ఎలా కూర్చోవాలి.. | How to Sit at a Computer | Desktop or Laptop

ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ కంప్యూటర్ నిత్యం వాడడం సర్వసాధారణమయిపోయింది. గంటల తరబడి కంప్యూటర్ ముందే కూర్చోవడం అనేక మానసిక, శారీరక రుగ్మతలకు దారి తీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకని కంప్యూటర్ మానిటర్ లేదా ల్యాప్ టాప్ వినియోగించేటప్పుడు తగు జాగ్రత్తలు సూచిస్తున్నారు. డెస్క్ టాప్, ల్యాప్ టాప్ లను గంటల తరబడి వినియోగిస్తున్నప్పుడు మధ్యమధ్యలో కాసేపు నిటారుగా నిలబడి కాని నాలుగు అడుగులు అటూఇటూ వేసి కాని రిలాక్స్ అవడం విధిగా చెయాలి. దీంతో నడుము, మెడ, భుజాలు, చేతివేళ్లు, కళ్లు.. ఇలా అన్నింటిమీద స్ట్రెయిన్ తగ్గుతుంది.

వీలైతే అప్పుడప్పుడు కుర్చీలోనే రెండు చేతులు జోడించి బాడీని కొద్దిగా స్ట్రెచ్ చేయడం, మెడను అటూ ఇటూ, పైకి కిందకీ తిప్పడం వల్ల మంచి రిలాక్సేషన్ లభిస్తుంది. అప్పుడే చేసేపని మీద దృష్టి పెట్టగలుగుతారు. అయితే రోజూ అధిక గంటల పాటూ మానిటర్ల ముందే ఉండాల్సిన వాళ్లకు క్రమం తప్పని వ్యాయామం లేదా యోగా సహకరిస్తుంది. ఆయా అవయవాల కండరాలు గట్టిపడి అంత తొందరగా స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉండదు.

కంప్యూటర్ ముందు తప్పు పొజిషన్లలో కూర్చోవడం, కంప్యూటర్ సరియైన ఎత్తులో లేకపోవడం, మానిటర్ బ్రైట్ నెస్ అసౌకర్యంగా ఉండడం చేత వెంటనే మెడ, నడుము, భుజాలు, కళ్లు.. ఇతర అవయవాల నొప్పులు మిమ్మల్ని బాధిస్తాయి. స్క్రీన్ ని అదేపనిగా గంటలతరబడి కళ్లార్పకుండా చూడడం వల్ల కళ్లు తడిఆరిపోయి మంటలు వస్తాయి. ఇలా సమస్యతలెత్తకుండా అప్పుడప్పుడు కంటికి సంబంధించిన వ్యాయామం తప్పక చేయాలి. కంటి రెప్పలను బలంగా మూయడం, వీలైనన్ని ఎక్కువ సార్లు కనురెప్పలు ఆర్పడం వంటివి మేలు చేకూరుస్తాయి. డిస్ప్లె కోసమని తలవంచడం, పైకి ఎత్తడం వల్ల మెడ నొప్పి, సరియైన పోస్చర్ లో కూర్చోకపోతే నడుం నొప్పి తప్పవు. అందుకని ఏదైనా కంప్యూటర్ స్క్రీన్ మన కళ్లు సునాయసంగా చూసేలా ఉండాలి. అంటే మెడ నిటారుగా ఉంచి నేరుగా చూడగలగాలి. లేదంటే అది మెడనొప్పికి దారితీస్తుంది. మన కళ్ల నుంచి మానిటర్ చేయిచాచినంత దూరంలో ఉండాలి. అలాగే కంప్యూటర్ ముందు మనం కూర్చునే భంగిమ చాలా ముఖ్యం. కాలుపై కాలు వేసుకోవడం, కాళ్లను దేనికైనా తన్నిపెట్టకుని కూర్చోవడం అత్యంత ప్రమాదకరం. డెస్క్ టాప్ లేదా ల్యాప్ టాప్ ముందు కుర్చీలో నిటారుగా కూర్చుని కాళ్లు సమానంగా నేలమీద ఆనించి పెట్టాలి. కాళ్లు నెలపైకి అందడం లేదనుకున్నప్పుడు చిన్న పీటను అమర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.

కంప్యూటర్ మానిటర్ ఎల్లవేళలా శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు రూములో సరైన లైటింగ్ ఉండాలి. స్క్రీన్ బ్రైట్ నెస్, కాంట్రాస్ట్‌ కళ్లకు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవడం మరవద్దు. తరుచుగా మంచినీళ్లు తాగడం, గుండెల నిండా గాలి పీలుస్తూ వదలడం వల్ల మంచి ఉపశమనం దొరుకుతుందని గమనించండి.


No comments: