ఆనంద దీపావళి వేళ.. | Safety Tips to Ensure a Happy Diwali


దీపావళి అనగానే పిల్లలు, పెద్దలు కలసి బాణాసంచా కాలుస్తూ సంబరంగా జరుపుకొనే పండగ. అయితే అప్రమత్తంగా ఉంటేనే పండగ సంబరంగా జరుపుకోవడం సాధ్యమవుతుంది. వారివారి వయసుని దృష్టిలో పెట్టుకుని దూకుడుగా ప్రవర్తించ కుండా టపాకాయలు ఎంచుకోవడం, కాల్చడం అవసరం. ఆడంబరాలకు, పోటీలకు పోయి ఎక్కువ డబ్బులు టపాకాయాలకు ఖర్చుపెట్టకుండా, నిరాడంబరంగా జరుపుకుంటేనే మంచిదని గమనించాలి. ముఖ్యంగా పిల్లలకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. టపాకాయలు కాల్చుతూ ఆనందంతో ఉరకలేస్తుంటారు. ఈ ఆనందం విషాదాన్ని మిగల్చకూడదు. అందుకే పిల్లలను కనిపెడుతూ ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే!

- టపాసులు కాల్చేవేళ కాటన్ వస్త్రాలు, ఎక్కువ వదులుగా లేని దుస్తులు మాత్రమే ధరించాలి. ఒక వేళ నిప్పురవ్వలు పడినా మంటలు త్వరగా వ్యాపించకుండా ఉంటుంది.
- బాణాసంచా కాల్చే ప్రదేశం నుంచి పసి పిల్లలను, వృద్దులను, శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారిని దూరంగా ఉంచాలి.
- పెద్దపెద్ద శబ్దాల వల్ల గుండె అదురుతుంది. గుండె వ్యాదులు ఉన్న వారు ఇటువంటి శబ్దాలకు దూరంగా ఉండాలి.
- బాణసంచా కాల్చేటప్పుడు చెప్పులు లేదా షూస్ తప్పక వేసుకోవాలి.
- పిల్లల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఒంటరిగా బాణసంచా కాల్చేందుకు అనుమతించకూడదు. పిల్లల వద్ద పెద్దలు కచ్చితంగా ఉండాలి.
- చిచ్చుబుడ్లు, బాంబులు, మతాబులు, టపాసులు.. వగైరా వెలిగి పేలకుండా ఆరిపోయిన వాటి జోలికి పొరపాటున కూడా వెళ్లకూడదు.
- కాలిన టపాసులు, ఇనుప ఊచలు.. మొదలైన వాటిని ఎప్పటికప్పుడు పక్కన పడేయాలి. 
- ఆరుబయట ఖాళీ ప్రదేశాల్లోనే టపాసులు కాల్చాలి. ఇల్లు, అపార్ట్‌మెంట్లలో, నలుగురు తిరిగే వీధుల్లో బాణాసంచా కాల్చరాదు.
- గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్, ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్ ల వద్ద టపాసులు ఉంచరాదు.
- ఎక్కువ మొత్తంలో వెలుగులు విరజిమ్మి కంటికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూలింగ్‌ గ్లాసులు పెట్టుకోవడం ఉత్తమం.
- క్రాకర్స్ శబ్దాలతో చెవులు గిళ్ళుమనకుండా పిల్లలు, పెద్దలు ఎవరైనా చెవులలో దూది పెట్టుకోవడం మర్చిపోకూడదు. దీని వల్ల కర్ణభేరికి హాని జరగకుండా ఉంటుంది.
- చిన్నచిన్న ప్రమాదాలను తప్పిచ్చడానికి ఇసుక, నీరు అందుబాటులో విధిగా ఉంచుకోవాలి.
  అలాగే బర్నాల్ లాంటి ప్రధమచికిత్స మందులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
- టపాసుల తయారీలో వినియోగించే వివిధ రకాల రసాయన పదార్థాల కారణంగా ఆరోగ్యం దెబ్బతినకుండా వాటినుంచి జనించే పొగకు దూరంగా ఉండాలి.
  అలాగే చేతులు శుభ్రపరచుకుని మాత్రమే ఆహారం తీసుకోవాలి. కళ్లకు కూడా ఈ రసాయనాలు తగలకుండా జాగ్రత్తపడాలి.
- ఈ ఆనంద సమయాన ఏమరుపాటుతో ప్రమాదాలను కొనితెచ్చుకోకుండా ఉండడమే కాక, ఇతరులకు, పక్షులకు, జంతువులకు కూడా ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాలి.
- శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం వగైరాలు తలెత్తకుండా పర్యావరణ అనుకూలమైన దీపావళిని జరుపుకోవాలి.


 

No comments: