చిట్కాలు తెలిస్తే చిటికిలో గ్యాస్ స్టవ్ మరమ్మతు I Gas Stove Repairing & Servicing | వంటింటి చిట్కాలు | vantintichitkalu


దుర్గ ఆ రోజుకు పనులు ముగించుకుని నిద్రకుపక్రమిస్తూ లైట్ కట్టెయడానికి కిచెన్ లోకి వెళ్ళింది. కట్టేయగానే గ్యాస్ స్టవ్ దగ్గరలో చిన్న దీపంలా వెలుగుతుండడం కంటపడింది. పరీక్షించి చూడగానే అది గ్యాస్ హోజ్ కనెక్టర్ సమీపంలో రబ్బరు పైపు నుంచి సన్నగా గ్యాస్ లీక్ అవడం, అది మండడం జరుగుతోంది. వెంటనే అప్రమత్తమైన దుర్గ గ్యాస్ రెగ్యులేటర్ ని కట్టేసి మరునాడు ఉదయాన్నే రబ్బరు పైపుని మార్చేసింది. ఘోర ప్రమాదం తప్పినట్టయింది.

                                                      ***
గ్లాస్ కుక్ టాప్ గ్యాస్ స్టవ్ ని వాడుతున్న వర్ష ఉదయం లేవగానే స్టవ్ వెలిగించి ఒక్కసారిగా వచ్చిన శభ్దానికి భయబ్రాంతికి గురయ్యింది. తేరుకుని ఆలోచిస్తే రాత్రి సిమ్ లోకి మార్చగానే బర్నర్ ఆఫ్ అయింది. ఇక గ్యాస్ స్టవ్ కట్టేయలని తోచక వదిలేస్తే లీక్ అయిన గ్యాస్ ఇప్పుడు మంట వచ్చి స్టవ్ పైన గ్లాస్ తునాతునకలయ్యింది.    

                                                     ***

ఇలా వంటింటి ప్రమాదాలకు గ్యాస్ స్టవ్ వినియోగంలో అజాగ్రత్త మూల హేతువు. వంటింట్లో గ్యాస్ స్టవ్ లు పేలిన దుర్ఘటనలు తరచూ నాలుగు 'కాలలు' దినపత్రికలకు, ప్రతీ బులెటెన్ లో టీవీలకు వార్తలవుతున్నాయి. గ్యాస్ స్టవ్ వంటింట్లో ఉంటే గృహిణులకు ఎంత సౌకర్యమో అంత ప్రమాదభరితం కూడా. ఇంటి ఇల్లాళ్ళు ఏమరుపాటు వీడి అప్రమత్తంగా ఉంటే గ్యాస్ స్టవ్ ప్రమాదాలని జరగకుండా చూసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ తో తరచూ ఎదురయ్యే సమస్యలు, విడి భాగాలు, వినియోగించే ఉపకరణాలపై అవగాహన ఉంటే చిటికలోనే బాగుచేసుకునే సౌకర్యం కూడా ఉంది.

స్టవ్ వెలుగుతుండగానే గ్యాస్ వాసన రావడం, రెగ్యులేటర్ కట్టేసినా స్టవ్ వెలిగి ఉండడం, గ్యాస్ కంట్రోల్ నాబ్ ని సిమ్ లోకి మార్చగానే మంట ఆరిపోవడం, నాబ్ కదలకుండా మొరాయించడం, విరిగిపోవడం. మంట ఎర్రగా రావడం, గిన్నెలకు మసిపట్టడం, ఆటోమెటిక్ స్టవ్ లకు లైటర్ పనిచేయక పోవడం  - ఇలాంటి సమస్యలు గ్యాస్ స్టవ్ వినియోగంలో ఎదురవుతాయి. వంటింటి గ్యాస్ స్టవ్ ని ఈ సమస్యలతో ఏ మెకానిక్ నో ఆశ్రయిస్తే డబ్బు దండుకుని లేని సమస్యలు మిగులుస్తాడు. తక్కువ విడిభాగాలతో నిర్మితమైన గ్యాస్ స్టవ్ ని సర్వీసింగ్ సులభంగా చేసుకోవడం గృహిణులకు ఏమాత్రం కష్టతరం కాదు. పైగా విడి భాగాలు ఏమంత ఖరీదైనవి కాదు. గ్యాస్ స్టవ్ కి గ్యాస్ సిలిండర్ నుండి కనెక్ట్ చేసే రబ్బరు ట్యూబ్, రెగ్యులేటర్ తో పాటూ స్టవ్ ఫ్రేమ్ లో ఇమిడిఉన్న పైప్ లైన్  (మిక్సింగ్ మెటల్ ట్యూబ్), బర్నర్ లు, గ్యాస్ కాక్ లు, జెట్ లు, నాబ్ లు, పాన్ సపోర్ట్ లు, నాలుగు రబ్బరు దిబ్బలు, డజనుకు మించని స్క్రూలు, నట్లు... ఇవి స్టవ్ లోని విడి భాగాలు. ఇక విడి భాగాలు తెలిసిన మీరు 'గ్యాస్ స్టవ్ మెకానిజం' చేయడం సులభం.

అతి తక్కువ పనిముట్లు ఉపయోగించి గ్యాస్ స్టవ్ ని సర్వీసింగ్ చేసుకోవచ్చు. కనీసం నెలకోసారయినా గ్యాస్ స్టవ్ ని పూర్తిగా విడదీసి శుభ్రపరచి బిగించుకోవడం వలన చక్కగా మంట బ్లూ కలర్ లో పూర్తిగా వెలుగుతుంది. తద్వారా గ్యాస్ కూడా పొదుపు అవుతుంది. స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్, జెట్ రేంచీలు స్టవ్ రిపేరింగ్ కు ఉపకరించే సాధనాలు. ఇవి ఇళ్ళల్లో ఉండే సాధనాలే కనుక కొన్ని గ్యాస్ స్టవ్ స్పేర్ పార్ట్ లు కూడా కొనుగోలు చేయడం ఉపయోగకరం.

గ్యాస్ స్టవ్ వాడకంలో అతి భయంకర సమస్య  గ్యాస్ లీకవుతూ వాసనరావడం. ఈ సమస్యకు కారణం ప్రెజర్ రెగ్యులేటర్ అయితే మాత్రం రిపేర్ చేసే ప్రయత్నం చేయకుండా కొత్తది మార్చుకోవడం మంచిది. రెగ్యులేటర్ పనితీరు కనుక్కోవడానికి ఇలా చేసి చూడాలి. స్టవ్ లోని అన్నీ బర్నర్ లను సరిగా కట్టేసినా గ్యాస్ వాసన వస్తుంటే, రెగ్యులేటర్ ని కూడా ఒక సారి కట్టేసి గమనించాలి. మామూలుగా గ్యాస్ స్టవ్ పనిలో ఉన్నప్పుడే రెగ్యులేటర్ నాబ్ ఆఫ్ చేస్తే మంట ఆరిపోవాలి. కానీ మంట ఆరకుండా వెలుగుతూ ఉంటే అది రెగ్యులేటర్ లోని లోపమే.

కొన్ని సందర్భాల్లో సిలిండర్ కూడా లీక్ అవుతుంది. సిలిండర్ క్యాప్ తీసేసి కొన్ని నీళ్ళు పోస్తే బుడగలు వస్తాయి. రెగ్యులేటర్ ను సిలిండర్ కి అమర్చి రెగ్యులేటర్ నాబ్ ని ఆన్, ఆఫ్ ఏది చేసినను సిలిండర్ లోని 'పిన్' కదలికలు ఉండవు. సిలిండర్ లీకవుతున్నప్పుడు రెగ్యులేటర్ నాబ్ ని ఆఫ్ పొజిషన్లో ఉంచినా స్టవ్ వెలుగుతుంది. ముందుగానే సిలిండర్ గ్యాస్ లీక్ ని గుర్తించి సిలిండరు మార్చడం ఉత్తమం. ఈ విషయంపై గ్యాస్ ఏజెన్సీ వాళ్లకి కంప్లైంట్ చేయడం వల్ల సిలిండర్ మార్చడం గానీ, రబ్బర్ వాషర్, పిన్ అమరికల్ని సరిచేయడం గానీ చేస్తారు.  సిలిండర్ బరువు, గడువు తీరు తేది, గ్యాస్ లీకేజి తదితర నాణ్యతపరమైన విషయాల్లో ఇంటికి సిలిండర్ రాగానే వారి సమక్షంలోనే సరిచూసుకోవడం ఉత్తమం.

గ్యాస్ లీక్ నకు సిలిండర్, రెగ్యులేటర్ లు కారణం కాకుంటే రబ్బరు పైపే కారణం అని నిర్ధారించవచ్చు. స్టవ్ నాబ్ లు ఆఫ్ చేసి, రెగ్యులేటర్ ఆన్ చేసి రబ్బరు పైపుపై సబ్బు నీళ్లని స్ప్రే చేస్తే గ్యాస్ లీక్ అవుతుందో లేదో తేలిపోతుంది. వీటికి గమ్ టేప్ లు అంటించడం మంచి పద్దతి కాదని గుర్తించాలి. రబ్బరు పైపు పగుళ్ళు వచ్చినప్పుడు, చివరలు వెడల్పు అవడం వల్ల గ్యాస్ లీక్ అవుతుంది. కాబట్టి పైపు నాణ్యతను బట్టి తరచూ పైపును మార్చుకోవాలి. పైపుపై ఎలాంటి తొడుగులు, బరువులు, మడతలు కచ్చితంగా ఉండకూడదు.

బ్లూ ఫ్లేమ్ రాక, స్టవ్ నాబ్ సిమ్ లోకి తిప్పినప్పుడు మంట ఆరిపోతుంటే, అసలుకే నాబ్ లు పనిచేయక  ఇబ్బంది పెడుతుంటే స్టవ్ ని రిపేర్ చేయక తప్పదు. రెగ్యులేటర్ ను గ్యాస్ సిలిండర్ నుంచి తొలగించి రబ్బరు పైపును స్టవ్ నుంచి వేరు చేయాలి. వంటపాత్రలు అమర్చే పాన్ సపోర్ట్ లు, బర్నర్  లని చేత్తోనే వొలిచి స్టవ్ ఫ్రేమ్ ని బోర్లించాలి. స్టవ్ నాబ్ లను స్క్రూ డ్రైవర్ సహాయంతో ఊడదీయాలి.

వెనువెంటనే ఉన్న గ్యాస్ కాక్ కి స్టవ్ సిమ్ లో వెలిగేలా గ్యాస్ ని పంపించే చిన్న రంధ్రం ఒకటి - మామూలుగా పెద్దమంటతో స్టవ్ వెలిగేలా గ్యాస్ ని పంపించే పెద్ద రంధ్రం మరొకటి ఉంటాయి. రెండు నాబ్స్ దగ్గర ఉండే గ్యాస్ కాక్ లని విప్పి శుభ్రంచేసి కాక్ ల చుట్టూ గ్రీజ్ రాసి బిగించాలి. దుమ్ము పట్టి మసిపట్టినట్టుగా ఉన్న గ్యాస్ కాక్ లని శుభ్రపరచడం వల్ల గ్యాస్ ప్రసరణ మెరుగుపడుతుంది. మంట సరిగా రాకపోవడానికి, గిన్నెలు మసి పట్టడానికి కారణం జెట్ లు కూడా కావచ్చు. ఇవి రెండు పొయ్యిలకు రెండు అమర్చి ఉంటాయి. చిన్నపొయి దగ్గర అమర్చిన జెట్ కి చిన్న రంధ్రం, పెద్ద పొయ్యి దగ్గర అమర్చిన జెట్ కి పెద్ద రంధ్రమూ ఉంటాయి. ఇవి కూడా దుమ్ముతో నిండి ఉండడమో, మసి పట్టినట్టు ఉంటే బ్రష్,  స్టవ్ క్లీనింగ్ కిట్ లోని పిన్ లతో శుభ్రపరచాలి. స్టవ్ ఫ్రేమ్ పైకి కనిపించే స్క్రూలను తొలగించి మిక్సింగ్ మెటల్ ట్యూబ్ లను ఊడదీస్తే  ఈ జెట్ లు కనిపిస్తాయి. చివరగా మిక్సింగ్  మెటల్ ట్యూబ్ ను కూడా క్లీన్ చేసి బిగిస్తే గ్యాస్ స్టవ్ ఏ సమస్యలేకుండా పనిచేస్తుంది. ఆటోమేటిక్ స్టవ్ లకు ఇగ్నిషన్ సమస్య అదనంగా వస్తుంది. దీనికి బ్యాటరీ మర్చాల్సి ఉంటుంది. లేదా సర్వీసింగ్ చేయించాలి.

ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా, చిన్న సమస్యే అని అనిపించినా అనుభవఙులైన గ్యాస్ సర్వీసింగ్ మెకానిక్ ని సంప్రదించాలి. గ్యాస్ స్టవ్ ను తరచూ శుభ్రపరుస్తూ మధ్య మధ్యలో రబ్బరు పైపు, రెగ్యులేటర్ల పనితీరుని గమనిస్తుండాలి. బర్నర్లను తొలగించి పిన్నుతో రోజూ శుభ్రపరుస్తూ గ్యాస్ స్టవ్ పై ఆహార పదార్ధాలేవీ పొంగకుండా చూడాలి. మొరాయిస్తున్న, విరిగిన విడి భాగాలను నాణ్యమైనవాటితో భర్తీ చేస్తుండాలి. రాత్రి వేళల్లో, ఇంట్లో లేనప్పుడు రెగ్యులేటర్ నాబ్ ని కట్టివేయడం మరవకూడదు. గ్యాస్ వాసన వస్తున్నప్పుడు ఎలక్ట్రిక్ స్విచ్ లను వేయడం కానీ, తీయడం కానీ చేయద్దు. స్పార్క్ వచ్చి మంటలు చెలరేగే ప్రమాదముంది. అలాగే క్రిమీసంహార మందులను కూడా వాడకూడదు. గ్యాస్ లీకేజి, సిలిండర్ లో ఉన్న గ్యాస్ పరిమాణం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్న సేఫ్టీ డివైస్ ని అమర్చుకోవచ్చు.

గ్యాస్ స్టవ్ నాబ్ ని ఆన్ చేసి తరువాత లైటర్ వెతుక్కోవడం వల్ల గ్యాస్ వృధా అవుతుంది. అలాగే ప్రమాదం కూడా. కిచెన్ లో ఎల్లప్పుడు గాలి సక్రమంగా వీచేలా చూసుకోవాలి. వెంటిలేటర్లు, కిటికీలు తెరిచి ఉంచడం మంచిది. స్టవ్ నుండి సిలిండర్ ని సాధ్యమైనంత దూరంలో ఉంచాలి. గ్యాస్ స్టవ్ ను పిల్లలకు అందకుండా జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం.

No comments: