కొత్త తెలుగు సంవత్సరాది.. శ్రీ విళంబి నామ సంవత్సరం | Sri Vilambi Nama Samvatsaram | Ugadi - 2018

వసంత రుతువులో చెట్లు చిగురిస్తాయి. పుష్పాలు వికసిస్తాయి. ప్రకృతి రమణీయంగా మారుతుంది. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలోనే అచ్చమైన తెలుగుదనానికి ప్రతీకగా నిలిచే ఉగాది పండుగ వస్తుంది. మనం తెలుగు సంవత్సర ప్రారంభ రోజును ఉగాది అని లేదా సంవత్సరాదిగా జరుపుకోవడం పరిపాటి. ఇప్పటి నుంచి తమ కష్టాలు తొలగిపోవాలని, సుఖసంతోషాలు ఉండాలని ఆకాంక్షిస్తాం.

రుతువు మారే సమయంలో వచ్చే ఈ పండుగ రోజున పాటించే ఆచారవ్యవహారాల వెనుక ఆరోగ్యాన్ని కాపాడే కారణాలున్నాయని పూర్వీకులు చెప్పారు. సంప్రదాయాలకు, శాస్త్ర ప్రయోజనాలకూ కచ్చితంగా అవినాభావ సంబంధం ఉంటుందనేది నిర్వివాదాంశం. ఉగాదిని తెలుగువారే కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా రకరకాల పేర్లతో చేసుకుంటారు. మరాఠీలకు గుడిపడ్వా, తమిళులకు పుత్తాండు, మలయాళీలకు విషు, సిక్కులకు వైశాఖీ, బెంగాలీలకు పొయ్‌లా బైశాఖ్‌.. ఇలా ఆచార వ్యవహారాలు భిన్నమైనప్పటికీ అందరికీ ఇది ఆనందాన్ని ప్రసాదించే పర్వదినం.

ఈ రోజు ఉగాది పచ్చడి సేవించడం ఆరోగ్యదాయకం. మానవునికి ప్రకృతికి గల అవినాభావ సంబంధం ఉగాది పచ్చడి షడ్రుచులలోనే ఉంది. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు, ఆటుపోట్లకు ప్రతీకగా షడ్రుచులను మేళవించి, ప్రసాదంగా తీసుకునే పచ్చడి ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. వేపపువ్వు, కొత్త చింతపండు, బెల్లం, మామిడి ముక్కలు.. ఇలా తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు ఆరుచులతో తయారవుతుంది. శ్రీ విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు ..


No comments: