వంటింటి మొక్కలు.. | Tips for Kitchen Garden | Vantinti Chitkalu


వంటింటి మొక్కలు.. ఇవేంటనేనా మీ సందేహం.. ఘుమఘుమలాడే వంటకాలకోసం వాడే కొత్తిమీర, కరివేపాకు.. వగైరా అప్పటికప్పుడు కావాలంటే మీ పెరటి మొక్కల్లో ఇవి ఉండాలి. అలాగే పెరట్లో మరికొన్ని ఆకుకూరలు, కూరగాయల మొక్కలు వేసుకుంటే చాలా మంచిది. ఉన్న కొద్దిపాటి స్థలంలోనైనా కుండీలలో వంటింటికి అవసరమైన ఆకుకూరల్ని, కూరగాయల్ని పండించడంపై ఇప్పుడు అందరు శ్రద్ధ పెట్టారు. బాల్కనీలో పెంచే పూలమొక్కలకు తోడు రకరకాల వంటింటి మొక్కలు పెంచుతున్నారు. వంటల్లో సువాసనలు వెదజల్లే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు.. పోషక విలువలు పుష్కలంగా లభించే పాలకూర, తోటకూర, మెంతికూర వంటి ఆకుకూరల్నీ పెంచుకోవాలి. పచ్చిమిర్చి, టమాట, వంకాయ.. ఇటువంటి కూరగాయల మొక్కలు కూడా పెంచుకుంటే వంటల రుచి పెరగడంమేకాక ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. కుండీల్లో సునాయసంగా పెంచుకోగలిగే ఉల్లి, వెల్లుల్లి కాడలు, గోదుమ గడ్డి.. అనేక రుగ్మతలను పారదోలడంలో సహాయపడతాయి.

మొక్కలకోసం వాడే కుండీలు, మట్టి ఎంపికలో తగు జాగ్రత్తలు అవసరం. అలాగే గాలి, వెలుతురు విషయంలోనూ దృష్టి పెట్టాలి. వాము, కలబంద మొక్కలు ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారుస్తాయనడంలో సందేహంలేదు. వాము ఆకు వంటల్లో మంచి రుచిని అందిస్తుంది. చక్కని ఆక్సీజన్ ను అందించడంతో పాటు కలబంద సౌందర్యపోషణలోనూ మేటి. చిన్నచిన్న గాయాలకు చక్కని ఔషధం కూడా. ప్లాస్టిక్‌ కుండీలకన్నా మట్టి కుండీలను వాడటం ఎంతో మంచిది. కుండీకి అడుగున కన్నం చేయడం, ఓ ప్లాస్టిక్‌ ప్లేటు ఉంచడం మరవద్దు. కండీల్లో నింపే మట్టి గుళ్లగా ఉండేలా చూసుకోవాలి. కావాలంటే మార్కెట్లో రెడీమేడ్‌గా దొరికే పాటింగ్‌ మిక్సర్‌ వాడుకోవచ్చు. రసాయన ఎరువుల జోలికిపోకుండా కుండీల్లో వంటింటి వ్యర్థాలతోనే కంపోస్ట్‌ ఎరువులను తయారుచేసుకోవాలి. దీనికి వాడేసిన టీ, కాఫీ పొడి, కొడిగుడ్డు పెంకులు, ఉల్లిపాయ పొట్టు, బియ్యం కడుగు నీళ్లు.. మొదలైనవి ఉపయోగపడ్తాయి. వంటింట్లో కూరలు కడిగిన నీరు మొక్కలకు వాడుకోవాలి.


No comments: