గమ్మత్తుగా చిత్తవుతున్న యువత.. | 31 మే: అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం | Smoking is injurious to health and it causes lung cancer, yet people in general are ignorant of its statutory warnings.


ఫ్యాషన్ ముసుగులో భావిభారతం పొగచూరుతోంది. ప్రపంచ వ్యాప్తంగా జనాన్ని నిర్వీర్యం చేసే అంశాల్లో పొగాకు వాడకం ఒకటి. ఈ మహమ్మారి ఏటా కొన్ని లక్షల మంది జీవితాలని కబళిస్తుంది. అయినా మన దేశంలో పొగాకును పూర్తిగా నిషేధించే పరిస్థితులు లేవని పొగాకు వాడకం మీద ప్రజల్లో చైతన్యం తీసుకురావడం తప్ప మరే మార్గం లేదంటారు విశ్లేషకులు. అభివృద్ధి చెందిన దేశాలలో పొగత్రాగేవారి సంఖ్య స్థిరంగా ఉండగా అభివృద్ధి చెందుతున్న మనదేశంలో వీరి శాతం రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది. అమెరికాలోని వ్యాధి నిరోధక మరియు నియంత్రణ కేంద్రం పొగాకు వినియోగాన్ని నిరోధించగలిగే వ్యాధి కారకాలలో ప్రధానమైనదిగా, ప్రపంచవ్యాప్తంగా సంభవించే అకాల మరణాలకు ముఖ్యమైన కారణంగా పేర్కొంది.

ధూమపానం చేయడం నేడు ఫ్యాషన్ అయిపోయింది. ఎవరింట్లోనైతే పెద్దలు ధూమపానం చేస్తుంటారో ఆ ఇంట్లోని పిల్లలు, గర్భినీ స్త్రీలు, పెంపుడు జంతువుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. ధూమపానం చేసేవారికన్నా ఆ చుట్టుపక్కల వారి ఆరోగ్యంపై పొగ ప్రభావం అధికంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పొగాకు వినియోగం ఏ రూపంలో ఉన్నా అనారోగ్యానికి గురిచేస్తుంది. అయితే వినియోగించిన విధానాన్ని బట్టి కొంతవరకు తీవ్రతలో మార్పు ఉంటుంది. ఈ శారీరక సమస్యలకు తోడు మానసిక సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తప్పవు.

పొగాకు కొన్ని వందల రకాల హానికర రసాయనాలతో కూడుకున్నదే కాక నికోటిన్, బూడిద, అధికంగా అనర్థాలకు గురి చేసే కార్బన్ మోనాక్సైడ్ దీనిలో ఎక్కువగా ఉంటాయి. పొగాకు ఊపిరితిత్తులను విపరీతంగా ప్రభావితంచేస్తాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మాత్రమేకాకుండా, శరీరంలోని అన్ని అవయవాలను క్రమంగా నాశనం చేస్తుంది. పొగాకు వినియోగం వలన కలిగే నష్టాలలో ముఖ్యమైనవి ఊపిరితిత్తుల కాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు. అంతేకాకుండా ధూమపానం వల్ల నంపుసకత్వం వస్తుందని తాజా పరిశోధనలు వెల్లడించాయి. సహజంగా పురుషులలో ధూమపానం ఎక్కువగా ఉన్నా యుక్త వయస్కులలో ఈ లింగభేదం ఎక్కువగా లేకపోవడం గమనార్హం.

చాలా మంది ధూమపానం యుక్త వయసులో ప్రారంభిస్తారు. ధూమపానం వల్ల అదోరకమైన ఆనందం పొందుతారు. కన్నాళ్లకు ధూమపానం మానివేయడానికి ససేమిరాల మారుతారు. సినిమాల ప్రభావమో, పెద్దలను అనుకరించడమో, సరదాకోసమో, మత్తు కోసమో.... కారణమేదైనా అలవాటైన పొగాకు వాడకం, దానిలోని నికోటిన్ మళ్లీమళ్లీ వినియోగించేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఆధునిక కాలంలో సిగరెట్ తాగేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా యువత సరదా కోసం కాల్చుతూ క్రమంగా దానికి బానిసలవుతున్నారు. నగరాల్లో మహిళలు సిగరెట్లు, పల్లెటూర్లలో కొంతమంది మహిళలు చుట్టలు తాగుతుండటం గమనిస్తున్నాం. ఇలా ఏదోఒక రకంగా పొగాకు ఉత్పత్తుల వాడకం పెరుగుతూనే ఉంది. తొలుత సరదాగా మొదలై అనంతరం ప్రాణాలను మింగేసే ఈ దురలవాటును ప్రజలు వదల్లేక పోతున్నారు. పొగాకుకు బానిసలై తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. పొగాకును వాడటం వల్ల భారతదేశంలో రోజుకు సుమారు 2500 మంది చనిపోతున్నట్లు ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది.

పొగాకు ఉత్పత్తులకు బానిసై ఒక్కసారిగా మానడం కష్టమే అంటున్నారు వైద్య నిపుణులు. పైగా అలా మాన్పించినా నష్టమే జరుగుతుందంటారు. అయితే గుట్కా నమిలే వాళ్లు వాటికి క్రమంగా దూరం అవడం కోసం నికోటిన్ తక్కువ మోతాదులో ఉండి, హానికర పదార్థాలు లేని చూయింగ్‌గమ్, చాక్లెట్లను ఆశ్రయించాలి. అలాగే ధూమపానం అలవాటుకు దూరం కావడం కోసం టార్‌ఫ్రీ, హానికర పదార్థాలు లేని ఎలక్ట్రానిక్ సిగరెట్లు వాడడం ఉపయోగకరం అని సూచిస్తున్నారు.

పొగాకు వినియోగం వల్ల కలిగే నష్టాలను గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 31వ తేదీని ధూమపాన వ్యతిరేక దినంగా ప్రకటించింది. 1953 నుండి ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రపంచ మంతటా ‘నో స్మోకింగ్‌ డే’ నిర్వహించడం ఆనవాయితీగా మారింది. పొగాకు రాహిత సమాజంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా 18 సంవత్సరాల వయస్సులోపువారికి పొగాకు ఉత్పత్తులు అమ్మడం ప్రభుత్వం నిషేధించింది. సిగరెట్ అండ్ అదర్ టబాకో ప్రోడక్ట్స్ యాక్ట్ లోని సెక్షన్ 4 బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకూడదని స్పష్టం చేస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధించడం తద్వారా పొగతాగే వారి సంఖ్యను గణనీయంగా తగ్గించాల్సి ఉంది.

World No Tobacco Day | International Child Labour and Drug Abuse Day | International Day against Drug Abuse and Illicit Trafficking | మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం

No comments: