అనంత వ్రత కోటీనాం.. ఏకబిల్వం శివార్పణం..
ఒక్క ఆకుతో పూజించినా కోటి కోర్కెలనైనా తీర్చే దేవుడు శివుడు. ఆదిదేవుడు నిర్వికారుడు.. నిరాండంబరుడు... ఆ పార్వతీపతిని పూజించాలంటే భక్తులు కూడా ఆర్భాటాలకు, ఆడంబరాలకు పోనక్కరలేదు. పుష్పం, పత్రం, తోయం...ఇందులో పువ్వులు లేకపోయినా ఆకులు, నీళ్లూ ఉంటే చాలు శివుడు సంతృప్తి చెందుతాడు. బిల్వం.. అంటే మారేడు పత్రాలు శంకరుడికి ఎంతో ప్రీతి. అలాగే జలాభిషేకంతోనే ఆయన కరుణ పొందవచ్చు.
బిల్వదళం మూడు ఆకులతో ఉంటుంది. అందుకే త్రిమూర్తుల రూపమని ప్రతీతి. అందులో ఎడమ వైపునున్నది బ్రహ్మ, కుడి వైపునున్నది విష్ణు, మధ్య ఉన్న ఆకు శివుడి రూపమని విశ్వాసం. మూడాకులున్న బిల్వదళాన్ని మాత్రమే సమర్పించాలి. ఇది త్రిశూలానికి సంకేతం. మారేడుని శ్రీఫలం అంటాం. అంటే లక్ష్మీదేవికి ప్రతిరూపం. అందుకే శివానుగ్రహం కోసం కోటి బిల్వ పత్రాలతో పూజించాలనే విశ్వాసం వ్యాప్తిలోకి వచ్చింది. కానీ మోక్షం పొందడానికి ఒక్క బిల్వ పత్రమున్నాచాలు.
సుగంధ భరితంగా ఏదో దివ్యానుభూతిని కలుగజేస్తూ ఉండే మారేడుతో వేనవేల లాభాలున్నాయి. మారేడు వృక్షం నుంచి గాలి సోకితేనే ఆరోగ్యం. అందులో సూర్య శక్తి, తేజస్సు ఉంటుంది.శరీరంలోపలా, బయటా చెడును హరిస్తుంది. మారేడు ఆకుల కషాయం తాగితే అరుచి దూరమవుతుంది. జఠరాగ్నిని బాగా రగులుస్తుంది కాబట్టి ఆకలి పుడుతుంది. శ్లేష్మాన్ని, అతిసారాన్ని పోగొడుతుంది. మారేడు ఆకులను నూరి శరీరానికి రాసుకుంటే చర్మసంబంధ వ్యాధులు దూరమవుతాయి.
No comments:
Post a Comment