శునకాల పెంపకం - ఒక అవగాహణ | Pet Care - How to take care of your dog

కుక్క విశ్వాస జంతువు. కుక్క పిల్లలని అల్లారుముద్దుగా పెంచుకుంటే కుటుంబసభ్యులందరితో అతిసన్నిహితంగా ఉంటూ, అభిమానాన్ని చూరగొంటూ కుటుంబంలో ఒక భాగం అవుతాయి. శునకాలు కాలక్షేపంగా, ప్రాణపదంగా ఉంటూ ఆనందాన్ని పంచుతాయి. అయితే వీటి కొనుగోలు, పెంపకం ఖరీదైన వ్యవహారమే. పెంపుడు కుక్కను ఎంచుకోవడానికి దాని జాతి, జీవితకాలం, పోషణ,  నడత.. ఇలా అనేక విషయాలు పరిగణలోకి తీసుకొవాల్సి ఉంటుంది. కేవలం ఆరుబయట తిరుగుతూ కాకుండా ఇంటి వాతావరణంలో, అపార్ట్ మెంట్లలో ఉండ గలిగే వాటిని చూసుకోవాల్సి ఉంటుంది.

వీటి అలనాపాలనలో ఏ మాత్రం అజాగ్రత్తవహించినా బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల భయంకర వ్యాధులు సోకుతాయి. వీటి వల్ల వచ్చే పార్వో, రేబిస్, హైపటైటిస్ వ్యాధులను మందులు కూడా అంత సులువుగా నయం చేయలేవు. వాటి నివారణకు ముందుగానే టీకాలు విధిగా వేయించాల్సి ఉంటుంది. కొన్ని వ్యాధులు కుక్కల నుంచి మనుషులకు కూడా వచ్చే అవకాశం ఉంది. కుక్క పిల్లల్లో సకాలంలో రోగనిరోధక టీకాలు వేయించక పోతే ప్రమాదకరమైన పార్వో వైరస్ సోకి అకస్మాత్తుగా మృతి చెందుతాయి.  కుక్కకాటు అనగానే కళ్లు తేలేసి, నోరు తెరిచేసి టక్కున గుర్తుకు వచ్చే అతి భయంకరమైన వ్యాధి - రేబిస్. రేబిస్ వ్యాధి కుక్క కాటు ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుంది. అందుకని వెటర్నరీ డాక్టర్లను ముందుగానే సంప్రదించి సంవత్సరానికొకసారి కుక్కలకు టీకాలు విధిగా చేయిస్తుండాలి. కుక్కల్లో తరచుగా అంతరపరాన్నజీవులు ప్రేవులను ఆశ్రయించి ఆరోగ్యం పూర్తిగా క్షీణించేలా చేస్తాయి. ఈ విషయంలో పశువైద్యుల సలహాలు తు.చ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.

కుక్కల స్నానాకి కార్బాలిక్, డియోరెంట్ గుణాలు కల సబ్బులు వాడకూడదు. స్నానానంతరం పొడిబట్టతో తడి ఆరిపోయేలా తుడవాలి. ఆహారంలో సరిపడా కాల్సియం లభించినా ఇళ్లలోనే తిరిగే కుక్కల్లో డి-విటమిన్ లోపంతో బాధ పడుతుంటాయి. కనుక ఉదయం, సాయంత్రం వేళల్లో బయట తిప్పటం వల్ల సూర్యరశ్మితో డి-విటమిన్ శరీరంలోకి చేరుతుంది. అలాగే వ్యాయామం కూడా చేకూరుతుంది. అలాగే ఆహారం విషయంలోనూ సమయపాలన పాటించాలి. అన్ని వేళలా స్వచ్ఛమైన నీటిని అందుబాటులో వుండేలా చూడాలి. వాటి కాలకృత్యాలకు నిర్నీత సమయాలను అలవాటు చేయాలి. నలతగా ఉన్నా, జబ్బులేమైనా వచ్చినా వెంటనే వైద్యశాలకు తీసుకెళ్లాలి. పుష్టికరమైన ఆహారంతో పాటు వైద్యుడి సలహా మేరకు సిరప్, ఇంజక్షన్లు వాడుతుండాలి. అల్లారుముద్దుగా పెంచుకునే కాలబైరవులకు అప్పుడప్పుడు డాగ్ షోలు, క్లబ్బులు అంటూ షికార్లు అవసరం. వాటిని చీటికిమాటికి కసురుకోవడం తగదు.

కుక్కల ఆరోగ్యం విషయంలో అంత శ్రద్ద కనబరచి, మన ఆరోగ్యం విషయంలో ఏమరుపాటు వహిస్తే ప్రమాదమే. వీటి వ్యర్థాలతో బహుపరాక్ అంటున్నారు నిపుణులు. కుక్కలకు స్నానం చేయించిన అనంతరం చేతుల్ని శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. కుక్కలు పైకెగిరి ముఖమంతా, ఒళ్లంతా నాకకుండా చూసుకోవాలి. సరదాకైనా కుక్కలు కొరకకుండా జాగ్రత్తపడాలి. వాటికి కేటాయించిన పాత్రల్లోనే ఆహారపదార్థాలను అందించాలి. ప్రధానంగా వంటింట్లోకి కుక్కలు చొరబడకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలు కుక్కలతో ఆడుకుంటున్నప్పుడు కని పెడుతుండాలి. పిల్లల చేతుల్లో వుండే తినుబండారాలపైన ఎగబడి దాడి చేసే అలవాటును కుక్కల్లో మానిపించాలి.

మూగ జీవాలతో మన సహజీవనం బాగానే ఉంటుంది. మరి ఇతరులకు హాని కలగకుండా వుండాలంటే మాత్రం 'కుక్కలున్నాయి జాగ్రత్త!' అనే బోర్డ్ తగిలించడం మరవకూడదు.


No comments: