సంపూర్ణ ఆహారంగా పాల ప్రాశస్త్యత | జూన్ 1 : ప్రపంచ పాల దినోత్సవం | Why is Milk Considered to be a Complete Meal | World Milk Day


పాలు సంపూర్ణమైన ఆహారం. ఇది అక్షరాల నిజం. చంటి పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి పాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పాలలో వివిధ రకాల పోషక పదార్థాలు విరివిగా లభించడమే దీనికి కారణం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ వారి సిఫారసు మేరకు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 283 గ్రాముల పాలు తీసుకోవాలి. పాలు మానవ శరీరానికి పోషకాల ఖని. ఆవు, గేదె, మేక పాలతో వేరువేరు ప్రమాణాల్లో పోషక పదార్థాలు మనం పొందవచ్చు. ప్రతి వంద గ్రాముల పాలల్లో - ఆవుపాలు 86.6 శాతం, గేదె పాలు 84.2 శాతం వరకు నీరు కలిగి ఉంటుంది. ఆవు పాలల్లో కొవ్వు 4.6 శాతం, మాంసకృత్తులు 3.4 శాతం, పిండి పదార్థాలు 4.9 శాతం, ఖనిజ లవణాలు 0.7 శాతం వుంటాయి. గేదె పాలల్లో 6.6 శాతం కొవ్వు, 3.9 శాతం మాంసకృత్తులు, 5.2 శాతం పిండి పదార్థాలు, 0.8 శాతం ఖనిజ లవణాలు లభిస్తాయి.

ముఖ్యంగా కాలంతో పోటీపడే నేటి మహిళకు, పిల్లలకు అందుబాటులో ఉండే అత్యంత బలవర్ధకమైన ఆహారం పాలు అని చెప్పాలి. పాలు అతి తేలికగా జీర్ణమవడమేకాకుండా మంచి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని కూడా ఇనుమడింపచేస్తాయి. మహిళలల్లో వయస్సు పెరిగేకొద్ది తగ్గే కాల్షియం తద్వారా దంతాలు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు సోకడం జరుగుతుంది. అందుకని మహిళలు చిన్న వయస్సు నుంచే పాలను సరిపడా తీసుకోవడం ఎంతైన ఆరోగ్యదాయకం. మానవ శరీర పోషణకు అవసరమయ్యే పౌష్టికాహారాల్లో పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు ప్రధాన పాత్రవహిస్తాయి. ఇవన్నీ సులభంగా పాల ద్వారానే లభిస్తాయని గమనించాలి. వీటితో పాటు పాలల్లో అధికంగా కేసిన్ మాంసకృత్తులు, లాక్టోస్, చక్కెరలు విరివిగా లభిస్తాయి.

తాజా పాలలో, మీగడలో ప్రోటీన్ లు సమృద్ధిగా ఉంటాయి. ప్రోటీన్ లు శరీరంలోని ధాతువులను, కండరాలను, రక్తాన్ని వృద్ధి పరచడంలో తోడ్పడుతాయి. అంతేకాకుండా వెన్న, నెయ్యిలలో కొవ్వు అధికంగా లభిస్తుంది. ఈ కొవ్వు శరీరానికి కావలసినంత శక్తి ఇస్తుంది. పాలనే కాకుండా, పాల ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. పాలు, వెన్న, నెయ్యి, పెరుగు లాంటి పాల ఉత్పత్తుల వాడకం వల్ల శరీరానికి అవసరమయ్యే  విటమిన్-ఎ సమృద్ధిగా లభిస్తుంది. దీని వల్ల కళ్ళ దృష్టిని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా రేచీకటి నుండి రక్షణ పొందవచ్చు. పాలు, వెన్న తీసిన పాలు, పెరుగులలో  విటమిన్-బి (రిబోప్లోవిన్) ఎక్కువగా ఉంటుంది. తద్వారా నంజు, గరుకు చర్మం లేకుండా రక్షణ ఏర్పడుతుంది. కంటి చూపును కూడా సరిగా ఉంచుతుంది. అన్నీ వయసుల వారికి ముఖ్యంగా పసిపిల్లలకు, గర్భిని స్త్రీలకు విటమిన్-ఇ ఎంతో అవసరం. చర్మ సౌందర్యానికి, శరీర పోషణకు విటమిన్-ఇ ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్-డి ని వెన్న, మీగడల నుంచి సునాయసంగా పొందవచ్చు. విటమిన్-డి రికెట్స్  అనే కీళ్ల జబ్బు రాకుండా చూస్తుంది. బెరిబెరి జబ్బు రాకుండా సహాయపడే విటమిన్-బి ని కూడా పాలు కలిగి ఉంటాయి. ఎ, బి1, బి2, బి6, సి, డి, ఇ విటమిన్ లతో పాటూ పాంటోథెనిక్ యాసిడ్, నియాసిన్, బయోటిన్ (బీ7), ఫోలిక్ యాసిడ్ మొదలైనవి పాలల్లో విస్తారంగా లభిస్తాయి. మానవశరీర పెరుగుదలకు దోహదపడే కాల్సియం, పాస్ఫరస్, జింక్, మెగ్నీషియం, కాపర్, మ్యాంగనీస్, పొటాషియం, సోడియం క్లోరైడ్, సల్ఫర్, సిలికాన్, క్రోమియం, ఐరన్ మొదలైన ఖనిజ లవణాలు పాలల్లో పుష్కలంగా ఉంటాయి. ఎముకలు, దంతాలకు సంబంధించిన వ్యాధులు వీటి ద్వారా నయమవుతాయి. 



No comments: