వాతావరణ కాలుష్యం వల్ల ఏర్పడే సమస్యలను అధిగమించడానికి అలంకరణ మొక్కలను ఆశ్రయించక తప్పదు. ఇంటికి శోభ వంటికి ఆరోగ్యాన్నిచ్చే అలంకరణ మొక్కలు కాలుష్యం నుంచి రక్షణ వలయంగా ఉంటాయి. కర్మాగారాలు, రవాణ వాహనాల నుండి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ - ఇతర హానికర వాయువులు వెలవడుతాయి. ఇంటి చుట్టూ ఉన్న చిన్న చిన్న చెట్లు, అలంకరణ మొక్కలు దుమ్ము, ధూళి, పొగలను అడ్డగించి మనల్ని అనారోగ్యాలకు గురికాకుండా చూస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ ను మొక్కలు వినియోగించుకుని మానవుని(జీవుల) కి అవసరమైన ప్రాణవాయువు(ఆక్సీజన్)ను వాతావరణంలోకి విడుదల చేస్తాయి. మానవునికి ప్రమాదకరమైన సల్ఫర్ డైఆక్సైడ్ వంటి వాయువులను మొక్కలు గ్రహించి తద్వారా స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి.
రవాణ వాహనాల రాకపోకల శబ్దాలు, ఇంకా ఇతర శబ్దాల కలుష్యాన్ని నివారించి మనం నివసించడానికి అనువైన పరిసరాలను అలంకరణ మొక్కలు కలిపిస్తాయి. అలంకరణ మొక్కలు పరిసరాల ఉష్ణోగ్రతను క్రమబద్దం చేస్తాయి. మొక్కలు నేలలోని నీటిని వాటి వేర్ల ద్వారా గ్రహించి, ఆకుల నుండి ఆవిరి రూపంలో వాతావరణంలోకి విడుదల చేస్తాయి.
మొక్కల ఆకులు ముదురు రంగులో ఉండటం చేత సూర్యకిరణాలను గ్రహించడం తప్ప విడుదల చేయలేవు. ఈ కారణాల వల్ల చుట్టూ ఉన్న వాతావరణం చల్లబడుతుంది. ఇంటి పరిసరాలలో కొన్ని చెట్లు ఉంటే ఎంతో నీడను శుభ్రమైన గాలిని పొందవచ్చు.
అధిక వేగంతో వీచే గాలులు ఇంట్లోకి చొరబడి ప్రమాదాలు సృష్టించకుండా ఉండడానికి కిటికీలకు తీగలుగా పెరిగిన మొక్కలు దొహదపడతాయి.
సిట్రొనెల్ల, పన్నీరు, వట్టివేరు, మాచిపత్రి, మరువం, దవనం లాంటి మొక్కలు పెంచడం వల్ల సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి. ఇంటి ముంగిళ్లలో నాటుకోవడానికి పారిజాతం ఎంతో అనువైనది. ఇంటికి హోదాను, వైభవాన్ని తెచ్చిపెట్టే పారిజాతపు పుష్పాలు రాత్రివేళల్లో వికసించి ఆహ్లాదకరమైన, మత్తెక్కిచ్చే సువాసనలను వెదజల్లుతాయి. అందం, ఆకర్షణతో కూడిన గ్లాడిస్ సంతతికి చెందిన మొక్కలను ఇంటిముందు కుండీలలో పెంచుకుంటే మనస్సుకు మనోహరాన్ని కలిగిస్తాయి. ఫ్లవర్ వాజ్ లలో అలంకరించడానికి, బొకెలు కట్టడానికి గ్లాడిస్ ఫ్లవర్స్ బాగుంటాయి.
ఫిలోడెండ్రాన్ మొక్కలను ఇంటి బయట కంపౌండ్ లో, బాల్కనీ, పోర్టికో, వరండాలలో పెంచుకోవచ్చు. వేలాడే కుండీలుగా, మట్టి అవసరం లేకుండా కేవలం నీటితోనే హైడ్రోఫోనిక్స్ ని కూడా పెంచుకోవచ్చు. ఫిలోడెండ్రాన్ ఆకులు హృదయం, కోడిగుడ్డు, బాణం, గోళం - రకరకాల ఆకారాలలో ఉండి చూపరులను ఇట్టే ఆకర్షిస్తాయి.
అలంకరణ మొక్కలతో పాటు చామంతి, కనకాంబరం, గన్నేరు, మల్లె, సన్నజాజి, విరజాజి, చమేలి, గులాబి - పలు పూల మొక్కలనుపెంచుకోవడం ప్రయోజనకరం. వాటితో పాటుగా పెరటిలో వివిధ జౌషధ గుణాలున్న మొక్కలు, చక్కని పోషకాలున్న ఆకుకూరల మొక్కలు పెంచుకోవచ్చు. వీటి వల్ల ఇంటికి అందం పెరుగుతుంది. పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. పూలు, కూరలు, సామాన్య రుగ్మతల చికిత్సలకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. విరామ సమయాన్ని సమర్ధవంతంగా వినియోగించుకోవచ్చు. అలంకరణ మొక్కలను ఆరోగ్యంగా పెంచడం వల్ల శరీరానికి వ్యాయామంతో పాటు ఆరోగ్యం చేకూరుతుంది.
తెలియకుండానే మన చుట్టూ ఆవరించి విషవలయాలున్నాయి. క్యాన్సర్ కు దారి తీసే కణాలు లేకపోలేదు. ఇంటి నిర్మాణంలో, ఫర్నీచర్ లో ఉపయోగించిన ఫ్లైవుడ్ నుంచి ఫార్మాల్డిహైడ్, వంటగ్యాస్ - ఇతర దీపాలను వెలిగించినప్పుడు వెలువడే కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, ఎయిర్ కండీషన్ గదులలో మౌల్డ్స్, ఫంగీ, బ్యాక్టీరియాలను నివారించడానికి ఇండోర్ ప్లాంట్సే శరణ్యం.
బయటి వాతావరణం ఎంత కాలుష్యమైనప్పటికి ఇంట్లో కాలుష్యం అదుపులో లేకుంటే అతి ప్రమాదకరం. మనం పీల్చుకునేది ప్రాణవాయువు అయినా వదిలేది విషవాయువులే. ఇంట్లో అనుకూలమైన వాతావరణం లేకుంటే తలతిప్పడం లాంటి రుగ్మతలు తప్పవు. కొన్నిసార్లు శ్వాస ఆడడమే కష్టం కావచ్చు. అందుకే కొద్దిపాటి శ్రమకోర్చి పచ్చని మొక్కలను పెంచి ఇంటిని చక్కదిద్దుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
అలంకరణ మొక్కలను అమర్చిన కుండీలలోని ఇసుకను అనుకోని అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు మంటలను అదుపు చేయడానికి వాడుకోవచ్చు. ఇంటిని చక్కదిద్దడంలోను, చక్కని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరికొన్ని చిట్కాలు చూద్దాం.
క్రిమి కీటకాలకు వాడే మందులను సాధ్యమైనంతవరకు తగ్గించాలి. ఆ మందులు ఆవిరై హానికరమైన పారడీక్లోరోబెంజిన్ లు ఏర్పడతాయి. గదులలో గాలి వెలుతురు సోకే విధంగా వెంటిలేషన్ ఉండాలి. మూసి ఉంచే సూట్ కేస్, ఇతర పెట్టెల అడుగులలో ఎండిన వేప ఆకులను, నాఫ్తాలిన్ ఉండలను ఉంచితే క్రిములు దరిచేరవు. కొత్త బట్టలను, డ్రైక్లీన్ చేసిన బట్టలను తడిపి ఆరవేసి వాడుకోవాలి. దుస్తులను డ్రైక్లీన్ చేయడానికి వాడే కెమికల్స్ ప్రమాదకరమైనవి. కిటికీలు, గుమ్మాల కర్టెన్లు, డోర్ మ్యాట్లు , సోఫా కవర్లు, బెడ్ షీట్లను తరచూ వేడినీటితో ఉతికి శుభ్రపరచుకోవాలి. అలాచేయడం వల్ల డస్ట్ మేట్స్ వదిలి ఆస్తమా, ఎలర్జీల భారిన పడకుండా, అంటురోగాలు సోకడానికి ఆస్కారం లేకుండా ఉంటుంది. ఏ.సి, ఏయిర్ కూలర్, ఫ్యాన్లను దుమ్ము, ధూళీ చేరకుండా శుభ్రపరుస్తూ ఉండాలి. అప్పుడే పరిశుభ్రమైన గాలి మనసొంతం అవుతుంది.
బయట వాడిన షూష్ ని ఇంట్లో పరచిన కార్పెట్ పై వాడకూడదు. ఇంట్లో వేరొక పాదరక్షల జత వాడుకోవాలి. సిగరేట్ పొగలో నాలుగు వేలకు పై చిలుకు రకాల హానికరమైన రసాయణాలుంటాయి. పొగతాగే వారి కంటే పక్కవారికే ఎక్కువ ప్రమాదం. ఆ అలవాటు మానుకోవాలి. తప్పదనుకుంటే సరియైన వెంటిలేషన్ ఉన్న గదుల్లోనే పొగ తాగాలి.
వంటింట్లో, బాత్ రూంలలో వాడే స్టౌవ్ లు, ల్యాంప్ లు, గీజర్ లు, డ్రైయర్ లు - ఇతర గృహోపకరణాల నుండి నైట్రోజన్ డైఆక్సైడ్ వెలువడుతుంది. ఈ వాయువులను తప్పించడానికి, స్వచ్ఛమైన ఆక్సీజన్ గదుల్లో నిండుకోవడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ లను తప్పనిసరిగా వాడాలి. అలాగే ఇంటికి ఆనుకుని వాహనాలు నిలుపుకునే పార్కింగ్ లేదా గ్యారేజ్ ఉంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడకం ఎంతైనా మంచిది.
ఈపాటి చిన్ని చిట్కాలను పాటించి మన అందమైన ఇంటికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు. మన ఆరోగ్యం పది కాలాల పాటు పదిలపరచుకోవచ్చు.
No comments:
Post a Comment