలకృష్ణయ్య తెలుగుభాషాభివృద్ధికి చేసిన పోరాటం తెలుగు ప్రజలు మరువలేనిది. దాని ఫలితంగా తెలుగును అధికార భాషగా గుర్తిస్తూ 1964లో చట్టం చేశారు. ఆగస్టు 29న - 'శిష్ట వ్యవహారిక' రూప శిల్పి గిడుగు రామమూర్తి జయంతిని తెలుగు -మాతృభాషా దినోత్సవంగా పాటిస్తున్నాం.

ఏ జాతైనా తమ భాష ప్రతిష్టను గుర్తించినప్పుడే ఆ భాష అభివృద్ధి చెంది, మనగలుగు తుంది. 2020 నాటికి చాలా భాషలు కనుమరుగవుతాయని యునెస్కో హెచ్చరిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడే 6000 భాషలలో 43% భాషలు, అంతరించిపోయే భాషల జాబితాలో చేరాయంటోంది. ఇది ఇలాగే కొనసాగితే మున్ముందు మిగిలే భాషలు 600 అని ఒక అంచనా… ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాతృభాష కోసం ఉద్యమం ఉదృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


నోటిపూత.. | Home Remedies to Cure Mouth Ulcers


తరచూ నోటిపూతకు కారణం మానసిక ఆందోళన, పోషకాహార లోపం, అజీర్ణం కావచ్చు. రెండు పూటలా బ్రష్ చేసుకోక ఇన్ఫెక్షన్లు సోకడం వల్ల కూడా కావచ్చు. అసలు కారణాన్ని గ్రహించి చికిత్స తీసుకోవడం తప్పనిసరి. తాత్కాలికంగా నోటి పూత నుంచి ఉపశమనం పొందడానికి.. 

- గోరు వెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి ఆ నీటితో నోటిని రోజూ పుక్కిలించాలి.
- నిమ్మ, ఆరెంజ్.. వగైరా సిట్రస్ ఫ్రూట్స్ లో పుష్కలంగా లభించే విటమిన్ - సి, యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి నోటి పూతను నివారిస్తుంది.
- కొబ్బరినూనెలో సహజ సిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉన్నాయి. కొబ్బరినూనెను పుండ్లపై అప్లై చేయడం ద్వారా వెంటనే నోటి పూత నుంచి విముక్తి కలుగుతుంది.


వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలతో.. | శ్రావణ శుక్రవారం | Shree VaraLakshmi Namastubhyam

పార్వతీదేవికి పరమేశ్వరుడు ఉపదేశించిన వ్రతం వరలక్ష్మీ వ్రతం. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడం ముదావహం. సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి. దయాగుణం, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిదేవిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. అష్టలక్ష్మీ ఆరాధన ఎంతటి ఫలాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మీ వత్రం అంతటి ఫలితాన్ని ఇస్తుందని ధార్మికగ్రంథాలు వెళ్లడిస్తున్నాయి.

వరలక్ష్మీ వ్రతం వెనుక వైద్య రహస్యాలు, సామాజిక ప్రయోజనం కూడా దాగి ఉన్నాయి. శ్రావణమాసం అనగానే పడతి అరచేతుల్లో గోరింటాకు, కాళ్లకు పారాణి పుయ్యాల్సిందే. వీటి ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. శుభకార్యాల్లో వాడే పసుపు, గంధం, కుంకుమ.. వగైరా ఆరోగ్య ప్రదాయనిలు. పాదాలకు పసుపు రాసుకుంటే పలు ఇన్ఫెక్షన్లు దరిచేరవు. ముఖానికి పసుపు, గంధం రాయడం వల్ల మొటిమలు, పొక్కులు మాయమవడమేకాక ఛాయ పెరుగుతుంది. ఇక నానపెట్టిన శనగలు వాయినంగా ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితి. శెనగల్లో పోషక విలువలు పుష్కలంగా లభిస్తాయి. తాంబూలం వేసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇచ్చుకో వాయినం - పుచ్చుకో వాయినం అంటూ నలుగురిని కలుపుకుని పోవడం నిజంగా ఆధునిక కాలంలో సత్సంబంధాలు పెరిగేందుకు దోహదపడుతుంది.



పెద్దల ఆహారం.. | Diet for Older People


వయసు పెరుగుతుంటే తీసుకునే ఆహారంలో తగిన మార్పులు అవసరమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వయసుపైబడినాక కూడా అవే ఆహారపు అలవాట్లు ఉంటే కాలక్రమేణా శరీర బరువు పెరుగుదలకు కారణమవుతుంది. ఊబకాయంతో పాటూ పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అలాగని పెద్దవాళ్లు పూర్తిగా ఆహారం తగ్గిచ్చేస్తే నీరసించిపోవడం, రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. వృద్ధులు తీసుకునే ఆహారంపై అవగాహనతో సరియైన పోషక విలువలతో సరిపడా శక్తిని ఇచ్చేవిగా చూసుకోవాలి. అవసరమైన విటమిన్లు, ఖనిజలవణాలు, ఫైబర్, ప్రొటీన్లు లభించే ఆహారపదార్థాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అనారోగ్యాల పాలుచేసే కొవ్వు, చక్కెర పదార్థాలను తగ్గించాలి. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, చేయగలిగినంత వ్యాయామం వృద్ధాప్యపు ఛాయలను, అనారోగ్యాలను తగ్గిస్తాయని గుర్తించాలి.

- తృణధాన్యాలు, సీజనల్ ఫ్రూట్స్, తాజా కూరగాయలు, పాలు, పాల పదార్థాలు - అన్ని రకాల పోషకాలను సమకూరుస్తాయి. ఇవి రోజూ ఆహారంలో చేరితేనే ఆరోగ్యం. ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు తీసుకోవటం, తక్కువ ఉప్పు వాడడం తప్పనిసరి. వయసు పెరిగే కొద్దీ జీర్ణక్రియ పనితనం తగ్గుముఖం సట్టడం సహజం. కాని పోషకాహారంతో పాటు, తగినంత వ్యాయామం ఈ జీవక్రియలు సమతుల స్థాయిలో ఉండేందుకు దోహదం చేస్తుంది.

- సహజంగానే దాహం వేయకపోవడం, మంచినీరు తీసుకుంటే తరచూ మూత్రవిసర్జన తప్పదని అభిప్రాయం వల్ల చాలా మంది మంచినీటిని తగినంత తాగకపోవడంతో డిహైడ్రేషన్ కు గురవుతారు. ఈ పరిస్థితి దీర్ఘకాలికంగా కొనసాగితే కణాలు దెబ్బతింటాయి. అలసట ఆవహిస్తుంది. శరీరభాగాల్లో నొప్పులు మొదలవుతాయి. ఆలోచన శక్తి క్రమంగా క్షీణిస్తుంది. ఏ మాత్రం వేడిని తట్టుకోలేరు. మలబద్ధకం బాధిస్తుంది. ఈ దుష్ప్రభావాలకు గురికాకుండా మంచినీటిని, ద్రవపదార్థాలను అధికంగానే తీసుకోవాలి.

- చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు.. వీటిల్లో మెండుగా లభించే ఫైబర్ జీర్ణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి, మలబద్ధకం తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, రక్తపోటుని నియంత్రించి తద్వారా ఆరోగ్యకరమైన హృదయానికి దారితీస్తుంది. ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా డయాబెటిస్ అవకాశాలు తగ్గిస్తుంది.

- మజ్జిగ, పెరుగు.. ఇవి ఆహారానికి ప్రత్యమ్నాయంగానే కాక భుజించిన ఆహారం జీర్ణం అవడానికి కూడా ఉపయోగపడ్తాయి. చక్కని కాల్షియం వంటపట్టి పెద్ద వయసులోను ఎముకలు దృఢత్వం కోల్పోకుండా ఉంటాయి. విటమిన్ - డి కి కూడా యోగర్ట్ మంచి మూలం అని చెప్పాలి. పెరుగుతో పాటు ఏదైనా పండు జతచేసి తీసుకుంటే ప్రోటీన్ లు మరింత ఎక్కువగా అందుతాయి.

- టమోటాల్లో ఉండే లైకోపీన్ పలు రాకాల క్యాన్సర్ కారకాలను నిర్మూలిస్తుంది. పచ్చిటమోటాలో కంటే ఉడకపెట్టిన వాటితో లైకోపీన్ అధికంగా అందుతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. క్యారట్, బొప్పాయి, పుచ్చకాయల్లో కూడా లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది.

- బ్రోకోలీలో అన్ని రకాల విటమిన్లు, ఆంటీఆక్సిడెంట్స్ నిండి ఉండటం వలన ఇది ఆరోగ్యకరం. బ్రోకోలీలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది.

- వేరుశెనగ, బాదం, జీడిపప్పు, వాల్నట్.. వగైరా నట్స్ లో ఆరోగ్యానికి అవసరం అయ్యే ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మంచి రకమైన కొవ్వు, చక్కని ఫైబర్ తో పాటు పూర్తిస్థాయిలో ప్రోటీన్లు అందుతాయి. 


 

శనగలతో.. | Health and Nutrition Benefits of Chickpeas


శనగలు.. ఇవి ముఖ్యంగా స్త్రీలకు, పిల్లలకు పోషకాల గనులని చెప్పాలి. ఇవి నానపెట్టి, ఉడికించి, వేయించి, స్ప్రౌట్స్.. లానే కాకుండా వంటల్లో ఎంతో రుచికరంగా ఉంటాయి. శనగలతో తయారయిన స్నాక్స్ పిల్లలతో పాటు అందరు ఇష్టంగా తింటారు. శనగకాయలు అయితే వలచుకుని పచ్చి శనగలు తిన్నా కూడా రుచిగా ఉంటాయి. ప్రతిరోజూ వీటిని ఆహారంలో చేర్చుకుంటే మధుమేహం, రక్తహీనత, రక్తపోటు, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు దరి చేరవని నిపుణులు సూచిస్తున్నారు. శనగల్లో యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉండ‌డం వ‌ల్ల రోగ నిరోధక వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. వయసు పెరుగుతున్న వారికి, బరువు తగ్గాలనుకున్నవారికి  కూడా శనగలు సరైన ఆహారం అని చెప్పాలి. శనగల్లో ఉండే ఫోలేట్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వీటిలోని పోషకాలు గుండెకు బలాన్ని చేకూర్చుతాయి.

- శనగల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఎర్ర రక్తకణాలు వృద్ధి చెందడమెకాక రక్తహీనత దూరమవుతుంది.
- పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం వంటి ఎన్నో ర‌కాల మిన‌ర‌ల్స్ శ‌న‌గల్లో సమృద్ధిగా లభించడంతో గుండె సంబంధిత స‌మ‌స్య‌లు తలెత్తవు. 
- శ‌న‌గ‌ల్లో పీచు ప‌దార్థం ఎక్కువ‌గా ఉంటుంది. కారణంగా జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. మలబద్ధకం, అజీర్తి వంటివి బాధించవు.
- రక్తంలోని గ్లూకోజ్ స్థాయిల్ని అదుపు చేసి మధుమేహం ఉన్నవారికి శనగలు ఎంతో మేలు చేస్తాయి.
- శ‌న‌గ‌లతో మనకు కావాల్సిన కాల్షియం ల‌భిస్తుంది. దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి. 


ఇంపుగా.. | Use Corners Smartly


సొంతింటి కల నెరవేరినా.. ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడం ఒక కళ. ఇంటి అందం రెట్టింపు కావాలంటే చక్కని ఫర్నీచర్ అవసరం. మనం కొనే ఫర్నీచర్ ఇంటి అవసరాలు తీర్చడమేకాక, ఇట్టే ఆకర్శించాలంటే వాటి కొలతలు, రంగులు, అవి తయారయ్యే మెటీరియల్.. వగైరా విషయాలపై దృష్టిపెట్టాలి. ఇంట్లో ఏ గదినైనా పూర్తిగా వినియోగించుకోవాలంటే మూలలను సైతం నిర్లక్ష్యం చేయకూడదు. గది మూలల్లో ఫర్నీచర్ ప్లాన్ చేసుకుంటే సౌకర్యవంతంగానే కాక స్థలం కలిసివస్తుంది. ముఖ్యంగా వంటగదిలో ఒక మూలన సింక్ నిర్మించుకుంటే సౌలభ్యంగా ఉంటుంది. అలాగే రీడింగ్ రూంలో కార్నర్ లో బుక్ షెల్ష్ బాగుంటుంది. ల్యాంప్స్ మూలల్లో ఉండడం వల్ల బెడ్ రూంలో కళ్ళకు కాంతి కంఫర్ట్ గా ఉంటుంది. లివింగ్ రూం కార్నర్స్ లో స్పీకర్ లను, షోకేస్ లను అమర్చుకోవచ్చు. అనేక అలంకరణ ఉత్పత్తులను నాలుగు మూలల్లోనూ అమర్చుకోవచ్చు. బాత్ రూంలో మూలల్లో అమర్చే కార్నర్ వాల్ మౌంట్ షెల్ఫ్ ల వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. సో.. ఆలోచిస్తుంటే కార్నర్ ఫర్నీచర్ చేయించుకోవడమో.. రెడీమేడ్ వి కొనడమో అవసరమే అనిపిస్తోంది. కదూ..

సొంతింటి కల నెరవేరినా.. ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడం ఒక కళ. ఇంటి అందం రెట్టింపు కావాలంటే చక్కని ఫర్నీచర్ అవసరం. మనం కొనే ఫర్నీచర్ ఇంటి అవసరాలు తీర్చడమేకాక, ఇట్టే ఆకర్శించాలంటే వాటి కొలతలు, రంగులు, అవి తయారయ్యే మెటీరియల్.. వగైరా విషయాలపై దృష్టిపెట్టాలి. ఇంట్లో ఏ గదినైనా పూర్తిగా వినియోగించుకోవాలంటే మూలలను సైతం నిర్లక్ష్యం చేయకూడదు. గది మూలల్లో ఫర్నీచర్ ప్లాన్ చేసుకుంటే సౌకర్యవంతంగానే కాక స్థలం కలిసివస్తుంది. ముఖ్యంగా వంటగదిలో ఒక మూలన సింక్ నిర్మించుకుంటే సౌలభ్యంగా ఉంటుంది. అలాగే రీడింగ్ రూంలో కార్నర్ లో బుక్ షెల్ష్ బాగుంటుంది. ల్యాంప్స్ మూలల్లో ఉండడం వల్ల బెడ్ రూంలో కళ్ళకు కాంతి కంఫర్ట్ గా ఉంటుంది. లివింగ్ రూం కార్నర్స్ లో స్పీకర్ లను, షోకేస్ లను అమర్చుకోవచ్చు. అనేక అలంకరణ ఉత్పత్తులను నాలుగు మూలల్లోనూ అమర్చుకోవచ్చు. బాత్ రూంలో మూలల్లో అమర్చే కార్నర్ వాల్ మౌంట్ షెల్ఫ్ ల వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. సో.. ఆలోచిస్తుంటే కార్నర్ ఫర్నీచర్ చేయించుకోవడమో.. రెడీమేడ్ వి కొనడమో అవసరమే అనిపిస్తోంది. కదూ.. 

కర్చుతో కూడుకున్నా వుడ్, గ్లాస్ షెల్ఫ్ లు, కేస్ లు చూడడానికే కాక ఆరోగ్యానికి మంచివి. ఇక ప్లాస్టిక్, పివిసి, ఐరన్.. వగైరా అయితే ఇంటి వాతావరణంపై ప్రభావం పడుతుంది. నలుమూలలా ఇండోర్ ప్లాంట్స్ పెంచుతూ ఇంటి సొగసు ఎంతో ఆహ్లాదభరితం చేసుకోవచ్చు.


 

మీరు కత్తి.. | Choose the right Chopping Board for your Kitchen


వంటింట్లో కూరగాయలు తరగడానికి కొడవలి, కత్తిపీట స్థానే చాక్, చోపింగ్ బోర్డ్, పీలర్.. ఇలా చాలా రకాలుగా వెజిటబుల్ కట్టర్స్ ఇప్పుడు విపనిలోకి వచ్చాయి. వీటిల్లో కటింగ్ ఎడ్జ్ ఇనుము, స్టీల్ తో ఉండగా బేస్, హ్యండిల్స్ కర్ర లేదా ప్లాస్టిక్ తో తయారయినవి ఉంటున్నాయి. అవసరానికి సరైన కట్టర్ ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. నాణ్యత విషయంలో రాజీపడకూడదు. కొంతమంది కిచెన్ గట్టుపైన, డైనింగ్ టేబుల్ పైన పదునైన చాకులతో కూరలు తరుగుతారు. ఇది ఏమంత మంచి పద్ధతి కాదు. సౌకర్యవంతమైన కట్టర్ అయితేనే కూరగాయలు కోయడం సులభం. ముఖ్యంగా వెజిటబుల్స్ తరగడం మీదనే కూరల రుచి ఆధారపడి ఉంటుంది. కూరలు తరిగేటప్పుడు వాటిని శుభ్రపరచడంలో, పని పూర్తి అయ్యాక చోపింగ్ బోర్డ్ క్లీన్ చేయడంలో ఏమాత్రం అశ్రద్ద పనికిరాదు. విధిగా వెజిటబుల్ వేస్ట్ ని వెంటనే డస్ట్ బిన్ లో వేయాలి. తక్షణం ఈ పని పూర్తిచేయకపోతే బ్యాక్టీరియా ఏర్పడి పలురకాల ఇన్ఫెక్షన్ లకు దారితీయడం, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా ఉంది. లైట్ కలర్ కట్టర్స్, చోపింగ్ బోర్డ్స్ అయితే పేల్ గా, ఎల్లో కలర్లోకి మారి అందవిహీనంగా తయారవుతాయి. అందుకని చోపింగ్‌ బోర్డ్‌ అండ్‌ నైఫ్స్‌ నిత్యం శుభ్రపరచడం చాలా అవసరం.


చోపింగ్ బోర్డ్స్ పై ఏర్పడిన మరకలు, వాసనలు చిటికలో తొలగిపోవాలంటే కొన్ని చిట్కాలు అవసరం. వీటిని డటర్జెంట్లతో శుభ్రపరచడం ప్రమాదకరం అని గమనించాలి. సాధారణ నీటికంటే వేడినీటిని ఉపయోగించి వీటిని కడగడం ఉత్తమం. చింతపండు, నిమ్మరసం, వెనిగర్, ఉప్పు .. వంటి సహజసిద్ధమైన క్లీనింగ్ ఏజెంట్స్ ని వినియోగించాలి. పైగా ఇలాంటి నేచురల్ క్లెన్సర్స్ ను ఉపయోగించడం వల్ల ఎటువంటి మరకలైనా వెంటనే మటుమాయం అవుతాయి. కూరగాయలు కట్ చేసిన వెంటనే నిమ్మతొక్కతో చోపింగ్ బోర్డ్ ను రుద్ది కడగాలి. నిమ్మతొక్క మీద కాస్త ఉప్పు చిలకరించి రుద్దితే ఇంకా మంచి ఫలితం కనబడుతుంది. చింతపండు గుజ్జుకు కొద్దిగా ఉప్పు కలిపినా మంచి క్లీనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. బేకింగ్ సోడా, ఉప్పు సమపాళ్ళలో తీసుకుని సరిపడా నీటిని చేర్చి పేస్ట్ చేసుకుని వీటిని శుభ్రపరచడంలో వినియోగిస్తే ఎలాంటి బోర్డ్స్ లేదా కట్టర్స్ అయినా తళతళలాడుతాయి. ఇక ఒకేసారి అన్ని కట్టింగ్ పరికారాలు శుభ్రపరచాలి అనుకున్నప్పుడు వేడి నీటిటో కొన్ని చుక్కల వెనిగర్ బాగా కలిపి అందులో కాసేపు నానపెట్టాలి. ఎల్లప్పుడూ చోపింగ్ బోర్డ్ తడి లేకుండా పొడిగా ఉండేలా చూసుకుంటే క్రిమికీటకాలు చేరకుండానూ, మరకలు, తుప్పు పట్టకుండానూ ఉంటుంది.


 

చిట్కాల మాయ.! | Cooking Tricks & Tips


- అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే వాటిని తరిగాక మజ్జిగలో వేయాలి.

- క్యాబేజీ ఎంత ఉడికించినా వాసన వదలట్లేదా.. చిన్న అల్లం ముక్కను చేర్చి చూడండి.
 
- వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే ఒక స్పూను పాలు వేసి చూడండి.
 
- బెండకాయ ముక్కల మీద కాస్త నిమ్మరసం చల్లితే వండేటప్పుడు జిగురు ఉండదు.

 


కలుపు పీకేయండి..! | Best ways to get rid of Garden Weeds


రోజూ చేసే అర గంట గార్డెనింగ్ మంచి వ్యాయామం శారీకంగానే కాక మానసికానందానికి తోడ్పడుతుంది. అంటే మొక్కలకు నీళ్లు పోయడం, కాయలు, పువ్వులు కోయడమే కాదు.. కలుపు మొక్కలను సమూలంగా నిర్మూలించడం కూడా. ఇవి తొలగించడం అనేది శారీరక శ్రమతో కూడుకున్నపని. ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. సో.. కెలోరీలు మరీ ఎక్కువయి ఊబకాయం దరిచేరకుండా మంచి ఆరోగ్యం, అందమైన గార్డెన్ సొంతం చేసుకోవాలంటే కలుపు తొలగించాల్సిందే. గడ్డి పీకడానికి కూడా చిట్కాలా అనుకోకుండా ఇవి ప్రయోగించి చూడండి..

- వర్షాకాలం ఎక్కువ కలుపుమొక్కలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో మట్టి తడిగా ఉండడంతో వాటిని వేళ్ళతో సహా పీకడం సులభం.
- చిన్నగా ఉన్నప్పుడే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తే అవి మళ్ళీ పెరగకుండా ఉంటాయి.
- కలుపు మొక్కలు పెద్దవైతే ముందుగా వాటిని పెకిలించడానికి మట్టిని నీళ్లతో బాగా తడపాలి.
- వీటి వేళ్ళు బాగా లోతుగా ఉన్నట్టయితే అక్కడ మట్టిని తవ్వి కలుపు తొలగించాలి.
- కలుపు మొక్కలను తొలగించడానికి V-ఆకారంలో ఉన్న పదునైన పనిముట్టు ఉపయోగకరంగా ఉంటుంది.
- పీకేసిన కలుపు మొక్కలను విధిగా సమూలంగా నాశనం చేయాలి. వీటి విత్తనాలు కూడా విస్తరించకుండా జాగ్రత్తపడాలి.


సోషల్ మీడియాలో వినూత్నంగా.. | Patriotism Through the Eyes of Social Media


ప్రస్తుత డిజిటల్ యుగంలో ముఖ్యంగా సోషల్ మీడియా అనేది నేటి యువత చేతిలో ఉన్న పెద్ద ఆయుధం అనే చెప్పాలి. అరచేతిలో విశ్వవ్యాప్తంగా ఏం జరుగుతుందో క్షణాల్లో తెలుకోవడమే కాక తమ ఆలోచనలను వ్యక్తం చేయడానికి, సృజనాత్మకతను ప్రదర్శించేందుకు సామాజిక మాధ్యమాలు ఒక వేదికగా మారాయి. సోషల్‌ మీడియాను యువతరం వినూత్నంగా ఉపయోగిస్తూ అందరి ప్రశంసలను అందుకుంటోంది. ఆడియో రిలీజ్ అయిన వెంటనే సినిమా పాటలకు సొంతంగా కొరియోగ్రాఫ్ చేసుకుని యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్న వీడియోలు మంచి ఆదరణ పొందుతున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాను ప్రజాహిత కార్యక్రమాలకు వేదికగా చేసి నూతన ఒరవడికి నేటి యువత శ్రీకారం చుట్టింది. పండగలకు పబ్బాలకు వాటి ప్రాశస్త్యం తెలియచేస్తూ ఎంతో చక్కగా యూట్యూబ్ లో సాంగ్స్ తీర్చిదిద్ది మన సంస్కృతీసంప్రదాయాలను భవిష్యత్ తరాల కంటికికడుతున్నారు. ఇక ప్రజల్లో దేశభక్తిని పెంపొందిచేందుకు సోషల్ మీడియా వేదికగా లఘు చిత్రాలు, పాటలు, కవితలు, రచనలు.. ఇలా ఎన్నో మంచి ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో జాతీయ గీతాలు ఎంతగా దోహదం చేస్తాయో మనకు తెలియంది కాదు. ప్రధానంగా రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సందర్భాల్లో సినిమాల లేదా ప్రయివేట్ దేశభక్తి గీతాలు యూట్యూబ్ లో ఎక్కువగా దర్శనం ఇస్తున్నాయి. భారతావని 72వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని గత కొన్ని రోజులుగా యూట్యూబ్ లో అప్ లోడ్ అవుతున్న ఈ యేడాది విడుదలైన బాలీవుడ్ హిట్ చిత్రం రాజి లోని ' ఏ వతన్.. ' పాట అందరినోటా వినిపిస్తోంది.

https://www.youtube.com/c/vantintichitkalu

 

ముక్కు దిబ్బడ - తగ్గించడిలా.. | Common Cold - How to Treat at Home


చల్లని వాతావరణం లేదా శీతల పదార్థాలు జలుబును కలిగిస్తాయి. అలాగే ఒకరినుంచి ఒకరికి ఇట్టే పాకేసే వైరస్‌ల వల్ల జలుబు వేధిస్తుంది. ఇక మందులకు లొంగకుండా '‘మందులు వాడితే వారం, లేకపోతే 7 రోజులు జలుబు ఉంటుందన్న’' నానుడి
లా సాధారణంగా జలుబు ఒక వారం పాటు బాధిస్తుంది, ఆ తర్వాత చాలా వరకూ దానంతట అదే తగ్గిపోతుంది. అయితే జలుబు పట్ల నిర్లక్ష్యం తగదు. మనమే కాక చుట్టుపక్కలవాళ్ళను ఇబ్బందిపెట్టకూడదనుకుంటే ఈ చిట్కాలు మీకోసమే..
- తుమ్ము వచ్చేటప్పుడు తప్పనిసరిగా నోటికి చేతి రుమాలు లేదా టిష్యూ పేపర్‌ అడ్డం పెట్టుకోవాలి.
- తరచుగా చేతులు కడుక్కోవటం, పొడిగా ఉంచుకోవటం అత్యంత అవసరం.
- ఇంట్లో వీరి టవల్స్, ఇతర వస్తువులకు దూరంగా ఉండాలి. అలాగే ఆఫీసులకు వెళ్లకపోవటం ఉత్తమం. లేకపోతే ఈ వైరస్‌ ఇతరులకూ వ్యాపిస్తుంది.
- జలుబు చేసినప్పుడు కరచాలనం, ముద్దులకు దూరంగా ఉండాలి.
- మంచినీరు, రకరకాల పండ్ల రసాలు, ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. సాధ్యమైనంత విశ్రాంతి తప్పక తీసుకోవాలి.
- ముక్కు దిబ్బడ వదలడానికి ఆవిరి పట్టటం చాలా మంచిది.
- కాచి చల్లార్చిన మంచినీటిని, పైగా గోరువెచ్చగా తీసుకోవాలి.
- జలుబు పూర్తిగా తగ్గేవరకు వేడి నీళ్లలో ఉప్పు వేసుకొని పుక్కిలించడం మరచిపోవద్దు. దీని వల్ల దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్ దరిచేరదు
- శుభ్రరిచిన గుప్పెడు తులసి ఆకులు, కొన్ని మిరియాలు కలిపి మెత్తగా దంచిన మిశ్రమాన్నీ తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు తగ్గుముఖం పడ్తాయి.
- అల్లం ముక్కలు లేదా రసంతో తేనె కలుపుకుని తీసుకుంటే జలుబు, దాంతోపాటు దగ్గు తగ్గుముఖం పడుతుంది.



గోరంత జాగ్ర‌త్త - కొండంత భ‌ద్ర‌త‌ | Life Care Daily Tips

 
రోజూ ప్రతి పనిలో 'జాగ్రత్త..!' అని శ్రేయోభిలాషులు చెప్పడమో, ఇతరులకు మనం చెప్పడమో చూస్తుంటాం. కారణం ఒక చిన్న అజాగ్రత్త ఎంతో కష్టం, నష్టం తెచ్చిపెట్టవచ్చు. అందుకని అన్నివేళలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వంటింటి నుంచి బయటి ప్రయాణాల వరకు తగు జాగ్రత్తలు తప్పనిసరి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తగు మూల్యం చెల్లించుకోక తప్పదేమో..

- పిల్లల గదిలో గోడలు, ఫర్నీచర్ వగైరా షార్ప్‌ ఎడ్జెస్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలక్ట్రికల్ పాయింట్స్‌ వాళ్లకి అందనంత ఎత్తులో ఉండాలి. డమ్మీలతో ప్లగ్ పాయింట్స్ ని కచ్చితంగా మూసివేయాలి.
- గృహావసరాలకు వాడే కత్తి, కత్తిపీట, చాకు, బ్లేడు వంటి పదునైనా వస్తువులు పిల్లలకు అందకుండా జాగ్రత్త పడాలి.
- చిన్నపిల్లలకు అందకుండా వేడి కుక్కర్‌, ఇతర పాత్రలను పెట్టుకోవాలి. డైనింగ్‌ టేబుల్‌ మీద వేసిన క్లాత్‌ కిందకు వేలాడుతూ ఉండకూడదు.
- పిల్లలకు స్నానానికి నీళ్ళు తోడేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు అవసరం. పారాడే పాపాయిలు ఉన్న ఇంట్లో అయితే మూతలు లేని పాత్రల్లో నీటి నిల్వ అత్యంత ప్రమాదకరం.
- చిల్లర డబ్బులు, మందులు, యూసిడ్‌ బాటిళ్లను పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు.
- ముఖ్యంగా ఎలక్ట్రికల్ గ్రైండర్, ఐరన్ బాక్స్, ఇమ్మర్షన్ రాడ్, ఇతర హీటర్లను పిల్లలు నిద్రిస్తున్న సమయంలోనే వాడడం ఉత్తమం.
- చేతితో మిక్సీ బ్లేడ్స్ ని మార్చడం అత్యంత ప్రమాదకరం అని గుర్తించాలి. విధిగా స్పానర్ ని వాడాలి.
-  వంట పూర్తయిన వెంటనే ఇండక్షన్‌ స్టవ్‌ స్విచ్ఛాప్‌ చేసి, ప్లగ్‌ను తొలగించడం తప్పనిసరి. అలాగే ఎలాంటి ఎలక్ట్రికల్ లేదా ఎలాక్ట్రానిక్ పరికరమైనా పనిపూర్తైన వెంటనే పవర్ స్విచ్ ఆఫ్ చేయడం, ప్లగ్ ను విధిగా తొలగించడం మరవద్దు.
- ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పడు జనించే హైఓల్టేజీతో విద్యుత్‌ ఉపకరణాలు కాలిపోయే ప్రమాదముంది. అలాగే టెలీఫోన్ వినియోగం కూడా అత్యంత ప్రమాదకరం అని గుర్తించండి.
- వంట పూర్తవగానే గ్యాస్ రెగ్యులేటర్‌ ఆఫ్ చేసుకోవడం మంచిది. ఎల్లప్పుడు గ్యాస్ స్టవ్ పరిసరాల్లో గాలి ప్రసరణ సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. ఇన్సెక్ట్ కిల్లర్స్, దీపాలు దాని దగ్గరలో వినియోగించకూడదు. గ్యాస్ లీకేజి ఉందనుకున్నప్పుడు ఎలక్ట్రికల్ స్విచెస్ ఆన్ / ఆఫ్ చేయకూడదు. దగ్గరలో మొబైల్ ఫోన్ వినియోగించకూడదు.
- కారులో ప్రయాణం చేసేటప్పుడు ముందు జాగ్రత్తగా సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవాలి.
- టూ వీలర్ రైడింగ్ లో విధిగా నాణ్యమైన హెల్మెట్‌ను ధరించాలి. అంతేకాకుండా హెల్మెట్ స్ట్రాప్ పెట్టుకోవటం తప్పనిసరి.