ఎండాకాలం హాయిగా గడపాలంటే.. పిల్లలకు వేసివి చిట్కాలు I Summer Child Care I Children's Health Care‎


 

పిల్లలు మామూలుగానే తిండి విషయంలో మారాం చేస్తుంటారు. మండే ఎండలు అంటే ఇక చెప్పేదేముంది. సమయాన్నంతా ఏం చేయాలో తోచక, ఎండ వేడిమిలో భోజనం సరిగా సహించక, కరెంట్ కట్ సమయాల్లో గాలి లేక నిద్రపట్టక... ఇలా పిల్లలు వేసవిలో పడే కష్టాలు ఇన్నిన్నికావు.

అధిక ఉష్ణోగ్రత, కలుషితమైన నీరు, ఆహారం, వేడిని అధిగమించడానికి తీసుకునే శీతల పానీయాలు... ఇలా కారణం ఏదైనా పిల్లలు తరచూ అనారోగ్యం పాలవుతారు. బయట వాతావరణం చాలా వేడిగా ఉండడం తద్వారా పిల్లల శరీర ఉష్ణోగ్రత పెరగడం, ఎక్కువ చెమటలతో వంట్లో నీరు వేగంగా ఆవిరై పోవడం... ఇవి వడదెబ్బకు దారితీస్తాయి. మంచి నీరు, ఇతర ద్రవాలు తాగకుండా మొరాయించే పిల్లలు ఎండల్లో తొందరగా నీరసించిపోతారు. ఆరుబయట ఎండలో ఎక్కువసేపు గడిపితే అధిక చెమట ద్వారా లవణాలు కోల్పోయి నీరసించిపోతారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే చిన్న పిల్లల విషయంలోనూ జాగ్రత్త అవసరం. 

 
శుభ్రత పాటించక చెమట గ్రంథులు మూసుకుపోయి శరీరం చల్లబడే ప్రక్రియ దెబ్బతిని వడదెబ్బ తగలవచ్చు. చర్మంపై పేరుకుపోయిన వ్యర్థాల వల్ల చెమట పొక్కులు, ఇన్‌ఫెక్షన్‌తో సెగగడ్డలు వస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే జ్వరం వచ్చే అవకాశం లేకపోలేదు. అందుకని స్నానం చేశారు కదాని నిర్లక్ష్యం చేయక మొకం,కాళ్లు, చేతులు చల్లని నీటితో కడుగుతూ ఉండాలి. ఒకోసారి ముక్కు నుంచి రక్తం కారవచ్చు. ముక్కులో వేళ్ళు పెట్టుకునే అలవాటున్న పిల్లల్లో ఇది మరీ ఎక్కువనే చెప్పాలి. తరచూ పిల్లల ముక్కులు తడి చేసిన సున్నితమైన న్యాప్ కీన్, బడ్స్ సహాయంతో శుభ్రపరచడం మరవద్దు.


ఎండాకాలం హాయిగా ..
వంట పదార్థాలు ఎండాకాలం త్వరగా చెడిపోతాయి. అలాగని ఫ్రిజ్ లో పెట్టేసి, తీసిన వెంటనే తింటే, అధిక చల్లని పదార్థాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా పిల్లల్లో వాంతులు, విరేచనాలకు కారణం కావచ్చు. స్వచ్ఛమైన నీరు, అదీ గది ఉష్ణోగ్రతలో తీసుకుంటేనే మంచిది. ఎక్కడపడితే అక్కడ ఏదో ఒక నీరు, ఫ్రిజ్ ల్లో నీరు తాగడం వల్ల పిల్లలు వెంటనే జబ్బుపడవచ్చు. బయట శీతల పానియాల్లో వాడే ఐస్ తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుంది. వాంతులు, విరేచనాల విషయంలోనూ నిర్లక్ష్యం తగదు. ఎండాకాలం వచ్చే వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తాయి. కళ్ళకలక, గవద బిళ్ళలు, టైఫాయిడ్‌, పొంగు, అతిసారా, కామెర్లు... ఇవి ఎక్కువగా వ్యాపిస్తాయి. వేసవి హాయిగా గడపడానికి పిల్లలకి సరియైన గాలి, మంచినీరుతో పాటు పోషకాహారం అందించాలి. ఏమాత్రం డీహైడ్రేషన్ కి లోనయినట్టు అనిపించినా ఉప్పు, పంచదార కలిపిన నీరు తాగించాలి. బట్టలు వదులు చేసి చల్లని గాలి ప్రదేశానికి తరలించాలి. అవసరానికనుగుణంగా అప్రమత్తమై వైధ్యుడిని సంప్రదించడం మరవద్దు.


ఎండాకాలం హాయిగా ..
మండే ఎండలనుంచి పిల్లలకు ఉపశమనం ఎలా..  ఉదయం, సాయంత్రం ఎండలేని సమయాల్లోనే పిల్లలను బయటికి అనుమతించడం, తీసుకెళ్లడం చేయాలి. ఎండ  సమయంలో పిల్లలకి కథలు చెప్తూ, రైమ్స్,పాటలు పాడిస్తూ, పుస్తకాలు చదివిస్తూ, బొమ్మలు వేయిస్తూ, ఇంట్లో ఆడుకునే ఆటలు ఆడిస్తూ... కాలక్షేపం చేయాలి.

-  ఇంట్లోకి వేడిగాలి నేరుగా చొచ్చుకు రాకుండా చుట్టూ మ్యాట్ లు వేలాడదీయాలి. ఇవి పూర్తిగా తడి ఆరిపోకుండా చూసుకోవడం వల్ల గదులన్నీ చల్లని వాతావరాణాన్ని సంతరించుకుంటాయి.
- పిల్లలకి రెండు పూటలు తప్పక గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. శరీరంలో ఎక్కువ వేడి ఉన్నట్టయితే తడిబట్టతో తుడుస్తూ మామూలు స్థితికి తీసుకురావాలి.
- గాలి ప్రసరణమయ్యే పలుచటి, మెత్తటి కాటన్‌ దుస్తులు వేయాలి. బయటికి వెళ్లాల్సివస్తే గొడుగు, టోపీ, గాగుల్స్  తప్పక వాడాలి.
- పిల్లలు ఆటల్లోపడి నీరు తాగడం మర్చిపోవచ్చు. దాహంతో సంబంధం లేకుండా మంచి నీరు పట్టిస్తూండాలి.
- కొబ్బరినీళ్లు, బార్లీ, సబ్జా, సగ్గుబియ్యం...  తదితర ద్రవాలు తాగించాలి. మూత్రం సాఫీగా వచ్చేలా జాగ్రత్తపడాలి.
- సీజనల్ ఫ్రూట్స్,  అన్నీ రకాల ఆకుకూరలు, కూరగాయలు తినిపించాలి.
- సాధ్యమైనంత వరకు నిలువ ఆహారం జోలికి పోకుండా తాజా ఆహారం మాత్రమే పెట్టాలి.
- సకాలంలో టీకాలన్నీవేయించి ఆయా వ్యాధులన్నిటినీ నిరోధించాలి.

No comments: