ప్రాణాంతకం | Smoking is Injurious to Health | May 31 : World No Tobacco Day


ధూమపానం చేయడం నేడు ఫ్యాషన్ అయిపోయింది. ఎవరింట్లోనైతే పెద్దలు ధూమపానం చేస్తుంటారో ఆ ఇంట్లోని పిల్లలు, గర్భినీ స్త్రీలు, పెంపుడు జంతువుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ధూమపానం చేసేవారికన్నా ఆ చుట్టుపక్కల వారి ఆరోగ్యంపై పొగ ప్రభావం అధికంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పొగాకు వినియోగం ఏ రూపంలో ఉన్నా అనారోగ్యానికి గురిచేస్తుంది. అయితే వినియోగించిన విధానాన్ని బట్టి కొంతవరకు తీవ్రతలో మార్పు ఉంటుంది. ఈ శారీరక సమస్యలకు తోడు మానసిక సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తప్పవు. పొగాకు కొన్ని వందల రకాల హానికర రసాయనాలతో కూడుకున్నదే కాక నికోటిన్, బూడిద, అధికంగా అనర్థాలకు గురి చేసే కార్బన్ మోనాక్సైడ్ దీనిలో ఎక్కువగా ఉంటాయి. పొగాకు ఊపిరితిత్తులను విపరీతంగా ప్రభావితంచేస్తాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మాత్రమేకాకుండా, శరీరంలోని అన్ని అవయవాలను క్రమంగా నాశనం చేస్తుంది. పొగాకు వినియోగం వలన కలిగే నష్టాలలో ముఖ్యమైనవి ఊపిరితిత్తుల కాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు. అంతేకాకుండా ధూమపానం వల్ల నంపుసకత్వం వస్తుందని తాజా పరిశోధనలు వెల్లడించాయి.

పొగాకు ఉత్పత్తులకు బానిసై ఒక్కసారిగా మానడం కష్టమే అంటున్నారు వైద్య నిపుణులు. పైగా అలా మాన్పించినా నష్టమే జరుగుతుందంటారు. అయితే గుట్కా నమిలే వాళ్లు వాటికి క్రమంగా దూరం అవడం కోసం నికోటిన్ తక్కువ మోతాదులో ఉండి, హానికర పదార్థాలు లేని చూయింగ్‌గమ్, చాక్లెట్లను ఆశ్రయించాలి. అలాగే ధూమపానం అలవాటుకు దూరం కావడం కోసం టార్‌ఫ్రీ, హానికర పదార్థాలు లేని ఎలక్ట్రానిక్ సిగరెట్లు వాడడం ఉపయోగకరం అని సూచిస్తున్నారు. పొగాకు వినియోగం వల్ల కలిగే నష్టాలను గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 31వ తేదీని ధూమపాన వ్యతిరేక దినం (అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం)గా ప్రకటించింది. 1953 నుండి ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రపంచ మంతటా ‘నో స్మోకింగ్‌ డే’ నిర్వహించడం ఆనవాయితీగా మారింది. పొగాకు రాహిత సమాజంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా 18 సంవత్సరాల వయస్సులోపువారికి పొగాకు ఉత్పత్తులు అమ్మడం ప్రభుత్వం నిషేధించింది. సిగరెట్ అండ్ అదర్ టబాకో ప్రోడక్ట్స్ యాక్ట్ లోని సెక్షన్ 4 బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్దం.



No comments: