వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలతో.. | శ్రావణ శుక్రవారం | Shree VaraLakshmi Namastubhyam

పార్వతీదేవికి పరమేశ్వరుడు ఉపదేశించిన వ్రతం వరలక్ష్మీ వ్రతం. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడం ముదావహం. సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి. దయాగుణం, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిదేవిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. అష్టలక్ష్మీ ఆరాధన ఎంతటి ఫలాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మీ వత్రం అంతటి ఫలితాన్ని ఇస్తుందని ధార్మికగ్రంథాలు వెళ్లడిస్తున్నాయి.

వరలక్ష్మీ వ్రతం వెనుక వైద్య రహస్యాలు, సామాజిక ప్రయోజనం కూడా దాగి ఉన్నాయి. శ్రావణమాసం అనగానే పడతి అరచేతుల్లో గోరింటాకు, కాళ్లకు పారాణి పుయ్యాల్సిందే. వీటి ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. శుభకార్యాల్లో వాడే పసుపు, గంధం, కుంకుమ.. వగైరా ఆరోగ్య ప్రదాయనిలు. పాదాలకు పసుపు రాసుకుంటే పలు ఇన్ఫెక్షన్లు దరిచేరవు. ముఖానికి పసుపు, గంధం రాయడం వల్ల మొటిమలు, పొక్కులు మాయమవడమేకాక ఛాయ పెరుగుతుంది. ఇక నానపెట్టిన శనగలు వాయినంగా ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితి. శెనగల్లో పోషక విలువలు పుష్కలంగా లభిస్తాయి. తాంబూలం వేసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇచ్చుకో వాయినం - పుచ్చుకో వాయినం అంటూ నలుగురిని కలుపుకుని పోవడం నిజంగా ఆధునిక కాలంలో సత్సంబంధాలు పెరిగేందుకు దోహదపడుతుంది.



No comments: