వేసవి వచ్చిందంటే చాలు వంటింట్లో బార్లీ గింజలు, సగ్గుబియ్యం, సబ్జా గింజలు... దర్శనమిస్తాయి. ఇవి గతంలో నీళ్లు, పాలు, మజ్జిగలు మాత్రమే వాడి ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు తాగే పానీయాలు చేసేవారు. ఆధునిక కాలంలో ఇవే ఇంగ్రీడియెంట్స్ గా లస్సీలు. ఫ్రూట్ సలాడ్ లు, జ్యూస్ లు చేస్తున్నారు. అంటే ఆరోగ్యంతో పాటూ పలు రుచులు, కంటికి ఇంపుగా తయారవుతున్నాయన్నమాట. చాలా మటుకు పాత కాలం ఆహారపు అలవాట్లు కనుమరుగై అంతా ఇన్స్ టంట్ ఆహారపదార్థాలకే ఓటేస్తున్న తరుణంలో వీటి క్రేజీ తగ్గకపోవడానికి వీటి ఔషధగుణాలే ప్రధాన కారణం.
వంటింటిచిట్కాలు.కాం
బార్లీ ఒక గడ్డి జాతిమొక్క. బార్లీ గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి, రక్తపోటు, కొలెస్ట్రాల్ లను నియంత్రిస్తాయి. పోటీ ప్రపంచంలో అన్నీ వయసుల వారికి అప్పనంగా వచ్చి చేరుతున్న అధిక బరువుని తగ్గించేస్తుంది. ముఖ్యంగా పిల్లలు, వయసు మళ్ళినవారు బార్లీ నీరు తీసుకోవడం వల్ల మలబద్ధకం దరిచేరదు. మధుమేహం ఉన్న వారికి బార్లీ గింజలు చాలా మేలే చేస్తాయి. వీరిలో ఇన్సులిన్ హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది. బార్లీ నీరు వేసవిలో దహార్తిని తీర్చడమే కాక శరీరంలోని వ్యర్ధపదార్థాలని బయటికి పంపించడంలో తోడ్పడుతుంది.
సగ్గు బియ్యం అనగానె ఇదీ ఏదో ఒక ధాన్యం నుండి వచ్చినదనుకుంటారు చాలా మంది. కానీ దీని తయారికి ముడి సరుకు కర్ర పెండలం. ఇలా భూమిలో పండే దుంపను తీసి, శుభ్రపరచి దాని నుంచి పాలను తీస్తారు. ఇవి ముద్దగా ఉండడంతో జల్లడ సహాయంతో కావలసిన పరిమాణంలో గుండ్రని సహజసిద్ధమైన గింజలలానే తయారుచేసి ఆరపోస్తారు. అయితే ఇదంతా పాత పద్ధతి. సాంకేతికతను పుణికిపుచ్చుకున్న ఈ కాలంలో వీటి తయారీలో దుంపలు భూమి నుంచి తీయడం మొదలు, తొక్కతీయడం, శుభ్రపరచడం, పాలుతీయడం, చిన్నచిన్న ఉండలు చేయడం, ఆరపెట్టడం, ప్యాకింగ్.... అంతా యంత్రాలే చేసుకుపోతాయి.
సగ్గుబియ్యం లోని పొషకాల విషయానికొస్తే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తూ కొవ్వు తక్కువగా ఉండే పదార్ధం ఇది. కనుక బరువు తగ్గాలని అనుకునేవారికి చక్కని ఆహారం. ఇందులో మినరల్స్, విటమిన్స్, కాల్షియం, ఐరన్, ఫైబెర్లు ఉండటం వల్ల అన్ని వయసుల వారికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. చంటి పిల్లలకు సైతం పాల తర్వాత చెప్పే ఆహారం సగ్గుబియ్యం. ఇతరత్రా అనారోగ్యాలతో బాధపడుతున్నవారు, శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు, బలహీనంగా ఉన్నవారు ఇలా ఎవరైనా తేలికగా జీర్ణమయ్యే సగ్గుబియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల శక్తిని పుంజుకుంటారు.
సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. చెమటకాయలతో పాటూ వేసవిలో శరీర తాపంతో వచ్చే పలు రకాల చర్మ వ్యాధులను నయం చేస్తుంది. అయితే సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తీసుకుంటే సత్వర ఫలితం ఉంటుంది. అజీర్ణానికి సబ్జా నానబెట్టిన నీటిలో ఒక చెక్క నిమ్మకాయ రసం, చెంచా పంచదార కలిపి తాగితే ప్రయోజనముంటుంది.
ఇవే కాక కొబ్బరి బోండాం, చెరకు రసం, పుదీనా షర్బత్, నిమ్మకాయ షర్బత్, ముంజలు, ఫ్రూట్ జ్యూస్ లు.. ఇలా హాట్ హాట్ సమ్మర్ లో కూడా కూల్ కూల్ గా మనల్ని ఉంచడమే కాక అనారోగ్యానికి గురికాకుండా కాపాడుతాయి.
No comments:
Post a Comment