సన్నగా ఉన్నవారిని ఊరపిచ్చుక ప్రాణమని, ఇంటి పై ఉన్న చిన్న గోడలను పిట్టగోడలని, చిన్నప్రాయంలోనే ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తే పిట్టకొంచం కూతగణమని, పొట్టిపొట్టి కథలు చెప్తుంటే పిట్టకథలని, డాబుసరి మాటలు చెప్తుంటే పిట్టలదొరని, ఆడవారి అందమైన నడుముని పిట్టనడుమని, నవ్వుని కిలకిలా రావాలని - ఇలా మానవుడు వల్లించడానికే కాని మన ఇంటి, ఊరి పక్షుల మనుగడను పట్టించుకునే తీరికేది. ఒక్కప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో కనిపించే పిచ్చుకలు నేడు అంతరించిపోతున్నాయి. కాలంతో పోటిపడడం, సాంకేతిక ఫలాలను అందిపుచ్చుకోవడం - ఇదే లక్ష్యంతో మానవులు చేస్తున్న పనులు వల్ల పిచ్చుక జాతి పూర్తిగా అంతరించుకుపోయే పరిస్థితి నెలకొంది. మనిషి తన మనుగడ తాను చూసుకుంటూ మిగతా పరిసరాలను, జీవజాలాన్ని విస్మరిస్తున్నాడు. పిచ్చుక మీద మనం ప్రయోగిస్తున్న బ్రహ్మాస్త్రాలు, పక్షి జాతి నిర్వీర్యం కాకుండా కాపాడుకోవడమెలాగో చూద్దాం....
* పక్షులకు ఆవాసాల కొరతొచ్చి పడింది. నగరాలు, పట్టణాల్లో అపార్ట్ మెంట్ల కారణంగా పెంకుటిళ్లు, సాంప్రదాయ గృహాలు కనుమరుగవుతున్నాయి. దీంతో పిచ్చుకలు గూళ్లు పెట్టుకునేందుకు చోటే దొరకడం లేదు. ఇంతేకాదు చెట్లు కూడా అంతరించిపోతున్నాయి. రణగొణధ్వనులు, ఉరుకులు పరుగుల జీవితాల మధ్య ఇక పిట్ట గోడు ఎవరు పట్టించుకుంటారు?! ఇంటి ఆవరణలో మొక్కలు, చెట్లు పెంచితే పచ్చదనం, ఆరోగ్యం, పక్షుల కిలకిలారావాలు మన సొంతం అవుతాయి.
* నిజానికి రైతన్నకి పిట్టతినే పిడికెడు గింజలు ఏపాటి నష్టం కలిగిస్తాయి. పైగా పొలాల్లో క్రిమికీటకాలపై వాలి సహాయమే చేస్తాయి. పొలాల్లో పురుగు మందులు, క్రిమి సంహారకాలు జల్లేస్తున్నారు. ఇక ఆ కళ్లాల్లో స్వచ్చమైన గింజలెలా దొరుకుతాయి? ఇక క్రిమికీటకాలు సరేసరి. కాళీ స్థలాల్లో పచ్చిక మైదానాలున్నా అందులో పురుగుపుట్రా వెతుక్కుంటూ కాలం గడిపేసేవి పిట్టలు కానీ రియల్ ఎస్టేట్ రంగం దూకేసిందిగా.
* మనం అలవాటు పడ్డ ఇన్స్టంట్ ఆహారపదార్థాలు, వంట సరుకులు వెరసి పిట్ట కడుపుకొట్టాయి! ఆశ్చర్యంగా ఉన్నా ఇది వడ్లగింజలో బియ్యం గింజ ఉంటుందన్నంత నిజం. ఇదివరకు కిరాణా షాపు నుంచి తెచ్చుకున్న బియ్యం, పప్పుల్ని చేటతో చెరిగి శుభ్రం చేసేవారు. ఇప్పుడు సూపర్ మార్కెట్ల పుణ్యమా అని అలాంటి పనులేవీ లేనప్పుడు ఇక పిచ్చుకలకు నాలుగు గింజలెలా దొరుకుతాయి? దీన్ని అంగీకరించే వారు రోజూ గుప్పెడు గింజలను ఇంటి వాకిట్లో, బాల్కనీలో లేదంటే డాబా మీదో పిచ్చుకల కోసం వేస్తే ఆ మూగ జీవాలను కాపాడినవాళ్లమవుతాం.
* నగరాలు, పట్టణాలు శరవేగంగా విస్తరిస్తున్నందున పక్షులకు గూళ్లు పెట్టుకునేందుకు జానెడు జాగా కూడా కరువైపోతోంది. పైగా కమ్యూనికేషను రంగంలో వచ్చిన విప్లవం వీటి చావుకొచ్చింది. సెల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ పక్షులకు ఉరితాళ్లు బిగుస్తున్నాయి. ఎక్కువగా బలవుతున్నవి కాకులు, గబ్బిలాలు, పిచ్చుకలే.
* వాహన కాలుష్యం, దుమ్మూధూళితో జీవజాలమంతా అంతరించిపోయే ప్రమాదంలో పడింది. ముఖ్యంగా పెట్రోలు మండడం వల్ల ఉత్పన్నమయ్యే కార్బన్ డై ఆక్సైడ్, మిథైల్ నైట్రేట్ లాంటి రసాయనాలు మూగ జీవాలపై విషం చిమ్ముతున్నాయి.
అభివృద్ధి మంత్రంతో ముందుకెళ్తున్న మనం ఉన్నట్లుండి ఏమీ చేయలేం. సోషల్ మీడియాలో మూడు 'లైక్' లు ఆరు 'షేర్' లు తప్ప అయితే ఈ మూగజీవిని దేవుడు కాదు, మనిషే కాపాడాలి! ఈ రోజు 'ప్రపంచ ఊర పిచ్చుకల దినోత్సవం' సందర్భంగానైనా మనం చేయాల్సిందల్లా....
- మన నివాసం చుట్టూ ఎక్కడ అనువుగాఉన్నా మొక్కలు,చెట్లు పెంచడం
- ఇళ్లు, అపార్ట్ మెంట్ లలో పక్షుల ఆశ్రయం కోసం ఆవాసాలు, బర్డ్ ఫీడర్లు ఏర్పాటు చేయడం
- మూగజీవాల కోసం గుప్పెడు ధాన్యం గింజలు జల్లడం
- ముఖ్యంగా వేసవిలో పక్షులు తాగేందుకు మట్టికుండీల్లో కాసిని నీళ్లు పోసి అమర్చడం
No comments:
Post a Comment