పెద్దల ఆహారం.. | Diet for Older People


వయసు పెరుగుతుంటే తీసుకునే ఆహారంలో తగిన మార్పులు అవసరమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వయసుపైబడినాక కూడా అవే ఆహారపు అలవాట్లు ఉంటే కాలక్రమేణా శరీర బరువు పెరుగుదలకు కారణమవుతుంది. ఊబకాయంతో పాటూ పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అలాగని పెద్దవాళ్లు పూర్తిగా ఆహారం తగ్గిచ్చేస్తే నీరసించిపోవడం, రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. వృద్ధులు తీసుకునే ఆహారంపై అవగాహనతో సరియైన పోషక విలువలతో సరిపడా శక్తిని ఇచ్చేవిగా చూసుకోవాలి. అవసరమైన విటమిన్లు, ఖనిజలవణాలు, ఫైబర్, ప్రొటీన్లు లభించే ఆహారపదార్థాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అనారోగ్యాల పాలుచేసే కొవ్వు, చక్కెర పదార్థాలను తగ్గించాలి. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, చేయగలిగినంత వ్యాయామం వృద్ధాప్యపు ఛాయలను, అనారోగ్యాలను తగ్గిస్తాయని గుర్తించాలి.

- తృణధాన్యాలు, సీజనల్ ఫ్రూట్స్, తాజా కూరగాయలు, పాలు, పాల పదార్థాలు - అన్ని రకాల పోషకాలను సమకూరుస్తాయి. ఇవి రోజూ ఆహారంలో చేరితేనే ఆరోగ్యం. ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు తీసుకోవటం, తక్కువ ఉప్పు వాడడం తప్పనిసరి. వయసు పెరిగే కొద్దీ జీర్ణక్రియ పనితనం తగ్గుముఖం సట్టడం సహజం. కాని పోషకాహారంతో పాటు, తగినంత వ్యాయామం ఈ జీవక్రియలు సమతుల స్థాయిలో ఉండేందుకు దోహదం చేస్తుంది.

- సహజంగానే దాహం వేయకపోవడం, మంచినీరు తీసుకుంటే తరచూ మూత్రవిసర్జన తప్పదని అభిప్రాయం వల్ల చాలా మంది మంచినీటిని తగినంత తాగకపోవడంతో డిహైడ్రేషన్ కు గురవుతారు. ఈ పరిస్థితి దీర్ఘకాలికంగా కొనసాగితే కణాలు దెబ్బతింటాయి. అలసట ఆవహిస్తుంది. శరీరభాగాల్లో నొప్పులు మొదలవుతాయి. ఆలోచన శక్తి క్రమంగా క్షీణిస్తుంది. ఏ మాత్రం వేడిని తట్టుకోలేరు. మలబద్ధకం బాధిస్తుంది. ఈ దుష్ప్రభావాలకు గురికాకుండా మంచినీటిని, ద్రవపదార్థాలను అధికంగానే తీసుకోవాలి.

- చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు.. వీటిల్లో మెండుగా లభించే ఫైబర్ జీర్ణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి, మలబద్ధకం తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, రక్తపోటుని నియంత్రించి తద్వారా ఆరోగ్యకరమైన హృదయానికి దారితీస్తుంది. ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా డయాబెటిస్ అవకాశాలు తగ్గిస్తుంది.

- మజ్జిగ, పెరుగు.. ఇవి ఆహారానికి ప్రత్యమ్నాయంగానే కాక భుజించిన ఆహారం జీర్ణం అవడానికి కూడా ఉపయోగపడ్తాయి. చక్కని కాల్షియం వంటపట్టి పెద్ద వయసులోను ఎముకలు దృఢత్వం కోల్పోకుండా ఉంటాయి. విటమిన్ - డి కి కూడా యోగర్ట్ మంచి మూలం అని చెప్పాలి. పెరుగుతో పాటు ఏదైనా పండు జతచేసి తీసుకుంటే ప్రోటీన్ లు మరింత ఎక్కువగా అందుతాయి.

- టమోటాల్లో ఉండే లైకోపీన్ పలు రాకాల క్యాన్సర్ కారకాలను నిర్మూలిస్తుంది. పచ్చిటమోటాలో కంటే ఉడకపెట్టిన వాటితో లైకోపీన్ అధికంగా అందుతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. క్యారట్, బొప్పాయి, పుచ్చకాయల్లో కూడా లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది.

- బ్రోకోలీలో అన్ని రకాల విటమిన్లు, ఆంటీఆక్సిడెంట్స్ నిండి ఉండటం వలన ఇది ఆరోగ్యకరం. బ్రోకోలీలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది.

- వేరుశెనగ, బాదం, జీడిపప్పు, వాల్నట్.. వగైరా నట్స్ లో ఆరోగ్యానికి అవసరం అయ్యే ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మంచి రకమైన కొవ్వు, చక్కని ఫైబర్ తో పాటు పూర్తిస్థాయిలో ప్రోటీన్లు అందుతాయి. 


 

No comments: