మహిళా పొదుపు దినోత్సవం I April 14 - Women's Savings Day | ప్రపంచ పొదుపు దినోత్సవం | October 30 - The World Savings Day

గృహిణి ఇంటిళ్ళిపాదికి ఒకేసారి భోజనం పెట్టే ఏర్పాటు చేస్తుంది. అంటే విడివిడిగా వంటలకు గ్యాస్ వృధాకాకుండా, డైనింగ్ టేబుల్ దగ్గర మాటిమాటికి ఫ్యాన్ లు వేసి విద్యుత్ వృధాకాకుండా చూస్తుంది. అలాగే ఒకేసారి వండడంతో తినుపదార్థాల వృధాలేకుండా జాగ్రత్త పడుతుంది. అంటే వృధా కానిదే ఆదా... ఇదే పొదుపు.
 
అలాగే "అన్నయ్య! పళ్ళు తోముకోవడానికి అన్ని నీళ్ళు వృధా చేయాలా...". "తమ్ముడూ! పరీక్షలకు చదువుకోకుండా ఇప్పుడు సినిమాలని సమయం వృధా చేస్తావా..." . "ఏమండీ!... భోజనానికి ఇంటికే వచ్చేయండి. హోటల్ భోజనాలు డబ్బేకాదు, ఆరోగ్యం గుల్ల చేస్తాయి... ".... ఇలా ప్రతియింటా చెల్లి, అక్క, భార్య జాగ్రత్తలు చెపుతూనే ఉంటారు... ప్రతీరోజూ చక్కని నడవడిక నేర్పుతూనే ఉంటారు.

అయినా ఈ రోజు 14 ఏప్రిల్ : మహిళా పొదుపు దినోత్సవం | అక్టోబర్ 30 ప్రపంచ పొదుపు దినోత్సవం సందర్భంగా ఆదాయం, వ్యయం మధ్యలో పొదుపు గురించి క్షుణ్ణంగా చర్చిద్దాం.

"చీమ ఎంతో చిన్నది, పనిలో ఎంతో మిన్నది, ముందు చూపు ఉన్నది, పొదుపు లోన మిన్నది..." అంటూ చిన్నప్పుడే పాడుకున్నా ఇంకా పొదుపుపై భిన్నాభిప్రాయాలున్నాయి. పొదుపు అంటే వచ్చే ఆదాయంలో ఖర్చులు పోను మిగిలిన దానిలో కొంత భవిష్యత్ అవసరాలకు వెనుకేసుకునే డబ్బు అనుకునే రోజులు పోయాయి. పొదుపు చేసాక మిగిలిందే ఖర్చు చేయాల్సిన రోజులొచ్చాయి. ఎందుకంటే మన పొదుపే మనల్ని భవిష్యత్తులో ప్రణాళిక వేసుకున్న అవసరాలకు, అంచనాలో లేని, ఆకస్మికంగా వచ్చిపడే అవసరాలకు, అలాగే రిటైర్మెంట్ జీవితానికి... ఇలా చాలా సందర్భాల్లో ఆదుకుంటుంది.

పొదుపు, మదుపు... ఒకటేనని అపొహకు తావివ్వకుండా ఈ రెంటి మధ్య చాలా వ్యత్యాసం ఉందని గుర్తెరుగాలి. సాధారణంగా బ్యాంకు, పోస్టాఫీసుల్లో సేవింగ్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, ఈపిఎఫ్, పిపిఎఫ్, సేవింగ్ సర్టిఫికెట్స్... ఇవన్నీ పొదుపు వర్గంలోకి వస్తాయి. ఇక వివిధ కంపెనీ వాటాలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ వగైరాల్లో పెట్టే పెట్టుబడిని పొదుపు అనే కన్నా మదుపు అనడం సమంజసం. అలాగే ఎక్కువ వడ్డీ ఆశతో బిచాణా ఎత్తేసే కంపెనీలు, స్కీములలో పెట్టేది కూడా పొదుపు కాదు. పదవీ విరమణ తరువాత, లేదంటే ఇతరత్రా పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందినప్పుడు దాన్ని ఏక మొత్తంలో ఖర్చు పెట్టేయకుండా శేష జీవితం సజావుగా గడపడం కూడా పొదుపు లాంటిదే. అయితే క్రమం తప్పకుండా నిర్ణీత, ఆపై మొత్తం నిరంతరం పక్కన పెడుతూ ఉండే ప్రక్రియనే నిజమైన పొదుపు అని అనాలి.

మనలో చాలా మందిలో పొదుపు అనగానే 'పిసినారి' తనం తో పోల్చుతారు. కానీ పొదుపు అనేది త్యాగం. వచ్చిన ఆదాయాన్నంతా ఖర్చు పెట్టేస్తే అప్పులు తప్పవు. అలాగే ఆదాయానికి మించి ఖర్చు చేసే తత్వం అలవాటుగా మారే ప్రమాదం లేకపోలేదు. అలా కాకుండా మన ఆదాయాన్ని బట్టి మన అవసరాలను అదుపులో పెట్టుకుని ఎంతోకొంతైనా సరే డబ్బు వెనకేసుకోవడం అలవర్చుకోవాలి. ఇందులో భాగంగా అనవసరం అనుకున్న ఖర్చులను తగ్గించుకోవడమో, కొన్ని సుఖాలను, సరదాలను త్యాగం చేయడమో చేయాలి. ఈ పొదుపుతో ఇంకాస్త డబ్బు ఆర్జించినట్టే అవుతుంది. అయితే పొదుపు విషయంలో కఠినం అనిపించినా నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇతర ఖర్చుల ఒత్తిడికి తలొగ్గి, పొదుపు చేయాల్సిన మొత్తాన్నీ వ్యయం చేస్తే ఇక పొదుపు కొనసాగదు. అందుకే చేతికి డబ్బు రాగానే పొదుపు చేయాలనుకున్న మొత్తాన్ని ముందు పొదుపు చేసి, వెహికిల్ లోన్, హౌజింగ్ లోన్, క్రెడిట్ కార్డ్ వగైరా పేమెంట్లు ఉన్నట్లైతే అవి కూడా కట్టేసి ఆ తరువాతే మిగతా ఖర్చులు పెట్టాలి.

నేటి మహిళ కుటుంబ ఆదాయంలో పాలు పంచుకుంటోంది. అటు ఆఫీసులోనూ, ఇటు ఇంట్లోనూ తన బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వర్తిస్తోంది. కాని చాలా మంది మహిళలు పొదుపు, మదుపుల విషయంలో  అంత ఆసక్తి కనబరచడం లేదనేది వాస్తవం. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు నిర్వహిస్తున్నాయి. ఆడపిల్లలకు పిపిఎఫ్ తరహాలో సుకన్య సమృద్ధి యోజన గత సంవత్సరం అందుబాటులోకి వచ్చింది. దాదాపు అన్నీ బ్యాంకుల్లో మహిళలకు వివిధ సదుపాయాలను కల్పిస్తున్నాయి. వీరు నిర్వహించే సేవింగ్ అకౌంట్ లకు మినిమమ్ బ్యాలన్స్ అంటూ లేకపోవడం, లావాదేవీలకు సర్వీస్ ఛార్జీలు మినాహాంచడం, ఎక్కువ వడ్డీ అందించడం, ఇన్సురెన్స్ కల్పించడం మొదలైన ప్రయోజనాలు అందిస్తున్నాయి. వీరికి ప్రత్యేకంగా వివిధ అవసరాలకు, వ్యాపారాలకు లోన్స్ ఇవ్వడమే కాకుండా వడ్డీలో కూడా రాయితీలు ఇస్తున్నారు.

దుస్తులు, గృహోపకరణాలు వగైరా కొనుగోళ్లవిషయంలో అనవసరపు ఢాంబికాలకు పోకుండా అవసరంమైనవేమిటో చూసుకోవాలి. రోజువారి ఖర్చులను నిత్యావసరాలు, అదనపు ఖర్చులు, ఆస్పత్రి, మందులు... ఇలా విభజించి రాసిపెట్టుకోవాలి. ఈ చిట్టా మన ఆదాయవ్యయాలను ప్రతిబింభించేలా ఉండాలి.  ఐదేళ్లకు చేసిన పొదుపు, గృహరుణాల చెల్లింపులు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, మందులు, ఆస్పత్రి ఖర్చులు, స్వచ్చంధ సంస్థలకు ఇచ్చే విరాళాలు... వీటిపై ఇన్‌కం టాక్స్ మినహాయింపు ఉంటుంది. ఇదికాక ప్రత్యేకంగా మహిళలకు అదనంగా ఇన్‌కం టాక్స్ ప‌రిమితి ఉంటుంది.  ఆధునిక మహిళలకు ప్రత్యేకంగా పలు ఇన్సురెన్స్ కంపనీలు మెడికల్ పాలసీలను అందిస్తున్నాయి. ఇన్సురెన్స్ ఉన్నా నగదు రహిత చికిత్స పొందనియెడల సదరు సంస్థలనుంచి పరిహారం పొందడానికి ఆస్పత్రి, మందుల బిల్లులు సకాలంలో పొందుపరచాల్సి ఉంటుంది. అనారోగ్యాలు, అకస్మిక ప్రయాణాలను ఊహించలేం. ఇవి మినహా రాబోయే ఆర్ధిక అవసరాలకు ముందుగానే బడ్జెట్ తయారు చేసుకోవాలి. పొదుపు, మదుపుల పై చక్కని అవగాహన కలిగి తదనుగుణంగా వ్యవహరించాలి. అయితే మన సేవింగ్, ఇన్వెస్ట్మెంట్ లకు ఒక లక్ష్యం తప్పక ఉండాలి. అలాగే భవిష్యత్ అవసరాల ప్రాధాన్యత క్రమం తప్పకూడదు. ఒక్కొక్క అవసరానికి తగ్గట్టుగా పొదుపులో, మదుపులో ఒక్కో వ్యూహం ఎన్నుకోవాలి. వాటిని తరచూ సమీక్షించడం మరవద్దు. ఏతావతా క్రమం తప్పకుండా నిరంతరం పొదుపు చేయడం, పొదుపును కూడా అనివార్యమైన ఓ ఖర్చుగా పరిగణించి, తప్పనిసరిగా పొదుపు చేయడం చాలా కీలకం అని గుర్తించాలి.

#April 14: Indian Women's Savings Day

#October 30: The World Savings Day

No comments: