చిన్నతెరతో పిల్లలకు పెద్ద నష్టం I How TV affects your Child I Television Impact on Kids


 

ప్రజలకు సమాచారం అందించే ప్రసార సాధనాలలో టీవీ అత్యంత శక్తివంతమైనది. కేవలం విఙానమే కాకుండా వినోదం కూడా పంచటం వల్లే టీవీకి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. పూర్వం పట్టణాలకు మాత్రమే పరిమితమైనా, సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం పల్లెపల్లెకు విస్తరించిన డిష్ యాంటీన్నాల పుణ్యమా అని గ్రామాలలో సైతం చిన్నతెర నిత్యావసర వస్తువైంది. ఇక సంపన్నులు, సామాన్యులు అని తేడా లేకుండా ప్రతి ఇంట్లోనూ టీవీలు దర్శనమిస్తున్నాయి.

టీవీల ద్వారా దృశ్య, శ్రవణాలను ఒకేసారి వీక్షించి వినే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో దేశీయ మార్కెట్లో డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) విరివిగా రావడంతో మారుమూల గ్రామాల్లోను వీటి ద్వారా వార్తలు, గేమ్ షోస్, వివిధ ధారావాహిక కార్యక్రమాలను ఇంటిల్లిపాది వీక్షించే అవకాశం కలుగుతోంది. ప్రైవేటు ఛానళ్ళ ఆవిర్భావానికి ముందు దూరదర్శన్ కార్యక్రమాల్లో వారంతంలో ఒకటో అరో 'సినిమా' ప్రోగ్రాంలు ఉండేవి. దూరదర్శన్ ప్రసారాలతో పాటు విదేశీ ఛానళ్ళు కూడా సినిమా మయమై ప్రజలకు రోతపుట్టిస్తున్నాయంటూ ప్రచారం చేస్తూ మరికొన్ని తెలుగు ఛానళ్ళు ఇదే అదనుగా పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో కాలక్షేపం, వినోదం, విఙానం... అందించాల్సిన చిన్నతెర వల్ల భావిపౌరులకు భారి ముప్పే కలుగుతోంది. ప్రైవేటు ఛానళ్ళ ప్రసారాల్లో 'శుభోదయం'తో మొదలు 'శుభరాత్రి' వరకు అన్ని సినిమా కబుర్లే. అఫ్ కోర్స్... ఇవే మళ్ళీ తిరిగి అర్దరాత్రి నుండి ఉదయం వరుకు ప్రసారం అవుతాయి. ప్రేక్షకులకు నాణ్యమైన కార్యక్రమాలను అందించడానికి బదులు 'సినిమా' నాలెడ్జిని పెంచడం కోసం ప్రైవేటు ఛానళ్ళు పోటీపడుతున్నాయి. సినిమాల్లోని 'మసాలా'నంతా సీన్లుగా, సాంగ్ లుగా, ముక్కలు ముక్కలుగా ప్రోగ్రాంలు తయారుచేస్తున్నారే తప్ప కుటుంబమంతా కలసిచూసే కార్యక్రమాలను రూపొందించలేకపోతున్నారు. సినిమా డైరక్టర్లు, ప్రొడ్యూసర్లు విన్నవించుకున్నట్టే చిన్నతెర ఛానళ్ళ యజమానులు కూడా 'మసాలా' కార్యక్రమాలను ప్రజలు ఆదరిస్తున్నారని, మరీ ముఖ్యంగా మహిళలు అరవైశాతం ఇలాంటి కార్యక్రమాలంటేనే ఇష్టపడుతున్నారని అందుకే ప్రసారం చేయక తప్పటం లేదంటున్నారు. టీవీ రేటింగ్ సంస్థలు ప్రతీ వారంతంలో ఇచ్చే గణాంకాలు కూడా ఇదే రూఢీ చేయడం గమనార్హం. బిజినెస్ అన్నాక వినియోగదారుల 'వీక్ నెస్'ను డబ్బుగా సంపాదించడమే అయినా సమాజానికి కీడు కలుగుతున్న 'దృశ్యం'కానీ, 'శ్రవణం'కానీ వారికి చేరడం లేదా!

విఙాణం ఏది?
మామూలుగా అన్నిటికి 'విశ్రాంతి' అనేది ఉంటుంది. కానీ బుల్లితెరకు మాత్రం 'బ్రేక్' అంటూలేకుండా రోజంతా పనిచేస్తూనే ఉంటుంది.  శాటిలైట్ ఛానళ్ళతో పాటూ కేబుల్ ఛానళ్ళు కూడా 24/7 నిరంతర ప్రసారాల మాధ్యమాలు కదా మరి. క్రికెట్ లాంటి క్రేజి ఆటల ప్రసార సమయంలో పిల్లలు స్కూళ్ళు, కాలేజీలకు కూడా ఎగనామం పెట్టి టీవీ సెట్ల ముందు సెటిల్ అయిపోతారు. ఉదయాన్నే లేచి పుస్తకం చేతిలో పట్టుకోవడానికి బదులు 'రిమోట్ కంట్రోలర్' పట్టుకుంటున్నారు. టీవీ చూస్తూ డాన్సులు, డైలాగులు నేర్చుకోండని పిల్లలను ప్రోత్సహించేవారు కొందరైతే విఙానవంతులుగా మారతారని మరికొందరి అపోహ. పిల్లల్లో సహజమైన 'అనుకరణ' గుణం కారణంగా టీవీల్లో దర్శనమిచ్చే హింస, దౌర్జన్యం, శృంగారం... లాంటి వాటిని తు.చ తప్పకుండా అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ దుష్ప్రభావం కారణంగా చిన్నారుల్లో నేరప్రవృత్తి రోజురోజుకు పెరిగిపోయి సంఘవ్యతిరేకశక్తులుగా పరిణామం చెందుతున్నారు. తల్లిదడ్రుల ప్రేమాభిమానాలు కరువై టెలీవిజన్ వంటి ఆధునిక ఎలక్ట్రానిక్ వ్యవస్థల కౌగిట్లో 'బందీ' అవుతున్నారు.  పిల్లల అవసరాలు, కొరికలు పట్టించుకోకుండా పెంచడం వల్ల సంపూర్ణ వ్యక్తిత్వంకల పౌరులకు బదులుగా అసమగ్రంగా తయారవుతున్నారు. టీవీ కార్యక్రమాల్లో హారర్ షోలు, హింసలు, చట్టానికి చిక్కకుండా క్షణాల్లోచేయడం చూపిస్తూ విద్యార్థిలోకాన్ని పెడదారి పట్టిస్తున్నాయి. ఫలితంగా పెద్దలు, చట్టం, నిజాయితీల పట్ల పిల్లలకు దురభిప్రాయం కలుగుతోంది. పిల్లలకు రోజులో ఎక్కువ సమయం సునాయసంగా హరించుకుపోతూ చదువులు సన్నగిల్లుతున్నాయి. ఎన్నో కిరాతక చర్యలు పిల్లల చేతుల మీదుగా జరుగుతున్నాయని పత్రికల్లో వార్తలు ప్రచురణ అవుతుండగా, పోలీస్ స్టేషన్లలో వేలకొద్ది కేసులు నమోదు అవుతున్నాయి. ఆకలి, డబ్బు, అనుకరణ... కారణమేదైనా కావచ్చు. పిల్లలు మాత్రం పెడదారి పడుతున్నారు. 'ఆకలి'  కారణంగా చిల్లర దొంగతనాలు పేదపిల్లలు చేస్తున్నా సినిమాల్లోలా విలాసవంతంగా బతకడానికి డబ్బు సమకూర్చుకోవడానికి ఎలాంటి నేరాలైనా మామూలు కుటుంబాల పిల్లలు పాల్సడుతున్నారు. సినిమాలలో విపరీతమైన ఎక్స్ పోజింగ్, సెక్స్ ల ప్రభావంతో బాలికలపై బాలురు అత్యాచారాలకు సైతం ఒడికడుతున్నారు. అర్థం పర్థంలేని కార్యక్రమాలను రోజంతా పిల్లలు చూస్తూ చదువుకు దూరం అవడమే కాక స్వీయనిర్ణయాలు తీసుకునే శక్తి కోల్పోతున్నారు.

సంస్కృతి, సంప్రదాయాలను ధ్వంసం చేస్తూ...
అనాదిగా వస్తున్న పండుగలకు, ఆచారాలకు ఆదరణ కరవవుతోంది. సక్రాంతి, ఉగాది, దసరా... పండుగల ఉత్సవాలు పల్లెపట్టణాల్లో కూడా టి.వీల కారణంగా పట్టుకోల్పోతున్నాయి. ప్రతియేటా శ్రావణమాసంలో పసుపు కుంకుమలు, వాయినాలు ఇచ్చి పుచ్చుకోవడాలంటూ  ఎంతో హడావిడిగా కనిపించే గృహిణుల్లో రానురాను నిరాసక్తత చోటుచేసుకుంటోంది. వేసవి సెలవుల్లో పిల్లలను అమ్మమ్మ, నాయనమ్మ ఇళ్ళకు వెళ్లకుండా టీవీలు అడ్డుపడుతున్నాయి. విషయం ఏంటని పిల్లలని కదిపితే వచ్చే సమాదానం వీరికి కావలసిన ప్రోగ్రాం లను వారు చూడనివ్వకపోవడమే. బంధువులు, మిత్రుల రాకపోకలు తగ్గుతున్నాయి. సెలవు రోజుకదాని ఏ మిత్రుడి ఇంటికి వెళ్ళాలన్నా టీవీ కార్యక్రమాల్లో మునిగిపోయి మనమున్నంతసేపు మాట్లాడుతున్నా 'ఆ', 'ఉ', 'ఆహా'... అంటూ ముక్తసరిగా జవాబులొస్తుంటాయి. ఎవరింటికైనా వెళ్ళాలన్నా, ఆహ్వానం పలకాలన్నా 'టీవీ గైడ్' తిరిగేయాల్సిన పరి(దు)స్థితులు కొందరివి. పండుగలు, పూజలు అనగానే ఎంతో ఉత్సాహంగా గుళ్ళు, గోపురాలకు చేరి ఇష్టదైవాన్ని ప్రార్ధించడం, పరిచయస్తులకు శుభాకాంక్షలు తెలపడంలాంటివన్నీ టీవీ కార్యక్రమాలకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఏదో కాలక్షేపానికి చూడాల్సిన టీవీని గృహిణులు వంటలూ, ఇతర పనులు చేస్తూ చూడడం చివరికి వాటిముందే భోజనాలు చేస్తూ చూడటం మామూలైపోయింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న 'స్టేట్ ఆఫ్ ది మీడి యా డెమోక్రసీ సంస్థ' రోజులో ఎక్కువ సమయాన్ని ఎలా గడుపుతారని దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 'టీవీలు చూస్తూ...' అంటూ మహిళలు ప్రథమ స్థానంలో నిలిచారు. పిల్లలు చిన్న తెరల ముందే పుస్తకాల బ్యాగులను తెరచి హోం వర్క్ లు చేస్తుంటారు. టీవీని చూస్తునే నిద్రలోకి జారుకుంటారు. కార్యక్రమాల నిడివిలో ప్రసా(చా)రం అయ్యే పోషక రహిత ఆహారాల అడ్వర్టైజ్ మెంట్లకు ఆకర్షితులైన పిల్లలు వాటికోసం గొడవ చేస్తారు. గుట్కా, సిగరేట్, మద్యం లాంటి ఉత్పత్తులను కూడా కమర్షియల్ బ్రేక్ ల పేరిట ఎక్కువగా చూపిస్తుండడం ఎంతైనా హానికరమే అవుతుంది. ఇంట్లో వంటలు, వస్తువులు, మాటలు... అన్నింటిలోనూ టీవీ ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది.

బుల్లితెరతో పూర్తి ప్రయోజనం పొందడం ఇలా...
పిల్లలు టీవీల ముందు ఎక్కువ సమయం గడుపుతూ వ్యాయామాలు, ఆటల వంటి కార్యకలాపాలపై అసలు సమయం వెచ్చించడం లేదు. టీవీలో పలు రకాల ఛానళ్ళతో పాటూ విడియో గేమ్ లు, ఇంటర్నెట్ సదుపాయాలు కూడా తోడైతే మరీ ప్రమాదం. దీనికి తోడు కౌమార బాలబాలికలు ఆహార నియమాలు సరిగా పాటించక పోవడంతో శారీరక రుగ్మతలతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా దుష్ర్పభావం పడుతోంది. గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపుకంటే ఎక్కువగా పిల్లలు దీర్ఘకాలికమైన వ్యాధుల బారిన పడుతున్నట్లు వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల ఆరోగ్యకరమైన జీవనశైలి మన నడవడిక మీదే ఆదారపడి ఉందని మరవద్దు.

బుల్లితెరతోవచ్చిపడే బోలెడన్ని తంటాలను అధిగమించి ప్రయోజనం చేకూరలంటే కొన్ని మెళకువలవసరం. మంచి, చెడులకు మధ్య ఓ నిర్ధిష్టమైన అవధి అనేది ఉంటుంది. ఆ అవధి దాటనంతసేపు ఏ నష్టమూ ఉండదు. ప్రపంచాన్ని ఒక 'గ్రామం'లా మలచిన ఎలక్ట్రానిక్ మీడియాను అవసరం ఉన్నంత వరకు ఆశ్రయించక తప్పదు. పొద్దస్తమానం టీవీ ఛానళ్ళ హోరులో కొట్టుకుపోకుండా నాణ్యమైన కార్యక్రమాలను కుటుంబమంతా వీక్షించాలి. పిల్లలు చదువుకునే సమయంలో కాని, పడుకునే సమయంతో కాని టీవీ ఆన్ చేసి వారి మూడ్ ఆఫ్ (నిద్ర, చదువుల పట్ల) చేయకూడదు. టీవీ వల్ల పిల్లలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. వేల రూపాయలు వెచ్చించి ప్రపంచం లోని వార్తలు, విశేషాలు వీక్షించడానికో, కాలక్షేపానికో కొనుగోలు చేసిన టీవీ సంరక్షణలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

- స్టేటస్ కు చిహ్నంగా టీవీని ఎన్నుకోవడం కాక అవసరమైన సెట్టుని కొనుక్కోవాలి.
- ఎల్‌ఈడీ టెలివిజన్‌ సెట్‌లు చాలా స్లీక్‌గా, మంచి క్వాలిటీ పిక్చర్‌ను అందిస్తున్నాయి. దీనికి తోడు ఎల్‌సీడీతో పోల్చుకుంటే విద్యుత్‌ను 50 శాతం వరకు ఆదాచేస్తుంది. పైగా ఎల్‌సీడీ టీవీ ధరలకు దీనికి పెద్ద తేడా కనిపించడం లేదు.
- పిల్లల జీవితాల్లో టీవీ వినియోగం వల్ల విషాదఛాయలు అలముకోకుండా చూడాలి. ఖాళీ సమయాల్లో మంచి కార్యక్రమాలను చూపించడం వల్ల ప్రయోజకులవుతారు.
- విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులవల్ల టీవీ పాడవకుండా ఉండడానికి 'వోల్టేజి స్టెబిలైజర్' ను విధిగా వాడాలి. అలాగే హౌజ్ వైరింగ్ లో గృహోపకరణాలన్నిటితో పాటు టీవీకి కూడా ఎర్తింగ్ చేసి ఉండడం కూడా ఎంతో అవసరం.
- గంటల తరబడి టీవీని అనవసరంగా చూస్తుండడం వల్ల విద్యుత్ ఖర్చు పెరుగుతుంది.  కనుక జాగ్రత్త పడాలి. పైగా ఉత్పత్తిదారులు సూచించినమేరకు కాకుండా ఎక్కువ సమయం టీవీ ఆన్ చేసి ఉండడం వల్ల త్వరగా పాడయిపోయే ప్రమాదముంది.
- టీవీ, సెట్ ఆఫ్ బాక్స్, స్టెబిలైజర్, డివిడి ప్లేయర్ ఇత్యాది ఎలక్ట్రికల్ వైర్లు ,కనెక్టర్లు నలిగిపోయి ఫలితంగా ఇన్సులేషన్ తొలగిపోయేలా చేయకూడదు. ప్లగ్, స్విచ్ పాయింట్లను తరచూ గమనిస్తుండడం మంచిది. ఏమరుపాటువహిస్తే విద్యుత్ ప్రసారంలో అంతరాయం వల్ల టీవీ పనిచేయక మొరాయిస్తుంది.
- ఇంటర్నెట్, యు.ఎస్.బి, హెచ్.డి.ఎం.ఐ తదితర పోర్టుల నిర్వహణలో జాగ్రత్తగా మెలగాలి.
- ప్రతినెలా సంబంధిత సర్వీస్ మెన్ తో టీవీ ఛానల్ కనెక్షన్ సరిగా ఉందో లేదో చూపించాలి. సిగ్నల్ స్ట్రెంగ్త్ పూర్తిగా ఉన్నా టీవీ సరిగా కనిపించకపోతే సర్వీస్ సెంటర్ లో సంప్రదించాలి.
- టీవీ, సెట్ ఆఫ్ బాక్స్, డివిడి ప్లేయర్ ల రిమోట్ కంట్రోలర్స్ చాలా సున్నితమైనవి అయినందున వాటి వాడకంలో జాగ్రత్తపడాలి.
- ఎక్కువ సమయం టీవీ చూడడం వల్ల కళ్ళనరాలు దెబ్బతింటాయి. టీవీ అమర్చేప్పుడు చూడడానికి సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి.
- ఆకాశంలో వచ్చే ఉరుములు, మెరుపుల ప్రభావం వల్ల విద్యుత్తు అధికంగా ప్రసారమై టీవీలు కాలిపోకుండా ఉండడానికి ఉపయోగించని సమయాల్లో కూడా ప్లగ్ ను తొలగించడం చేయాలి.
- టీవీని అమర్చిన గదిలో విధిగా గాలి, వెలుతురు సరిగా ఉండేలా చూసుకోవాలి. స్మార్ట్ టీవీలయితే గది వైశాల్యం, వెలుతురు, ప్రోగ్రాంలను అనుసరించి ఆడియో, వీడియోల్లో మార్పులు చోటుచేసుకుంటాయి.
- ఆరోగ్యరీత్యా జాగ్రత్తపడాలనుకుంటే తప్పకుండా టీవీని సాధ్యమైనంత దూరంగా,  సౌకర్యవంతమైన యాంగిల్ లో ఉంచాలి. పడుకుని టీవీ చూడడం వల్ల కళ్ళు ఎక్కువ వత్తిడికి లోనై జబ్బులు వచ్చే ప్రమాదముంది.



No comments: