అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం : మేడే | May Day - International Workers' Day


మేడే అంటే ప్రపంచ శ్రామికులకు, కార్మికులకు స్పూర్తిదినం. విశ్వవ్యాప్తంగా సుమారు వంద దేశాల్లో జాతీయ శలవుదినంగా, అనధికారికంగా చాలా దేశాల్లోనూ కార్మికులకు పండగరోజుగా మే ఒకటి ప్రసిద్ధి. చరిత్రలోకి వెళితే 1886వ సంవత్సరం అమేరికాలోని చికాగో నగరంలో పెట్టుబడిదారి, దోపిడివర్గాల అక్రమాలకు శ్రమదోపిడికి గురైన కార్మికులు 'ఎనిమిది గంటల పనిదినం' కోసం శాంతీయుతంగా చేపట్టిన ఉద్యమం కాస్తా గుర్తు తెలియని వ్యక్తి పోలీసులపై డైనమేట్ బాంబు విసరడం, తదుపరి పరిణామాల పర్యవసానంగా  అనేకమంది కార్మికులు అమరులై తమ హక్కును సాధించుకున్నవారి స్పూర్తికి గుర్తుగా జరుపుకోనేదే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. నాటినుండి నేటివరకు ప్రపంచవ్యాప్తంగా  అనేక వర్గాల కార్మికులు తమ హక్కుల సాధన కోసం ఎర్రజెండా నీడలో అనేక ఉద్యమాలు సాగిస్తునే ఉన్నారు. కార్మికుల శ్రమకు, శక్తికి, చమటకు, రక్తానికి ఎంతో విలువుందని ప్రపంచానికి చాటిచెప్పారు.

శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని ఘంటాపథంగా ప్రకటించిన అభ్యుదయవాది, మహాకవి శ్రీశ్రీ... సహస్రవృత్తులు, సమస్త చిహ్నాలు కవిత్వానికి ప్రాణమని దండోరా వేశాడు. కార్మిక లోకపు కల్యాణానికి... శ్రామిక లోకపు సౌభాగ్యానికి... సమర్పణంగా, సమర్చనంగా శ్రీశ్రీ రాసిన కవితలు వేల మంది యువకవులకు స్పూర్తినిచ్చాయి. వేనవేల ప్రజాగాయకులకు స్పృహనందించాయి.  సామ్రాజ్యవాద దురాక్రమణ పంథాను ప్రతిఘటించిన కలం వీరులు ఎన్నో ఎర్ర సిరా చుక్కలు ధారపోసి కవిత్వాలకు అక్షరాలు పేర్చారు. కార్మిక, శ్రామిక వర్గ పోరాటాలకు సంఘీభావం చాటుతూ ఎందరో విప్లవ గళాలు సవరించుకుని జనగీతాలకు పల్లవులై నిలిచారు. మేడే అంటే అన్యాయాలను, అక్రమాలను, దోపిడీలను, దురంతాలను ధిక్కరించిన రోజు. కవులు, కళాకారులు ముక్తకంఠంతో దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన రోజు.

కార్మికుడు, కర్షకుడు చేతులు జోడించే స్థాయి నుంచి పిడికిళ్లు బిగించేలా పోరాట మార్గాన్ని చూపించింది మేడే. ప్రపంచ కార్మికులారా... ఏకం కండి! అన్న పిలుపుతో శ్రమజీవులందరూ ఒక్కతాటి మీద నడిచారు. పోరాటమనే ఆయుధాన్ని అందుకున్నారు. బానిస సంకెళ్లను తెంచుకునే సాహసాన్ని, శక్తిని సమకూర్చుకున్నారు. ఒకే పర్వదినం ప్రపంచం నలుమూలలా ఒకేరోజు జరుపుకుంటారంటే అది ఖచ్చితంగా 'కార్మికుల దినోత్సవం' అవుతుంది.



కొబ్బరిబోండాలు అమృతభాండాలు | Health benefits of Coconut Water in Summer


కొబ్బరిబోండాం గిరాఖీలు పెరిగాయి. మండు వేసవిలో దహర్తిని తీర్చేవి కొబ్బరినీళ్లు మాత్రమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. శీతలపానీయాల జోలికి వెళ్లకుండా కొబ్బరిబోండాం తాగడం వల్ల డీహైడ్రేషన్, వడదెబ్బ దరిచేరవు. వెంటనే అలసట నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఈ నీటితో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యూరినరీ ఇన్ఫెక్షన్లు, కిడ్నీల్లో రాళ్లు.. వగైరా రుగ్మతలకు మంచి ఔషధం అంటున్నారు వైద్యులు. శరీరానికి కావలసిన ఫైబర్ అందడంతో పాటు జీర్ణ శక్తి మెరుగుపడుతుంది.


 

ఆరోగ్య పరిరక్షణలో గోంగూర | Health Benefits, Nutrition & Uses of Gongura


ఆకుకూరలకు నిత్యం ఆహారంలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అన్నీ కాలాల్లొ లభించే పాలకూర, తోటకూర, గోంగూర, బచ్చలికూర, మెంతికూర, పొన్నగంటికూర, కరివేపాకు, కొత్తిమీర, పుదీన.. వగైరా ఆకుకూరలలో అనేక పోషకాలు, విటమిన్లు, ప్రొటీన్లు, మాంసకృత్తులు, ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. పైగా వీటిల్లో కొవ్వు తక్కువగా ఉండి ఆహారాన్ని రుచికరంగా మారుస్తాయి. అన్నీ వయసుల వారిలో జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు శారీరక ఎదుగుదలకు, దృఢత్వానికి, చక్కటి ఆకృతికి దోహదపడుతాయి. తోటకూర, గోంగూరలో ఉండే ఫోసియన్ యాసిడ్, విటమిన్ - బి, ఇనుముతో రక్తహీనత దరిచేరదు. శరీరంలో చక్కెర పెరగకుండా చూస్తూ మధుమేహం, అధిక కొవ్వు తగ్గించేందుకు మెంతికూర ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఆకుకూరలతో లభించే విటమిన్ - సి, కాల్షియం ముఖ్యంగా కళ్ళు, దంతాలు, ఎముకల ఆరోగ్యం ఇనుమడింపచేస్తాయి. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడతాయి. గోంగూర, ఎర్రతోటకూర, బచ్చలికూరలో హిమోగ్లోబిన్ సమృద్ధిగా లభిస్తుంది. తోటకూర, చుక్కకూరలో లభించే ఫోలిక్ యాసిడ్ ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తుంది.

ఆకుకూరల్లో ప్రత్యేక స్థానం ఉన్న గోంగూర కేవలం వెజిటేరియన్ ఫుడ్ లోనే కాక అనేక నాన్ వెజ్ వంటకాల్లో మంచి రుచిని అందిస్తుంది. గోంగూర పప్పు, పొడులు, పచ్చడి, ఊరగాయలు.. ఇలా మంచి అన్నీ రుచికరమే. ఇందులో పోటాషియమ్, క్యాల్షియం, ఫాస్పరస్, సోడియం, ఐరన్ వగైరా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఎ, బి1, బి9, సి విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్స్, కార్బోహైడ్రైట్స్ అధికంగా ఉండి క్రొవ్వు చాలా తక్కువగా ఉండడంతో గోంగూర బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఉపయోగకారి. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. తద్వార రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి, షుగర్ లెవెల్స్ ని నియంత్రించే శక్తి గోంగూర ఆకులు కలిగి ఉంటాయి. గోంగూర చర్మ సంబంధమైన సమస్యలకు చెక్ పెడుతుంది. గోంగూర యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేయడం వల్ల క్యాన్సర్ ను సైతం నివారించడానికి సహాయపడుతుంది.

అయితే సహజ ఔషధగుణాలున్న ఈ ఆకుకూరలు వండడంలో మెలకువలు అవసరం. వీటిపై దుమ్ముధూళి, చిన్నపురుగులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వీలైనన్ని ఎక్కువ సార్లు ఫ్లోటింగ్ వాటర్ లో కడగాలి. పది నిమిషాలు ఉప్పుకలిపిన నీటిలో నానపెట్టి ఆ తరవాత శుభ్రపరచుకోవడం మేలు. ఆకుకూరలను వండే సమయంలో పాత్రలపై మూత పెట్టి ఉడికించడం,మగ్గపెట్టడం ద్వారా పూర్తి పోషకాలు లభిస్తాయి. అలాగే ఆకుకూరలను ఉడికించిన నీటిని వృధా చేయకుండా వార్చి ఉప్పు, నిమ్మరసం కలిపి సూప్‌ గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. లేదంటే ఆ నీటిని చారులో కాని, ఇతర వంటకాల్లో కాని కలిపేసుకోవచ్చు. సీజనల్ గా దొరికే చింతాకు, ములగాకు, అవిశ ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఆయా కాలాల్లో చౌకగా దొరికే ఆకు కూరలను ప్రతిరోజు ఏదో రూపంలో ఆహారంగా తీసుకోవడం ఎంతో మంచిది.


 

వేసవిలో విద్యుత్ గృహోపకరణాలు - వినియోగం | Protect Home Appliances in the Summer


వేసవికాలం ఎండలకు బెంబేలెత్తి అధిక సమయం ఇంట్లోనే ఉండడం, పైగా విద్యాసంస్థలకు సమ్మర్ హాలీడేస్ కారణంగా పిల్లలు కూడా చేరడం.. విద్యుత్ గృహోపకరణాల వినియోగం ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీనివల్ల విద్యుత్ బిల్లు అధికమవ్వడమేకాక తగు జాగ్రత్తలు పాటించకపోతే విద్యుత్‌ సరఫరాలో హెచ్చు తగ్గులు ఏర్పడుతూ అవాంతరాల వల్ల ఎంతోవిలువైన ఎలక్ట్రికల్ పరికరాలు, ఎలక్ర్టానిక్‌ గ్యాడ్జెట్స్.. పాడయ్యేప్రమాదముంది. 
 

- ఒకప్పుడు టేబుల్ ఫ్యాన్‌, సీలింగ్ ఫ్యాన్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా వీటితో పాటు వాల్ మౌంట్ ఫ్యాన్, పెడస్టల్ ఫ్యాన్ వగైరా వచ్చాయి. అలాగే ఇంట్లోని వేడిగాలిని బయటికిపంపే ఎక్జాస్ట్ ఫ్యాన్ వినియోగం కూడా పెరిగింది. వీటిలో ఏ ఫ్యాన్ అయినా బ్రాండెడ్ వి ఎన్నుకోవడమే ఉత్తమం. ఫ్యాన్ రెగ్యులేటర్, బేరింగ్‌లు కొన్ని సంవత్సరాల వినియోగం తరవాత మొరాయించవచ్చు. అవి తిరిగి ఆయా కంపనీల స్పేర్స్ తోనే మార్చుకోవాలి. ఫ్యాన్ తక్కువగా తిరగడం, పూర్తిగా తిరగకపోవడం సమస్యలు తలెత్తినప్పుడు కండెన్సర్‌, వైడింగ్‌ లను మార్చవలసి ఉంటుంది. దీనికోసం అనుభవం ఉన్న సర్వీస్ ఇంజనీర్లనే సంప్రదించాల్సి ఉంటుంది.

- తక్కువ ధరకు వస్తున్నాయని నాసిరకం అసంబుల్డ్‌ ఎయిర్ కూలర్ లను ఎన్నుకోకూడదు. బ్రాండెడ్ కంపనీల కూలర్లలో నాణ్యమైన విడిభాగాలు వాడడం చేత అధిక వేడిని సైతం తట్టుకోగలుగుతాయి. చక్కని చల్లని గాలిని ప్రసరిస్తూ విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. కూలర్లలో నీటిని రోజూ మార్చుకోవాల్సి ఉంటుంది. లేదంటే దోమలు విజృంభించడం, పలురకాల శ్వాసకోస వ్యాధులు తప్పవు. విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా కూలర్ లో నీటిని మార్చడం అత్యంత ప్రమాదకరం. చెప్పులు వేసుకొని మాత్రమే కూలర్‌లను ముట్టుకోవడంతో పాటు పిల్లల విషయంలోనూ తగు జాగ్రత్తలు అవసరం.

- మండే ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఏసీలను ఆశ్రయించక తప్పడం లేదు. అయితే వీటి ఎన్నిక, ఇన్స్టలేషన్, నిర్వహణలో పలు జాగ్రత్తలు తీసుకోకపోతే ఎయిర్‌ కండిషనర్‌లు సరిగా పనిచేయకపోగా కరెంట్ చార్జీలు పెరగడం, హౌస్ వైరింగ్ కాలిపోవడం వగైరా సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ చల్లదనం కోసమని 16 డిగ్రీల ఉష్ణోగ్రతను వాడడం కంటే ఎంత అవసరమో గుర్తించాలి. లేదంటే విద్యుత్‌ అధికంగా ఖర్చు అయి కంప్రెషర్‌ పాడవుతుంది.

- ఇక వేసవిలో మరో నేస్తం రిఫ్రిజిరేటర్‌. ఫ్రిజ్ ని ఎట్టిపరిస్థతిల్లోనూ ఎండకు నేరుగా లేదా వంటింట్లో అమర్చుకోకూడదు. కచ్చితంగా వోల్టేజ్ స్టబ్లైజర్ వినియోగించడంతో పాటు దాని చుట్టూ, ముఖ్యంగా వెనక భాగంలో గాలి ప్రసరించేలా చూసుకోవాలి. అలాగే ఎక్కువ సార్లు డోర్స్ తీయకూడదు. ఏమాత్రం అజాగ్రత్త వహించినా విద్యుత్ వినియోగం పెరగడం, కంప్రెషర్‌ కాలిపోయే ప్రమాదం తప్పవు.  


- వేసవిలో ఐటి పరికరాలపైనా దృష్టి పెట్టాలి. లేదంటే అధిక ఉష్ణోగ్రతలతో అవి పాడవడం, మనకు అనారోగ్యం, ఒక్కో సారి ప్రాణహాని తప్పకపోవచ్చు. ఎలక్ట్రికల్ షాట్ సర్క్యూట్ కానీ, అధికవేడి వల్ల కానీ పరికరాలు పేలడం తద్వారా అగ్నిప్రమాదాలు సంభవించనూవచ్చు. మొబైల్ ఫోన్ తో పాటు ఏ ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి అయినా ఆయా పరికరల ఛార్జర్లను మాత్రమే విధిగా వాడాలి. అవసరానికిమించి ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీల లైఫ్ టైం తగ్గడంతో పాటు కాలిపోయే అవకాశం ఉంది. ఇక డెస్క్ టాప్, ల్యాప్ టాప్ కంప్యూటర్లు వినియోగిస్తున్నప్పుడు అధిక వేడి లేకుండా చల్లని గాలి ప్రసరించే లా చూసుకోవాలి. లేదంటే హ్యాంగ్ అవడం, విలువైన సమాచారం పోగొట్టుకోవడం జరుగుతుంది. మధ్యాహ్న సమయంలో టీవీ, మానిటర్ లను అదేపనిగా వీక్షించకపోవడమే ఉత్తమం. 


శునకాల పెంపకం - ఒక అవగాహణ | Pet Care - How to take care of your dog

కుక్క విశ్వాస జంతువు. కుక్క పిల్లలని అల్లారుముద్దుగా పెంచుకుంటే కుటుంబసభ్యులందరితో అతిసన్నిహితంగా ఉంటూ, అభిమానాన్ని చూరగొంటూ కుటుంబంలో ఒక భాగం అవుతాయి. శునకాలు కాలక్షేపంగా, ప్రాణపదంగా ఉంటూ ఆనందాన్ని పంచుతాయి. అయితే వీటి కొనుగోలు, పెంపకం ఖరీదైన వ్యవహారమే. పెంపుడు కుక్కను ఎంచుకోవడానికి దాని జాతి, జీవితకాలం, పోషణ,  నడత.. ఇలా అనేక విషయాలు పరిగణలోకి తీసుకొవాల్సి ఉంటుంది. కేవలం ఆరుబయట తిరుగుతూ కాకుండా ఇంటి వాతావరణంలో, అపార్ట్ మెంట్లలో ఉండ గలిగే వాటిని చూసుకోవాల్సి ఉంటుంది.

వీటి అలనాపాలనలో ఏ మాత్రం అజాగ్రత్తవహించినా బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల భయంకర వ్యాధులు సోకుతాయి. వీటి వల్ల వచ్చే పార్వో, రేబిస్, హైపటైటిస్ వ్యాధులను మందులు కూడా అంత సులువుగా నయం చేయలేవు. వాటి నివారణకు ముందుగానే టీకాలు విధిగా వేయించాల్సి ఉంటుంది. కొన్ని వ్యాధులు కుక్కల నుంచి మనుషులకు కూడా వచ్చే అవకాశం ఉంది. కుక్క పిల్లల్లో సకాలంలో రోగనిరోధక టీకాలు వేయించక పోతే ప్రమాదకరమైన పార్వో వైరస్ సోకి అకస్మాత్తుగా మృతి చెందుతాయి.  కుక్కకాటు అనగానే కళ్లు తేలేసి, నోరు తెరిచేసి టక్కున గుర్తుకు వచ్చే అతి భయంకరమైన వ్యాధి - రేబిస్. రేబిస్ వ్యాధి కుక్క కాటు ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుంది. అందుకని వెటర్నరీ డాక్టర్లను ముందుగానే సంప్రదించి సంవత్సరానికొకసారి కుక్కలకు టీకాలు విధిగా చేయిస్తుండాలి. కుక్కల్లో తరచుగా అంతరపరాన్నజీవులు ప్రేవులను ఆశ్రయించి ఆరోగ్యం పూర్తిగా క్షీణించేలా చేస్తాయి. ఈ విషయంలో పశువైద్యుల సలహాలు తు.చ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.

కుక్కల స్నానాకి కార్బాలిక్, డియోరెంట్ గుణాలు కల సబ్బులు వాడకూడదు. స్నానానంతరం పొడిబట్టతో తడి ఆరిపోయేలా తుడవాలి. ఆహారంలో సరిపడా కాల్సియం లభించినా ఇళ్లలోనే తిరిగే కుక్కల్లో డి-విటమిన్ లోపంతో బాధ పడుతుంటాయి. కనుక ఉదయం, సాయంత్రం వేళల్లో బయట తిప్పటం వల్ల సూర్యరశ్మితో డి-విటమిన్ శరీరంలోకి చేరుతుంది. అలాగే వ్యాయామం కూడా చేకూరుతుంది. అలాగే ఆహారం విషయంలోనూ సమయపాలన పాటించాలి. అన్ని వేళలా స్వచ్ఛమైన నీటిని అందుబాటులో వుండేలా చూడాలి. వాటి కాలకృత్యాలకు నిర్నీత సమయాలను అలవాటు చేయాలి. నలతగా ఉన్నా, జబ్బులేమైనా వచ్చినా వెంటనే వైద్యశాలకు తీసుకెళ్లాలి. పుష్టికరమైన ఆహారంతో పాటు వైద్యుడి సలహా మేరకు సిరప్, ఇంజక్షన్లు వాడుతుండాలి. అల్లారుముద్దుగా పెంచుకునే కాలబైరవులకు అప్పుడప్పుడు డాగ్ షోలు, క్లబ్బులు అంటూ షికార్లు అవసరం. వాటిని చీటికిమాటికి కసురుకోవడం తగదు.

కుక్కల ఆరోగ్యం విషయంలో అంత శ్రద్ద కనబరచి, మన ఆరోగ్యం విషయంలో ఏమరుపాటు వహిస్తే ప్రమాదమే. వీటి వ్యర్థాలతో బహుపరాక్ అంటున్నారు నిపుణులు. కుక్కలకు స్నానం చేయించిన అనంతరం చేతుల్ని శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. కుక్కలు పైకెగిరి ముఖమంతా, ఒళ్లంతా నాకకుండా చూసుకోవాలి. సరదాకైనా కుక్కలు కొరకకుండా జాగ్రత్తపడాలి. వాటికి కేటాయించిన పాత్రల్లోనే ఆహారపదార్థాలను అందించాలి. ప్రధానంగా వంటింట్లోకి కుక్కలు చొరబడకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలు కుక్కలతో ఆడుకుంటున్నప్పుడు కని పెడుతుండాలి. పిల్లల చేతుల్లో వుండే తినుబండారాలపైన ఎగబడి దాడి చేసే అలవాటును కుక్కల్లో మానిపించాలి.

మూగ జీవాలతో మన సహజీవనం బాగానే ఉంటుంది. మరి ఇతరులకు హాని కలగకుండా వుండాలంటే మాత్రం 'కుక్కలున్నాయి జాగ్రత్త!' అనే బోర్డ్ తగిలించడం మరవకూడదు.


పంచదార - ఒక మంచి క్లీనింగ్‌ ఏజెంట్‌ | Inventive ways you can use Sugar


ఇంట్లో అన్నీ వస్తువులు, ఫ్లోర్, టైల్స్, దుస్తులు.. ఏవైనా ఇట్టే మురికి వదలాలంటే పంచదార ఉండాల్సిందే. అదేలగ అని అంటారా.. మీరూ ప్రయత్నించి చూడండి.. ఇలా చేయడం వల్ల హోం క్లీనింగ్ లో ఘాటైన రసాయణాల వాడకం తప్పుతుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ దరిచేరవు.

- బేకింగ్‌ పౌడర్ కి కాస్త చెక్కెర జోడించండి. ఇందులో కాసిని నీళ్లు కలుపుకుని మిశ్రమం తయారుచేసుకోండి. ఇది చక్కని నేచురల్ డిటర్జెంట్ సోప్ లిక్విడ్ అని చెప్పవచ్చు. ఎలాంటి జిడ్డు పాత్రలైనా ఇట్టే మెరుపులీనాల్సిందే.

- కాస్త పంచదార తీసుకుని రోజ్ వాటర్ లో బాగా కరిగెలా కలపండి. దీంతో సిల్వర్ పాత్రలు రుద్ది చూడండి. ఇలా చేయడం వల్ల వెండి వస్తువులు ఎలాంటి గీతలు పడకుండా  తెల్లగా మిళమిళ మెరిసిపోతాయి.   

- తుప్పు మరకలు తొలగించడంలోనూ చెక్కర మంచిగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వంటింట్లో సిలిండర్ పెట్టే ప్రదేశంలో, అలాగే చాలా కాలం వాడని వంటపాత్రలకు పట్టే తుప్పును వదిలించేందుకు నిమ్మకాయరసంలో కాస్త పంచదార కలిపిన మిశ్రమం తో స్క్రబ్ చేసి శుభ్రపరచుకోవాలి.

- సరిపడా టమోటో రసం రెడీచేసుకుని అందులో కాస్త చెక్కెర కలిపితే.. ఈ మిశ్రమం సహజసిద్ధమైన బ్లీచింగ్‌ ఏజెంట్‌ అని చెప్పవచ్చు. దీంతో దుస్తులపై ఏర్పడ్డ ఎలాంటి మొండి మరకలనైనా  తొలగించవచ్చు.



చ‌ర్మం పై ఎండ‌ దాడి.. | Summer Skin Care Tips

మండే ఎండల్లో చర్మం నిగారింపును కోల్పోతుంటుంది. అయితే కొద్దిపాటి జాగ్రత్తలతో మీ అందానికి వెన్నెలలా వన్నె చేకూరుతుంది. చర్మంలో తేమ శాతం తగ్గకుండా ఎక్కువ నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి.  తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు.. నిత్యం ఆహారంలో ఉండేలా చూసుకోవడమేకాక వీటితో ఫేస్‌ప్యాక్‌లు ట్రై చేయడానికి మేలైనవి అని గమనించాలి. నిమ్మ, నారింజ, బొప్పాయి, టమాటా వంటివి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. అలసిన ముఖంలో కొత్త కాంతిని నింపుతాయి. మృతకణాలు తొలగిపోయి చర్మం పసిడిలా మెరుపులీనుతుంది. అయితే ఫ్రై ఫుడ్, జంక్‌ ఫుడ్.. వగైరాలకు దూరంగా ఉండాలి. కొబ్బరి బోండం నీళ్ళు, చెరుకు రసం, పళ్ల రసాలు.. వంటి వాటిని తీసుకుంటే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. ఎండ సమయాల్లో బయటికి రాకుండా ఉండడమే ఉత్తమం. ఒకవేళ తప్పనిసరి అయితే సన్‌స్క్రీన్‌ లోషన్‌ని రాయడంతో పాటు గొడుగును కూడా వెంట పెట్టుకోవడం మరవద్దు.
 
 


వేసవిలో మొక్కల సంరక్షణ | Summer Gardening - How to keep your Plants Healthy

వేసవిలో మొక్కలు ఎండిపోతున్నాయా.. కొత్త మొక్కలు పెట్టాలా వద్దా అని సంశయమా.. ఎలాంటి సందేహం లేకుండా ఎండ తీవ్రత నుంచి మొక్కల్ని రక్షించుకోవచ్చు.  అయితే ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఇంటి చుట్టూ ఖాళీ ప్రదేశంలో, మేడపైన, బాల్కనీ, పోర్టికోల్లో పెంచే మొక్కలకు సూర్యరశ్మి తప్పనిసరి. అలాగని మండే ఎండల్లో మొక్కలు తాళలేవు కనుక గ్రీన్ షేడ్ నెట్‌ను తప్పక ఉపయోగించాలి. దీనివల్ల తక్కువ ఖర్చుతోనే ఆకుకూరలు, కూరగాయల మొక్కలు, పూలమొక్కలతో పాటు వివిధ రకాలైన మొక్కలను, చెట్లను కాపాడుకోవచ్చు. మన పెరటి మొక్కలు, కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెన్ లకు సరిపడా కొలతలతో గ్రీన్ షేడ్ నెట్ గార్డెనింగ్ మెటీరియల్‌ అమ్మే దుకాణాల్లో, ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ లలోనూ దొరుకుతుంది. ఇది కొనే ముందు ఈ క్లాత్ పై అవగాహణ ఉండాలి. ఇది మొక్కలపై నేరుగా పడే ఎండని 50శాతంకి పైగా ఆపగలుగుతుంది. ఒక మీటర్, రెండు మీటర్ల తాన్లలో మనకు ఎన్ని మీటర్ల పొడుగు నెట్ అవసరమో చూసుకోవాలి. తక్కువ ఉష్ణోగ్రతలో మాత్రమే పెరిగే మొక్కలను పెంచుకోవడానికి ఏడాది పొడవునా ఈ నెట్‌ వినియోగపడుతుంది.

- మొక్కలను నాటే ముందే సారవంతమైన మట్టిని ఎంచుకోవాలి. వీలైతే సేంద్రియ ఎరువులను కలిపిన మట్టి అయితే మరీ మంచిది.

- వేసవిలో మొక్కలు వాడిపోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే వటింటి వ్యర్థాలనే సహజ ఎరువులుగా వాడాలి. వాడేసిన టీ, కాఫీ పొడి, కాఫీ గింజలు, కోడిగుడ్డు డొల్లలు.. వగైరా మొక్కలకు చక్కటి ఎరువుగా ఉపయోగపడుతాయి. వీటి వల్ల మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం మొక్కలకు పుష్కళంగా అందడంతో చాలా బలం చేకూరుతుంది.

- మొక్కల చుట్టూ మడిలో, కుండీల్లో మట్టి  ఎండ తీవ్రతకు గట్టిపడిపోకుండా రకరకాల ఎండు ఆకులను సేకరించి వేసుకోవాలి. లేదంటే వేర్లకు ఆక్సిజన్‌ అందని పరిస్థితి ఏర్పడి ఎదుగుదల క్షీణించి కొన్ని రోజులకు మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఈ మల్చింగ్ పద్ధతిని ప్రయోగిస్తే మొక్క సహజసిద్ధంగా ఎదుగుతుంది.

- కుండీలో నీరు ఎప్పుడూ నిలవకుండా చూసుకోవాలి. కుండీ అడుగుభాగాన రంధ్రం నుంచి నీరు సజావుగా వెళ్లిపోయేలా ఉండాలి.

- ఇండోర్‌ ప్లాంట్ల కుండీలు, మొక్క కాండం.. వీటికి ఎలాంటి రంగులు వేయరాదు. దీని వల్ల రంధ్రాలు మూసుకుపోయి ఆక్సిజన్‌ అందే అవకాశం ఉండదు.

- మొక్కల మధ్యలో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు ఏరిపారేయాలి. లేదంటే అసలైన మొక్కలకు అందాల్సిన పోషకాలన్నింటినీ ఇవి తీసేసుకుంటాయి.

ఈ జాగ్రత్తలు పాటిస్తూనే మొక్కల పెంపకంలో, పనిముట్ల ఎన్నిక విషయంలో.. ఎలాంటి సందేహాలున్నా అంతర్జాలంలో ఆ మొక్కలకు సంబంధించిన సమాచారం చదవడం లేదా దగ్గర్లోని నర్సరీకి వెళ్లి నిపుణుల సలహాపాటించడం తప్పనిసరి.
 
 
pc:internet

తుమ్మూ మంచిదే..! కానీ.. | How to Sneeze Properly to Not Get Others Sick

మనం ఊపిరిపీల్చేటప్పుడు ముక్కు ద్వారా గాలిలోని ప్రాణవాయువుతో పాటు అనేక సూక్ష్మజీవులు, దుమ్మూధూళిలాంటి అవాంఛనీయమైన కణాలు లోపలికి వెళ్లిపోతాయి. అనవసరమైన వీటిని బయటికి పంపేంచే శరీర ప్రక్రియ తుమ్ము. నాసిక రంద్రాలలో ఏదైనా అడ్డు పడితే తుమ్ము వస్తుంది. ఒక్కసారిగా వెలుతురుని చూసినప్పుడు గాని, ఎక్కువ చలిలోకి వెళ్లినప్పుడు గాని తుమ్ములు వ‌స్తాయి. ఇలా తుమ్మినప్పుడు నలబైవేలకు పైగా సూక్ష్మ జీవులు, సుమారు గంటకి 150 కిలోమీటర్ల వేగంతో గాలిలోకి రావడం జరుగుతుంది. ముక్కు, ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. అయితే చుట్టుపక్కల జనాలకు మాత్రం ఇబ్బంది తప్పదు. అందుకని తుమ్ము వచ్చినప్పుడు నోటికి, ముక్కుకి చేతులను అడ్డుగాపెడతాం. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ వెంటనే చేతులను శుభ్రపరచుకోకుండానే మిగతా పనుల్లో నిమగ్నమవుతాం, ఆహారాన్ని తీసుకోవడం, ఇతరులతో కరచాలనం చేయడం.. వగైరా కారణాల వల్ల కూడా బ్యాక్టీరియా విస్తరించడానికి కారణం అవుతుంది. కాబట్టి, తుమ్ము వచ్చే సమయంలో ఎల్లప్పుడూ చేతిరుమాలు కానీ టిష్యూ పేపర్ కానీ  సిద్ధం చేసుకోవడం మరవద్దు.


 

స్విమ్మింగ్ చేసే ముందు.. ఆ తర్వాత.. | Swimming - Protect Your Skin and Hair from Chlorine

పిల్లలకు వేసవి సెలవులు వచ్చాయంటే వారివారి అభిరుచుల్లో శిక్షణ పొందడం అంటే మహా సరదా. ఇక స్విమ్మింగ్ కి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. పైగా మంచి శరీరాకృతిని కోరుకునేవారికి, ఉల్లాసవంతమైన వ్యాయామం కోరుకునేవారికి ఈత చక్కని ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. స్విమ్మింగ్ నేర్చుకోవడం, ప్రాక్టీస్ అంతా కొలనులో, అందునా ట్రైనర్ మధ్య కాబట్టి ఎలాంటి ప్రమాదం లేదనుకుంటే పొరపాటే. ఏమాత్రం అశ్రద్ధ వహించినా వ్యాధులు పొంచి ఉండే అవకాశం ఉంది. పిల్లలు, పెద్దలు ఈతను సరదాగా ఎంజాయ్ చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

- భోజనం చేసిన వెంటనే ఈత కొట్టకూడదు.
 

- స్విమ్మింగ్‌పూల్‌లోకి వెళ్లక ముందు, స్విమ్మింగ్‌ పూర్తయ్యాక శుభ్రంగా తలస్నానం చేయాలి.
 

- కొలనులో తల తడవకుండా మాస్క్ పెట్టుకోవాలి, అలాగే చెవుల్లోకి నీళ్లు పోకుండా ఇయర్‌ ప్లగ్స్‌,  కళ్లకు గాగుల్స్ తప్పక పెట్టుకోవాలి.
 

- స్విమ్మింగ్‌పూల్‌ నీటిలో కలిపే క్లోరిన్ తదితర రసాయనాలు సరైన పాళ్లలో ఉండాలి లేదంటే చర్మం, తలవెంట్రుకలు, కళ్లకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
 

- స్విమ్మింగ్‌పూల్‌ ఆరుబయట ఉన్నట్లైతే మధ్యాహ్నం ఎండలో ఈత పనికిరాదు.
 

- స్విమ్మింగ్‌ పూర్తవగానే దుస్తులు మార్చుకుని పూర్తిగా తుడుచుకోవడం మరవద్దు. అవసరమనుకుంటే మాయిశ్చరైజర్ కూడా వినియోగించాలి.


దోమలు పరార్! | How to Get Rid of Mosquitoes | World Malaria Day, 25 April

గాలిలోని వాహకాలు, దోమల ద్వారా వ్యాపించే మలేరియా వ్యాధి వేసవిలో మరింత విజృంబిస్తుంది. సరియైన సమయంలో చికిత్స అందకపోతే ఈ జ్వరం మెదడు, కిడ్నీలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో మలేరియా కారణంగా సంభవిస్తున్న వేల మరణాలను తగ్గించడానికి నిపుణులు ఇంటి పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా సూచిస్తున్న జాగ్రత్తలు ఇవి..

- గృహాలు, సమీప పరిసరాలు ఎవరికి వారు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆ ప్రాంతంలో దోమలు వృద్ధి చెందకుండా చూడవచ్చు

- బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయకుండా, పనికి రాని పాత వస్తువులను ఎప్పటికప్పుడు చెత్త సేకరణ సిబ్బందికి ఇచ్చేయాలి

- వాటర్ సంప్, స్టోరేజ్‌ ట్యాంకుల్లో తాజా వేపగింజల పొడిని చల్లితే దోమలు చేరవు

- కూలర్లలో నీళ్లు నిల్వలేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి

- తాగి పడేసిన కొబ్బరి బోండంలోకి వర్షం నీరు చేరకుండా చూడాలి

- నిలువ నీటిని తొలగించడం, ఎటూ మార్గంలేకపోతే కిరోసిన్ చల్లాలి

- నీటి బిందెలు, బకెట్, వంటపాత్రలపై ఎల్లప్పుడు విధిగా మూతలు ఉండేలా చూసుకోవాలి

- దోమతెరలు ఉపయోగించడం లేదా వేప నూనె, కర్పూరం వగైరా ప్రకృతి సిద్ధంగా లభించే పదార్థాలతో దోమలకు చెక్ పెట్టాలి కాని మస్కిటో కాయిల్స్‌, ఎలక్ర్టికల్‌ రీఫిల్స్‌ జోలికి వెళ్లకూడదు

 

pc:internet

వంటింటి చిట్కాలు | Kitchen Hacks: Genius Ways to Save Time and Money

- ఉప్మా చేసేటప్పుడు ఉండ కట్టకుండా బొంబాయి రవ్వను కాస్త వేయిస్తారు. ఇది రుచి మారుతుందనుకున్నప్పుడు నూకకి చెంచా నూనె పట్టిస్తే సరి.

- తేనెను చిమలు ఇట్టేపట్టేసి చికాకుపెడ్తుంటాయి. అందుకని తేనె  సీసాలో నాలుగు మిరియాలు వేస్తే ఇక చీమలు దరిచేరవు.

- అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా ఎక్కువరోజుల పాటు ఉండాలంటే వాటిని గ్రైండ్ చేసే ముందు లైట్ గా ఫ్రై చేసుకోవాలి.

- అరటికాయ  ముక్కలను తరిగి నీళ్లలో వేస్తున్నా నల్లబడుతున్నాయి అనుకున్నప్పుడు మజ్జిగలో వేసుకోవడం ఉత్తమం.

- ఇది ఆవకాయలు పట్టే సీజన్. నిలవ పచల్లకు అన్నీ రకాల నూనెలు అంత రుచించవు. అందుకని ఆవ నూనెను వాడితే అవి ఎక్కువ రోజులు తాజాగానూ ఉంటాయి.

- కాచిన నెయ్యి సువాసనలకు తోడు కమ్మని రుచి చేకూరాలంటే అందులో కాసిని మెంతులు వేయాలి.

- పచ్చిమిరపకాయలను తరిగాక చేతులకు మంటలు ఒకపట్టాన వదలవు. అలాంటప్పుడు పంచదార కలిపిన నీళ్ళతో చేతుల్ని కడిగి చూడండి.

- కారం పొడి డబ్బాలో చిన్న ఇంగువ ముక్క వేసి ఉంచితే  పురుగులు పట్టకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

- బల్లులు ఇంట్లో తిరుగుతూ ఇబ్బంది పెడుతున్నాయా? అయితే కోడిగుడ్డు పెంకులను అవి సంచరించే ప్రాంతాల్లో అమర్చండి.

- అన్నం ఉడికే సమయంలో చెంచా నెయ్యి కాని వెన్న కాని వేస్తే అన్నం ముద్ద కాకుండా పొడి పొడిగా వస్తుంది. పులిహోర, దద్ధోజనం, మిగతా రకరకాల రైస్ లు కలుపుకోవడం చాలా సునాయసం అవుతుంది.
pc:internet

కంటి చూపుతో.. | Tips for Healthy Eyes

 
వేసవి కాలంలో నేత్రాలపై దృష్టి సారించాలి. కళ్లు ఈ ఎండల్లో అధిక వేడి, వెలుతురుతో ఇట్టే శ్రమకు లోనవుతాయి. పైగా కళ్లమంటలు మొదలవుతాయి. కంటి ఆరోగ్యం పది కాలాలు పదిలంగా ఉండాలంటే కనీస జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.

- చదువుతున్నప్పుడు సరిపడా వెలుతురు ఉండడంతో పాటు పుస్తకం కంటికి 30 సెంటీమీటర్ల దూరంలో 45 డిగ్రీల కోణంలో ఉండాలి. ఊయలలో కూర్చుని, సోఫాల్లో పడుకుని పుస్తకాలు చదవడం వల్ల కళ్లపై భారం ఎక్కువ పడుతుంది. అందుకని నిటారుగా కూర్చొని మాత్రమే చదవడం మంచిది.

- కంప్యూటర్ మానిటర్, ల్యాప్ టాప్ పైన పనిచేస్తున్నప్పుడు కూడా కుర్చిలో నిటారుగా కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు కాళ్లు నేలపై ఆనించి ఉండాలి. స్క్రీన్ మనకు సమంతరంగా, సరియైన ఎత్తులో ఉండేలా జాగ్రత్త పడాలి. పరిసరాల వెలుతురు, మానిటర్ బ్రైట్ నెస్ విషయంలో తగు జాగ్రత్త అవసరం. కళ్ల రెప్పలు తరచుగా కొట్టడం, నిరంతరం పనిచేయకుండా మధ్య మధ్యలో విరామం తీసుకోవడం చేయాలి. కీబోర్డు, మౌస్ లను సమానస్థాయిలో ఏర్పాటుచేసుకోవాలి.

అలాగే కంటి వ్యాయామం విషయంలోనూ అశ్రద్ధ పనికిరాదు. తలను ఏ మాత్రం కదల్చకుండా కళ్లను వీలైనంత పైకి, కిందకు, ఎడమ, కుడి పక్కలకు తిప్పి కాసేపు చూడాలి. తలను విశ్రాంతి దశలోనే ఉంచి చూపును క్లాక్వైజ్, యాంటీక్లాక్వైజ్ తిప్పాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు సరియైన వ్యాయమంతో పాటు విశ్రాంతి దొరుకుతుంది. అందమైన, ఆరోగ్యకరమైన నయనాలు మీ సొంతం అవుతాయి.


పెరటి తోటల పెంపకం | The Surprising Health Benefits of Gardening


మానసిక ఒత్తిళ్లను అధిగమించాలంటే రోజూ కాసేపు తోటపని చేయాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. పచ్చని మొక్కలు, విరబూసిన పూలు.. ఎంతటి ఒత్తిడినైనా క్షణాల్లో మాయం చేస్తాయి. ఇలా గార్డెనింగ్ ప్రయోజనకరంగా, ఆసక్తికరంగా ఉండడమే కాక మంచి వ్యాయామం కూడా. గంట పాటు తోటపని చేస్తే కనీసం 500 క్యాలరీల వరకు కరిగిపోతాయి.
 

అందమైన పెరటితోటలను రూపొందించాలంటే మొక్కలు నాటాలనే తపన ఉంటేనే సరిపోదు. క్రమం తప్పకుండా రోజూ వాటికి సమయం కేటాయించాలి. సహజమైన వాతావరణంలో మొక్కల పెంపకం వల్ల ప్రకృతితో మమేకమయ్యామన్న భావన కలుగుతుంది. ఇది మానసికంగా సంతోషాన్నిస్తుంది. మనసుంటే పెరటి తోటల పెంపకానికి స్థలం లేదనే భావనే దరిచేరదు. ఆకుకూరలు, కూరగాయలు, పూలమొక్కలు వగైరా కుండీల్లోనూ పెంచుకోవచ్చు. పెరట్లో కాసిన కూరగాయలను వండుకుని తింటే వాటి రుచే వేరు. ముంగిట్లో పూసిన పూవుల వాసన గుభాలిస్తుంది. ఇలా గార్డెనింగ్ కి పడ్డ శ్రమ వృథా కాదు. అంతేకాకుండా శరీరాన్ని ఫిట్‌గా ఉంచేందుకు, ఫలితంగా ఒత్తిడి తగ్గేందుకూ తోడ్పడుతుంది. ఇలా పెరటి తోటల పెంపకం మానసికంగా, శారీరకంగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.


ఏసీ నిర్వాహణ.. | Tips to Improve Air Conditioner Efficiency | Save Electricity

వేసవిలో ఎయిర్‌ కండీషనర్ల వాడకంతో సాధారణంగా విద్యుత్‌ వినియోగం చాలా పెరుగుతుంది. అయితే ఏసీ కొనుగోలు, నిర్వాహణలో తగు జాగ్రత్తలు తీసుకుంటే కరెంట్ బిల్లుల మోత తగ్గించడమే కాక హాయిగా కూల్ కూల్ గా హాట్ సమ్మర్ ని గడిపేయవచ్చు.

- గది పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత సామర్ధ్యం గల ఏసీ అవసరమో చూసుకోవాలి. ఒక టన్ను సామర్థ్యం ఉన్న ఏసీ గంటకు ఒక యూనిట్‌ వరకు విద్యుత్‌ ఖర్చు చేస్తుందని గమనించాలి.

- రెండో అంశంగా స్టార్ రేటింగ్ పై దృష్టి సారించాలి. రేటింగ్ అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని అంచనా వేసి ఆయా ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు ర్యాంకులు కేటాయించడం. వీలైనంత వరకు ఎక్కువ రేటింగ్‌ ఉన్న ఏసీ కొనుగోలు చేయడం మేలు.

- అలాగే ఇన్వర్టర్‌ టెక్నాలజీ ఉన్న ఏసీలు తీసుకుంటే సగానికి పైగా విద్యుత్‌ ఆదా అయ్యే అవకాశం ఉంది.

- ఏసీ ఫిటింగ్ లో ఉపయోగించే కాయిల్స్‌ ఎంపికలోనూ జాగ్రత్తపడాలి. కాపర్‌ కాయిల్స్‌ అయితే వేడిని గ్రహించడం వదిలేయడంలో అల్యూమినియంకన్నా సమర్థవంతంగా పని చేస్తాయి. ఏసీ పనితీరు సమర్ధవంతంగా ఉంటుంది.

- ఏసీ గదిలోకి బయట నుంచి గాలి చొరబడకూడదు. నేరుగా ఎండపడకూడదు లేదంటే గదిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీంతో ఏసీపై చాలా భారం పడుతుంది. అవుట్‌ డోర్‌ యూనిట్‌పై కూడా ఎండ పడకుండా చూసుకోవాలి.

- అలాగే దుమ్ముధూళీ చేరకుండా చూసుకోవాలి. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే ఏసీలోని కాయిల్స్‌ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకని తరుచూ ఏసీ యూనిట్ ని శుభ్రం చేయడం మరవద్దు.

- ఏసీ ఉన్న గదిలో వీలైతే సీలింగ్ ఫ్యాన్‌ కూడా వేసి ఉంచడం ద్వారా ఏసీపై పడే భారాన్ని తగ్గించవచ్చు. 
 
 
 pc:internet

నిప్పుల కొలిమి.. ఆరోగ్యం చెక్కుచెదరకుండా చిట్కాలు | Tips for a Healthy Summer

తెలుగు రాష్ట్రాల్లో విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించినట్టుగా ఈ వారం ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదు అవుతున్నాయి. ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటేయగా 44 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశముంది.  ఇలా ఎండలు మండిపోతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.

వేసవిలో త్వరగా అలసిపోతాం. మండుటెండలకు ఒళ్ళంతా చిటపటలాడుతుంది. ఏ మాత్రం ఎండలోకి వెళ్ళినా చెమటలు పట్టడం, చర్మం నల్లబడడం, గొంతు ఆరిపోయి తరచూ దాహం వేయడం జరుగుతుంటుంది.  మరి వేసవి అంతా హాయిగా గడపడానికి ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు అత్యవసరం. అలాగే కొన్ని చిట్కాలు కూడా పాటిస్తే ఆరోగ్యం చెక్కుచెదరకుండా ఉంటుంది.

- తేలికగా జీర్ణమయ్యే ఆహారపదార్థాలను ఎంచుకోవాలి. నూనెలో వేపిన పదార్థాలు, మసాలలతో పాటు పులుపు, కారం తగ్గించాలి.

- వేసవిలో విరివిగా లభ్యమయ్యే ఆకుకూరలు, జామ, రేగు, పనస, అరటి, మామిడి, ద్రాక్ష పలు రకాల పసందైన పండ్లు రోజూ వాడాలి.

- చెరకు రసం, కొబ్బరినీళ్ళు ఇతర పండ్ల రసాలను ఆధికంగా తీసుకోవాలి. కూల్ డ్రింకులు, షోడాల్లాంటి పానీయాల జోలికి వెళ్ళకూడదు.

- కొత్తకుండలో నీళ్ళు, నిమ్మరసం, మజ్జిగ, పుచ్చకాయల వాడకం పెంచాలి. ఇవన్నీ తేలికగా జీర్ణమయ్యి ఆకలిని పెంచుతాయి. అంతేకాకుండా మానసిక ఉల్లాసం, ఆహ్లాదం కలిగిస్తాయి.

- రాగులు, జొన్నలు, సజ్జలు, బార్లి, సగ్గుబియ్యం, సబ్జ.. మొదలైనవి శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించి ఆరోగ్యానికి మేలు కలుగజేస్తాయి.

- ఎన్ని నీళ్ళు తాగినా దాహం తీరకపోతే గ్లాసు నీళ్ళలో చిటికెడు శొంటి పొడి కలిపి మరిగించి తరచూ కొద్దికొద్దిగా తీసుకుంటే సరిపోతుంది.

- మామిడి పండ్లు వేడిచేసి అనారోగ్యం పాలుచేస్తాయని అపోహలు ఉన్నాయి. కానీ వేసవిలో ఎక్కువగా దొరికే మామిడి పండ్లు మంచి ఆరోగ్యానికి, వేసవి బాధలకు విరుగుడుగానూ పనిచేస్తాయి.

- వేసవిలో శరీరంలోని వేడిని తగ్గించడానికి కీరా దోసకాయలు, సొరకాయ, ఉల్లిపాయలు, ముల్లంగి, టమోటాలు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని విరివిగా వినియోగించాలి.

- కొబ్బరిబోండాం నీళ్ళు వేసవిలో ప్రబలే పచ్చ కామెర్లకు దివ్యౌషధం. పలురకాల వ్యాధులతో పాటు మూత్రవ్యాధులు దూరమవుతాయి. రక్త శభ్రతకు, సెగ గడ్డలు, దురద, తామర - ఇత్యాది చర్మ సంబంధిత అంటువ్యాధులను అరికడుతుంది.
 
 

సైక్లింగ్ తో ఆరోగ్యం | Health Benefits of Bicycle Riding

నడక తరువాత ప్రాధాన్యం ఉన్న వ్యాయామం - సైక్లింగ్.  దీంతో కాళ్లు, చేతులు, భుజాలు, వెన్ను, పొట్ట - ఇతర కండరాల రక్త ప్రసరణ మెరుగై ఆరోగ్యవంతులవుతారు. సైకిల్‌ను ఒక క్రమపద్ధతిలో తొక్కడం వల్ల శ్వాసక్రియ మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి స్థూలకాయం ఏర్పడే ప్రమాదం ఉండదు. శారీరకంగానే కాక
మానసికంగానూ ఎన్నో లాభాలున్నాయి అంలున్నారు నిపుణులు. అయితే సైకిల్ ఎంపిక, నిర్వాహణలో చిట్కాలు చూద్దాం..

ఆన్ లైన్ లో సైకిల్ ధర తక్కువుందనో, మోడల్స్ ఎక్కువున్నాయనో కొనడం ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. షాపుకెళ్లి సరియైనది ఎంచుకోవలసి ఉంటుంది. దీనితో సైజులో, బరువులో సరిపోయినవే కాక అభిరుచికి అనుగుణంగా మోడల్, రంగు ఎన్నుకునే అవకాశం ఉంటుంది.
 
సైకిల్ సరిగ్గా సరిపోవడం అంటే సీటుపై కూర్చుని హైండిల్స్ సౌకర్యంగా పట్టుకున్నప్పుడు రెండు కాళ్ల పాదాలు పూర్తిగా నేలపై ఆనాలి. ఫెడల్స్ సునాయసంగా తొక్కగలగాలి. బ్రేక్ లు వేయగానే సైకిల్ వెంటనే ఆగేలా ఉండాలి. సైకిల్ బెల్, క్యారేజ్, వాటర్ బాటిల్ హోల్డర్ తదతర ఉపకరణాలు అన్నీ అత్యవసరం, ప్రయోజనకరం. ట్రాఫిక్ లో సైకిల్ తొక్కవలసి ఉన్నప్పుడు హెల్మెట్ కూడా తప్పక కొనాల్సి ఉంటుంది.
 
సైకిల్ రైడ్ కి వెళ్లే ముందు కచ్చితంగా ట్యూబ్ లలో గాలి సరిపడా ఉందోలేదోనని టైర్ లని పరీక్షించాలి. అలాగే బ్రేక్ లు, ఇతర ఫిటింగ్స్ పనితనం ముందుగానే చూసుకుని కదలాలి.
 
సీట్ ఎత్తుకి సమంగా హైండిల్ బార్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. సైకిల్ తొక్కడానికి వీలుగా, అంటే కాళ్లు సౌకర్యవంతంగా కదిపేలా సీట్ ని కొంచం ముందుకి వంచుకోవచ్చు.
 
సైకిల్ వెనకాల రేడియం స్టిక్కర్ లు, ముందు లైట్ ఉంటే రాత్రివేళల్లో సైకిల్ తొక్కడం సునాయసం అవుతుంది. ఇవి విధిగా సైకిల్ కి ఉండాలి కూడా.

సైకిల్ వినియోగంతో పర్యావరణ పరిరక్షణనే కాక నిత్యం కనీసం అరగంట తొక్కగలిగితే శారీరక, మానసిక ఉల్లాసం పొందవచ్చు.  సైకిల్‌ తొక్కటం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవటంతో పాటు కండరాల పుష్టికి దోహదం చేస్తుంది. పోటీ ప్రపంచంలో వయసుతో సంబంధంలేకుండా వచ్చే అనేక రకాల రగ్మతలను దరి చేరకుండా సైక్లింగ్ ద్వారా చూసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


 

ప్రపంచ ధరిత్రీ దినోత్సవం | Earth Day - Support for Environmental Protection

ప్రపంచ ధరిత్రీ దినోత్సవం.. ప్రతీయేట ఏప్రిల్ 22న భూ పరిరక్షణపై అవగాహన కోసం కోసం జరుపుకుంటున్నాం. 1970వ సంవత్సరం నుండి ప్రపంచవ్యాప్తంగా ధరిత్రీ దినోత్సవ వేడుకలు, పర్యావరణ అవగాహనా కార్యక్రమాల ద్వారా పర్యావరణం మెరుగుదలకు ప్రతీ ఒక్కరు కృషి సల్పడమే దీని ముఖ్యొద్దేశంగా నిర్వహిస్తున్నాం.

మన వంతుగా మనం చేయాల్సిందల్లా..

- బయటికెళ్ళేందుకు వహనాలు కాకుండ నడిచి వెళ్ళడం లేదా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ఎంచుకోవడం.
- వీలైనంత వరకు ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, రీసైక్లింగ్‌ కు ఉపయోగపడే వాటర్‌ బాటిల్స్‌, బ్యాగ్‌లను మాత్రమే ఉపయోగించడం.
- పర్యావరణ సానుకూల ఉత్పత్తులను వినియోగించండం.
- పొరపాటున కూడా విద్యుత్‌ వినియోగం అవసరానికి మించి ఉండకూడదు.
- పర్యావరణాన్ని కాపాడే చెట్లను బతికించుకోవాలంటే కాగితాల వాడకం తగ్గించాలి. అందుకని ఆన్‌లైన్‌ సదుపాయాన్ని విరివిగా వాడుకోవాలి.
- చెత్తని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడంతో పాటు డిస్పోజబుల్స్ జోలికి వెళ్ళకపోవడం.
- సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి సారించాలి.

కురులు ఏపుగా.. | Tips for Growing Longer Hair Quickly


జుట్టున్న అమ్మడు ఏ కొప్పైనా వేయగలదు.. ఎన్ని పూలైన పెట్టగలదు. ఈ సామెత నిజమే కదా.. మీరూ ట్రై చేయండి మరి..!
 

- గోరు వెచ్చని ఆలివ్ ఆయిల్‌ని జుట్టుకు, కుదుళ్లకు బాగా పట్టించి అర గంట తరవాత తలస్నానం చేయాలి. లేదంటే ఈ ఆయిల్‌ను రాత్రిపూట జుట్టుకు రాసుకుని మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేస్తే మరీమంచిది.

- రాత్రి గుప్పెడు మెంతులను కొన్ని నీళ్లలో నానపెట్టాలి. ఉదయాన్నే దాన్ని పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని తలకి దట్టంగా పట్టించాలి. ఈ మాస్క్ బాగా ఆరాక గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

- సరిపడా కొబ్బరినూనెలో కాస్త ఉసిరి పొడిని చేర్చి కాచి చల్లార్చుకోవాలి. ఈ ఆమ్లా ఆయిల్ ని కురుల కుదళ్లకు చేరేవరకు చేతి వేళ్లతో మర్దనా చేసుకోవాలి.  30 నుండి 40 నిమిషాల అనంతరం శుభ్రపరచుకోవాలి.

మీకు అనువైనా ఏ చిట్కానైనా అవసరాన్ని బట్టి వారానికి ఒకటి లేదా రెండు సార్లు ప్రయోగిస్తే పలు జుట్టు సమస్యలు దూరమవ్వడమే కాక కురులు పట్టుకుచ్చులా, ఏపుగా పెరుగుతాయి. అయితే ఆహారం విషయంలో నిర్లక్ష్యం తగదు. రోజూ గుప్పెడు నట్స్‌ తీసుకోవాలి. అంతేకాకుండా ఆహారంలో గుడ్డు, చేపలు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, పాలకూర, పనీర్‌, దంపుడు బియ్యం.. వగైరా ఉండేలా చూసుకోవాలి. వీటితో లభించే విటమిన్‌, ప్రొటీన్‌ ల వల్లే  కుదుళ్లు బలపడి జుట్టు చక్కగా ఎదుగుతుంది. 


వైభవంగా అష్టలక్ష్మి దేవాలయం బ్రహ్మోత్సవాలు | Ashtalakshmi Temple Brahmotsavam

ముగ్ధమనోహరంగా సాయి నృత్య తరంగిణి శిష్యబృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన

కొత్తపేట, హైదరాబాద్ లోని శ్రీఅష్టలక్ష్మి దేవాలయంలో 22వ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 17 నుండి 23 వరకు నిర్వహించబడుతున్నాయి. ఈ వారం రోజుల పాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు 13 రకాల సేవల్లో ఉదయం, సాయంత్రం వేళ అన్నప్రసాదం ఉంటుంది.

ఆలయ ప్రాంగణంలో ప్రతీ రోజు సాయంకాలం కార్యక్రమాల్లో బాగంగా కీర్తనలు, కూచిపుడి నృత్యాలు నిర్వహిస్తున్నారు.
 

మేలు చేసే మెంతులు | Amazing Fenugreek Benefits | Vantinti Chitkalu

పప్పు, కూర, పచ్చడి, చారు.. ఏ వంటైనా ఘమఘుమలాడాలంటే పోపు (తాలింపు)లో నాలుగు మెంతులు పడాల్సిందే. కేవలం పోపు గింజలుగానే కాకుండా నిత్యం అనేక రకాల ఆహారపదార్థాలలో మెంతులు. మెంతిపొడి, మెంతికూర ఉంటాయి. దీంతోనే ఆయా వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే మెంతులు ఆహారంగానే కాదు, మనకు ఆరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. మెంతులలో అనేక ఔషధగుణాలు దాగున్నాయి. ఆరోగ్యానికి మెంతులు ఎంతగానో ఉపకరిస్తాయి. వీటిలో ఫోలిక్ ఆసిడ్, సోడియం, జింక్, మెగ్నీషియం, కాపర్, థయామిన్, నియాసిన్, కేరోటీన్.. మరెన్నో మూలకాలు కలిగి ఉండడంతో మధుమేహ వ్యాధి, కొవ్వు స్థాయిలను నియంత్రిస్తాయి. రోజు ఉదయాన్నే ఒక చెంచా మెంతి పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగటం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది.

- శరీరంలో ఎక్కువగా ఉండే చెడు కొలెస్ట్రాల్‌ నిల్వలను నియంత్రించి అధిక బరువు సమస్యను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. గుండె సమస్యలు దరిచేరవు.
- అనేక రోగాలకు కారణమయ్యే కఫం, వాతం, మలబద్ధకం.. లాంటి సమస్యలకు మెంతులు దివ్వౌషదంగా పనిచేస్తాయి.
- మెంతులు గ్యాస్ సమస్యలు, అసిడిటీ లను నయంచేయడమేకాక జీర్ణ వ్యవస్థను శక్తివంతం చేస్తాయి. తద్వారా ఆకలి పెరగడానికి దొహదం చేస్తాయి.
- విరేచనాలను అరికట్టడంలో మెంతులు, మజ్జిగ బాగా పనిచేస్తాయి.
- మెంతుల్లో ఉండే ట్రైగోనెల్లిన్‌, కౌమారిన్‌ అనే తత్వాల వల్ల టైప్‌ 1, టైప్‌ 2 మధుమేహాలు రెండింటిలోనూ చక్కని ఔషధం.
- పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచేందుకు మెంతులను విరివిగా ఆహారంగా తీసుకోవాలి.
- ముఖంపై బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మాయమవ్వడానికి మెంతి ఆకులను రుబ్బి ఉపయోగించాలి.
- జుట్టు పట్టుకుచ్చులా తయారవడానికి మెంతులను నీళ్లలో నానపెట్టి రుబ్బుకుని హెయిర్ ప్యాక్ లా వేసుకోవాలి.