శ్రీరామనవమి వడపప్పు, పానకం | Panakam - Vada pappu : Sri Rama Navami Neivedyam

నీతి, నిజాయితీ తప్పని ధర్మబద్ధపాలన అందించడమే రామ రాజ్యమనుకున్నాడు రాముడు. ప్రజలందరికీ సమాన న్యాయం, సమాన గౌరవం అందించడమే రాజుగా తన కర్తవ్యమని భావించాడు రాముడు. నీతి, నిజాయితీ, ధర్మం కలగలిసిన పాలనలోనే ప్రజలకు నిజమైన న్యాయం అందుతుందని ఆశించాడు. అందుకే సర్వాజనామోదం పొందిన మర్యాదాపురుషోత్తముడిగా కీర్తి ప్రతిష్టలందుకున్నాడు. అందుకుంటూనే ఉన్నాడు.

శ్రీరామనవమి మనకి ఓ ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైయ్యాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణలోని భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. తెలుగు రాష్ట్రాల్లో వసంతోత్సవంతో తొమ్మిది రోజులు పాటు సాగే శ్రీరామనవమి ఉత్సవాలను ముగిస్తారు.

శ్రీరామనవమి రోజున భగవంతుడికి నివేదించే ప్రసాదాలు.. కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి భక్తులందరికి పంచి పెడతారు. వీటి వెనుక ఆయుర్వేద ఆరోగ్య పరమార్థం ఉంది.
పానకం వల్ల వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనం కలుగుతుంది. అలాగే మంచినీటిలో నానపెట్టిన పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది, దేహకాంతి ఇనుమడింపచేస్తుంది. 

No comments: