పిల్లలు జాగ్రత్త.. | Child Care During The Rainy Season

 
వర్షాకాలంలో ముఖ్యంగా నీరు, ఆహారం కలుషితమయి పిల్లలు ఇట్టే జబ్బు పడే అవకాశం ఉంది. అలాగే పిల్లలు వర్షంలో ఆడటానికి ఎంతో ఇష్టపడతారు. వద్దన్నా వినే అవకాశం ఉండదు.  దీని కారణంగా పిల్లలకు జలుబు, దగ్గులతో పాటు వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. వీటి నుంచి పిల్లల్ని కాపాడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

- పిల్లలతో బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా గొడుగు, రెయిన్‌కోట్‌, రెయిన్ క్యాప్, షూస్.. వగైరా తప్పక తీసుకెళ్లాలి.
- చిన్నారులను వర్షంలో తడవకుండా ఇలా జాగ్రత్తలు తీసుకున్నా తడిస్తే వెంటనే దుస్తులను మార్చివేయాలి. అలాగే వీలైనంత త్వరగా షవర్‌ స్నానం చేయించాలి.
- వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం వల్ల సూక్ష్మక్రిములు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. కాబట్టి చేతులు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. తినే ముందు పిల్లలు కచ్చితంగా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి.
- ఈ కాలంలో కూడా వీలైతే రోజూ రెండుసార్లు యాంటీ ఫంగల్ సోప్‌తో స్నానం చేయిస్తే మంచిది. స్నానానికి కచ్చితంగా గోరు వెచ్చని నీటిని మాత్రమే వినియోగించాలి. ఆ నీటిలో యాంటీసెప్టిక్‌ డ్రాప్స్‌ కూడా వాడుకోవచ్చు.
- పిల్లలకి వర్షాకాలంలో కాటన్ దుస్తులతో పాటు సెమీ ఉలన్‌ ఫ్యాబ్రిక్స్‌ వాడాలి.
- కాచి చల్లార్చి, వడకట్టిన నీటినే మాత్రమే తాగించాలి. గోరువెచ్చగా మంచి నీటిని తాగడమే ఉత్తమం. ఎల్లప్పుడూ తాజా ఆహారం తీసుకోవాలి. సమతులాహారంపై దృష్టి పెట్టడమే కాక బయట తినుబండారాలకు దూరంగా ఉండాలి.
- ఎక్కువగా మంచి నీటిని తాగడం వల్ల జలుబు, జ్వరాలను నివారించవచ్చు. ఎక్కువ మోతాదులో నీరు తీసుకున్నప్పుడు శరీరంలో ఉన్న విషపదార్థాలు, హానికారక సూక్ష్మక్రీములను నివారించవచ్చు.
- అలాగే భోజనానికి ముందు ద్రవపదార్థమైన వేడివేడి విజిటబుల్‌ సూప్‌ తీసుకోవాలి. ఇది అనేక పోషకాలతో పాటు కమ్మని రుచిని ఇస్తుంది.
- తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు రోజూ వారి ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి. సిట్రస్‌ జాతి పండ్లు ఎక్కువగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- ఈ కాలంలో దోమలు స్వైరవిహారం చేయడంతో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా.. వీటి భారిన పడకుండా పిల్లలకు దోమలు కుట్టకుండా నిండైన దుస్తులు వేయాలి. నిద్రించే సమయంలో దోమతెరలను విధిగా ఉపయోగించాలి
- దోమల నివారణకు ప్రధానంగా ఇంటిని శుభ్రంగా ఉంచడంతో పాటు ఇంట్లోనూ, పరిసర ప్రాంతాల్లోనూ నీరు నిలువ లేకుండా చూడాలి.
- గదుల్లో తేమ లేకుండా ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకుంటే పిల్లలకు వెచ్చదనాన్ని కలిగించడంతో పాటు హాయిగా ఉంటుంది.
- పిల్లలకు అనారోగ్యం కలిగితే వెంటనే వైద్యులను సంప్రదించడమే కాక త్వరగా కోలుకోవడానికి వారికి తగినంత విశ్రాంతి ముఖ్యమని గమనించండి.



pc:internet

No comments: