వడగళ్ళ వాన.. | Sudden hailstorm cuts scorcher

ఈ సాయంకాలం ఉభయతెలుగు రాష్ట్రాల రాజధానిలో వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వారం అధిక పగటి ఉష్ణోగ్రతల మధ్య వడగళ్ళ వానతో నగరంలో వాతావరణం భిన్నంగా కనిపించింది. ఎండాకాలంలో వర్షాలు పడితే ఎక్కువగా వడగళ్ళతో కూడిన వర్షం వస్తుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఈ వానల వల్ల పెంకుటిళ్ళకు, పంట చేలకు, పశువులకు చాలా నష్టం కలుగుతుంది. చల్లని వాతావరణాన్ని నగరవాసులు ఎంజాయ్ చేస్తున్నా రోడ్లైతే చెరువులను తలపించాయ్. ఎంత ఆదివారమైనా ట్రాఫిక్ జామ్ లు తప్పలేదు. అయితే ఈ వడగళ్ళ వాన ఎలా కురుస్తుందో.. అనే కదా మీ సందేహం..

మేఘాలు ఎత్తుకు వెళ్ళినప్పుడు వాటిపై భాగం చల్లబడి, నీటి ఆవిరి బిందువులుగా మారుతుంది. ఈ స్థితిలో కింద నుండి గాలి మేఘాన్ని ఇంకా పైకి నెట్టుతూ వుండటంవల్ల, ఉష్ణోగ్రత బాగా తగ్గటంవల్ల చిన్న చిన్న బిందువులు ద్రవీకరించి మంచు కణాలుగా ఘనీభవిస్తాయి. బరువైన నీటి కణాలు కిందికి రాలుతూ మంచుకణాలతో కలియటంవల్ల వడగళ్ళుగా మారుతాయి. ఇలా చిన్నచిన్న వడగళ్ళతో కూడిన వానతో ఇబ్బంది లేకపోయినా వాటి సైజు పెరిగే కొద్దీ ప్రాణ, ఆస్థి నష్టాల ప్రమాదం ఎక్కువ కలుగుతుంది.


No comments: