పాములుంటాయ్‌.. జాగ్రత్త..! | With the Rains come Snakebites

వర్షాకాలంలో విషసర్పాలు ఎక్కువగా సంచరిస్తాయి. పాముల్లో అన్నీవిషపూరితమైనవి కావు. కట్లపాము, నాగుపాము, నల్లత్రాచు, రక్తపింజర వంటి వాటి వల్ల మాత్రమే ప్రాణనష్టం ఉంటుంది. అయితే సకాలంలో స్పందించి వైద్యం అందించగలిగితే ఎలాంటి హాని కలగదు. పాముకాటుకన్నా పాముకరిచిందన్న భయం, ఆందోళన వల్ల ప్రాణాలు కోల్పోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. విషపూరిత పాము కాటుకు గురైతే వాటి రెండు కోరల గాయం స్పష్టంగా కనిపిస్తుంది. నొప్పి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. క్రమక్రమంగా నొప్పిపైకి పాకి శరీరం మత్తుకు గురై స్పృహ కోల్పోవడం జరుగుతుంది. అంతకన్నా ఎక్కువ కాట్లు కనిపిస్తే అది సాధారణ పాము అయి ఉండవచ్చు. పాము కాటును గుర్తించిన వెంటనే అప్రమత్తం అవ్వడమే ప్రధానం. విషం రక్తంలో కలిసి గుండెకు చేరితే ప్రాణాపాయం సంభవిస్తుంది. కనుక కాటు వేసిన శరీర భాగం నుంచి ఇతర భాగాలకు రక్తప్రసరణ జరగగకుండా వెంటనే రబ్బర్ బ్యాండ్, తాడు, గుడ్డ.. వీటిలో దేని సహాయంతోనైనా గట్టిగా కట్టు కట్టాలి. కరిచిన భాగంలో కొత్త బ్లేడ్‌తో చర్మాన్ని తొలగించి ఆ విషపు రక్తాన్ని పిండివేయాలి. దీనివల్ల శరీరంలోకి ప్రవేశించిన విషం త్వరగా గుండెకు చేరకుండా నివారించవచ్చు. తదనంతరం వైద్యున్ని సంప్రదించడం ద్వారా ప్రాణాలు నిలుస్తాయి.

పాములకు దూరంగా..
- కప్పలు, ఎలుకలు ఉన్న చోట పాములు ఆహారం కోసం ఎక్కువగా సంచరిస్తాయి. అందువల్ల అవి రాకుండా పరిసరాల్లో శుభ్రత పాటించడం అవసరం. చుట్టూ ఉన్నమొక్కలను, చెట్లను ఎప్పటికప్పుడు ట్రిమ్ చేయాలి. బయటికి ఉన్న డ్రైనేజి పైపులకు జాలీ విధిగా ఉండాలి. బాత్ రూంలో కమ్మోడ్ వాడుతున్నప్పుడు ఒక్కసారి గమనించాలి. చెప్పుల స్టాండ్, ఎక్కువ కాలం పార్క్ చేసిన వాహానాలు, ఖాళీ ప్రదేశాల్లోనూ దృష్టి సారించాలి. ముఖ్యంగా వరదనీరు అపార్ట్ మెంట్ లేదా ఇంట్లోకి వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
- ధాన్యపు గాదెలు, గడ్డివాములు ఉన్న చోట ఎలుకలు ఎక్కువగా తిరుగుతాయి. నిల్వనీళ్లు, తడి ప్రదేశాల్లో కప్పలు చేరుతాయి. అలాగే దుంగల మధ్య, పిడకల దొంతరల్లో పాములు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఆయా ప్రదేశాల్లోకి  వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు అవసరం. మోకాళ్ల వరకు ఉండే గమ్ బూట్లను వేసుకోవాలి. పాములు కేవలం శబ్ద తరంగాలను గ్రహిస్తాయి కనుక ఏదోలా చప్పుడు చేయడం వల్ల పాములు అక్కడి నుంచి పారిపోతాయి.
- అలాగే పాత భావి, బంగ్లాలు, వ్యవసాయ క్షేత్రాలవద్ద పాములు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఇలాంటి ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు పాదరక్షలు, శరీరాన్ని కప్పుతూ దుస్తులు వేసుకోవడంతో పాటు వెంట కర్రను, టార్చిలైట్‌ను తీసుకెళ్లడం తప్పనిసరి.
- కోడి, పిల్లి, కుక్క మొదలైన పెంపుడు జంతువులు పాములను ముందుగా గుర్తిస్తాయి. 



pc:internet

No comments: