ఖాద్రీ లక్ష్నినరసింహ స్వామి - బ్రహ్మ రథోత్సవం | Kadiri Narasimha Swamy Brahma Rathotsavam | 8th March 2018

హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఉగ్రరూపాన్ని చాలించి నారసింహుడు శాంతమూర్తిగా మారడమే కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్ర మహత్యం. మహర్షులంతా స్వామివారిని శాంతపరిచేలా స్తోత్రాలు పఠించారుట. అందుకే ఇక్కడి పర్వతాన్ని స్తోత్రాద్రి అని అంటారు. దీని మీద ఇప్పటికీ విష్ణుమూర్తి పాదాలున్నాయి. 'ఖ' అంటే విష్ణుపాదం. 'అద్రి' అంటే కొండ. అందుకే ఈ ఊరిని పూర్వం ఖాద్రి అనేవారు. ఈ దేవుడ్ని ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి అని కొలుస్తారు.  ఖాద్రి కాలక్రమేణా కదిరిగా రూపాంతరం చెందింది.

కదిరి బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఏడాది16 రోజులపాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. నారసింహుడి ఊరేగింపు కోసం దేవతలే రోజుకో వాహనాన్ని పంపిస్తారని ప్రతీతి. ఇక రథోత్సవం రోజున స్వయంగా బ్రహ్మదేవుడు రథం లాగుతాడని భక్తుల నమ్మకం. రథోత్సవం జరుగుతున్నప్పుడు ఉత్సవమూర్తి మీదకు భక్తులంతా దవనం జల్లుతారు. పండ్లు సమర్పిస్తారు. మిరియాలు అర్పించడం ఇక్కడి విశిష్టత. ఇలా చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయని క్షేత్ర మహాత్యం చెప్తోంది. ఇంతేకాదు రథం వెళ్లిన మార్గంలో పడిన మిరియాలు, పండ్లు తీసుకుని భుజిస్తే సకల మనోవాంఛలు సిద్దిస్తాయని భక్తులు నమ్ముతారు. కదిరి మాడవీధుల్లో ఆ తేరును లాగితే జన్మధన్యమైనట్లేననుకుంటూ  భక్తజనం పోటీలుపడతారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోని కదిరి జాతీయ రహదారికి ఆనుకుని ఉండడం, రవాణా సౌకర్యాలు కూడా మెరుగ్గా ఉండడంతో భక్తకోటి ఈ నెల 8న నిర్వహించే బ్రహ్మ రథోత్సవం(తేరు)కి చేరుకుంటుంది.
 

No comments: