ధీశాలులకు భక్తకోటి నీరాజనాలు | సమ్మక్క సారక్క జాతర | Medaram Sammakka Saralamma Jatara | VantintiChitkalu

సహజంగా జాతర అనగానే గుడి, గోపురం, విగ్రహం స్పురిస్తాయి. అక్కడ అవేమి కనిపించవు. రాష్ట్రరాజదానికి రెండొందల పైచిలుకు కిలోమీటర్ల దూరం... అంతా దట్టమైన అడవి... జలజలపారే సెలయేళ్ళు... పక్షుల కిలకిలరావాలు... అక్కడేదో మహత్మ్యం ఉంది. లక్షలాది మంది భక్తులను ఒకే చోట కలిపే మహత్తర వేదిక. పూర్తిగా ఆదివాసీ గిరిజన సంస్కతి ఆచార వ్యవహారాలకు అద్దంపట్టే మహాజాతర సమ్మక్క సారక్క జాతర.

గిరిజనులలో స్ఫూర్తిని నింపిన వీరమణుల ఆరాధ్య వేదిక సమ్మక్క సారక్క జాతర. అమాయకుల సార్వభౌమాన్ని కూలదోయాలనుకున్న నాగరిక పెత్తందారులకు వ్యతిరేకంగా 800 ఏళ్ల కిందటే... విప్లవభావాలు నూరిపోసిన రణక్షేత్రం మేడారం. కాకలు తీరిన సాయుధ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టేందుకు ఎంతటి తెగువ అవసరమో నేర్పిన యుద్ధభూమి. దట్టమైన అడవుల్లో కొండాకోనల మధ్య వెలిసిన క్షేత్రం మేడారం. సమస్త గిరిజనుల దేవతలుగా నీరాజనాలందుకుంటున్న సమక్క సారక్కల నిలయం. పురాణాలను, ఇతిహాసాలను మించిన ఘనత కలిగిన ఈ జాతరను ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా యునెస్కో కూడా గుర్తించింది. మాఘ పౌర్ణమి రోజున ప్రతి రెండేళ్ల కోసారి వచ్చే ఈ ఉత్సవానికి లక్షల్లో భక్తులు తరలివస్తారు. ఆ వన దేవతలను పూజించి వెళ్తారు. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో ఉంది ఈ మేడారం గ్రామం. వరంగల్ నుంచి 110 కిలోమీటర్ల దూరం. దట్టమైన అడవి, కొండ కోనల మధ్య సాగే ప్రయాణం.  ఈ జాతర ప్రకృతితో అనుబంధాన్ని పెంచుతుంది.
   
ఓరుగల్లు పోరాటాల చరిత్రలో ప్రముఖమైనది కాకతీయులతో పగిడిద్ద రాజు జరిపిన పోరాటం. 12వ శతాబ్దంలో కాకతీయ రాజుకు, పగిడిద్దరాజుకు జరిగిన యుద్ధంలో అమరులైన సమ్మక్క, సారక్క, జంపన్నకు నివాళులర్పించే గిరిజన సంప్రదాయం సమ్మక్క సారక్క జాతర. వందల సంవత్సరాల నుంచి ఈ జాతర వైభవంగా జరుగుతోంది. ఒకప్పుడు ఆదివాసీలే పాల్గొనే ఈ జాతర ఇప్పుడు అన్ని వర్గాల వారి రాకతో దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతికెక్కింది. రెండేళ్లకోసారి ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి వేళ కన్నుల పండువగా ప్రారంభమవుతుంది. మొదటి రోజు వడ్డెర పూజారులు మేడారానికి సమీపంలోని కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దె దగ్గరికి తీసుకొస్తారు. రెండో రోజు సమ్మక్కగా భావించే భరిణెను చిలుకలగుట్ట అడవి నుంచి తీసుకువస్తారు. నాలుగో రోజు సమ్మక్క, సారక్క ప్రతిరూపాలను యుద్ధం జరిగిన ప్రదేశానికి తీసుకుపోతారు. గద్దెల వద్ద గిరిజనులు బంగారం (బెల్లం) సమర్పిస్తారు. ఆ బెల్లాన్నిప్రసాదంగా స్వీకరిస్తారు. గిరిజన వీరులకు నివాళిగా మొక్కులు సమర్పిస్తారు.
   
ఆనాడు మేడారాన్ని పాలించే పగిడిద్ద రాజుకు కాకతీయ రాజులతో వైరం పెరిగింది. సంప్రదాయ ఆయుధాలతో కాకతీయ రాజులపై యుద్ధం మొదలెట్టారు. పగిడిద్దరాజు, అతని భార్య సమ్మక్క, కూమార్తెలు సారక్క, నాగులమ్మ, కొడుకు జంపన్న వీరోచితంగా తలపడ్డారు. గెరిల్లా యుద్ధ తంత్రంతో కాకతీయ సేనతో పోటీపడ్డారు. కానీ మంద బలం, ఆయుధ బలం ముందు గిరిజనుల పోరాట వ్యూహం విఫలమైంది. కాకతీయుల అపార సైనిక బలం ముందు గిరిజన వీరులు ఒక్కొక్కరూ నేలకొరిగారు. ఓడిపోయిన పరాభవంతో జంపన్న సంపంగివాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సంపంగివాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. కాకతీయులతో తలపడ్డ సమ్మక్క యుద్ధంలోనే మరణించింది. సారలమ్మ గాయపడి అడవిలోకి వెళ్తూ మత్యువాత పడింది.

అమరులైన సమ్మక్క సారక్క అప్పటి నుంచి వన దేవతలుగా కొలువబడుతున్నారు. రెండేళ్లకోసారి యుద్ధం ప్రారంభమైన రోజున (మాఘశుద్ధ పౌర్ణమి) గిరిజన సంప్రదాయాలతో ఆ దేవతలను పూజిస్తున్నారు. దండకారణ్యంలో నివసించే వివిధ జాతుల గిరిజనులు ఈ జాతరకు వస్తున్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో భక్తుల సంఖ్య రానురాను పెరుగుతోంది. ఈ జన జాతరకు భక్తకోటి తోడై మహాకుంభమేళాను తలపిస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఒడిశా, కర్ణాటక తదితర రాష్ర్టాలకు చెందిన గిరిజన తెగలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని గిరిజనేతరులు కూడా సందర్శిస్తున్నారు.

మేడారం మ‌హా జాత‌ర తేదీలు - 2018
- జ‌న‌వ‌రి 31న సార‌ల‌మ్మ గ‌ద్దెకు ఆగమనం
- ఫిబ్ర‌వ‌రి 1న సమ్మ‌క్క‌ గ‌ద్దెకు ఆగమనం
- ఫిబ్ర‌వ‌రి 2న భ‌క్తుల మొక్కులు చెల్లింపు
- ఫిబ్ర‌వ‌రి 3న అమ్మ‌వార్లు తిరిగి వ‌న ప్ర‌వేశం

https://www.youtube.com/c/vantintichitkalu 

No comments: