ప్రస్తుతంలో జీవించాలి
గడిచిన కాలం మన చేతిలో ఉండదు. భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించలేము. గతం, భవిష్యత్ రెండూ అప్రస్తుతం అందుకనే వర్తమాన కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి. మనలో చాలామంది పనులు పూర్తి చేస్తుంటారు కానీ సమయపాలనే మరచిపోతుంటారు. వాయిదా మనస్తత్వం అలవర్చుకోక ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవాలి. లేకుంటే తప్పని పరిస్థితుల్లో ఆ పనులు మనల్ని విపరీతమైన ఇబ్బందుల్లో పడేస్తాయి.
వయసుకు మించిన ముసలితనాన్ని అధిగమించాలంటే శరీరాన్నే కాక జీవన విధానాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. వయసు పైబడినా అలా కనిపించకపోవాడానికి మూలం తమ సంతోషం, సంతృప్తి అని తెలసుకోవాలి. మనం వర్తమానంలో జీవించకుండా ప్రతీ క్షణం కోరికలు, ఆలోచనలకు తావిస్తే అవమానాలు, ఆందోళనలకు గురికాక తప్పదు. పైగా మన చేతుల్లో ఉన్న సమయాన్ని కాదని జరిగినవి, జరగబోయేవి తలచుకుంటూ కూర్చుంటే ప్రస్తుతంలో ఉండే ఆనందాన్ని కూడా మనకు దక్కకుండా చేస్తాయి. కోరికలు తీర్చుకోవాలన్నా , సమస్యలనుండి బమటపడాలన్నా వర్తమానంలో మాత్రమే మనం చేసుకోగలం అని గమనించాలి.
లోకంలో సుఖం, దుఃఖం రెండూ ఉంటాయి. ఇవి ప్రతీ మానవుడికి అనుభవంలోకి రానివేంకావు. ఆశించిన ఫలితమేదైనా ఒకే రీతిగా భావించి ముందుకెళ్ళాలి. ఇది చెప్పుకున్నంత సులువేం కాకపోయినా విచక్షణతో మెలగడం ముఖ్యం. కోరికలే ఇంధనంగా మనిషిని ముందుకు నడుపుతాయి. అయితే రకరకాలైన కోరికల్లో ఉత్తమమైనది గుర్తించి సరియైన సంకల్పంతో కోరికను తీర్చుకోగలగాలి.
మనిషి ఆశాజీవి, జీవితంలో తీరినవి, తీరనవి, తీరాలని ఆశపడేవి చాలా ఉంటాయి. ఆ ఆరాటంలో ప్రస్తుతం చిరునవ్వును చెరగనివ్వద్దు. అనవసరపు ఆలోచనలే కాదు, మాటలు సైతం కట్టిపెట్టాలి. వాటి ప్రభావం ఇతరుల మీదపడే ప్రమాదముంది. Prevention Is Better Than Cure అన్నట్టుగా తరచూ మానసిక ఒత్తిడిలకు గరియై రకరకాల అనారోగ్యాల పాలయ్యేకంటే సునాయసంగా ఒత్తిడిలకు దూరంగా ఉండడం అలవర్చుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యం ఎలాంటి మానసిక ఒత్తిడికి గురవకపోవడం. ద్వేషాలు, బాధలు మానసిక వ్యాకులతకు కారణమై మనని ఇంకా కృంగదీస్తాయి. తరచూ ఈర్ష్యా ద్వేషాల విపరీత దోరణి వల్ల శరీరంలోని హార్మోనులు అసాధారణమైన వేగంతో పని చేసి మానసిక సామర్ధ్యంతో పాటుగా శరీరానికి కూడా హాని కలిగిస్తాయి. అనవసరపు ఆలోచనలతో జరిగినదానికి సతమతమవుతూ ఉన్న కాలాన్ని కాస్తా కరిగించక సప్రయోజకముగా వినియోగపరచుకోవాలి. మన అనుకున్న వ్యక్తులను దూరం చేసుకోకుండా సన్నిహితంగా మెలగడం కూడా నచ్చిన పని చేయడమే అవుతుంది. అవసరాల కోసమే 'స్నేహం' ముసుగు వేసేవారిని గుర్తించి, ఇతరులకు సహాయపడుతూ గొప్ప మానసిక అనుభూతిని పొందాలి. స్వర్గం మరెక్కడో లేదని ప్రస్తుతం అనుభవించే సంతోషంలోనే ఉందని గ్రహించాలి.
No comments:
Post a Comment