కడుపు పండాలంటే.. | Surprising Health Benefits of Grapes | Angoor

ద్రాక్షపండు.. ఇందులో యాంటీఆక్సిడెంట్ లు, ఖనిజాలు, విటమిన్ లు.. ఇలా పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గించుకోవడానికి వీటిని తీసుకోవడం ఒక మార్గం.  విటమిన్ - ఎ, విటమిన్ - సి, బి-కాంప్లెక్స్, కెరొటిన్ మొదలైన వాటితో పాటు ద్రాక్ష ఐరన్, కాపర్, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరానికి సమృద్ధిగా అందిస్తుంది. ఇవి ఎముకల్లో దృఢత్వం పెంచుతాయి. వీటిని విరివిగా తీసుకోవడం వల్ల శ్వాస సంబంధమైన సమస్యలను శాశ్వతంగా అధిగమించవచ్చు. ఊపిరితిత్తులను ఆరోగ్యవంతంగా ఉంచడంలో ద్రాక్ష దోహదం చేస్తుంది. అజీర్తి సమస్యకు ద్రాక్షపండు దివ్యౌషధం అని చెప్పవచ్చు. ఎండుద్రాక్షలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత ఏర్పడకుండా కాపాడుతుంది. అంతేకాకుండా సౌందర్యపోషణలోనూ సహజసిద్ధమైనది. ద్రాక్షపండ్లతో తయారయిన పేస్ట్ ఒక మంచి ఫేస్‌ప్యాక్. దీంతో చర్మం మృదుత్వం సంతరించుకుంటుంది.

కంటినిండా నిద్ర, వీలైనంత ఎక్కువగా ద్రాక్ష పండ్లను తినడం ద్వారా సంతానలేమిని సైతం జయించవచ్చని తాజా అధ్యాయనాలు చెప్తున్నాయి. మహిళల్లో నెలసరి సక్రమంగా లేకపోవడం, విపరీతమైన కడుపునొప్పి..  ఇలాంటి ఎండోమెట్రియోసిస్ లక్షణాలను నియంత్రించి గర్భం ధరించడానికి అవసరమైన పక్వదశలో ఉన్న అండాలను విడుదల చేయడంలో ద్రాక్ష ఉపకరిస్తుంది.

తరచూ ద్రాక్షను తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే అన్నీ సీజన్ లలో అందుబాటులో ఉండక 'అందని ద్రాక్ష పుల్లన' చందంగా కాకుండా ఎండుద్రాక్షను కూడా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. కాకపోతే వీటి మంచినీటితో ఒకసారి కడగడం మరవద్దు. వీటిని నేరుగా కాని, రాత్రి గ్లాస్ నీళ్ళలో నాలుగు కిస్మిస్ (నల్లవి) నానపెట్టి ఉదయాన్నే తీసుకోవడం కాని చేయవచ్చు. ఇక సమ్మర్ లో అయితే గ్రేప్ జ్యూష్ రుచికి, దాహం తీర్చడానికి అత్యుత్తమం. మరి ఈ ద్రాక్ష షర్బత్‌ ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలా..

ముందుగా సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ జ్యూసుల్లో మంచి ఫ్లేవర్ ను, ఆరోగ్యాన్ని అందించే మసాలపొడిని సిద్ధం చేసుకోవాలి. దీనికి ఇలాయిచీలు, దాల్చినచెక్క, లవంగాలు.. దోరగా వేయించి మెత్తని పొడిలా చేసుకుంటే సరిపోతుంది. కొన్ని పళ్ళను శుభ్రపరచి జ్యూసర్‌లో వేసుకుని ద్రాక్షరసం సిద్ధం చేసుకోవాలి. సర్వ్ చేసేటప్పుడు సరిపడా చల్లనినీళ్లలో ఈ రసం, కాస్త మసాలతో పాటు రుచికి తేనె చేర్చాలి.

పుచ్చకాయ.. | Tips for Pick a Sweet and Juicy Watermelon

వాటర్‌ మెలోన్‌..కాయ నిండా నీరే, రంగు, రుచితో ఇట్టే అందరిని ఆకర్షిస్తుంది. తింటే దాహం తీరిపోతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌లు మెండు. విటమిన్ - ఎ, విటమిన్ - బి, విటమిన్ - సి.. పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయ తిన్నా జ్యూస్ తాగినా సమృద్ధిగా ఎలక్ట్రోలైట్లు తక్షణమే అందుతాయి కనుక వడదెబ్బ బారినపడే అవకాశం లేదు. ఇందులోని లైకోపీన్ గుండె, ప్రొస్టేట్, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా పలు క్యాన్సర్ల భారిన పడకుండా చూస్తుంది. పుచ్చకాయ ఎండ నుంచి చర్మాన్ని కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. కాలిన గాయాలకు కూడా ఉపశమనం కలుగుతుంది.

సరియైన ఖర్బూజ కొనేప్పుడు దాని ఎంపికలో తగు జాగ్రత్తలు తప్పనిసరి. పరిమాణంలో కాయ చిన్నదైనా, పెద్దదైనా దానికి తగ్గ బరువు ఉందనే అనుభూతి కలగాలి. మచ్చలు, దెబ్బలు లేకుండా నిగనిగలాడుతూ ఉండాలి. వాటర్ మెలోన్ చుట్టూ గమనిస్తే ఒక పక్క కొంచంగా పసుపు రంగు కన్పిస్తుంది. ఇది భూమిపై ఆనుకుని కాయ పెరగడం వల్ల ఏర్పడుతుంది. ఇలా ఉంటేనే పుచ్చకాయ సహజసిద్ధంగా పక్వానికి వచ్చిందని అర్థం. అలాగే దాన్ని తట్టినపుడు ధ్వని మోగుతుంది. పండనివి, మరీ ఎక్కువ పండినవి, పాడైన కాయలు ఎక్కువ మోత చేయవు.
 https://www.youtube.com/c/vantintichitkalu

చమట దుర్వాసన రాకుండా | Natural ways to Reduce Your Body Odor

చమట వాసనకు దూరంగా ఉండండిలా..
- కనీసం రోజుకు రెండు సార్లు గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.
- షవర్ తర్వాత అన్ని శరీర మడతల వద్ద తప్పక పొడిగా తుడుచుకోవాలి.
- కాటన్ వస్త్రాలనే వాడాలి.
- మంచి నీటిని పుష్కలంగా తీసుకోవాలి.
- కెఫిన్ తీసుకోవడం తగ్గించండి.
- హెర్బల్, గ్రీన్ టీ లనే తీసుకోవాలి.
- చర్మంపై యాంటీ-యాంటీపెర్పిరెంట్ ను ఉపయోగించండి.
 

మెడ, వీపు చర్మకాంతికి.. | Back Beauty | VantintiChitkalu

స్టైలిష్, డిజైనర్ రవికెలు వాడుతున్నప్పుడు మెడ, వెనకవైపు చర్మం సౌందర్యం ఇనుమడింపచేయాలంటే బ్యూటీసిన్లు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. అలాగే మెడ, వీపు భాగం లో శుభ్రత పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మచ్చలు, పులిపిర్లు.. ఇతర చర్మ సంబంధిత వ్యాధులు తథ్యం అని హెచ్చరిస్తున్నారు.

- ఉప్పు అందానికి వన్నె తెస్తుంది. ఇది న్యాచురల్ క్లెన్సర్ లా ఉపయోగపడుతుంది. రాళ్ళ ఉప్పుని కరిగించిన నీటిలో కాస్త బేకింగ్ సోడాని కలిపి బాడీ పాలీష్ గా వాడితే మృదువైన, ఆకట్టుకునే సొగసును సొంతం చేసుకోవచ్చు.

- ఒక కప్పు వోట్మీల్ తీసుకొని, గుడ్డు తెల్లసొనతో బాగా మిక్స్ చేయండి. ఈ పేస్ట్ ని బ్యాక్ అప్లై చేసి 15 నిముషాలు ఆరనివ్వండి. ఇప్పుడు నీటితో శుభ్రపరచి చూడండి.

- కొంత నిమ్మ రసంలో వోట్మీల్ పౌడర్ చేర్చి 10-15 నిమిషాల పాటు వృత్తాకారంగా రబ్ చేసినా మంచి ఫలితం ఉంటుంది.

- నిమ్మకాయ రసం ఒక సహజ బ్లీచింగ్ ఏజెంట్. అందుకని నిమ్మకాయని కోసి ఆ ముక్కను నేరుగా స్క్రబ్బర్ గా ఉపయోగించవచ్చు. ఇది మీ మెడ, వెనుక భాగం చర్మం నిగనిగలాడేలా చూసుకునేందుకు తేలిక మార్గం.

- టొమాటో కూడా సహజ సిద్ధమైన బ్లీచింగ్‌ పదార్థమే కావున చర్మం పై మచ్చలు, మృతకణాలు ఏర్పడిన చోట దీని రసంతో మర్దనా చేస్తే అవన్నీ తొలగిపోతాయి.

- రోజ్‌ వాటర్‌ లో కమలాపండు తొక్కలను ఆరపెట్టి చేసిన పొడిని కలిపి పేస్ట్ లా చేసుకుని మెడ, వీపు భాగంలో తరచూ మర్దనా చేసినా ఆ భాగమంతా మిళమిళా మెరిసిపోవాల్సిందే.

మండే ఎండలో.. నోరూరించే చెరుకు రసం | Amazing Benefits of Sugarcane Juice

మండే ఎండలో దాహం తీర్చే చెరుకు రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి సత్వరం గ్లూకోజ్ అందడం వల్ల అలసట దరిచేరకుండా చేస్తుంది. డీహైడ్రేషన్‌, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ సమస్యలు వేసవిలో ఎక్కువగా వేధిస్తుంటాయి. వీటిని తరమడానికి చెరుకు రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలున్నవారికైనా చక్కని ఆహారం షుగర్ కేన్ జ్యూస్ అని చెప్పవచ్చు. ఇందులో పుష్కలంగా లభించే మెగ్నీషియం, పొటాషియం, పాస్పరస్ కాల్షియం శరీరాన్ని ఎప్పటికప్పుడు ఉత్తేజంగా ఉంచుతాయి. జీర్ణశక్తి మెరుగవుతుంది. క్రషర్ లో చెరుకు గడతో పాటు చిన్న అల్లం ముక్క, ఒక నిమ్మచెక్క కూడా చేర్చి తీసిన రసం రక్త హీనతని ఇట్టే దూరం చేస్తుంది.

గర్భిణులకు చెరుకు రసం చాలా మంచిది. ఇందులో ఇనుము, ఫొలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. జుట్టు ఎదుగుదలకు ఎంతో తోడ్పడతాయి. వృద్ధాప్య ఛాయల్నీ అడ్డుకుంటాయి. చెరకు రసంతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఈ రసంలో ఉండే పొటాషియం మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. దంత సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది.

శ్రీరామనవమి వడపప్పు, పానకం | Panakam - Vada pappu : Sri Rama Navami Neivedyam

నీతి, నిజాయితీ తప్పని ధర్మబద్ధపాలన అందించడమే రామ రాజ్యమనుకున్నాడు రాముడు. ప్రజలందరికీ సమాన న్యాయం, సమాన గౌరవం అందించడమే రాజుగా తన కర్తవ్యమని భావించాడు రాముడు. నీతి, నిజాయితీ, ధర్మం కలగలిసిన పాలనలోనే ప్రజలకు నిజమైన న్యాయం అందుతుందని ఆశించాడు. అందుకే సర్వాజనామోదం పొందిన మర్యాదాపురుషోత్తముడిగా కీర్తి ప్రతిష్టలందుకున్నాడు. అందుకుంటూనే ఉన్నాడు.

శ్రీరామనవమి మనకి ఓ ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైయ్యాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణలోని భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. తెలుగు రాష్ట్రాల్లో వసంతోత్సవంతో తొమ్మిది రోజులు పాటు సాగే శ్రీరామనవమి ఉత్సవాలను ముగిస్తారు.

శ్రీరామనవమి రోజున భగవంతుడికి నివేదించే ప్రసాదాలు.. కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి భక్తులందరికి పంచి పెడతారు. వీటి వెనుక ఆయుర్వేద ఆరోగ్య పరమార్థం ఉంది.
పానకం వల్ల వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనం కలుగుతుంది. అలాగే మంచినీటిలో నానపెట్టిన పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది, దేహకాంతి ఇనుమడింపచేస్తుంది. 

నీలగిరి తైలం | Wonderful Benefits of Eucalyptus Essential Oil

నీలగిరి ఆకుల నుంచి తీసిన యూకలిప్టస్ ఆయిల్ అత్యంత శక్తివంతమైన ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల ఈ తైలం ఎల్లప్పుడు ఇంట్లో అందుబాటులో ఉంచుకుని విస్తారమైన ఆరోగ్య, పరిశుభ్రమైన ప్రయోజనాలను పొందవచ్చు.

ముఖ్యంగా జలుబు, తలనొప్పి అనగానే గుర్తుకొచ్చే అనేక పూత మందుల్లో ప్రధానమైన ముడిసరుకు యూకలిప్టస్ ఆయిల్ అని గుర్తించాలి.  ఇది శరీరంలో హాని కలిగించే ఎటువంటి సూక్ష్మజీవులనైనా నశింపచేస్తుంది. ఈ ఆయిల్ వాసన చూడడం, పూతగా రాయడం వల్ల జలుబు ఇట్టే మాయమవుతుంది. రెండు చుక్కల నీలగిరి తైలం వేసి వేడినీటితో స్టీమ్ పట్టడం మరీ మంచిది. 

చుండ్రు, పేను సమస్యలకు చక్కని ఔషధం జామాయిల్. ఇది విడిగా కాని, కొబ్బరి నూనె మిశ్రమంగా కానీ తలకు బాగా పట్టించి అరగంట ఆగి తలస్నానం చేయడం వల్ల చుండ్రు, పేలు.. వగైరా సమస్యలు తొలగడమేకాక దురద, చిరాకు దరిచేరనివ్వదు. పైగా జుట్టు పోషణకు సహజంగా దోహదం చేసి మంచి నిగనిగలాడే శిరోజాలు సొంతమవుతాయి. 

యూకలిప్టస్ ఆయిల్ ఒక మంచి హ్యాండ్ క్లీనర్ అని చెప్పవచ్చు. ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యాండ్ వాష్ ల కన్నా ఇది సహజసిద్దమైనది. చేతులను మురికి నుంచి శుభ్రం చేసి మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అలాగే మౌత్ ఫ్రెష్ నర్ గా కూడా వాడుకోవచ్చు. దీనివల్ల సువాసనలతో పాటు ఎలాంటి త్రోట్ ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి. ఇది ఔషధంగా తీసుకుంటే సైనస్, అలర్జీలు కూడా మాయమవుతాయి. దీన్ని ఔషధంగా తాగినా ఛాతీ మీద తరచూ మర్దనా చేసినా ప్రాణాంతకమైన శ్వాస సంబంధిత సమస్యలు కూడా శాశ్వతంగా తొలగిపోతాయి.

యూకలిప్టస్ ఆయిల్ యాంటీమైక్రోబయల్, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. కనుక నిరభ్యంతరంగా అన్నీ రకాల గాయాలకు, పుళ్ళకు లేపనంగా వాడవచ్చు. క్రిమికీటకాలు కాటు వేసిన గాయాలకైనా నొప్పి నివారణగా పనిచేయడంతోపాటు, త్వరగా హీల్ అవుతాయి. ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనానికి స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల ఈ ఆయిల్ వాడుకోవాలి.

ఇలా ఔషదంగానే కాక యూకలిప్టస్ ఆయిల్ సహజ గృహ సంరక్షణకు తోడ్పడుతుంది. వ్యక్తిగత శుభ్రతకు, ఇంటి శుభ్రతకు వాడే సబ్బు, డిటర్జెంట్, పలు క్లీనర్ లలో ఇది తాజాదనం కలిపించడంలో, సూక్ష్మజీవులను తరమడంలో ముఖ్యభూమిక పోషిస్తుంది. గృహోపకరణాల క్లీనింగ్, దుస్తులపై మొండి మరకలు, టైల్స్ పై జిడ్డు ఇట్టే మాయమవుతాయి. దీని స్ప్రే చెడువాసనలు తరిమి ఆహ్లాదభరితమైన వాతావారణాన్ని సృష్టిస్తుంది.

ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినం | World Tuberculosis Day | TB Day, 24 March

పసుపు.. నిత్యం మన ఆహార పదార్థాల్లోనే కాక సౌందర్యసాధనలో ఉపయోగిస్తాం. అలాగే యాంటిబయాటిక్ గా కూడా వాడతాం. రక్తాన్ని శుభ్రపరిచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి పసుపు నలుగు పెట్టుకుని స్నానం చేస్తే శరీర కాంతిని ఇనుమడింప చేస్తుంది. ఇలా అద్భుత గుణాలను కలిగి ఉన్న పసుపు క్షయవ్యాధిని సైతం నిర్మూలిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. పసుపులో ఉండే కర్కుమిన్ పదార్థం మానవ శరీరంలోని మ్యాక్రోఫేజేస్ రోగ నిరోధక కణాలను ఉత్తేజపరుస్తుంది. దీనికి క్షయవ్యాధికి కారణమయ్యే మైక్రోబ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ను తొలగించే శక్తి ఉంటుంది. నొప్పి నివారణకు, అనేక ఆరోగ్య సమస్యలు, పలు రుగ్మతల నుంచి ఉపశమనం పొందేందుకు పసుపును ఇప్పటికే వినియోగిస్తున్నాం. పసుపులో క్యాన్సర్ వ్యాధిని తగ్గించే గుణాలు కూడా ఉన్నాయని అధ్యయనాలు వెళ్ళడించాయి.

ఎర్త్ అవర్... అవర్ హెల్త్! | Earth Hour 2018 | 24 March 2018, 8:30 PM

మనిషి స్వార్థం కోసం చేస్తున్న విధ్వంసం, పారిశ్రామికీకరణ పేరుతో విచ్ఛలవిడిగా అడవులు నరకటం.. విద్యుత్ ఉత్పాదన పేరిట కాలుష్యం వెదజల్లటం.. ఇలా కారణాలు ఏవైతేనేం భూగోళం వేడెక్కిపోతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటారు. అందుకే ఈ నెల 24న రాత్రి 8.30 గంటల నుంచి 9.30 వరకు జరిగే ఎర్త్ అవర్ (ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ దినోత్సవం) లో మనమందరం పాల్గొనాలి.

వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు సేవ్ ఎర్త్ పేరిట విశ్వ వ్యాప్తంగా ది వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) చేపడుతున్న కార్యక్రమమే ‘ఎర్త్‌ అవర్‌-2018’. ఎర్త్ అవర్  అంటే ఓ గంట పాటు విద్యుత్ వినియోగాన్ని ఆపేయడమే. కరెంట్ బల్బులు, టీవీలు, కంప్యూటర్లు... కరెంటుతో నడిచే ఉపకరణాలన్నీకాసేపు స్విచ్ ఆఫ్ చేయాల్సిందే.  ఇలా విద్యుత్ ఆదా చేస్తే ఆ మేరకు భూ వాతావరణాన్ని పరిరక్షించినట్లే. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దీన్ని మొదలు పెట్టారు. ప్రతి సంవత్సరం మార్చి ఆఖరి శనివారం రాత్రిపూట ఒక గంట విద్యుత్ ఉపకరణాలు అన్నింటినీ ఆపివేయటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దీనిని  జరుపుకుంటూ ఈ పదేళ్ళలో ప్రజలు స్వచ్చందంగా ఎర్త్ అవర్ పాటించే విధంగా చైతన్యం తీసుకురాగలిగారు. ముఖ్యంగా వ్యాపార, పారిశ్రామిక వర్గాలు కరెంట్ కట్ చేస్తే బోలెడు ఆదా అవుతుంది. సోషల్ మీడయా, మోబైల్ ఫోన్ల ద్వారా విస్త్రుత ప్రచారం సాగుతోంది. స్వచ్చంద సంస్థలు బాధ్యతగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేసే యువతరం దీన్ని భుజానికెత్తుకుంటున్నారు. రేపటి భారతం అంధకారం అవకుండా ఉండాలంటే ఈరోజు కాసేపైనా చీకటి అనుభవించక తప్పదు.  మన చేతుల్లోనే మన భూగోళం... ఎర్త్ అవర్ కోసం ఓ గంట పాటు విద్యుత్ పరికరాలన్నీ స్విచ్ ఆఫ్ చేసేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ విషయాన్ని చేరవేయండి. సాధ్యమైనంత ఎక్కువ మందిని ఎర్త్ అవర్ లో భాగస్వాముల్ని చేయండి. 

ఇయర్ బడ్స్ వాడుతున్నారా.. | Doctors Warn of Dangers of Ear Buds

చెవుల్లో గులిమి ఏర్పడడం ఒక సహజసిద్ధమైన ప్రక్రియ. చెవిలో అంతర్గతంగా ఉండే కొన్ని గ్రంథులు గులిమిని స్రవిస్తాయి. చెవులను శుభ్రంగా ఉంచడంలో భాగంగానే గులిమి తయారవుతుంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్‌ గుణాలు చెవికి ఎలాంటి అనారోగ్యం దరిచేరకుండా చూస్తుంది. ఇది కొంతకాలానికి దానంతట అదే బయటికి పోతుందట. అంతేకానీ దాన్ని తీయడం కోసం ఇయర్ బడ్స్‌ను ఉపయోగించకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పుల్లలు, పిన్నీసులు, కాటన్‌ ఇయర్‌ బడ్స్‌ పెట్టి గులిమిని బయటకు తీసే ప్రయత్నం చేయడంతో చెవిలోని అంతర్గత భాగాలు డ్యామేజ్‌ అవుతాయని వైద్యులు చెబుతున్నారు. దీంతో వినికిడి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు.

ఔచ్! నొప్పి.. | Anti-Inflammatory Tea Relieves Pain And Boosts Your Immune System

ఈ రోజుల్లో తలనొప్పి, కాళ్ళనొప్పి.. అలసిన శరీరంలో ఇతర నొప్పులు సాధారణమే.. అన్నిటికి టీ టైమ్ లో వంటింటి చిట్కాలు ట్రై చేసి చూడండి. నొప్పులు మాయమే కాదు.. ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారో...
- పసుపులో యాంటీ ఆక్సిండెంట్స్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకుని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.

- అల్లంలోనూ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెండు. శరీరంలో నొప్పులు హరించేందుకు ఇవి దోహదపడతాయి. అంతేకాకుండా రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు అల్లం ఎంతో ఉపయోగ పడుతుంది. కండరాల నొప్పి తగ్గిస్తుంది . సో.. అల్లం టీ తాగడం వల్ల ఎలాంటి నొప్పుల నుంచైనా ఉపశమనం పొందవచ్చు.

- నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి. శరీరంలోని పీహెచ్‌ లెవల్స్‌ ని నియంత్రిస్తాయి కూడా. నొప్పి, ఇన్ఫ్లమేషన్‌ తగ్గించడానికి నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది. లెమన్ ఛాయ్ లేదా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం మిక్స్‌ చేసి తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

పెసరట్టు.. ఒక మంచి బ్రేక్ ఫాస్ట్..! | Amazing Nutritional Benefits of Pesarattu | Green Gram Dosa | Moong Dal Dosa

పెసర దినుసులు రుచితో పాటు చక్కని ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. పెసరలో బి, సి విటమిన్‌ లతో పాటు పలు ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా పెసర చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తుంది. సూర్యుని నుంచి వెలువడే ఆల్ట్రావయిలెట్‌ కిరణాలు, పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యలను ఇట్టే అదిగమించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జుట్టు సొంతమవుతుంది. సున్నిపిండి తయారీలో పెసర పప్పుని వినియోగిస్తారు. దీనివల్ల చర్మం మృదుత్వం సంతరించుకుంటుంది. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల హైబిపి, చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుముఖం పడ్తాయి. తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. వీటిలోని ఐరన్‌ మూలకం రక్తహీనతను దూరం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి పెసలు అద్భుతం అని చెప్పవచ్చు. పెసర మొలకలు వచ్చిన తర్వాత పోషకాలు, ఫైబర్, ప్రోటీన్ లు తదితర పోషకాలు రెండింతలు అవుతాయి. డయాబెటీస్, అధికబరువు, కొలెస్ట్రాల్ సమస్యలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్న ఎవరికైనా పెసరపప్పుతో చేసే ఆహారపదార్థాలు, ముఖ్యంగా స్ప్రౌట్స్, పెసరట్టు ఎంతో మంచిది. ఉల్లిపాయ ముక్కలు, కాస్త జీలకర్ర, అల్లం ముక్కలు పెసరట్టుకి తోడైతే ఇష్టం ఉండని వారెవ్వరు ఉంటారు. చెప్పండి..!

ఆరోగ్యమే మహాభాగ్యం | Good Housekeeping | Genius Cleaning Tips

వ్యక్తిగత శుభ్రత కేవలం ఒకరికి మాత్రమే మేలు చేస్తుంది. అదే ఓ ఇంటిని శుభ్రంగా ఉంచగలిగితే కుటుంబసభ్యులందరు ఆరోగ్యంగా ఉంటారు. అందుకే ఇంటి శుభ్రత బాధ్యత ఏ ఒక్కరి మీదో పడేయకుండా అందరూ గుడ్ హౌస్ కీపింగ్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇంటిళ్ళిపాది రోగాల బారిన పడకుండా, వైద్య చికిత్సలంటూ అనవసరంగా డబ్బు ఖర్చు ఉండదు. ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలంటే కాలానుగుణంగా కొన్ని పనులు తప్పక చేయాల్సి ఉంటుంది. రోజూవారి పనుల్లో ఇల్లు, పాత్రలు, దుస్తులు.. శుభ్రపరచుకోవడం సాధారణమే. వీటికి అదనంగా వారానికి ఒకసారైనా బెడ్ షీట్స్ మార్చడం, డైనింగ్ టేబుల్ క్లాత్ మార్చడం, టీవి వగైరా పరికరాలను డస్టింగ్ చేయాలి. అలాగే నెలకు ఒకసారి ఇంటిని పూర్తిగా దుమ్ము ధూళి, బూజు లేకుండా దులిపి వస్తువులను సర్దుకోవాలి. ముఖ్యంగా కిచెన్ లో ఉండే గూళ్ళు, కుళాయి, సింక్ లను శుభ్రపరచడం తప్పనిసరి. బొమ్మలు, క్రాకరీ, బుక్స్ ఉండే అల్మారాలు నీట్ గా లేకపోతే అనేక పురుగులు చేరే అవకాశం ఉంది. ఆరు నెలలకోసారి పరుపును డస్ట్ క్లీన్ చేసుకుని తిప్పి వేయడం, దిండ్లు నలిగిపోకుండా ఉన్నాయా అని సరిచేసుకోవడం చేయాలి. ఇవి శుభ్రంగా లేక పోవడం వల్ల నిద్ర భంగం తప్పదు. అంతేకాకుండా పలు రకాల ఎలర్జీలు దరిచేరుతాయి. పైగా కాలం చెల్లిన దిండు, పరుపుల వల్ల మెడ, నడుము నొప్పులకు ఆస్మారం ఎక్కువ. ఫ్యాన్, వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, మైక్రోవేవ్ ఓవెన్‌ను తదితర పరికరాలను తప్పకుండా తరచూ శుభ్రం చేసుకోవాలి. లేదంటే మొండి మరకలు, క్రిమీకీటకాలు సంచరించడం జరుగుతుంది.


ఊర పిచ్చుక.. నీ జాడేది? | Where have all the house sparrows gone? | March, 20 : World Sparrow Day

ఈ రోజు ప్రపంచ ఊర పిచ్చుకల దినోత్సవం సందర్భంగా మనం చేయాల్సిందల్లా..

-    మన నివాసం చుట్టూ ఎక్కడ అనువుగా ఉన్నా మొక్కలు, చెట్లు పెంచడం

-    ఇళ్లు, అపార్ట్ మెంట్ లలో పక్షుల ఆశ్రయం కోసం ఆవాసాలు, బర్డ్ ఫీడర్లు ఏర్పాటు చేయడం

-    మూగజీవాల కోసం గుప్పెడు ధాన్యం గింజలు జల్లడం

-    ముఖ్యంగా వేసవిలో పక్షులు తాగేందుకు మట్టికుండీల్లో కాసిని నీళ్లు పోసి అమర్చడం

అదే పనిగా వాడేయకండి! | Is sleeping in underwear bad for us?

సరుకులకు, ఔషధాలకు ఎక్స్పైరీ తేది చూస్తాం. అవి ఓపెన్ చేస్తే నెలరోజుల్లోనే చెత్తబుట్టలో పడేస్తాం. మరి టూత్ బ్రష్, చెప్పులు, టవల్, లోదుస్తులు వగైరా విషయంలో నిర్లక్ష్యం దేనికి. ఇది చాలా ప్రమాదకరం అని నిపుణుల హెచ్చరిక.
 
- తల దిండు, పరుపు కొన్ని రోజుల వాడకంలో ఎత్తుపళ్ళాలుగా మారడంతో సుఖనిద్రకు నోచుకోలేరు. నడుము, మెడ నొప్పులు కూడా వస్తాయి. కావున వాటి నాణ్యతను బట్టి రెండేళ్ళకోసారి కొత్తవి మర్చుకోవాల్సి ఉంటుంది. దిండు కవర్ లను, బెడ్ షీట్స్ ని కనీసం రెండు రోజులకోసారి అయినా ఉతికినవి మార్చుకోవాలి. లేదంటే శ్వాసకోశ వ్యాధులు ప్రభలుతాయి.

- డైనింగ్ టేబుల్, సోఫా కవర్లతో పాటు విండో, డోర్ కర్టెన్లను కూడా తరచూ శుభ్రపరుస్తుండాలి.

- ఎంత శుభ్రంగా స్నానం చేసినా టవల్ విషయంలో జాగ్రత్తపడక పోతే అనారోగ్యమేనని గుర్తించాలి. తడిగా ఉన్న టవల్స్‌ మీద బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. కాబట్టి, టవల్స్‌ ను వీలైనంత ఎంటనే ఎండలో ఆరబెట్టాలి. రోజూ ఉతకడం మర్చిపోకూడదు. అలాగే ఒక టవల్‌ ని సంవత్సరం కన్నా ఎక్కువ వాడడం అత్యంత ప్రమాదకరం.

- మనం రోజూ వాడే టూత్‌బ్రష్‌లు కనీసం మూడు నెలకొకసారి మార్చాలని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. డెంటల్ స్పెషలిస్ట్ సలహా మేరకు హార్డ్, సాఫ్ట్, ఆల్ట్రా సాఫ్ట్ వగైరా టూత్ బ్రష్ లని మాత్రమే వినియోగించాలి.

- ఇంట్లో వాడే చెప్పులకైన బ్యాక్టీరియా సోకుతుంది. ఎంత రెగ్యూలర్ గా  వాష్ చేస్తున్నా సరే ప్రతి ఆరు నెలలకి వీటిని మార్చడం మరవద్దు. అలాగే షూస్‌, ముఖ్యంగా జాగింగ్‌ షూస్‌ని ఒక సంవత్సరం కన్నా ఎక్కువ వాడకూడదు. లేదంటే సోల్ అరిగిపోవడం, కుషనింగ్ తగ్గడం వల్ల జాయింట్‌ పెయిన్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

- నిద్రపోయేటప్పుడు లోదుస్తులను ఉంచుకోవడం మంచిది కాదు. రోజంతా లోదుస్తులు అలాగే ఉండడం వలన ఆయా ప్రాంతాల్లో చమట, తద్వారా బాక్టీరియా చేరుతుంది. శాటిన్, సిల్క్, సింథటిక్ ఫాబ్రిక్స్ తో తయారయిన లోదుస్తులయితే నిద్రించే సమయంలో ఎట్టి పరిస్థితిల్లోనూ ధరించకూడదు. గాలి ఆడనీయకుండా చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్ లు దరి చేరుతాయి. తద్వారా దురద, మంటలకు కారణమవుతాయి. పైగా ఎలాస్టిక్, హుక్స్, గుండీల వల్ల ఒరుసుకుపోయి శరీరంపై మచ్చలు ఏర్పడుతాయి. లోదుస్తులు ఏవైనా సంవత్సరానికొకసారి కచ్చితంగా మార్చాలి. అప్పుడే అవి కంఫర్ట్ గా,  మీరు ఆరోగ్యంగా ఉండగలరు. 
 
 
pc : internet

వేప పువ్వు పులుసు.. | Neem Flower Rasam | VantintiChitka

కాకరకాయ పులుసుకు మాదిరి వేప పువ్వు పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి పోపులపెట్టి, తాలింపునకు సరిపడా నూనె, చింతపండు రసం, బెల్లం ముక్క వగైరా సిద్ధం చేసుకోవాలి. గుప్పెడు వేప పువ్వును శుభ్రపరచుకుని నెయ్యిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆవాలు, జీలకఱ్ఱ, శెనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండు మిర్చి.. లతో నూనెలో పోపు వేసాక రంగు రుచికి  కాస్త పసుపు, ఇంగువ కూడా చేర్చి చింతపండు రసం పిండి సరిపడా ఉప్పు, బెల్లం ముక్క వేసి బాగా కాగనివ్వాలి. ఇప్పుడు ఇందులో వేయించిన వేప పువ్వును కలిపేసి స్టవ్ కట్టేయాలి. ఇక వేప పువ్వు పులుసు వడ్డించడమే తరవాయి.
 

ఉగాది పచ్చడి - ఆరోగ్య ఔషధం | The Six Tastes of Ugadi Pachadi

శ్రీ విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలతో..
ఈ రోజున ప్రసాదంగా తీసుకునే ఉగాది పచ్చడిలో కొత్త చింత పండు, కొత్త బెల్లం, వేపపూత, మామిడి కాయ ముక్కలు, చెరుకు ముక్కలు.. వగైరా ఉంటాయి. అందుకని ఇది శారీరక ఆరోగ్యానికి ఎంతో శ్రేష్ఠమని ఆయుర్వేదం చెప్తోంది.

ఉదయాన్నే ఈ పచ్చడిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదంటారు. సంవత్సరమంతా అనారోగ్యం దరిచేరకుండా ఉండేందుకు ఈ పచ్చడి ఉపకరిస్తుందని పెద్దలు చెప్పేమాట. వేసవి కాలం ఆరంభ సమయం కావున మానవ శరీరం వేడిని తట్టుకోవడానికి ఈ ద్రవపదార్థం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఆహారాన్ని ఈ రోజు మొదలు తొమ్మిది రోజుల పాటు తినే ఆచారం కూడా ఉండేది. ఈ సంవత్సరాదికి విసన కర్రలను వాయినంగా పంచే సంస్కృతి మనది.
 

నెట్టింట్లో castingcouch, MeToo.. హాష్ ట్యాగ్ ల హల్ ఛల్ | Youtube Trending

కాస్టింగ్ కౌచ్, మీ టూ.. ఈ రెండు హాష్ ట్యాగ్ లు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పాకి ఇప్పుడు సోషల్ మీడియాలో, మరీ ముఖ్యంగా యూట్యూబ్ లో గత వారం రోజులుగా ట్రెండింగ్ సృష్టిస్తున్నాయి.

ఇంతకి కాస్టింగ్ కౌచ్ అంటే ఉపాధి అవసరం ఉన్నవారిని, అవకాశం కల్పించడానికి సెక్స్‌వ‌ల్ గా అధికారులు వాడుకోవడం అనే అర్థాన్నిస్తోంది. ఈ 'కాంప్రమైజ్'  చిత్ర పరిశ్రమలో ఏన్నాళ్ళుగానో జరుగుతున్న తతంగమే అని సీనియర్ నటీమణుల నుండి అప్ కమింగ్ హీరోయిన్ ల వరకు మీ టూ.. అనే ఉద్యమం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ #MeToo ఉద్యమం గత సంవత్సరం చివరిలోనే వైరల్ అయినా ఇప్పుడు ఇది తెలుగు తెరంగేట్రం చేసి విచ్చలవిడిగా #CastingCouch ప్రచారం కొనసాగుతోంది. పని స్థలంలో మహిళలపై తరచూ లైంగిక వేధింపులు లేదా దాడులు జరగుతున్నా బయటపెట్టడానికి ఇబ్బంది పడే వారికి అండగా మొదలైన ఈ మీ టూ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కుంటున్న దుర్భర పరిస్థితులను నోరు విప్పి చెప్పే పరిస్థితిని కల్పించింది.
తెలుగు సినీ పరిశ్రమలో ఇంకా మాదకద్రవ్యాల వ్యవహారం పుండు మానలేదు. ఇప్పటికైనా సినీపెద్దలుగా చలామని అవుతున్న పురుషపుంగవులు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కలిగిస్తారని ఆశిద్దాం.
https://www.youtube.com/c/vantintichitkalu

కొత్త తెలుగు సంవత్సరాది.. శ్రీ విళంబి నామ సంవత్సరం | Sri Vilambi Nama Samvatsaram | Ugadi - 2018

వసంత రుతువులో చెట్లు చిగురిస్తాయి. పుష్పాలు వికసిస్తాయి. ప్రకృతి రమణీయంగా మారుతుంది. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలోనే అచ్చమైన తెలుగుదనానికి ప్రతీకగా నిలిచే ఉగాది పండుగ వస్తుంది. మనం తెలుగు సంవత్సర ప్రారంభ రోజును ఉగాది అని లేదా సంవత్సరాదిగా జరుపుకోవడం పరిపాటి. ఇప్పటి నుంచి తమ కష్టాలు తొలగిపోవాలని, సుఖసంతోషాలు ఉండాలని ఆకాంక్షిస్తాం.

రుతువు మారే సమయంలో వచ్చే ఈ పండుగ రోజున పాటించే ఆచారవ్యవహారాల వెనుక ఆరోగ్యాన్ని కాపాడే కారణాలున్నాయని పూర్వీకులు చెప్పారు. సంప్రదాయాలకు, శాస్త్ర ప్రయోజనాలకూ కచ్చితంగా అవినాభావ సంబంధం ఉంటుందనేది నిర్వివాదాంశం. ఉగాదిని తెలుగువారే కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా రకరకాల పేర్లతో చేసుకుంటారు. మరాఠీలకు గుడిపడ్వా, తమిళులకు పుత్తాండు, మలయాళీలకు విషు, సిక్కులకు వైశాఖీ, బెంగాలీలకు పొయ్‌లా బైశాఖ్‌.. ఇలా ఆచార వ్యవహారాలు భిన్నమైనప్పటికీ అందరికీ ఇది ఆనందాన్ని ప్రసాదించే పర్వదినం.

ఈ రోజు ఉగాది పచ్చడి సేవించడం ఆరోగ్యదాయకం. మానవునికి ప్రకృతికి గల అవినాభావ సంబంధం ఉగాది పచ్చడి షడ్రుచులలోనే ఉంది. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు, ఆటుపోట్లకు ప్రతీకగా షడ్రుచులను మేళవించి, ప్రసాదంగా తీసుకునే పచ్చడి ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. వేపపువ్వు, కొత్త చింతపండు, బెల్లం, మామిడి ముక్కలు.. ఇలా తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు ఆరుచులతో తయారవుతుంది. శ్రీ విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు ..


ప్లాస్టిక్ ముప్పని తెలిసినా.. | From Gudi Padwa, Plastics are Banned in Maharashtra

ప్లాస్టిక్ వాడకంతో మానవాళి ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. వాతావరణ కాలుష్యంతో సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాలవల్ల భూమిని కాపాడే ఓజోన్‌ పొరకు భారీస్ధాయి నష్టం వాటిల్లుతుంది. కారణంగా భూమి పైన ఉన్న మానవాళికి, జీవరాశికి శ్వాస, చర్మ, సంబంధిత వ్యాధులు ప్రభలుతాయి. అంతేకాకుండా పశుపక్షాదులకు ప్లాస్టిక్ వల్ల ప్రాణహని ఉంది. ఏటా లక్ష క్షీరదాలు పక్షలు ప్లాస్టిక్ కారణంగా మరణిస్తున్నాయి. చెరువుల్లో, నదుల్లో ఈ వ్యర్థాలు వేయటంవల్ల చేపలు ఇతర జలచరాలు చనిపోతున్నాయి. వర్షపు నీరు భూగర్భంలోకి చేరకుండా ప్లాస్టిక్‌ వ్యర్థాలు అడ్డుపడ్తున్నాయి. పాలిథిన్ బ్యాగులు, ఇతర ప్లాస్టిక్‌ వస్తువులను తగలబెట్టడం వల్ల డ్రైయాక్సిన్‌ విషవాయువు గాలిలో కలిసి పలు రకాల క్యాన్సర్‌ లకు కారణమవుతుంది. వాతావరణంలో కాలుష్యం ఏర్పడటానికి ప్రధాన కారణం విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం అని తెలిసినా, వాటికి ప్రత్యమ్నాయ మార్గాలు ఉన్నా మనలో నిర్లక్ష్య ధోరణి వదలడం లేదు. ప్రభుత్వాలు 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించినా అమలుకు మాత్రం నోచుకోవడం లేదు.

ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించే దిశగా ప్రతి ఒక్కరు చూడాలి. పాలిథిన్ క్యారీ బ్యాగులకు బదులుగా క్లాత్ బ్యాగులను వాడుకోవాలి. జనపనార, కాగితంతో తయారైనవి కూడా ఉత్తమమే.
 

నేడు ప్రపంచ నిద్ర దినోత్సవం | March 16, 2018 World Sleep Day | VantintiChitkalu

మనిషికి కమ్మని నిద్ర చాలా అవసరం. నిద్ర కరువైతే శరీరం అనేక రోగాలకు దారితీస్తుంది. నిద్ర శారీరిక, మానసిక ఆరోగ్యానికి ఎంత కీలకమో తెలియంది కాదు. అయినా నిద్ర నిర్లక్ష్యం చేసి అనారోగ్యాలపాలు కాకుండా అవగాహన కల్పించేందుకు మార్చి 16, 2018 (శుక్రవారం)న ప్రపంచ నిద్ర దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితి.

నిద్రకు ఒక లెక్క ఉందని గమనించాలి. వయసును బట్టి నిద్ర వేళలు మారినా కానీసం సగటున ప్రతిరోజూ ఏడు గంటలైనా నిద్రపోవాలి. నిద్రలేమి శరీర బరువు పెరగడానికి కారణం అవుతుంది. మెదడు బలహీన పడుతుంది. ఆయుర్దాయం తగ్గుతుంది. ఎక్కువ రోజులు నిద్రపోకుండా ఉంటే ప్రాణాపాయం కూడా తప్పదు.

ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్ర పోవడం, నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. సెలవు రోజు అంటూ మినహాయింపు లేదు. సుఖ నిద్రకు రోజూ వ్యాయామం తప్పనిసరి. హ్యాపీ వరల్డ్‌ స్లీప్‌ డే..

కొబ్బరి బొండాం తాగితే.. | Amazing Health Benefits of Coconut Water | Nariyal Pani

వేసవి ఎండలు అప్పుడే చురుక్కుమనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈ  సమ్మర్ లో ఎండలు, వడగాలులు ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి, వడదెబ్బ తగలకుండా ఉండటానికి, చక్కటి ఆరోగ్యానికి కొబ్బరినీళ్లు ఉపకరిస్తాయి. ప్రకృతి ప్రసాదించిన కొబ్బరిబోండాలలోని నీళ్లలో ఉండే ఖనిజ లవణాలు అప్పటికప్పుడు శక్తిని అందజేస్తాయి. వీటిలో అతి తక్కువగా ఉండే కొవ్వు పదార్థం వల్ల లావెక్కెస్తామని భయం లేదు. బోండాంలో ఉండే ఎలక్ట్రోలైట్స్, నీటివల్ల తక్షణం శక్తి అందడం, చర్మం నిగారింపుతో ఉండటం సాధ్యమవుతుంది. మనకు కావలసిన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం లాంటి ఎలక్ట్రోలైట్స్.. ఇందులో మెండుగా ఉంటాయి. పరిమిత స్థాయిలో గ్లూకోజ్ ఉంటుంది. అధిక రక్తపోటును నియంత్రించేందుకు కొబ్బరినీళ్లు ఉపయోగపడతాయి. కొబ్బరినీళ్లలోని పీచుపదార్థంవల్ల పేగులు శుభ్రపడతాయి.
 

ఫోర్ హెడ్ పై ముడతలా.. | Simple ways to get rid of Forehead Wrinkles at Home

- చేతిలోకి కొంచం కొబ్బరి నూనె, వీలైతే ఆలివ్‌ ఆయిల్ ని తీసుకుని నుదుటి భాగంలో పైకి కిందకి పది నిమిషాల పాటు మర్దనా చేయండి. రోజుకి కనీసం రెండు సార్లయినా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
-  కోడి గుడ్డులోని తెల్లసొనను నుదిటిపై రాయండి. బాగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో ముఖం కడిగేయండి. ముడుతలు మాయమయి చర్మం బిగుతుగా మారుతుంది.
- నిమ్మకాయ, నారింజ.. లాంటి సిట్రస్ ఫ్రూట్ ల రసం ఏదైనా నుదిటికి బాగా పట్టించాలి. కాసేపాగి గోరువెచ్చని నీటితో కడిగేస్తే ప్రయోజనం ఉంటుంది.
 

వినియోగదారుడా మేలుకో.. | ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం | World Consumer Rights Day

కల్తీ కాలంలో వినియోగదారుడే తెలివిగా వ్యవహరించి సరియైన సరుకులు, సేవలు పొందాలి.  రాయితీలు, తక్కువ ధరకు ఇస్తున్నారని చెప్పి, సరైన బిల్లులు లేకుండా ఏ వస్తువునూ మార్కెట్లో కాని, ఆన్ లైన్ లో కాని కొనుగోలు చేయకూడదు. ఏ వస్తువును కొన్నా దానికి సంబంధించిన బిల్లులు, వారంటీ, గ్యారంటీ విషయంలో, కార్డులను బధ్రపరిచే విషయంలో జాగ్రత్త వహించాలి.  ఔషధాలు, ఆహార వస్తువులైతే తయారీ తేదీ, కాలం తీరే తేదీలను చూశాకే కొనుగోలు చేయాలి. మనం తినే ఆహారం కల్తీ అయితే మన ఆరోగ్యాన్ని చేజేతులా పాడుచేసుకున్నవాళ్లమవుతాం. మనం నిత్యం వాడే ఆహార పదార్థాలపై అవగాహనతో వాటిల్లో కల్తీ పాలు ఎంతో కనిపెట్టాలి. మచ్చుకి కొన్ని చూద్దాం..

పాలు: సాధారణంగా డిటర్జెండ్ పౌడర్, యూరియా, సింథటిక్ మిల్క్‌తో కల్తీ చేస్తారు. కొద్దిపాలలో అంతే మొత్తం నీళ్లు కలిపితే డిటర్జంట్ కలిపిన విషయం తేలుతుంది. పాలను కాచినప్పుడు పసుపు రంగులోకి మారినా, తాగుతున్నప్పుడు కాస్త చేదుగా అనిపించినా అవి సింథటిక్ పాల కల్తీ జరిగినట్టే.

టీ పొడి: చక్కటి రంగుకోసం బొగ్గు కలిపే అవకాశాలున్నాయి. తెల్లటి బ్లాటింగ్ పేపర్‌పై టీపొడి జల్లి కాసేపు తరువాత చూస్తే దానిపై రంగు మచ్చలు ఏర్పడితే అది కల్తీదే  అని గుర్తించాలి.

ఉప్పు: సాధారణ ఉప్పులో సుద్దపొడి, అయొడైజ్డ్ ఉప్పులో సాధారణ ఉప్పు కలిపి కల్తీ చేస్తారు. ఉప్పు కలిపిన నీళ్లను వేడిచేస్తే సుద్దపొడి పైకి తేలుతుంది. బంగాళదుంప ముక్కపై అయొడైజ్డ్ ఉప్పు జల్లి, కొద్దిగా నిమ్మరసం పిండి వేచిచూడాలి. ఆలుగడ్డ ముక్కపై నీలిమచ్చలు ఏర్పడితే అది కల్తీ జరగనట్లే.

మిర్చిపొడి: కర్రపొట్టు, నిషేధిత రంగు, ఇటుకల పొడి కలిపి కారంపొడిని కల్తీ చేస్తారు. స్పూన్ మిర్చిపొడిని గాజు గ్లాసు నీళ్లలోవేస్తే కాసేపటికి ఇటుకల పొడి నీటి అడుగుకి చేరుతుంది. రంగు కలిసిపోతుంది. అసలు కారం నీళ్లపై తేలుతుంది.

మిరియాలు: ఇవి కల్తీ చేయడానికి ఎండబెట్టిన బొప్పాయి గింజలు కలుపుతారు. డిస్టిల్డ్‌వాటర్‌లో ఈ గింజలు వేస్తే కొద్దిసేపటికి బొప్పాయి గింజలు పైకి తేలుతాయి. మిరియాలు అడుగుకు చేరతాయి.

తేనె: తేనెను పంచదార పాకం, బెల్లం పాకం కలిపి కల్తీ చేస్తారు. పట్టు వస్త్రంపై తేనె చుక్క వేస్తే అంటుకోకుండా జారిపోవాలి.