పంచామృతలలో పెరుగు ఒకటి. దాని నుండి వచ్చిందే మజ్జిగ లేదా చల్ల. ఆయుర్వేద నిపుణులు మజ్జిగను మంచి సాత్వికాహారం అంటున్నారు . వాత, కఫ దోషాలను తగ్గిస్తుందంటున్నారు. సంవత్సరం పొడవునా అవసరమే అయినా మండే ఎండలను సైతం మనం సమర్థంగా ఎదుర్కోవాలంటే మజ్జిగ ఉండాల్సిందే. దీనికి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం, జీలకర్ర, వాము, నిమ్మరసం.. ఏదైనా ఒకటి కాస్త చేరితే మజ్జిగకు మించిన ఆహారమే ఈ కాలంలో ఉండదు. మండువేసవిలో డీహైడ్రేషన్ భారిన పడకుండా మంచి ఎలక్ట్రోలైట్‌లా చల్ల పనిచేస్తుంది. చక్కని ఆరోగ్యంతో పాటు సౌందర్యసాధనంగానూ ఇది ఉపయోగపడుతుంది. ఇంటికి వచ్చిన అతిధులకు మంచినీళ్ళు, ఆ తరవాత మజ్జిగను ఇచ్చే సంప్రదాయం మనది. ఇక అదే ఈ సమ్మర్ లో అయితే మజ్జిగ వినియోగం ఎక్కువే అని చెప్పాలి. మన జీర్ణవ్యవస్థలో కోటానుకోట్ల సూక్ష్మజీవులు రోగనిరోధకశక్తిని పెంపొందిస్తూంటాయి. అందుకే వీటిని ప్రోబయోటిక్ అని వ్యవహరిస్తారు. మజ్జిగలో సహజంగా ఉండే ప్రోబయోటిక్ లక్షణాల వల్ల మనకు ఆరోగ్యం చేకూరుతుంది. అందువల్ల పరగడుపున మొదలు, నిద్రకుపక్రమించే వరకు ఎన్నిసార్లు వీలైనా మజ్జిగను నిరభ్యంతరంగా తాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
No comments:
Post a Comment