చార్జింగ్ పెట్టి మొబైల్ మాట్లాడడం, పాటలు వినడం, ల్యాప్ టాప్ వొళ్ళో పెట్టుకుని పనిచేసుకోవడం, స్విచ్ ఆఫ్ చేయకుండా పవర్ అడాప్టర్లను తొలగించడం, చార్జర్లను అలాగే ప్లగ్ పయింట్ లకే వదిలేయడం... ఇలాంటివన్నీ ఎంత ప్రమాదకరమో తెలియంది కాకపోయినా నేడు పిల్లాపెద్దా అందరికి అలవాటయిపోయింది. ఎవరైనా హెచ్చరించినా నిర్లక్ష్యంగా నవ్వుతూ 'తప్పదండి..' అంటారే కానీ 'తప్పు' తెలుసుకోరు. సోషల్ మీడియాలో వీటి ఫలితంగా సంభవించిన దుర్ఘటనలకు 'లైక్'లు కొట్టడం, 'షేర్'లు చేయడం వరకే కాకుండా నేటి యువత విద్యుత్,విద్యుత్కణ పరికరాల వినియోగంలో తమవంతు జాగ్రత్తలు అవసరమని గుర్తించాలి.
ప్రతిరోజూ దినపత్రికల్లో సెల్ఫోన్ చార్జింగ్ పెడుతూ లేదా చార్జింగులో పెట్టిన ఫోను తీస్తూ, టీవీ ఆన్ చేస్తూ విద్యుత్ షాక్ తగిలి మృత్యువాత పడ్డారని, అధిక విద్యుత్ ప్రవాహంతో టీవీ, ఫ్రిజ్, ఏసి అన్నీ కాలిపోయాయని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదాలతో ఆస్థి, ప్రాణనష్టం జరిగాయని చదువుతాం. కానీ వాటిపై దృష్టి సారించం. ఎందుకు ఇలా జరిగిందో ఆలోచిస్తే విద్యుత్ వినియోగం ఎంత సౌకర్యమో అంత ప్రమాదభరితమని అర్థం అవుతుంది. సాంకేతికతో పోటీపడుతూ మానవుడికి ఎలక్ట్రిక్, ఎలాక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరిగింది. విద్యుత్ వాడకంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సరఫరాలో అంతరాయాలే కాకుండా ప్రాణాంతక ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. లోపభూయిష్టమైన విద్యుత్ వైరింగ్, ఇన్సులేషను సరిగాలేని, తడిసిన స్విచ్ లు, ప్లగ్ లు - ఇతర విద్యుత్ గృహోపకరణాల వల్ల విద్యుదాఘాతాలు, ఆస్థినష్టాలు సంభవిస్తాయి. గృహావసరాలకు అనుభవంలేని ఎలక్ట్రీషియన్లు విద్యుత్ వైరింగ్ చేయడం వల్ల, నాణ్యమైన పరికరాలు వాడక పోవడం వల్ల తరచూ షార్ట్ సర్క్యూట్ కు దారితీసి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇళ్లలో సరైన ఎర్తింగ్ లేకపోవడం, అవసరమైనచోట వోల్టేజి స్టెబ్లైజర్ వాడకపోవడం మూలంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద న్యూట్రల్ విఫలం కావడం, ఎర్తింగ్ సరిగా లేకపోవడంతో హై వోల్టేజీ విద్యుత్ సరఫరా అయి ప్రమాదాలు సంభవిస్తాయి. మరోపక్క నాణ్యత లేని పవర్ అడాప్టర్, చార్జర్, బ్యాటరీలు వినియోగించడం వల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయి. చార్జర్ను ప్లగ్లో పెట్టినప్పుడు ఏసీ కరెంటు , డీసీగా మారాలి. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో అందులోని సర్క్యూట్ విఫలమై నేరుగా విద్యుత్ సరఫరా అయి ప్రమాదం జరుగుతుంది. విద్యుత్ తీగలకు ముడులు వేయడం, స్విచ్బోర్డు సరిగా లేకపోవడం వల్ల కూడా విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉంది. ఇళ్లలో ఎర్తింగ్ ను తప్పనిసరిగా చేసుకోవాలి. మొక్కుబడిగా ఎర్తింగ్ పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా ప్రమాదాలకు నెలవుగా మారుతుంది. సరియైన ఎర్తింగ్ మాత్రమే విద్యుత్ షాక్ తగలకుండా ఉండడంతోపాటు ప్రాణాలు కోల్పోకుండా నియంత్రిస్తుంది. ఎర్తింగ్ కనెక్షన్ తప్పనిసరిగా టీవీ, ఫ్రిజ్, కంప్యూటర్ ఇతర గృహోపకరణాల పవర్ ప్లగ్లకు ఉండేలా చూసుకోవాలి. ఎక్కడ హైవోల్టేజీ విద్యుత్ సరఫరా జరిగినా ఎర్తింగ్ ద్వారా గ్రౌండ్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా విద్యుత్ షాక్, విద్యుత్ ఉపకరణాలు కాలిపోవడం, షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు.
మరిన్ని జాగ్రత్తలు...
- విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండడానికి, ఎలాంటి ప్రమాదాలకు తావులేని వైరింగ్ పద్ధతులను అవలంభించాలి. హౌజ్ వైరింగ్ చేసే విధానం ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ కు అనుగుణంగా ఉండాలి. సూర్యరశ్మి, వర్షం, తేమ లాంటి వాతావరణ పరిస్థితులకు తట్టుకుని ఎక్కువకాలం మన్నేవిధంగా విద్యుత్ తీగలను ఎన్నుకోవాలి. రాపిడి వల్ల కాని, దెబ్బలనుండి కాని చెక్కుచెదరని ఇన్సులేషన్ కలగి ఉండాలి.
- అయిదు ఆంపియర్లకు మించిన ఫ్యూజ్ లను విద్యుత్ దీపాల సర్క్యూట్ లో వాడకూడదు.
- సర్క్యూట్ లోని స్విచ్ లన్నింటినీ విద్యుత్ ప్రవహించే (ఫేజ్) వైరులోనే బిగించాలి.
- ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు పిల్లలకు అందనంత ఎత్తులో ఉండాలి.
- వైర్లు కిందకి వెళ్లాడకుండా చూసుకోవడమే కాక, చైల్డ్ సేఫ్టీ బ్లాంకింగ్ ప్లగ్ లని వాడుకోవాలి.
- ఆల్టర్ నేటివ్ కరంట్, డైరక్ట్ కరంట్ సర్క్యూట్ లను విధిగా వేరుగా ఉండేలా చూసుకోవాలి.
- ఒక ప్లగ్ పాయింట్ వద్ద ఒకే ఉపకరణం వాడాలి. ఎక్కువగా వాడితే వేడి అతిగా పెరిగి అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయి.
- రెండు వేర్వేరు సబ్ సర్క్యూట్ లను ఏర్పాటు చేసుకుని లోడ్ డిస్ట్రిబ్యూషన్ సమానంగా ఉండేలా చూసుకోవాలి.
- సరియైన ఎర్తింగ్ పద్ధతిలో భాగంగా ప్లగ్ లు, సాకెట్లు తప్పకుండా మూడు పిన్నులు కలవి వాడుకోవాలి.
- గృహవిద్యత్ మొత్తం సరఫరా నిలిపేందుకు మేయిన్ స్విచ్ ను ప్రవేశద్వారం దగ్గర బిగించుకోవాలి.
- ఐ ఎస్ ఐ మార్కుగల, నాణ్యమైన విద్యుత్ పరికరాలను మాత్రమే వాడాలి.
- నాణ్యతగల ఫ్యూజ్ డిస్ట్రిబ్యూషన్ బోర్డును మెయిన్ బోర్డుకు దగ్గరలోనే అమర్చాలి. ప్రతి విద్యుత్ ప్రసారానికి ఒక కటౌట్ ఉండాలి.
- మెయిన్ స్విచ్ లు, మీటరు మిగతా వైరింగు ఇంట్లో ఉపయోగించే లోడును భరించగలిగేవగా ఉండాలి.
No comments:
Post a Comment