బతుకు సారాన్ని తెలియజేస్తూ సాగిపోయే బతుకమ్మ.. | తెలంగాణ గ్రామీణుల 'బతుకమ్మ' సంబురాలు | Telangana floral festival Bathukamma | వంటింటిచిట్కాలు | VantintiChitkalu | Divine & Nature




బతుకమ్మ... ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినా, దేశవిదేశాల్లో ఎంతో వైభవంగా జరుపుకునేందుకు కళ్లు మిరుమిట్లుగొలిపే విద్యుత్ దీపాలు, ప్లాస్టిక్ పూలు సిద్ధం చేసుకున్నా ఇది ఒక ఆట మాత్రమే కాదు. ఇది నియమ నిబంధనలతో కూడిన పల్లె పండుగ. వీలైతే రండి! పల్లెకు పోదాం....

మారుతున్న నాగరికతలను పుణికిపుచ్చుకుంటున్నా, అనాదిగా వారసత్వ సంస్కృతిగా వస్తున్న సంప్రదాయాల్ని, పండగల్ని రెట్టించిన ఉత్సాహంతో జరుపుకోవడం ముదావహం. తెలంగాణ జిల్లాల్లోని ప్రతి ఆడపడచు ఎదురు చూసే 'బతుకమ్మ' పండుగ, దసరా పండుగలో భాగంగా నిర్హహించడం విశేషం.

తరతరాల సజీవసంస్కృతులకు ప్రతీకలు, సంప్రదాయాల పట్టుగొమ్మలు పల్లెలు. వారు జరుపుకునే సంబరాలకు ఆర్భాటాలుండవు ఆచారాలు తప్ప! సంస్కృతిని వారు విస్మరించరు. వారిలో సంస్కారం వికటించదు. బ్రతుకును దైవత్వం శాసిస్తుందనేది వారి నమ్మకం. ప్రకృతి శక్తికి , భక్తికి, ఆచారాలకు, సంప్రదాయాలకు దైవత్వాన్ని ముడిపెట్టి - ప్రకృతిని 'తమను వైపరీత్యాలకు గురి చేయవద్దంటూ' ఆరాధనగా వేడుకోవడమే పండుగలు. పడతులు తమ పసుపు కుంకుమలను పదికాలాల పాటు పదిలపరచమని కోరుతూ, కోలాటాలు వేసేది 'బతుకమ్మ పండుగ'.

సంప్రదాయబద్ధంగా ఆనందోత్సాహాల మేళవింపుగా సాగే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ కళాత్మకంగా జరగడం ప్రసిద్ధి. గ్రామీన ప్రంతాల్లో పండుగ రాకే ఓ అనిర్వచనీయమైన కళను గ్రామాలకు సంతరించుకుంటుందంటే అతిశయోక్తి కాదు. బతుకమ్మ వేడుకల్ని వివిధ ప్రాంతాల్లో విభిన్నరకాలుగా జరుపుకున్నా, పండుగ ఒక్కటే, ప్రాధాన్యతా ఒక్కటే. మారుమూల పల్లె నుంచి ఓ మోస్తరు పట్టణం దాకా బతుకమ్మ పండుగ జోరుగా సాగుతుంది. "పాడిపంటలను ఉయ్యాలో... చల్లగా చూడమ్మ, బతుకమ్మ ఉయ్యాలో..." అని వేడుకనే పండుగ.

ఏటా ఆశ్వీజ శుద్ధ పాఢ్యమి మొదలుకుని మహానవమి వరకు బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. పండుగ ప్రాశస్త్యత, పుట్టుపూర్వోత్తరాలపై రకరకాల కథలు ప్రచారంలో ఉన్నా "శంకరుని భార్య గౌరీదేవి మహిషాసురిడితో పోరాడి అలసిపోయి ఆశ్వీజ శుద్ధ పాఢ్యమి నాడు మూర్చపోయిందనీ, ఆ మూర్చ నుండి ఆమె తేరుకోవడానికి గ్రామీణులు వివిధ రీతుల్లో గౌరీదేవిని స్తుతిస్తూ పాటలు పాడారనీ, అదే బతుకమ్మ పండుగగా మారిందనే" కథ ప్రముఖంగా వినవస్తుంది. సంధ్యాసమయాన ఆడిపాడే 'బతుకమ్మ'కు పగలంతా హడావిడే. ఈ పండుగ ప్రకృతిరమణీయకతకు విడదీయరాని సంబంధం ఉందనడానికి నిదర్శనంగా బతుకమ్మను అనేక రకాలైన పూలు, ఆకులతో ఆకర్శణీయంగా అలంకరిస్తారు. తంగేడు, గుమ్మడి, చామంతి, గడ్డిపూలు, గునుక - పలు రకాల పూలను సేకరించి సిబ్బి(పల్లెం)లలో గుమ్మడి ఆకులను పరచి వాటిపై గోపురాకారంలో పేర్చుతారు. పేర్చిన పూల మీద 'గౌరమ్మ'(పసుపు ముద్ద)ను పెడతారు.  ఈ బతుకమ్మను తయారు చేసి, వారిలో ఉన్న సృజనాత్మకతను చాటిచెబుతారు.

అన్ని రోజులు బతుకమ్మల్ని ఒకచోట చేర్చి చుట్టూ తిరుగుతూ కోలాటాలు ఆడటం, పాటలు పాడటం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆత్మీయతానురాగాల్ని పరస్పరం కనబరుచుకోవటం  ఈ సందర్భంగా ప్రతి పడతిలోనూ గోచరిస్తుంది. తమ అయిదోతనాన్ని కాపాడమంటూ కోరుకునే భావాలతో కూడిన పాటల్ని రాగయుక్తంగా పాడుతూ, లయబద్ధంగా చప్పట్లు చరుస్తూ స్త్రీలు ఆనంద సముద్రంలో తేలియాడతారు.

"బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు గౌరమ్మ ఉయ్యాలో..." అంటూ సాగే బతుకమ్మ ఆటలు, పాటలు తెలంగాణ ప్రాంత సంస్కృతికి, సమాజ పరిస్థతులకు, కట్టుబాట్లకు, ఆచార సంప్రదాయాలకు అద్దం పట్టే రీతిలో చైతన్యవంతంగా ఉంటాయి. అంతేకాకుంగా సతీమర్యాదలు, వేదాంతం, పుట్టింటి వారి నిరాదరణ, కొత్త పెళ్లి కూతుర్లకు హితబోధ, ఆలుమగల అలకల ప్రహసనాలు, చూలాలి మురిపాలు, కుటుంబ నియంత్రణ ఆవశ్యకత, అక్షరాస్యతా ప్రాముఖ్యత, కట్నకానుకలు, భర్తల వ్యసనాలు, పాడి పంటలు - ఇతర అంశాలు సహజసిద్ధంగా కళ్ల ముందు ఆవిష్కరిస్తాయి. బతుకమ్మ పాటల్లో ప్రతి చరణం చివర 'ఉయ్యాలో', 'కోల్', 'చందమామ' లాంటి పదాలు ఎక్కువ. బతుకమ్మ పాటలకు పాశ్చాత్య సంగీతాలుండవు. చప్పట్లు, కోలలు, కాళ్ల గజ్జలే సంగీత వాయిద్యాలు. ఈ నెల 20న ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగ మహానవమి (సెప్టెంబరు 28) రోజున ముగుస్తుంది. బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమైన ఆరో రోజును 'అర్రెం' పేరుతో సెలవు పాటించడం పరిపాటి. చివరి రోజున జరుపుకునే బతుకమ్మను 'సద్దుల బతుకమ్మ' పండుగగా పేర్కొంటారు. తొమ్మిది రోజుల ఉత్సవాలు ఒకెత్తుకాగా, చివరిరోజున ఉత్సవం ఒకెత్తు. స్త్రీలంతా ఒకరినొకరు పోటీపడి రంగురంగుల పూలతో పేర్చిన నిండైన నిలువెత్తు 'బతుకమ్మల్ని' చేర్చి వాటికి 'జానపదుల్ని' కూర్చి కలిసికట్టుగా పాడతూ గౌరమ్మను పూజించడం శోభాయమానంగా ఉంటుంది. చివరి రోజున అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, రకరకాల సద్దులను నైవేద్యాలుగా సమర్పించి బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. అంతటితో తొమ్మది రోజుల ఆటవిడుపుకి తెరపడుతుంది. అదే ఉత్సాహంతో మరో ఏడాది బతుకు సమరానికి సన్నద్ధులవుతారు గ్రామీణులు.
#బతుకమ్మ పండుగ #బతుకమ్మ ఫిల్మోత్సవ్  #బతుకమ్మ వేడుక #సద్దుల బతుకమ్మ #తెలంగాణలో బతుకమ్మ #పండుగ ఉత్సవాలు #నేటి నుంచే బతుకమ్మ సంబురాలు #బతుకమ్మ సాంగ్  #Floral Festival #Bathukamma #ఎంగిలి పూలు #అర్రెం  #పూలపండగ #బతుకమ్మ ప్రసాదాలు

No comments: