జర భద్రం బిడ్డా.. | Health Risks associated with Cell Phones

మళ్ళీ సెల్ ఫోన్ పేలడం మూడవ తరగతి చదువుతున్న జగన్మోహన్‌ ఆచారి తీవ్రగాయాలపాలవడం అందరిని కలచివేస్తున్న విషయం. సెల్‌ఫోన్‌లో పాటలు వింటుండగా బ్యాటరీ భారీ శబ్దంతో పేలడంతో బాలుడి కుడిచేతి వేళ్లు తెగిపడిన ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఇలాంటి దుర్ఘటనలు తరచూ జరుగుతూ రానురాను సెల్ ఫోన్ కాస్తా హెల్ ఫోన్ గా మారిపోతోంది. మొబైల్ ఫోన్లతో ఎంత ఉపయోగమో అంత అనర్థమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా పిల్లల్లో నేరుగా మెదడు ఎదుగుదలపై ప్రభావం చూపుతుందంటున్నారు. ఇక తిండి, నిద్ర, చదువు.. అయితే సరేసరి. సెల్‌ఫోన్‌ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నా పెడచెవిన పెట్టేవారే ఎక్కువున్నారు. రోజురోజుకు ఆహారం, విశ్రాంతి, చేసేపని మీద ద్యాస కరువవుతోంది. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం ఫ్యాషన్‌ అయిపోయింది. అలాగే సెల్ఫీల పిచ్చి పీక్స్ కి చేరి యువత ప్రాణాలు కోల్పోతోంది.

అసలు సెల్ ఫోన్ అనేది పైకాన కంటే అపరిశుభ్రమైన పరికరం. ఏరోజూ శుభ్రతకు నోచుకోక వంటింటి నుంచి వాష్ రూం దాకా, బయటి అడుగుపెట్టినప్పటి నుంచి పబ్లిక్ టాయ్‌లెట్ దాకా అన్నీ చోట్ల సెల్ ఫోన్ వినియోగించడంతో అధిక శాతం క్రిములు దాంట్లోనే చేరతాయి. ఈ బ్యాక్టీరియా అనేక రుగ్మతలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక స్మార్ట్ ఫోన్ లు వచ్చాక అందరి చేతుల్లో ఇట్టే ఇముడుతున్న ఈ సెల్ ఫోన్ నుండి వెలువడే రేడియేషన్ తో ప్రాణానికి హాని తలపెట్టే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువే ఉన్నాయంటూ అధ్యయనాలు ఇప్పటికే చెప్పాయి. సిగ్నల్ వ్యవస్థ, బ్యాటరీ ఛార్జింగ్ సరిగా లేనప్పుడు మొబైల్ వినియోగంతో ఈ ముప్పు తప్పదని నిపుణులు అంటున్నారు.


 pc:eetv, eenadu

No comments: