21 June: International Yoga Day | యోగా డే | ప్రపంచ యోగా దినోత్సవం


ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి ఎవరి నోట విన్నా యోగా డే ప్రస్తావనే. జూన్ 21న 200లకు పైగా దేశాల్లో రెండు వందల కోట్లకు పై చిలుకు మంది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. 2014 సంవత్సరం సెప్టెంబరులో జరిగిన సర్వప్రతినిధి సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోదీ సూచన మేరకు ఇంటర్నేషనల్‌ యోగాడేని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. వేద కాలానికి ముందే పుట్టిన యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మనసు, శరీరం మనకు నచ్చినవిధంగా పనిచేయాలంటే వాటి రెండింటినీ ఏక కాలంలో అదుపులోకి తెచ్చుకోగలగాలి. అలా అనుకూలంగా మరల్చగలిగే శక్తి కేవలం యోగాకి ఉంది. అందుకే యోగాభ్యాసం ఎంతైనా అవసరం. దీనకి సులభమైన ఆసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు లాంటివి అవసరం అవుతాయి.

శ్వాస క్రియలో మనం పీల్చే గాలి పరిమాణం పెరిగితే జీవకణాలకు ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది. తద్వారా జీవకణాలు శక్తివంతమవుతాయి. ప్రాణాయామంతో పాటు శరీర కండరాలు కూడా బాగా బిగించటం వదులు చేయటం ప్రక్రియతో అవి శక్తివంతం అవుతాయి. అలాగే శరీర భాగాలను పైకి క్రిందకు పక్కకు కదిలిస్తుండడం చేత శక్తిని పొందుతాయి. ఆరోగ్యం కాపాడ బడుతుంది. అయితే యోగ సాధనలో సక్రమ ఫలితాలకోసం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అవేంటంటే...

ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకోవాలి. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, శరీరం తేలికగా ఉందని తోచినప్పుడు మాత్రమే యోగాను అభ్యసించాలి. యోగాకి ముందు, వెనుక కనీసం గంట పాటూ ఎలాంటి ఘనపదార్థాలు తీసుకోకూడదు. సరిపడా గోరువెచ్చని నీటిని తాగి కొంత సమయం తరవాత అభ్యాసం మొదలుపెట్టాలి. ప్రాణాయామం చేసేటపుడు మరీ కష్టంగా అనిపిస్తే ఆపడం మంచిది. యోగాసనాలు వేసేటపుడు సుదీర్ఘంగా, లయబద్ధంగా నాసిక రంధ్రాలతో మాత్రమే శ్వాస పీల్చుకోవాలి.

No comments: