మానసిక ఒత్తిళ్లను అధిగమించాలంటే రోజూ కాసేపు తోటపని చేయాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. పచ్చని మొక్కలు, విరబూసిన పూలు.. ఎంతటి ఒత్తిడినైనా క్షణాల్లో మాయం చేస్తాయి. ఇలా గార్డెనింగ్ ప్రయోజనకరంగా, ఆసక్తికరంగా ఉండడమే కాక మంచి వ్యాయామం కూడా. గంట పాటు తోటపని చేస్తే కనీసం 500 క్యాలరీల వరకు కరిగిపోతాయి.
అందమైన పెరటితోటలను రూపొందించాలంటే మొక్కలు నాటాలనే తపన ఉంటేనే సరిపోదు. క్రమం తప్పకుండా రోజూ వాటికి సమయం కేటాయించాలి. సహజమైన వాతావరణంలో మొక్కల పెంపకం వల్ల ప్రకృతితో మమేకమయ్యామన్న భావన కలుగుతుంది. ఇది మానసికంగా సంతోషాన్నిస్తుంది. మనసుంటే పెరటి తోటల పెంపకానికి స్థలం లేదనే భావనే దరిచేరదు. ఆకుకూరలు, కూరగాయలు, పూలమొక్కలు వగైరా కుండీల్లోనూ పెంచుకోవచ్చు. పెరట్లో కాసిన కూరగాయలను వండుకుని తింటే వాటి రుచే వేరు. ముంగిట్లో పూసిన పూవుల వాసన గుభాలిస్తుంది. ఇలా గార్డెనింగ్ కి పడ్డ శ్రమ వృథా కాదు. అంతేకాకుండా శరీరాన్ని ఫిట్‌గా ఉంచేందుకు, ఫలితంగా ఒత్తిడి తగ్గేందుకూ తోడ్పడుతుంది. ఇలా పెరటి తోటల పెంపకం మానసికంగా, శారీరకంగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
No comments:
Post a Comment