శరన్నవరాత్రులలో బొమ్మలకొలువు | Bommala Koluvu | Golu Dolls

దసరా పండుగ వచ్చింది - సరదాలెన్నో తెచ్చింది.. ఈ ఆనందం, ఉత్సాహాల మధ్య దసరా 'బొమ్మల కొలువు' ఆడపిల్ల ఉన్న ప్రతీ ఇంటా కొలువు తీరింది. దసరా నవరాత్రులలో పది రోజుల పాటు బతుకమ్మ ఆటపాటలకు తోడు బొమ్మలకొలువు పండగ జరుపుకుంటారు. ప్రతి రోజూ సాయంత్రము పేరంటానికి ముత్తైదువులను, పిల్లలను పిలిచి, అందరికీ తాంబూలము, దక్షిణ ఇవ్వడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం.
బొమ్మల కొలువు ప్రారంభించిన సంవత్సరం ఒక వరుస బొమ్మలతో మొదలై ప్రతీ సారి ఒకటి చొప్పున తొమ్మిది మెట్ల వరకు పెంచుతూ వెళతారు. ప్రతీ సంవత్సరము తప్పనిసరిగా ఓ క్రొత్త బొమ్మ కొనడం సంప్రదాయం. అలాగే వచ్చిన వారు కూడా ఒక కొత్త బొమ్మను బహుకరిస్తారు. బొమ్మల కొలువులో ప్లాస్టిక్ బొమ్మలు, బార్బీలు.. వంటివి కాకుండా మట్టి బొమ్మలు, కొయ్య బొమ్మలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి.

సంస్కృతి సంప్రదాయాలు, నీతి కథలు, పురాణ గాథలు, ఇతిహాసాలు పిల్లలకు బోధపడేలా బొమ్మల కొలువును తీర్చిదిద్దుకోవాలి. దేవుని బొమ్మల్లో వినాయకుడు, సీతారాములు, రాదాకృష్ణులు, లక్ష్మిదేవి, సరస్వతిదేవి, పార్వతిదేవి.. పెట్టుకోవచ్చు. ఇక పెళ్ళితంతు బొమ్మలు, హాస్యబొమ్మలు, బామ్మ-తాత, గోపికలు, వివిధ జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, పండ్లు, చెట్ల బొమ్మలు,  ప్రయాణ సాధనాలు వంటివి కొలువులో ప్రత్యేక ఆకర్శనగా నిలుస్తాయి.


No comments: