" గురుబ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః "
అప్పుడే స్కూలు నుంచి వచ్చిన సాన్వీని 'టీచర్' ఏం హోంవర్క్ ఇచ్చారు? అని ప్రశ్నిస్తే గుక్క తిప్పుకోకుండా ఈ రోజు 'సార్' హోంవర్క్ ఇచ్చారు.. అని జవాబిచ్చింది. ఇలా చాలామంది పిల్లలు ఆడవాళ్లని 'టీచర్'గా, మగవాళ్లను 'సార్'గా పిలుస్తారు. అంటే అతివలకు అంతచక్కగా 'టీచర్' అనే మాట అతికిపోయిందన్నమాట. టీచర్ కు అర్థం మనకు తెలిసిందే అయినా పిల్లలు కేవలం ఆడవారినే 'టీచర్'గా వ్యవహరిస్తారు. పిల్లలు టీచర్... టీచర్... అంటూ అతి సన్నిహితంగా ఉంటూ చదువు పట్ల ఆసక్తి కనబరుస్తుంటారు. మరికొన్ని విద్యాసంస్థల్లో 'సిస్టర్', 'ఆంటీ'లుగా పిలుస్తారు. ఇతర ఉద్యోగాల కంటే 'టీచర్' ఉత్తమమైనదిగా వనితలు ఎంచుకుంటున్నారు. వివిధ రంగాల్లో స్త్రీలు ముందంజ వేస్తున్నా 'టీచర్' వృత్తినే ప్రప్రథమంగా మొదలెట్టింది. ఉద్యోగాలు సులభంగా దొరకడం, సునాయసంగా 'వృత్తి'కి న్యాయం చేకూర్చగలగడం, పాఠాలు చెప్పడం పిల్లలకు కావున దాదాపు ఇంటి వాతావరణం నెలకొని ఉండడం, పనికాలం, పని భారాలు తక్కువగా ఉండడం చేత వనితలు చాలా వరకు 'టీచర్' ఉద్యోగాలపై మోజుకనబరుస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పడంలో తల్లిఒడి ఎంత గొప్పదో తెలియంది కాదు. విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దడానికి ప్రాథమిక దశలో 'ఆడ' టీచర్లనే ప్రైవేటు సంస్థలు నియమిస్తున్నాయి. ఆడవారిలో అమ్మతనం, ఆప్యాయత, పిల్లలపట్ల ఆదరణ అన్నిటికి మించి సహనశీలత ఉండడంతో ఉపాధ్యాయవృత్తికి అక్షరాల సరిపోతారనే అభిప్రాయంతో పలు పాఠశాల యాజమాన్యాలు వారికే ప్రధాన్యత ఇస్తున్నాయి. మిగతా ఉద్యోగాలతో పోలిస్తే 'ఉపధ్యాయ వృత్తి' ఏమంత కష్టతరం కాకపోవడంతో నేటి వనితలు సంతోషంగా చేపడుతున్నారు. హోం ట్యూషన్లకు కూడా గిరాకి పెరగడంతో ఆడవారికి ఆర్ధిక స్వాతంత్ర్యం లభిస్తోంది. జీతాలను ఎక్కువగా ఆశించకుండా పూర్తి బాధ్యతతో వ్యవహరించడం వల్ల వివిధ కాన్వెంట్, కార్పోరేట్ స్కూళ్ల యాజమాన్యాలు స్త్రీలనే ఉపాధ్యాయులుగా నియమిస్తున్నారు. చాలా పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిపై భావిపౌరుల భవిష్యత్ ఆదారపడి ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తికి దోహదపడే లక్షణాల్లో విద్యార్థుల పట్ల ప్రేమ, ఆదరణ, దయాస్వభావం కలిగి ఉండడం ప్రధానమైనవి. సరియైన శారీరక, మానసిక ఆరోగ్యం, ఆదర్శవంతమైన మూర్తిమత్వము, ఆత్మవిశ్వాసం, సమగ్రమైన, విస్త్రుతమైన విషయ పరిఙానం, సృజనాత్మకతలు కూడా ఉపాధ్యాయులు కలిగి ఉండాలి. పిల్లల మనస్తత్వం ఒక్కొక్కరిదీ ఒక్కోవిధంగా ఉండడం మూలానా 'అర్థం'చేసుకుని వారి భవితవ్యానికి చక్కని పునాది వేయాలి. 'టీచర్' స్నేహంగా మెలుగుతూ పలు విషయాలపై సమగ్రంగా, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాన్ని పిల్లలకు కల్పించాలి. మాను సక్రమమైన దారి పట్టడానికి మొక్కను వంచకూడదు. చక్కని బాట వేస్తే సరిపోతుంది. అలాగే పిల్లలకు మంచి అలవాట్లు, క్రమశిక్షణ నేర్పడంలో 'దెబ్బకు దయ్యం వదులుతుంద'నే ధోరణి పనికిరాదు. 'ఆమె'లోని ప్రేమ, ఓర్పు, నేర్పు, పట్టుదలలు కలసి పిల్లలు అనూహ్యమైన రీతుల్లో పైపైకెగిరి ప్రగతిపథంలో పయనించేలా బంగారు బాట వేస్తాయి. అన్ని ఉద్యోగాలకన్నా ఎక్కువగా సెలవులు 'బడిపంతుళ్ల'కే ఉంటాయి. వేసవి సెలవులు, పండుగలు, రెండవ శనివారాలు, ఆదివారాలు... ఇలా చాలావరకు సెలవులతోనే సంవత్సరాలు గడిచిపోవడంతో ఉద్యోగం చేసినట్టే అనిపించదు. టిటిసి, బి.ఇడి, ఎం.ఇడి ప్రవేశపరీక్షలకు లక్షల అప్లికేషన్లు చేరుతున్నాయంటే వాటి వెనక స్త్రీలు 'టీచర్' వృత్తి చేపట్టాలనే లక్ష్యం ఉండడమే. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో సగౌరవంగా 'టీచర్' పోష్టును చేపడుతూ నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం 'ఆకాశంలో సగాని'కి లభించడం అభినందనీయం. సర్వతోముఖాభివృద్ధికి కృషి సలపే 'టీచర్' విద్యార్ధుల మనస్సులలో చిరస్మరణీయం.
No comments:
Post a Comment