ఎండలు మండుతున్నాయ్. మండే ఎండల్లోనూ చక్కని చిట్కాలు పాటిస్తే చిటికెలో సమస్యల అగ్ని గుండానికి దూరం కావచ్చు. ఎండల్లో కళ్లు, చర్మం, జుత్తు కాపాడుకోవడం, డీ హైడ్రేషన్ నుంచి ఉపశమనం పొందడం ఎలానో చూద్దాం. మన శరీరంలో నీటి శాతం తగ్గడమే డీ హైడ్రేషన్. ఇది ఏమాత్రం ఏమార్చినా ప్రాణాలమీదకి తీసుకొస్తుంది. కళ్లు తిరగడం, నీరసపడటం, స్పృహ కోల్పోవడం జరుగుతుంది. వాతావరణంలో పెరిగిన ఉష్ణోగ్రతలకు పట్టే చెమటలతో మన శరీరంలో సోడియం, పొటాషియం మూలకాల సమతూకం దెబ్బతింటుంది. డీహైడ్రేషన్ కి లోనవకుండా మంచి నీళ్లతో... నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు దాహం తీర్చుకోవాలి. ఇంత గరంగరంలో టీ, కాఫీలు, గరం మసాలా ఆహారాన్ని తగ్గించి, బార్లీ, కొబ్బరి నీళ్లు, మజ్జిగలు వాడుకోవాలి. విసర్జించిన నీటికి సరి సమానంగా సమయానికి మంచినీళ్లు తీసుకుంటుండాలి. పండ్ల రసాలు, ఎలక్ర్టోలైట్ ద్రవాలతో డీహైడ్రేషన్ లక్షణాల నుంచి బయటపడొచ్చు. ఎండాకాలం బయటికి వెళ్లాలంటే మన కళ్లు, చర్మం జుత్తు సూర్యుని వేడి నుండే కాక ఆల్ట్రావయెలెట్ కిరణాల బారినపడకుండా జాగ్రత్తవహించాలి.
కళ్లు కాపాడుకోండి ఇలా...
సూర్యుని వేడిమి నుంచి నయనాలు కాపాడుకోవడం ప్రధానం. ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఆల్ట్రా వయెలెట్ కిరణాల రేడియేషన్ తో కళ్ల చూపు శాశ్వతంగా పోయే ప్రమాదముంది. కళ్ల రెటీనా దెబ్బ తినకుండా ముందుచూపు అవసరం. సన్ గ్లాసెస్ తోపాటు ఆధునాతన కంటాక్ట్ లెన్స్ కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. నాణ్యమైన సన్ గ్లాసెస్ వినియోగిస్తే వంద శాతం యు.వి. రేడియేషన్ నుంచి మన కళ్లకు రక్షణ కలిగినట్టే. గ్రే కలర్ సన్ గ్లాసెస్ అయితే ఎక్కువ కాంతిని పరిసరాల రంగు మారకుండానే తగ్గిస్తుంది. పెద్దలకంటే కూడా పిల్లలు, టీనేజర్స్ ఎండలో ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది. కాబట్టి కలర్ ఫుల్ డిజైన్స్, చాలా మోడల్స్ లో లభ్యమయ్యే సన్ గ్లాసెస్ వినియోగించడం మర్చిపోకూడదు. మనం ఎంచుకున్న సన్ గ్లాసెస్ ఎంతవరకు యు.వి. రేస్ ను నిక్షిప్తం చేసుకుంటాయో, మన కళ్లను ఎలా కాపాడుతాయో ముందే పరీక్షీంచుకోవాలి.
చర్మం రక్షించుకోండి ఇలా...
ఎండలో కాలు పెట్టగానే మదిలో మెదిలేది చర్మంపై వేడికి కమిలి పడే నల్లని మచ్చలు. సూర్యుడికి నేరుగా ఎక్స్ పోజ్ అయ్యే శరీర భాగాల్లో చర్మం వేడికి మాడిపోయి నల్లగా మచ్చలు ఏర్పడతాయి. నాణ్యమైన సన్ స్క్రీన్ లోషన్స్ వాడితే చర్మంపై రక్షణకవచంగా ఉండి హాని కలిగించే కిరణాలకు దూరంగా ఉండొచ్చు. తలకు, ముఖానికీ స్కార్ఫ్ తో సహా చేతులకు, కాళ్లకూ గ్లౌజ్ లు, సాక్షులు వాడటం మర్చిపోకూడదు. మండే ఎండల్లో మనం తీసుకునే నీరంతా చెమటరూపంలో బయటకి పోతుంటుంది. వేసవిలో కనీసం 8 నుంచి 10 గ్లాసులైనా మంచినీళ్లు తాగాలి. ఆవిరైపోతున్న మన శరీరంలోని నీటి శాతాన్ని తిరిగి పొందేందుకు మంచినీళ్లతోపాటు వివిధరకాల పానీయాలు, పండ్ల రసాలు, డెయిరీ ఉత్పత్తులను క్రమం తప్పకుండా తీసుకుంటుండాలి. ఎక్కువ చెమటలు, ఎండ తాకిడితో చర్మగ్రంథులు తెరుచుకుని వాటిలో మురికి చేరుతుంది. చర్మం పాడవటం, చెమటకాయలు, పింపుల్స్ రావడం జరుగుతుంది. వీటికి ఉపశమనంగా రోజ్ వాటర్ ని వాడుకుని చర్మాన్ని కాంతులీనేలా కాపాడుకోవచ్చు. సమ్మర్ లో వీలైనంత మేకప్ లకు దూరంగా వుండి వాటర్ బేస్డ్ మేకప్ ప్రోడక్టులు, ఐలైనర్, మస్కారా వాడుకోవడం శ్రేష్టం. తరచూ బ్యూటీ పార్లర్స్ కి వెళుతూ డెడ్ స్కిన్ క్లీన్ చేయించుకోవాలి. కీరా, రోజ్ వాటర్, గంధం, వేపాకులతో చక్కని కూలింగ్ ప్యాక్ లను తయారు చేసుకుని చర్మ సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇనుమడింపచేయొచ్చు. వాడే కాస్మటిక్స్ అల్ట్రా వైలట్ కిరణాలను నివారించగలిగేవిగా ఉండాలి. అంటే జింక్ ఆక్సైడ్, టైటానియం డై ఆక్సైడ్ ఉండాలి. ఎవోబెంజిన్, ఇతర సన్‌స్క్రీన్ లోషన్లు చర్మంలోకి చొచ్చుకుపోయి కిరణాలను శోషణం చేసుకుంటాయి. జింక్, టైటానియం చర్మంపైనే ఉండి కిరణాలను వెనక్కు పంపుతాయి. ఇవి అల్ట్రావైలెట్ కిరణాలనుండి చర్మాన్ని రక్షిస్తాయి. ఎండలోకి వెళ్ళడానికి పది, పదిహేను నిమిషాల ముందుగానే సన్‌స్క్రీన్ లోషన్ వంటికి రాసుకోవాలి. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంవలన వేసవి కాలంలో ఇబ్బందులను అధిగమించవచ్చు. ముఖ్యంగా కాటన్ దుస్తులు ధరించి నట్లయతే అన్ని విధాలా మంచిదని గమనించాలి.
శిరోజాలను అందంగా ముడివేయండి ఇలా...
భగభగ మండే సూర్య కిరణాలు కళ్లు, చర్మాన్నే కాక శిరోజాలకూ హాని కలిగిస్తాయి. అందుకు కొంచం శిరోజాల సంరక్షణ విషయంలో మెళకువలు అవసరం. సమ్మర్ లో కొంత కేర్ తో రకరకాల హెయిర్ స్టయిల్స్ సాధ్యమవుతాయి. వీలైనంత తక్కువ పొడవులో హెయిర్ ఉంటే సమ్మర్ లో హాయి. పొడవైన హెయిర్ ని కూడా టాప్ నాట్, పోనీ టెయిల్ గా వేసుకుంటే హాయిగాను, ట్రెండీగానూ వుంటుంది. శిరోజాలు పాడవకుండా వేసవిలో తరచు మంచి కండీషనర్లను వాడాలి. హెన్నా మంచి కండీషనరే కాక హెయిర్ మాస్క్ గానూ పని చేస్తుంది. వ్యాయామానికి వ్యాయామం. ఒక మంచి ఆట, అలసటకి విరుగుడు స్విమ్మింగ్. స్విమ్మింగ్ పూల్ లో వాడే క్లోరిన్ వల్ల జుత్తు మరింత పాడయ్యే అవకాశాలు ఎక్కువ. దీంతో జుత్తును కాపాడుకోవడానికి కండీషనర్సే మార్గం. మిగతా శరీర భాగాలతోపాటు తలలోనూ ఎక్కువ చెమట పట్టే ఈ కాలంలో వారానికి కనీసం మూడుసార్లయినా కండీషనర్ షాంపూతో స్నానం చేయాలి. నిర్లక్ష్యం చేస్తే చెమటలతో ఏర్పడిన మలినాలతో దురదలు, చిరాకు పైగా జుత్తు రాలడం జరుగుతుంది. సరిపడా మంచినీళ్లు, పండ్ల రసాలే కాకుండా తాజా పచ్చని కూరగాయలు, పండ్లు, సలాడ్స్ చర్మన్నే కాక శిరోజాలనూ రక్షిస్తాయి. ఈ చక్కని చిట్కాలు మదిలో పదిలపరుచుకుని మండు వేసవిలో సైతం హాయికిహాయిగా కూల్ కి కూల్ గా ఎంజాయ్ చేస్తారు కదూ.
No comments:
Post a Comment