టిఫిన్ బాక్స్.. | Healthy Tiffin Box for Your Child

స్కూళ్ కి వెళ్లే పిల్లలకు టిఫిన్ బాక్స్.. బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్.. ఇలా ఏదైనా సరే వారికి సర్దడం కొంచం కష్టమే. ఏ రోజు ఏ ఆహారం ఇష్టంగా తింటారో.. ఏ రోజు టిఫిన్ బాక్స్ తిరిగి తీసుకొచ్చేస్తారో తెలియదు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే చదువు మీద దృష్టి సారించగలరు కాబట్టి వారి ఆహారం, అలవాట్లపై ప్రతీ తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. అందుకని పిల్లల టిఫిన్ బాక్స్‌ పైన శ్రద్ధ పెట్టాలి. బాక్సులో పిల్లలకు పెట్టే ఆహార పదార్థాలు శారీరకంగా మానసికంగా దృఢంగా ఎదగడానికి తోడ్పడేలా మంచి పోషకాలను అందించేవిగా చూసుకోవాలి. ప్రతిరోజూ ఒకేలాంటి ఆహారం కాకుండా రోజుకోరకం అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. సింహభాగం నేచురల్‌ ఫుడ్ మాత్రమే ఉండాలి. అంటే  ఫ్రూట్స్‌, తాజా కూరగాయాలు అన్నమాట. వీటితో పిల్లలకు వెంటనే శక్తి అందడం, ఎక్కువ సమయం వరకు హుషారుగా ఉండడంమే కాక ఏకాగ్రతస్థాయి మెరుగుపడుతుంది. పిల్లలు చీటికిమాటికి అనారోగ్యం పాలు కావడానికి కారణం పోషకాహార లోపం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా పెద్దలే అరికట్టగలగాలి. ఉదయం వేళల్లో క్యారట్, బీట్ రూట్.. లాంటి పచ్చికూరగాయల రసాన్ని ఒక గ్లాసు ఇస్తే బాగుంటుంది. దానివల్ల కంటిచూపు మెరుగవుతుంది, చర్మసమస్యలు దరిచేరవు. అల్పాహారంగా మొలకెత్తిన విత్తనాలు, నానబెట్టిన వేరుశెనగ పప్పు, ఖర్జూర, పచ్చికొబ్బరి, డ్రై ఫ్రూట్స్.. పెట్టాలి. తేనె, బెల్లం.. లాంటి పదార్థాలు రోజూ తీసుకోవడం తప్పనిసరి. స్నాక్స్ సమయంలో సీజనల్ ఫ్రూట్స్ లేదా ఒక గ్లాస్ పండ్లరసం మంచిది. దీంతో మీ పిల్లలు ఆరోగ్యవంతులుగా తయారవుతారు.

మరిన్ని టిఫిన్ బాక్స్ టిప్స్..
- టిఫిన్‌ బాక్సులు తోటి పిల్లల కుండే లాంటివే ఉండాలి. రెండు మూడు గిన్నెలతో పదార్థాలు పెట్టడానికి అనువుగా, సుళువుగా మూతలు తీసుకునేలా బాక్స్ ఉండాలి. అవి మారకుండా వాటిపైన పేర్లు రాయాలి.
- పిల్లలు స్కూల్లో టిఫిన్‌ బాక్స్‌, వాటర్‌బాటిల్‌ మూతలు తీయడానికి వీలుగా ఒక్కసారి ఇంటి వద్ద చేయించి చూపించాలి.
- తక్కువ సమయంలోనే తినేవిధంగా పోషక విలువలున్న ఆహారపదార్థాలను మాత్రమే పెట్టాలి. ఎక్కువ మసాలా పదార్థాలు లేకుండా చూసుకోవాలి.
- బాక్సులో పెట్టిన పదార్థాలు ఎక్కువసమయం వరకూ ఉన్నా, పాడవకుండా ఉండే విధంగా ఉండాలి. 
 
 

No comments: