హోలీ.. సహజ రంగుల కేళీ! | How to Make Natural and Safe Colours For Holi

ప్రకృతిని ఆరాధిస్తూ వసంతానికి స్వాగతం పలికే పండుగ హోలీ. ఫాల్లున మాసంలో పౌర్ణిమి రోజు రంగులు జల్లుకుంటూ బంధుమిత్రుల ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం ఆనవాయితి. అయితే తెలిసీతెలియక విషతుల్యమైన రసాయనిక రంగులను ఒంటి మీద జల్లుకుంటూ మనకుమనమే ముప్పుకొనితెచ్చుకుంటున్నాం.  ఈ కల్తీ రంగులకు దూరంగా ఉండకపోతే పలు అలర్జీలతో పాటు శాశ్వతంగా కంటిచూపునే కోల్పోయే ప్రమాదం ఉంది. హోలీ తెచ్చిపెట్టే అనారోగ్యాల్లో ముఖ్యంగా చర్మ సంబంధిత అలర్జీలు, కంటి అలర్జీలు, అంధత్వం, శ్వాస సమస్యలు, ఆస్త్మా, జుట్టు ఊడిపోవడం, క్యాన్సర్. మార్కెట్లో హోలీ రంగుల పేరిట అమ్ముతున్న సింథటిక్ కలర్స్ లో సిలికా, క్రోమియం, లెడ్ తదితర టాక్సిక్ ఇంగ్రిడియెంట్స్ ఎక్కువగా ఉంటున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిలికా మోతాదు మించితే మనిషి నాడీమండల వ్యవస్థ దెబ్బతింటుంది. క్రోమియం విషపూరితమైన రసాయనం. లెడ్ తో క్యాన్సర్ ముప్పు పొంచి ఉంది.
ఇంత ప్రమాదం ఉందని తెలిసినప్పుడైనా జాగరూకతతో వ్యవహరిద్దాం. సహజసిద్ధమైన రంగులనే వాడుదాం.
- ఆకుపచ్చ రంగు తయారు చేసుకోవడానికి గోరింటాకు, మందార ఆకులు, పాలకూర లాంటి వాటితో ట్రై చేయొచ్చు. వీటిని ఉడకబెట్టి వడగడితే ఏ ప్రమాదమూ లేని ఆకుపచ్చ రంగు రెడీ అవుతుంది. వీటిని ఆరపెట్టి పొడి కొట్టి గ్రీన్ కలర్ పౌడర్లుగానూ వాడుకోవచ్చు. 
- ఎర్రరంగును మన పెరట్లో దొరికే మందార, మోదుగు పూలతో సులువుగా తయారు చేసుకోవచ్చు. పువ్వులు ఎండపెట్టి పొడికొట్టడం ఒక పద్దతైతే... బాగా ఉడకబెట్టి అవసరాన్ని బట్టి నీళ్లు కలుపుకోవడం రెండో పద్ధతి. బీట్ రూట్ ఉడకబెట్టినా ఈ రంగు వస్తుంది.  
- రసాయన పూరితమైన ఎల్లోరంగుకు బదులుగా మన ఇంట్లో వాడే పసుపు నీళ్లు జల్లుకుంటే ఎంతో ఆరోగ్యం. పసుపు సోయగంతోనే నిజమైన వసంతం వచ్చినట్లు ఉంటుంది. 
- ముల్తానీ మట్టి, స్వచ్ఛమైన హెన్నా, బచ్చలి పండ్ల రసం కూడా హోలీ రంగుగా వాడుకోవచ్చు. 

No comments: