అక్షయ తృతియ అనగా లక్ష్మీదేవి సిరులు కురిపించే దివ్యమైన రోజు అని అర్థం. ఈ రోజు పసిడి కొనుగోలు చేస్తే పాడి పంటలతో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ప్రజల అపారమైన నమ్మకం. అందుకే ఈ రోజు ఎంతో కొంత బంగారం కొనుగోలు చేసేందెకు పేద, ధనికులు అనే తేడా లేకుండా షాపుల ముందు క్యూలు కడతారు. బంగారం కొనుగోలు గొప్ప పెట్టుబడి పద్ధతి అని ఆర్థక నిపుణులు చెప్తున్నారు. అయితే తగు జాగ్రత్తలు తప్పనిసరి అని సూచిస్తున్నారు. చాలా సంవత్సరాలుగా అక్షయ తృతీయ బంగారం కొనుగోలు చేయడానికి అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా పరిగణించబడుతోంది. ప్రస్తుతం ఇది ఒక సంప్రదాయంగా మారింది. భారతీయ పురాణాలు, సాంఘిక నమ్మకాలు.. ఏవైతేనేం అక్షయ తృతియ నాడు బంగారం కొనుగోలు చేస్తే ఎప్పటికీ నిలిచిపోతుందని చాలామంది నమ్మకం. పైగా ఈ సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉండడం.. బంగారం కొనగోళ్ళు ఎక్కువగానే జరుగుతాయి. కానీ బంగారు అభరణాలు కొనుగోలు చేసేటప్పుడు ముందు మీరు తప్పక గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి.
బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు, దాని నిజమైన విలువను నిర్ణయించేటప్పుడు, దాని స్వచ్ఛత గురించి తనిఖీ చేయాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) బంగారు ఆభరణాల స్వచ్ఛతను తెలిపే అధికార సంస్థ. అభరణంపై బిఐఎస్ స్టాంప్, ఎన్ని క్యారట్స్, హాల్మార్కింగ్ యొక్క సంవత్సరం వగైరా వివరాలు రింగ్ బ్యాండ్ లోపలి వైపు ఉంటాయి. బంగారం విలువ దాని స్వచ్ఛత ద్వారా నిర్ణయించబడుతుంది. మనం బంగారం కొనేముందు క్యారట్స్, బరువు, ధర, మన్నిక విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. 24 క్యారట్లు 100 శాతం స్వచ్ఛతను సూచిస్తున్నప్పటికీ, మీరు బంగారు ఆభరణాలను 22, 18 క్యారెట్ల వరకు తీసుకోవడం మంచిది.
పసిడి కొనుగోళ్లకు శుభప్రదమైనదిగా భావించే అక్షయ తృతియ సందర్భంగా నగల అమ్మకాలను వినియోగదారుడు ఆకర్షించడానికి అందుబాటులో అనేక ఆఫర్లు ఉన్నాయి. కేవలం డిస్కౌంట్లకు మాత్రమే ఆకర్శితులవ్వకూడదు. హాల్మార్క్ ముఖ్యమని గమనించాలి. బంగారు ఆభరాలణాల ధర వివిధ షాపుల్లో వేరుగా ఉండే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మార్కెట్ ధర పట్టికను, మేకింగ్ చార్జెస్, తరుగు, డిస్కౌంట్లను పరిగణనలోకి తీసుకుని ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. మీరు పూర్తిగా బంగారాన్ని పెట్టుబడిగా చూస్తున్నట్లయితే బంగారు నాణేలు, బిస్కెట్లు ఎంచుకోవడం ఉత్తమమైన మార్గం. ఎంత విలువైన రాళ్ళను పొదిగిన ఆభరణాలయినా.. బంగారం విలువను తగ్గిస్తాయి. అధిక మేకింగ్ చార్జెస్ ఉంటాయి. ఆ నగలను మార్పిడి చేసినప్పుడు, విక్రయించినప్పుడు బంగారం విలువ గుర్తించడానికి రాళ్ళను పూర్తిగా తీసివేయబడతాయి.
No comments:
Post a Comment