గులాబీ మొక్కల సంరక్షణ | Rose Garden : Growing Roses in Pots

వాతావరణం అనుకూలంగా ఉండడంతో పూలమొక్కలకు భలే మంచి గిరాఖీ ఉంది. వీటిల్లో ప్రధానంగా రకరకాల రంగుల్లో పువ్వులు విరభూసే గులాబీ మొక్కలంటే మగువలకు మక్కువ ఎక్కువ. రెండు గులాబీ మొక్కల కుండీలు ఉన్నా ఇంటికి శోభనిస్తాయి. గులాబీకి ఒక రంగు అంటూ ఉన్నా ఎరుపు, తెలుపు, పసుపు, నీలం - ఇలా నానా రకాలరంగుల్లో గులాబీలు పూస్తాయి. చిన్నిచిన్న మొక్కలకే ఎక్కువ పువ్వులు పూయడం వల్ల కుండీలను పైభాగాన 25 నుంచి 30  సెంటీమీటర్ల వ్యాసార్థం కలవి ఎన్నుకోవాలి. కుండీలు మట్టితో చేసి కాల్చినవి వాడడం ఉత్తమం. కుండీలో నీళ్ళు నిలువ ఉండకుండా అడుగున కన్నం ఉండేలా జాగ్రత్తపడాలి. ఇలా కారిన నీరు వృథా కాకుండా కుండీల కింద సరిపడా ట్రేలను విదిగా వాడుకోవాలి. కుండీల్లో మట్టితోపాటు కంపోస్ట్ ఎరువును రెండు, ఒకటి నిష్పత్తిలో గుల్లగా చేసి కలిపి నింపాలి. కుండీలో నీళ్ళు పోయడానికి వీలుగా పైన 5 సెంటీమీటర్ల వరకు ఖాళీస్థలం ఉండాలి.

నర్సరీల్లో అమ్మే గులాబీ మొక్కలను ప్లాస్టిక్ బ్యాగుల్లో ఉండడంచేత వాటిని తీసి మళ్ళీ నాటేప్పుడు మట్టిలోకి ఆకులు, మొగ్గలు కలిసిపోకుండా చూడాలి. మొక్కను నిటారుగా కుండీలోకి దించాక చుట్టూ చేతి వేళ్ళతో మట్టిని నెమ్మదిగా నొక్కాలి. మొక్కను నాటాక రోజూ రెండుపూటలా నీళ్ళు అవసరమైనన్ని పోస్తుండాలి. గులాబీ మొక్కలను పెంచడం సరదాగా, చాలా సులువుగా తోస్తుంది. కానీ కాస్త శ్రమ తప్పదు. వాడిపోయిన ఆకులను, పువ్వులను తుంచడం, కలుపుమొక్కలను తీయడం చేస్తుండాలి. గులాబీ మొక్కల పైన అప్పుడప్పుడు నీళ్ళు స్ప్రే చేయడం ద్వారా దుమ్ము ధూళి ఆశించవు. గులాబీ మొక్కల ఎదుగుదలకి మట్టిలో ఆమ్ల స్వభావం ఉండాలి. కాఫీ పొడి మట్టికి ఆ గుణాన్ని పెంచుతుంది. కాబట్టి దాన్ని గులాబీ మొక్క మొదట్లో చల్లండి. ఉల్లిపొట్టు, బంగాళాదుంప పొట్టు.. మొక్కచుట్టూ వేస్తే మంచి ఎరువుగా పనిచేస్తాయి.


No comments: